'టాలెంట్' స్కూల్ నిర్వాకం: తల్లిదండ్రులు ఫీజు కట్టలేదని నాలుగేళ్ల పిల్లాడిని చితకబాదారు!

  • 11 ఏప్రిల్ 2018
హైదరాబాద్, టాలెంట్ స్కూల్స్, ఫీజులు Image copyright Illiah Sadam

వేసవి సెలవులు మొదలైతే గంతులేస్తూ ఆడుకోవాల్సిన నాలుగేళ్ళ నర్సరీ పిల్లవాడు ఇప్పుడు నడవటానికే కష్టపడుతున్నాడు.

''స్కూల్ ఫీజు కట్టలేదని వాతలు తేలేట్లు చితకబాదారు స్కూల్ వాళ్ళు" అని ఆ పిల్లవాడి మామయ్య ఇల్లయ్య సాదం తెలిపారు.

హైదరాబాద్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఏప్రిల్ 9 న ఈ సంఘటన జరిగింది.

ప్లంబర్ పని చేసే తండ్రి జాలా శేఖర్, ఇళ్లలో పనులు చేసే తల్లి రేణుక పిల్లవాడి స్కూల్‌కు చెలించాల్సిన రెండు వేల రూపాయల ఫీజు కట్టడంలో ఆలస్యం అయింది.

దీంతో ఫీజు కోసం స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ కలిసి పిల్లవాడిని కొట్టినట్లు ఇల్లయ్య తెలిపారు. ఇల్లయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

"చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని మా చెల్లి, బావ కాయకష్టం చేసి పిల్లవాడిని చదివించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్కూలుకు కట్టాల్సిన ఫీజును సమయానికి కట్టలేకపోయారు. అందుకని అభంశుభం తెలీని పిల్లాణ్ని కొట్టడమేంటి?" అని ప్రశ్నించారు ఇల్లయ్య.

Image copyright Illiah Sadam

ఇంటికి వాతలతో వచ్చిన కొడుకును చూసి తల్లడిలిపోయిన తల్లి రేణుక వెంటనే స్కూలుకు వెళ్లి విషయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

"స్కూలుకు వెళ్తే మేనేజమెంట్ మొదట తమకేమీ తెలీదని బుకాయించారు. కానీ మా చెల్లి రెట్టించి అడిగేసరికి, 'జరిగిందేదో జరిగింది, మీ ఆయనకు చెప్పొద్దు' అని దబాయించారు. అదే రోజు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాం" అని వివరించారు ఇల్లయ్య.

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మీర్‌పేట్ పోలీస్ మంగళవారం కృషవేణి టాలెంట్ స్కూల్ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ పద్మజ, టీచర్ స్వరూపను అదుపులోకి తీసుకున్నారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎ. రాజు ఆ ముగ్గురినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

Image copyright Illiah Sadam

ఫీజుల కోసం ఇలా పిల్లలను వేధించడం ఇది మొదటిసారి కాదు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ 14 ఏళ్ల అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోవడంతో, ఆ బాలికను పరీక్షలు రాయనీయకపోవడమే ఆమె ఆత్మహత్యకు కారణమని తేలింది.

ఫీజుల కోసం అభం శుభం తెలీని పిల్లలను హింసిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు