ప్రెస్ ‌రివ్యూ: 'చంద్రబాబును ప్రజలు మరోమారు క్షమించొద్దు' - జగన్

  • 12 ఏప్రిల్ 2018
జగన్ Image copyright Facebook
చిత్రం శీర్షిక జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలు, మోసాలతో పాలన సాగిస్తున్నారని, ఆయన్ను ప్రజలు మరోమారు క్షమించరాదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారని 'ఆంధ్రజ్యోతి' రాసింది.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఏపీ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి సెంటర్లో నిర్వహించిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు.

''వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికీ కిలో బంగారం ఇస్తానంటాడు. నమ్మకుంటే బోనస్‌గా బెంజికారంటాడు. అప్పటికీ నమ్మకుంటే... ఓటు కు రూ.3 వేలు వంతున పంపిణీ చేయిస్తాడు. మీరు మాత్రం మూడు కాదు అయిదు వేలు కావాలని డిమాండ్‌ చేయండి. అదంతా మనడబ్బే. మనల్ని దోచి దాచిపెట్టిన సొమ్మే! తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారమే వేయండి'' అని ఆయన చెప్పారు.

వైసీపీ ఎంపీల దీక్ష భగ్నం

ప్రత్యేక హోదా డిమాండ్‌తో దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వేదికగా వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం భగ్నం చేశారని 'సాక్షి' తెలిపింది.

''దీక్ష భగ్నం సందర్భంగా ఏపీ భవన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర భావోద్వేగానికి గురైన పార్టీ శ్రేణులు ఎంపీలను తరలిస్తున్న అంబులెన్సులను అడ్డుకున్నారు. ఆందోళనకు దిగిన పార్టీ శ్రేణులపై పోలీసులు పక్కకు నెట్టేశారు. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు'' అని సాక్షి రాసింది.

ఈ ఇద్దరు ఎంపీల బ్లడ్‌షుగర్‌ స్థాయులు పడిపోవడం, మిథున్‌రెడ్డి అల్సర్‌తో బాధపడుతుండడంతో మంగళవారం రాత్రే దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. అయినప్పటికీ ఎంపీలు తమ దీక్షను కొనసాగించారు. బుధవారానికి దీక్ష ఆరో రోజుకు చేరుకుంది.

Image copyright Facebook/Andhra Pradesh CM

ఎన్నికల కంటే ముందే రుణ మాఫీ పూర్తి: చంద్రబాబు

రానున్న ఎన్నికల కంటే ముందే రైతుల రుణ మాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని 'ఈనాడు'రాసింది. విజయవాడ ఉండవల్లిలో బుధవారం రాత్రి భూధార్‌ ప్రయోగాత్మక అమలు పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

''కేంద్ర సహకారం లేకుండానే రాష్ట్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. మరో విడత చెల్లిస్తే రుణ మాఫీ పూర్తవుతుంది. పూర్తిగా రుణ మాఫీ చేసేంత వరకు నేను బాధ్యత తీసుకుంటా'' అని చంద్రబాబు తెలిపారు.

భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలు జరగకుండా భూధార్‌ ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. ''గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగకుండానే త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవచ్చు. భూముల విక్రయం, కొనుగోళ్లలో మధ్యవర్తిత్వం ఉండదు. మనిషికి ఆధార్‌లాగానే భూమి గుర్తింపునకు భూధార్‌ ఉపయోగపడుతుంది'' అని ఆయన వివరించారు.

Image copyright Venugopal Bollampalli

షాజహాన్ సంతకం తీసుకురండి: సున్నీ వక్ఫ్‌బోర్డుకు సుప్రీంకోర్టు ఆదేశం

తాజ్‌మహల్‌కు తమనే యజమానులుగా ప్రకటించాలన్న ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్‌బోర్డును మొఘల్ చక్రవర్తి షాజహాన్ సంతకాలు చేసిన దస్ర్తాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని 'నమస్తే తెలంగాణ' రాసింది.

భార్య ముంతాజ్‌మహల్‌పై ప్రేమతో తాజ్‌మహల్ కట్టించిన తర్వాత 18 ఏళ్లకు ఆగ్రా కోటలో గృహనిర్బంధంలో ఉండగానే షాజహాన్ కన్నుమూశారు.

తాజ్‌మహల్ తమ ఆస్తి అని 2005 జూలైలో వక్ఫ్‌బోర్డు ప్రకటించుకోగా, దీన్ని వ్యతిరేకిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మంగళవారం పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర స్పందిస్తూ- ''తాజ్‌మహల్ వక్ఫ్‌బోర్డుకు చెందుతుందంటే ఎవరైనా నమ్ముతారా? షాజహాన్ వక్ఫ్‌నామాపై ఎలా సంతకం చేశారు? దాన్ని మీకెప్పుడు ఇచ్చారు'' అని ప్రశ్నించారు.

మొఘల్ చక్రవర్తి నాటి కాలంలో వక్ఫ్‌నామా అనేది కూడా లేదని ఏఎస్‌ఐ తరఫు న్యాయవాది ఏడీఎన్‌ రావు చెప్పారు. షాజహాన్‌ను ఆయన కుమారుడు ఔరంగజేబ్ నిర్బంధించారని, ఆ నిర్బంధంలోనే ఆయన మృతిచెందారని, మరి కస్టడీలో ఉండగా షాజహాన్‌ వక్ఫ్‌నామాపై ఎలా సంతకం చేశారని ధర్మాసనం ప్రశ్నించింది.

సినిమాలు వదిలేస్తే పవన్‌కు మద్దతు: ముద్రగడ

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సినిమాలు వదిలిపెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే ఆ పార్టీకి మద్దతిచ్చే అంశంపై ఆలోచిస్తామని కాపు నేత ముద్రగడ పద్మనాభం అన్నారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

కాకినాడలో బుధవారం రాష్ట్ర కాపు జేఏసీ కార్యాచరణ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆరు నెలలకు, సంవత్సరానికి ఒకసారి రోడ్డు మీదకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పవన్‌ను ఉద్దేశించి ముద్రగడ వ్యాఖ్యానించారు. పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలంటే సినిమాలు వదిలి ప్రజల మధ్యకు వచ్చి సమస్యలపై పోరాడాలని, అప్పుడే ప్రజలు గౌరవిస్తారని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)