ప్రెస్‌రివ్యూ: బ్రిటీష్‌ వాళ్లకు బీజేపీకి తేడా లేదు - చంద్రబాబు

  • 13 ఏప్రిల్ 2018
చంద్రబాబు నాయుడు Image copyright TDP.Official/facebook

బ్రిటీష్‌ పాలకులకూ, బీజేపీ పాలకులకూ తేడా లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తాము తలుచుకుంటే రాష్ట్రంలో బీజేపీని నామరూపాలు లేకుండా చేయడంతోపాటు దేశంలోనూ లేకుండా చేస్తామని అన్నారు. ప్రజల మనో భావాలతో ఆటలాడవద్దన్నారు.

మంగళగిరి ఎపిఎస్‌పి బెటాలియన్‌లో జరిగిన ఏపీ పోలీస్‌ టెక్‌టవర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారని ప్రజాశక్తి ఒక కథనంలో పేర్కొంది. కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఏదిఏమైనా ప్రధాని మోదీపై పోరాటం చేయాలన్నారు. ఢిల్లీ వెళ్లి పోరాడే వారికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు. బీజేపీకి రాష్ట్రంలో ఏముందని, ఎప్పుడైనా ఇన్ని సీట్లు గెలిచారా అని ప్రశ్నించారు. బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని, ప్రధాని మోదీ తిరుమల వెంకన్న సాక్షిగా, అమరావతి, నెల్లూరు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చారని, ఇప్పుడు మాటతప్పి మోసం చేశారని అన్నారు. ఒక దేశ ప్రధాని దీక్ష చేయడం చరిత్రలో ఇంత వరకూ ఎక్కడా లేదన్నారు. కేవలం రెచ్చగొట్టడానికే ఇటువంటి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎటువంటి సాంకేతిక అంశాలూ అడ్డుకావని, ఇది కేవలం రాజకీయ పరమైన అంశమని చంద్రబాబు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలు, హిల్‌ స్టేషన్లకు హోదా ఇచ్చి ఏపీకి ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు.

ప్రధాని మోదీని నిలబెట్టింది టీడీపీ ఎంపీలే అని చంద్రబాబు గుర్తు చేశారు. అయినా ఆంధ్రాని నమ్మించి మోసం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ డబ్బులేదో ఇచ్చేసినట్లు, తన ఇంటికి రహస్యంగా పంపించినట్లు మాట్లాడు తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన డబ్బుకు సంబంధించి లెక్కలేమైనా ఉంటే ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానిపై ప్రత్యేక హోదా కోసం యుద్ధం చేస్తుంటే ప్రతిపక్షాలు కలిసి రావాలి కదా అని అన్నారు. న్యాయపరంగానూ ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. చాలాసార్లు ఢిల్లీ వెళ్లాల్సి వస్తుందని, అప్పుడే ఏమయిందని, కేంద్రం ఏ రూట్లో వస్తుందో మనం ఏ రూట్లో వెళ్లాలో చూడాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.

Image copyright Getty Images

దక్షిణాదిపై వివక్ష లేదు

దక్షిణాది పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నట్లు వచ్చిన ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది. నిధుల కేటాయింపులో దక్షిణాదికి అన్యాయం చేశారన్న ఆరోపణలు నిరాధారమని మోదీ అన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన అడయార్‌ కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ వజ్రోత్సవాల్లో ఆయన ఈ విషయంపై స్పందించారు. 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై తొలుత గళమెత్తిన తమిళనాడు గడ్డపైనే ప్రధాని వివరణ ఇచ్చారు.

''15వ ఆర్థిక సంఘం విధివిధానాలపై నిరాధార ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలకో, ఒక ప్రాంతానికో వ్యతిరేకంగా విధివిధానాలు ఉన్నట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణకు కష్టించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ఆర్థిక సంఘానికి సూచించింది'' అన్నారు. ''జనాభా నియంత్రణకు వనరులను, శక్తి యుక్తులను వినియోగించి, ఎంతో శ్రమించిన తమిళనాడు లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో తప్పకుండా లబ్ధి పొందుతాయి'' అన్నారు.

ఎన్‌డీయేతర పార్టీల పాలనలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు పదిహేనో ఆర్థిక సంఘం కొత్త విధివిధానాలు తమ పట్ల వివక్ష చూపేవిగా భావిస్తున్నాయి. బిహార్‌, యూపీలతో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే పన్ను ఆదాయం తమకు తగ్గుతుందని అనుమానిస్తున్నాయి. ఈసారి ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొంది. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. సమర్థతకు ప్రతిఫలం ఇవ్వాల్సింది పోయి శిక్షిస్తారా? అంటూ నాలుగు దక్షిణాది రాష్ట్రాలు పోరుబాట పట్టాయి.ఈ నేపథ్యంలో ప్రధాని దక్షిణాది రాష్ట్రాలకు సందేశం ఇచ్చారు.

Image copyright Getty Images

నోట్ల రద్దు చెత్త ఆలోచన!

మోదీ సర్కారు 2016 నవంబర్‌లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) నిర్ణయంపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారని సాక్షి ఒక కథనం ప్రచురించింది. అది మంచి ఆలోచన కాదని అప్పుడే తాను ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని ఆయన వెల్లడించారని ఈ కథనంలో పేర్కొంది. అంతేకాకుండా వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన కరెన్సీ నోట్లను రద్దు చేసే ప్రక్రియను తగిన ప్రణాళిక లేకుండా చేపట్టారని కూడా ఆయన కుండ బద్దలుకొట్టారు. విఖ్యాత హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2016 నవంబర్‌ 8న మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటి స్థానంలో కొత్తగా మళ్లీ రూ.2,000, రూ.500 నోట్లను వెంటనే ప్రవేశపెట్టారు. తర్వాత రూ.200 నోటును కూడా తీసుకొచ్చారు. అయితే, తగినన్ని నోట్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లుపడ్డారు.

తగినన్ని నోట్లు సిద్ధం కాకుండానే..

'వ్యవస్థలో ఉన్న 87.5 శాతం విలువైన నోట్లను రద్దు చేయాలంటే ముందుగా దానికి తగ్గట్టుగా కరెన్సీ నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధపడాలి. ఏ ఆర్థికవేత్త అయినా ఇదే చెబుతారు. అయితే, భారత ప్రభుత్వం ఇలాంటి కసరత్తును పూర్తిగా చేయకుండానే ఆదరాబాదరాగా డీమోనిటైజేషన్‌ను ప్రకటించింది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ నిర్ణయంతో ప్రజలు నల్ల ధనాన్ని నేలమాళిగల్లోంచి బయటకు తెచ్చేసి, లెంపలేసుకొని పన్నులు కట్టేస్తారనేది ప్రభుత్వం ఆలోచన. అయితే, ఇది అవివేకమైన నిర్ణయం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు కొత్త వ్యవస్థలకు వేగంగా అలవాటుపడిపోయి, కొత్త దారులు వెతుక్కుంటారన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. రద్దు చేసిన నోట్లకు సమానమైన మొత్తం వ్యవస్థలోకి మళ్లీ తిరిగివచ్చేసిందంటే, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో దీన్ని చేపట్టిందో అది నెరవేరనట్టే లెక్క. ప్రత్యక్షంగా దీని ప్రభావంలేదని తేటతెల్లమైంది. కరెన్సీకి కటకటతో ప్రజలు ఇబ్బందుల పాలు కావడం ఒకెత్తు అయితే, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడంతో అసంఘటిత రంగంలో భారీగా ఉద్యోగాలు ఊడిపోయాయి. అయితే, దీర్ఘకాలంలో దీనివల్ల ఎలాంటి ప్రభావం పడుతుందనేది వేచి చూడాలి. ప్రధానంగా పన్నుల వసూళ్లపై ప్రభుత్వం గనుక సీరియస్‌గా దృష్టిసారిస్తే... ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. ఇది నెరవేరిందని బలంగా నిరూపితం అయితేనే సానుకూల ప్రభావం ఉన్నట్లు లెక్క. నా వరకూ అయితే, ఆ సమయంలో నోట్ల రద్దు అనేది నిరుపయోగమని భావించా' అని రాజన్‌ వివరించారు.

Image copyright Reuters

సుప్రీంకోర్టుపై కేంద్రం ఎదురుదాడి

ఎస్సీ, ఎస్టీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చట్టంలోని నిబంధనలను నీరు గారుస్తోందని, దీనివల్ల దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపిందని ప్రజాశక్తి ఒక కథనంలో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం చెప్పినందునే ఈ చట్టంలో అరెస్టు నిబంధనలపై తాము ఉత్తర్వులు ఇచ్చామంటూ సుప్రీంకోర్టు ఇటీవల మోదీ సర్కార్‌కు చీవాట్లు పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ తాజా స్పందన సుప్రీంకోర్టుపై ఎదురుదాడికి దిగినట్లుగా కనిపిస్తోందని ఈ కథనం పేర్కొంది. అత్యంత సున్నితమైన స్వభావం కలిగిన ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు దేశంలో భావోద్వేగాలను రెచ్చగొడుతోందని, ఆగ్రహం, అశాంతికి కారణమవుతోందని, పైగా సామరస్యత లోపిస్తోందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా ఎస్సీ, ఎస్టీ చట్టంలోని శూన్యతలను భర్తీ చేయలేదని, అయితే వైరుధ్యాలను మాత్రం పెంచిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ లిఖితపూర్వకంగా సమర్పించిన కేంద్ర ప్రభుత్వ వాదనలో పేర్కొన్నారు. పార్లమెంట్, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థల అధికారాలు వేర్వేరుగా ఉన్నాయని, వాటిని ఉల్లంఘించలేమని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడిన గందరగోళం, అయోమయాన్ని తీర్పును సమీక్షించటం ద్వారా సరిదిద్దుకోవచ్చని చెబుతూ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)