అభిప్రాయం: దళితుల్లో పెరుగుతున్న ఆగ్రహం, బీజేపీ 'సామరస్యం'పై ముసురుతున్న సందేహాలు

  • 12 ఏప్రిల్ 2018
బీజేపీ నేతలు Image copyright Getty Images

"దళితులను ఎన్నికల వంటకంలో కరివేపాకులా వేసుకోవడం, తినేముందు తీసి పక్కన పారెయ్యడం మామూలే" అని ఓ దళిత నేత గతంలో ఓసారి అన్నారు.

'దళితుల ప్రయోజనాల కోసం, హక్కుల కోసం సాగుతున్న పోరాటాల్లో నేను నిజాయితీగా నిలబడ్డాన'ని చెప్పుకునే నైతిక స్థైర్యం బహుశా ఇప్పుడు మాయావతిలో కూడా లేదు. ఎందుకంటే రోహిత్ వేముల, ఉనా దారుణం, సహారన్‌పూర్ అల్లర్ల సందర్భంగా ఆమె అనుసరించిన వైఖరి చాలా పేలవంగా ఉందన్నది తేటతెల్లం.

అయితే, ఆ తర్వాత ఆమె జిగ్నేశ్ మేవాణీ, చంద్రశేఖర్ ఆజాద్ వంటి యువ నాయకులు ఎదిగివస్తున్న తీరును గమనించి ప్రమాదాన్ని అంచనా వేశారు. కోల్పోయిన 'మోరల్ హైగ్రౌండ్‌'ను మళ్లీ చేజిక్కించుకోవడం కోసం ఆమె తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఇక మిగతా పార్టీల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దళితులు ఎల్లప్పుడూ అన్ని వైపుల నుంచీ మోసపోతూనే వచ్చారు. ఇక వారిపై జరుగుతున్న అత్యాచారాలు కూడా కొత్తవేమీ కాదు.

దళితులకు మద్దతుగా నిరాహారదీక్ష చేయాలన్న కాంగ్రెస్ ఎత్తుగడ కూడా పారలేదు ఎందుకంటే, బీజేపీ చెబుతున్న ప్రకారం, వాళ్లు నిరాహారదీక్షకు ముందు భోజనం చేయడమే కాదు, ఫొటోలు కూడా తీయించుకున్నారు. అలా ఇమేజ్ విషయంలో బీజేపీ మరోసారి ఓ అడుగు ముందు నిలిచింది.

అయితే ఇప్పుడు కొత్తగా ముందుకు వచ్చిన పరిణామం ఏంటి?

కొత్తదేంటంటే, బీజేపీ గత నాలుగేళ్లలో ఎన్నడూ లేనంత గందరగోళంలో, అనుమానాల్లో పడిపోయింది.

తాము మోసపోయినట్టు గ్రహించిన దళితుల తరం కొత్తది. వారిలో నెలకొన్న ఆగ్రహం కొత్తది. ఈ ఆగ్రహం ఫలితంగానే భయం పుట్టుకొచ్చింది. ఈ భయం మామూలుది కాదు.

Image copyright Getty Images

అప్పటి వరకు అప్రకటితంగా ఉన్నది 2014 సాధారణ ఎన్నికల్లో ప్రకటితంగా మారింది. తమకు 14 శాతం ముస్లింల ఓట్లు ఎలాగూ పడవు, కాబట్టి దేశంలో అత్యధికంగా 80 స్థానాలు గల యూపీలో ఒక్క టికెట్ కూడా వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ నిర్ణయించుకుంది.

సబ్‌కా సాథ్.. సబ్‌కా 'మైనస్ ముస్లిం' వికాస్...

ఆ విధంగా, 'సబ్‌కా సాథ్ (అందరి తోడ్పాటు), సబ్‌కా వికాస్ (అందరి అభివృద్ధి)' కాస్తా 'అందరు మైనస్ ముస్లిం'గా మారిపోయింది.

బీజేపీ జాటవేతర దళితుల ఓట్లపై, యాదవేతర ఓబీసీ ఓట్లపై దృష్టి కేంద్రీకరించగా, అది దానికి గొప్ప ఫలితాల్నిచ్చింది కూడా.

సామాజిక అధ్యయనం నిర్వహించే సంస్థ సీఎస్‌డీఏస్ తమ నివేదికలో, "2009 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి దళితుల ఓట్లు 12 శాతం పడ్డాయి. 2014లో ఈ సంఖ్య రెట్టింపయ్యింది. దళితుల్లో 24 శాతం మంది బీజేపీకి ఓట్లు వేశారు. ఈ కారణం వల్లనే మాయావతికి ఒక్క సీటు కూడా లభించలేదు" అని తెలిపింది.

అయితే 2019 ఎన్నికల్లో ఐదేళ్ల కిందటి సమీకరణాలు ఉండవు. ఓవైపు అభివృద్ధి నినాదం పదును కోల్పోయింది. మరోవైపు నోట్లరద్దు, జీఎస్టీ వంటి వాటితో మోదీ వ్యక్తిగత ఇమేజ్ అంతగా తగ్గకపోవచ్చు. కానీ ఇప్పుడు బ్యాంకు కుంభకోణాలు, 'పకోడా ఉపాధి' వంటి ప్రకటనల తర్వాత మోదీ ఇమేజ్ పెరగనైతే అది పెరగలేదనేది మాత్రం స్పష్టం. బీజేపీకి ఇప్పటి వరకు మోదీ పేరే చాలా పెద్ద ఆసరాగా ఉంటోంది.

ఒకవేళ, బీఎస్‌పీ-సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే (అట్లాగే జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది) జాటవేతర దళితుల ఓట్లు, యాదవేతర బీసీల ఓట్లు గతంలో లాగా బీజేపీకి పడకపోవచ్చు. ఇది ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ ఉపఎన్నికల్లో కనిపించింది కూడా.

Image copyright Getty Images

ఇప్పుడు ఏం మారుతున్నట్టు కనిపిస్తోంది?

నిరుడు జూన్ నెలలో సహారన్‌పూర్‌లో రాణా ప్రతాప్ జయంతి ఊరేగింపు పేరుతో జరిగిన హింస పట్ల దళితుల్లో ఆక్రోశం ఉంది. ముఖ్యంగా, భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్ 'రావణ్'కు బెయిల్ లభించిన తర్వాత కూడా ఆయనను జాతీయ భద్రతా చట్టం కింద ఇప్పటికీ జైలులో నిర్బంధించడం పట్ల దళితుల్లో ఆగ్రహం ఉంది.

అయితే వారి క్రోధావేశాలు స్పష్టంగా బయటికొచ్చింది మాత్రం మొన్న ఏప్రిల్ 2న జరిగిన భారత్ బంద్ సందర్భంగానే. ఉత్తర్ ప్రదేశ్‌లో, మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో దాదాపు 10 మంది దళితులు మృతి చెందారు. పెద్ద సంఖ్యలో దళితులను అరెస్ట్ చేశారు.

అయితే, జరుగుతున్న ప్రచారం ఎలా ఉందంటే, దళితులే ఒక విచిత్రమైన హింసకు పాల్పడి తమను తామే చంపేసుకుంటున్నారు. వారి ఇళ్లు వారే తగులబెట్టుకుంటున్నారు. ఈ నేరాలకే వాళ్లు జైళ్లకు వెళ్తున్నారు.

ప్రస్తుత సమయంలో బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. అందుకే, తమ ఎంపీలను దళితుల ఇళ్లలో గడపాలనీ, తమది దళిత వ్యతిరేక పార్టీ కాదన్న విషయం వారికి అర్థం చేయించాలనీ బీజేపీ నాయకత్వం కోరింది. తమ పార్టీకి దళిత వ్యతిరేక ఇమేజ్‌ను కుట్రపూరితంగా ఆపాదిస్తున్నారని అది అంటోంది.

ఇంతకూ ఇలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతున్న వాళ్లెవరు? సావిత్రి బాయి ఫూలే, అశోక్ దొహరే, ఛోటేలాల్ ఖర్వార్, ఉదిత్ రాజ్, డాక్టర్ యశ్వంత్ వంటి వాళ్లే. వీళ్లందరూ బీజేపీ ఎంపీలే. దళితులపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకోవాలని ప్రధానికి ఫిర్యాదు చేసింది కూడా వీళ్లే.

ఇప్పటి వరకూ మౌనంగా ఉన్న రామ్‌విలాస్ పాశ్వాన్ గాలివాటును పసిగట్టి, దళితులలో బీజేపీకి అంత మంచి పేరు లేదని అన్నారు. పార్లమెంటు సభ్యులు చాలా ఒత్తిళ్ల మధ్యే ఇలా మాట్లాడుతున్నారనేది గమనించాలి.

Image copyright BBC/pti
చిత్రం శీర్షిక సావిత్రి బాయి ఫూలే

బీజేపీకి కష్టాలు తెచ్చిపెడుతున్న దళితులు

దళిత ఉద్యోగుల సంఘాల అఖిల భారత ఫెడరేషన్ కేంద్ర హోంమంత్రికి ఓ లేఖ రాసింది. "సవర్ణులు ('అగ్ర' కులాల వారు) హింసకు పాల్పడుతున్నారు. తప్పుడు ఎఫ్ఐఆర్ రాసి దళితులను జైళ్లలో పెడుతున్నారు" అని ఆ లేఖలో ఆరోపించారు.

"పోలీసు అధికారులు అంబేడ్కర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. బంద్ కారణంగా ఆఫీసుకు రాలేకపోయిన దళిత ఉద్యోగులను శిక్షిస్తున్నారు. వీటన్నింటికి సంబంధించిన వీడియోలనూ, స్క్రీన్ షాట్లను మీకు అందించాలని మేం అనుకుంటున్నాం."

చిత్రం శీర్షిక దళిత ఉద్యోగ సంఘాల అఖిల భారత ఫెడరేషన్ లేఖ

కిందటి ఎన్నికల్లో దళితులు మోదీ విజ్ఞప్తి మేరకు బీజేపీకి మద్దతు ఇచ్చారు. కానీ ప్రస్తుతం వారిలో నెలకొన్న ఆక్రోశం ఇలాగే కొనసాగితే ఆ పార్టీకి తీవ్ర సమస్యలు తప్పవు మరి. అందుకే, తమ ప్రభుత్వం దళితుల ప్రయోజనాలను కాపాడుతుందని హోంమంత్రి, రక్షణ మంత్రి, ప్రధానమంత్రి ప్రకటించారు.

అయినా బీజేపీ దళిత వ్యతిరేకి అన్న ఇమేజ్ బలపడుతోంది. ఎందుకంటే దళితుల రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుతామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎస్‌సీ-ఎస్‌టీ చట్టంలో మార్పు సందర్భంగా అది ఆ చర్యను దృఢంగా వ్యతిరేకించలేదు. ఆ తర్వాత దళితుల ఆగ్రహాన్ని గమనించాకే దాన్ని మళ్లీ సమీక్షించాలని అపీల్ చేసింది.

Image copyright Getty Images

దళితులు, హింస, ప్రభుత్వం

మరో ముఖ్య విషయం - 'దళితులపై అత్యాచారాలకు పాల్పడేవారిని వదిలిపెట్టం' అని పెద్ద నాయకుడెవరైనా అనడం మీరెప్పుడైనా విన్నారా? 'ఖండిస్తున్నాం' అనే ప్రకటనలకు పేరుగాంచిన హోంమంత్రి చాలా ఆచితూచి చేసిన ప్రకటనలో దళితులపై జరిగిన హింసను ఖండించడం కాదు కదా, దాన్ని ప్రస్తావించనైనా ప్రస్తావించలేదు.

ఈ పరిస్థితుల్లోంచి పుట్టుకొచ్చిన దళిత ఆక్రోశం బీజేపీని గట్టిగా దెబ్బ తీసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి అంతా చల్లబడిపోతుందని ఆ పార్టీ ఆశిస్తోంది.

అయితే ఈ ఆశ అర్థం లేనిదే అని చెప్పాలి. ఎందుకంటే గత నాలుగేళ్లలో ఆయుధాలు తీసుకొని రోడ్లపైకి వచ్చేసిన గుంపుల్ని ప్రభావయుతంగా అడ్డుకోవడానికి దాని నుంచి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. కాబట్టి ఒరల్లోంచి బయటకు లాగిన ఈ కరవాలాలు తిరిగి ఒరల్లోకి వెళ్లిపోతాయా అన్నది అనుమానాస్పదమే.

హింసకు పాల్పడుతున్న గుంపులకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే వారు తమను తాము హిందుత్వ సైనికులుగా భావిస్తారు. ఇప్పుడు దేశంలో ఉన్నది హిందువుల రాజ్యమే కాబట్టి తమకేం ఢోకా లేదన్నది వారి ధీమా.

ఈ సాయుధ దూకుడుతత్వం కేవలం ముస్లింలకు వ్యతిరేకంగానే పరిమితమవుతుందని అనుకుంటే అది అమాయకత్వమే. వాళ్లు దళితులను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.

కర్ణీ సేన, హిందూ యువ వాహిని, హిందూ చేతనా మంచ్, హిందూ నవజాగరణ్, హిందూ మహాసభ వంటి పేర్లతో చెలామణి అవుతున్న సంఘాల పిలుపుపై దూకుడుగా శోభాయాత్రలు నిర్వహించే వాళ్లందరూ - అది భాగల్‌పూర్‌లోనే కావొచ్చు, రోస్డాలో కావొచ్చు, నవాదా లేక గ్వాలియర్‌లలో ఎక్కడైనా కావొచ్చు - ఒకే తానులోని ముక్కలు కావని చెప్పలేం.

ముస్లింలపైనా, దళితులపైనా పథకం ప్రకారం దాడులు చేస్తున్న వాళ్లు వేర్వేరు కాదు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా, ముస్లింల పట్ల అమలవుతోందని చెబుతున్న బుజ్జగింపు ధోరణులకు వ్యతిరేకంగా వారిలో పీకల వరకూ వ్యతిరేకతను నింపేశారు. తమలో అణచిపెట్టుకున్న ఉక్రోశాలను వాళ్లు హింసా రూపాల్లో వ్యక్తీకరించడమే కాదు, అలా చేస్తున్నందుకు గర్విస్తున్నారు కూడా. దళితుల్లో, ముస్లింలలో భయాందోళనలను సృష్టిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఏప్రిల్ 2న దళితుల భారత్ బంద్ సందర్భంగా ఓ నిరసనకారుడిని కొంత మంది బెల్టులతో కొడుతున్న దృశ్యం

హిందువుల్లో ఉన్న ఐక్యత ఎంత?

తాము 'సామాజిక సామరస్యానికి' కట్టుబడి ఉన్నామని ఆర్ఎస్ఎస్, బీజేపీలు చెప్పుకుంటాయి. 'సామరస్యం' అంటే హిందువులంతా ఒకటి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. హైందవేతరులు శత్రువులు కావొచ్చు కానీ హిందువుల మధ్య శత్రుత్వం మంచిది కాదు.

హిందువులంతా ఒకటే అయితే, ప్రతి రెండు వాహనాల్లో ఒకదానిపై బ్రాహ్మణ్, జాట్, రాజ్‌పుత్, గూజర్ వంటి స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారు మరి? దళితులతో ఆలయ ప్రవేశం చేయించడానికి ప్రయత్నించినందుకు హిందువుల గుంపు దాడిలో గాయపడి ఆసుపత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందో బీజేపీ రాజ్యసభ సభ్యులు చెప్పగలరా?

యూపీ ముఖ్యమంత్రిని కలవడానికి ముందు దళితులు స్నానం చేసి రావాలని ఆదేశించడాన్నీ, అందుకోసం వారికి సబ్బులు కూడా ఇవ్వడాన్నీ నిత్యం అవమానాలు ఎదుర్కొనే దళితులు ఎలా మర్చిపోగలరు?

నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో తాము లేమని దళితులకు స్పష్టంగా తెలుసు. దళితులు రాష్ట్రపతి అయితే కావొచ్చు గానీ, ఓసారి బీజేపీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడండి. వాళ్ల కార్యవర్గాల్లో దళితులు ఎంత మంది ఉన్నారో? ఒక్కరో, లేదా ఇద్దరో - అంతే.

ఈ నేపథ్యంలో తమ సామరస్యపు గాలిబుడగను పేలిపోకుండా ఎలా కాపాడుకోవాలన్నదే బీజేపీ ముందున్న సవాలు. తమకు లభిస్తున్న రిజర్వేషన్లు లాక్కుంటారేమోనన్న అనుమానాలతో ఆందోళన చెందుతున్న వారికీ, మరోవైపు వాళ్లకు వ్యతిరేకంగా పూర్తిగా దూకుడు మీదున్న వారికీ మధ్య హింస క్రమంగా రాజుకుంటుండగా, వారిద్దరినీ ఒకేతాటిపైకి తేవడం చాలా కఠినమైన సవాలే.

'సామరస్యం' లేకుండా అధికారపు శృతిలయల మధ్య సమతుల్యం సాధించడమన్నది బీజేపీకి సాధ్యం కాని పని. ఎందుకంటే దేశంలో దళితులు 16 శాతం ఉన్నారు. దళితులనూ, ముస్లింలను పక్కన పెట్టేస్తే మిగిలిన 70 శాతం మంది ఓటర్లతోనే అధికార పీఠానికి కావాల్సిన మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. అయితే అది చాలా కష్టమైన పని.

ఈ హింస ఫలితంగా బీజేపీ ఏదో ఒక వైపు మొగ్గి ఉన్నట్టు కనపడే పరిస్థితి అనివార్యంగా తలెత్తుతోంది. ఓ వైపు, బీజేపీ నిజాయితీ పట్ల దళితులు ముందు నుంచే అనుమానాలతో ఉన్నారు. మరోవైపు, దళితులను శాంతింపజేయడానికి వారితో కలిసి భోజనం చేయడానికి మించి మరే పని చేసినా అగ్రకులాల ఓటర్లు ఆగ్రహిస్తారన్న భయం వెంటాడుతుంది.

ఈ కారణం వల్లనే భారతీయ జనతా పార్టీ దళితులతో కూర్చొని భోజనం చేయడం, వారి విశ్వాసాన్ని గెల్చుకునేందుకు ప్రయత్నించడం మాత్రం చేస్తోంది. కానీ ఈ చర్యలతో 'అగ్ర' కులాల వారికి ఏ మాత్రం కోపం తెప్పించకుండా జాగ్రత్త వహిస్తోంది. అయితే ఇలా ఎంత కాలం సాగుతుందో ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)