ప్రెస్‌రివ్యూ: ‘సోషల్ మీడియా కార్యకర్తలు కావలెను’ - రాజకీయ పార్టీల ప్రకటనలు

  • 11 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

ఎన్నికల యుద్ధం వాల్‌ పోస్టర్ల నుంచి ఫేస్‌బుక్‌ వాల్‌ పోస్టులకు మళ్లిందని, మైకులతో ప్రచార హోరు వాట్సాప్‌లో పోరుగా మారిందని.. వచ్చే ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుంటున్నాయని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

సాక్షి కథనం ప్రకారం.. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు కొత్తగా ఏర్పాటైన తెలంగాణ జనసమితి కూడా తమ ప్రచారానికి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందుకోసం సిబ్బందిని, వలంటీర్లను ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టారు. కోదండరామ్ ఇటీవలే పెట్టిన కొత్త పార్టీని సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఐదు వేల మంది కార్యకర్తలు (వలంటీర్లు) కావాలని ఫేస్‌బుక్, ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ నేరుగా కార్యకర్తలు, ప్రజలతో మాట్లాడేందుకు ఫేస్‌బుక్‌ లైవ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టారు. అధికార టీఆర్‌ఎస్‌ కూడా సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను విరివిగా సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయాలంటూ ఫేస్‌బుక్, ట్విటర్‌‌ల ద్వారా కార్యకర్తలకు సూచించింది. ఇక బీజేపీ కేంద్ర స్థాయిలో చేస్తున్న క్యాంపెయిన్‌ తరహాలో రాష్ట్రంలో చేపట్టేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు ప్రత్యేక బృందాలను నియమించారు.

రాజకీయ పార్టీలు తమ సోషల్‌ మీడియా ఖాతాలను నేరుగా కార్యాలయం నుంచి నడిపిస్తుండగా... ప్రజాప్రతినిధులు, నేతలు విడిగా వారి నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా క్యాంపెయిన్‌ బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికితోడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న పలువురు ఎన్నారైలు, నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న పలువురు నేతలు.. సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ కోసం పలు సంస్థల సేవలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా సంస్థలకు నెలకు రూ. లక్ష నుంచి రూ. 2.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

Image copyright Arun Jaitley/Facebook

మీ లెక్కలు మేం ఒప్పుకోం: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నిరసన

పదిహేనో ఆర్థిక సంఘ విధివిధానాలపై కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు మరోసారి గళమెత్తాయని, వివక్షతో కూడిన నిబంధనావళిని తక్షణం పునర్నిర్వచించాలని డిమాండ్‌ చేశాయని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై మంగళవారం నాడు తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం జరిగింది. దీనికి కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పుదుచ్చేరి ఆర్థికమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ, తమిళనాడు గైర్హాజరయ్యాయి. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సమావేశమై తమ నిరసనను తెలియజేయడం ఇదే ప్రథమం.

''రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య వ్యవస్థ సూత్రాలకు 15వ ఆర్థిక సంఘ విధివిధానాలు పూర్తిగా వ్యతిరేకం. మేలైన నిర్ణయాలు తీసుకుంటూ- మంచి పనితీరు కనబరుస్తున్న, అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాల పట్ల ఇది వివక్ష చూపడమే. 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకోకుండా 2011 జనాభాను పరిగణించి- సిఫారసులు చేయాలని సూచించడం వల్ల ప్రగతిశీల దక్షిణాది రాష్ట్రాలు తమ ఆదాయాన్ని భారీగా కోల్పోతాయి. అందుచేత వెంటనే ఈ టీఓఆర్‌ను మార్చి- తిరిగి రూపొందించాలి.. పునర్నిర్వచించాలి'' అని ఈ రాష్ట్రాలు గట్టిగా అభిప్రాయపడ్డాయి. ఈ నెలాఖరులో గానీ, లేక మే నెల మొదటివారంలో గానీ విశాఖపట్నంలో తదుపరి సమావేశం జరుగుతుందని ప్రకటించారు.

దక్షిణాది రాష్ట్రాల పట్ట వివక్ష చూపుతున్నారన్న విమర్శలను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తిరస్కరించారు. ''15 వ ఆర్థిక సంఘం కోసం రూపొందించిన విధివిధానాలు- ప్రస్తుత జనాభా అవసరాలను, జనాభా అదుపు దిశగా చేపట్టే చర్యలను పూర్తిగా సమతుల్యం చేస్తాయి. దేశంలోని ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా ఈ టీఓఆర్‌ ఉన్నాయన్న ఆరోపణలు సత్యదూరం. ఇది అనవసరమైన రాద్ధాంతం'' అని ఫేస్‌బుక్‌ పోస్టులో స్పష్టంచేశారు.

Image copyright Getty Images

మమ్మల్ని పిచ్చోళ్లను చేస్తోంది: కార్యనిర్వాహక వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పర్యావరణానికి, ప్రజా ప్రయోజనం కోసం ఉద్దేశించిన రూ. లక్ష కోట్ల నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిందని.. ''కార్యనిర్వాహక వ్యవస్థ మమ్మల్ని 'పిచ్చోళ్ల'ను చేస్తోంది'' అని దుయ్యబట్టిందని ‘ఈనాడు’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. కార్యనిర్వాహక వ్యవస్థను తాము విశ్వసించామని, అయితే అధికారులు సరిగా పనిచేయడంలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ''కోర్టు ఏదైనా చెబితే.. మేం పరిధిని దాటి వ్యవహరించామంటారు.. అతిక్రియాశీలత ప్రదర్శించామంటారు'' అని వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు సృష్టించిన వివిధ నిధుల కింద భారీగా సేకరించిన సొమ్మును పర్యావరణ పరిరక్షణకు, ప్రజా ప్రయోజనానికి మాత్రమే వాడాలని స్పష్టంచేసింది.

''ఇతర అవసరాల కోసం సొమ్మును వినియోగించినట్లు స్పష్టమవుతోంది. కోర్టు ఎంత దూరం వెళ్లాలనుకుంటున్నారు? కార్యనిర్వాహక వ్యవస్థకు ఒక బాధ్యత అప్పజెప్పాం. ఇష్టారీతిన వ్యవహరిస్తామన్నట్లు వారి ధోరణి ఉంది. మొదట మేం.. మా నమ్మకాన్ని వమ్ము చేసి, నిధులను మళ్లించిన వారిని పట్టుకోవాలి. ఇలా చేయడానికి మేం పోలీసులమా? దర్యాప్తు అధికారులమా? ఇది చాలా విసుగు కలిగిస్తోంది. ఇదేమీ చిన్నమొత్తం కాదు'' అని జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన 'కాంపెన్సేటరీ అఫారెస్టేషన్‌ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ' (కాంపా) కింద రూ. 11,700 కోట్లు ఉండేవని కోర్టు తెలిపింది. మొత్తం మీద ఇలాంటి నిధుల కింద దాదాపు రూ. లక్ష కోట్లు ఉండొచ్చని వివరించింది. అయితే కాంపా కింద రూ. 11 వేల కోట్లు ఖర్చయ్యాయని, మొత్తం నిధులు రూ. 50 వేల కోట్ల మేర ఉండొచ్చని ఓ న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న మొత్తం నిధుల వివరాలను సమర్పించాలని కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖను ఆదేశించింది.

Image copyright Getty Images

ధనిక జాతీయ పార్టీబీజేపీ.. విరాళాలు రూ. వెయ్యి కోట్లు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆదాయం అంతకంతకూ పెరుగుతున్నదని.. కేవలం ఏడాది కాలంలోనే ఆ పార్టీ ఆదాయం 81.18 శాతం పెరిగి రూ. 1,034.27 కోట్లకు చేరుకుందని ‘నవతెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆదాయపరంగా బీజేపీనే ధనిక జాతీయ పార్టీగా ఉన్నదని.. కాంగ్రెస్‌ రాబడి మాత్రం 14.45 శాతం మేర తగ్గిందని.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌ (ఏడీఆర్‌) రిపోర్టును ఉటంకిస్తూ తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 2016-17కు గానూ దేశంలోని ఏడు జాతీయ పార్టీల (బీజేపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, టీఎంసీ) ఆదాయాలపై ఏడీఆర్‌ అధ్యయనం చేసింది. 2016-17లో అన్ని పార్టీల ఆదాయం రూ. 1,559.17 కోట్లయితే.. ఖర్చు రూ. 1,228.26 కోట్లుగా ఉన్నది.

2015-16లో రూ. 570.86 కోట్లుగా ఉన్న బీజేపీ ఆదాయం.. 2016-17లో రూ. 463.41 కోట్లు పెరిగి రూ. 1,034.27 కోట్లకు చేరింది. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారును ప్రసన్నం చేసుకోవడానికి కార్పొరేట్లు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమయ్యారని రిపోర్టు ధ్రువీకరిస్తున్నది. ఇక రూ. 261.56 కోట్లు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం రూ. 225.36 కోట్లకు పడిపోయింది.

అలాగే రూ. 173.58 కోట్లుగా ఉన్న బీఎస్పీ ఆదాయం రూ. 266.32 కోట్లకు చేరుకున్నది. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) ఆదాయం రూ.9.13 కోట్ల నుంచి రూ.17.23 కోట్లకు పెరిగింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదాయం 81.32 శాతం తగ్గింది. అన్ని పార్టీల్లోకెల్లా సీపీఐ అతి తక్కువ ఆదాయాన్ని (రూ. 2.08 కోట్లు) కల్గి ఉన్నది.

ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్‌ పేర్కొన్నది. ప్రధానంగా మూడు పద్ధతుల్లో (గ్రాంట్లు, డొనేషన్లు, కాంట్రిబ్యూషన్లు) పార్టీలకు ఆదాయం సమకూరుతున్నది.

ట్రాన్స్‌జెండర్ Image copyright Getty Images

పాన్ దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు

పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) పొందేందుకు చేసుకొనే దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కోసం ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్ ఏర్పాటుచేయనున్నారని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఇప్పటివరకు పాన్ కోసం చేసుకొనే దరఖాస్తులో జెండర్ గురించి ప్రస్తావించేచోట స్త్రీ/పురుష (ఎఫ్/ఎం) అనే వర్గాలు మాత్రమే ఉండేవి. ఇకపై ట్రాన్స్‌జెండర్లకు కూడా (ఉదాహరణకు ఎఫ్/ఎం/టీ అని ఉండేలా) ఓ టిక్ బాక్సును ఏర్పాటుచేస్తారు. ఈ మేరకు ఆదాయపు పన్ను నిబంధనల్లో ప్రభుత్వం సవరణలు చేసింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ విధానాన్ని రూపొందించి, సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీబీడీటీకి ఇటీవల అందిన వినతులతో ఈ మేరకు నిబంధనలను సవరించినట్టు ఓ అధికారి తెలిపారు.

పాన్ కార్డు పొందేందుకు ట్రాన్స్‌జెండర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్‌కార్డులో జెండర్ క్యాటగిరీలో మూడోవర్గాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కానీ పాన్‌లో అందుకు అవకాశం లేదు అని చెప్పారు. దీనివల్ల ఆధార్‌కార్డుతో పాన్ అనుసంధానానికి ట్రాన్స్‌జెండర్లకు అవకాశం ఉండటంలేదని అధికారులు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. 2017 జూలై 1 నాటికి ప్రతి ఒక్కరూ పాన్ కార్డు కలిగి ఉండాలి. అప్పుడే ఆధార్ పొందేందుకు అర్హులవుతారు. ఆదాయపు పన్ను అధికారాలకు ఆధార్ నంబర్ తెలియజేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)