వీళ్లను తిడతారు, కొడతారు, అసహ్యించుకుంటారు - ఎందుకు?

  • 15 ఏప్రిల్ 2018
సుగ్రీవ్
చిత్రం శీర్షిక సుగ్రీవ్

ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని కుటుంబాలు ఎన్నో తరాలుగా చనిపోయిన జంతువుల ఎముకల్ని సేకరించి వాటిని అమ్ముకొని జీవిస్తున్నాయి. కానీ 2017లో ప్రభుత్వం గోవధపై నిషేధాన్ని విధించినప్పటి నుంచీ ఎముకల్ని సేకరించే వాళ్లంతా భయం భయంగా బతుకుతున్నారు.

అక్కడ వేలాది దళితులు ఈ వృత్తిపై ఆధారపడే జీవిస్తున్నారు. అలాంటి వాళ్లలో ఒకరైన బ్రిజ్వాసీ లాల్ అనే వ్యక్తితో ఫొటోగ్రాఫర్ అంకిత్ శ్రీనివాస్ మాట్లాడారు.

‘మేం ఎముకల్ని తీసుకెళ్లడం ఎవరైనా చూస్తే, మేమే గోవుల్ని చంపామనీ, వధశాలల కోసం మేం పనిచేస్తున్నామనీ అనుకొని దాడి చేస్తారు’ అని బ్రిజ్వాసీ లాల్ వివరించారు. ఏడాది కాలంగా అలా ఎముకలతో కనపడిన చాలామంది దళితులు గోవుల్ని వధిస్తున్నారనే ఆరోపణలపై దాడులకు గురయ్యారు.

బ్రిజ్వాసీ లాల్‌ కూడా దాడులకు, బెదిరింపులకు గురయ్యారు.

బ్రిజ్వాసీ లాల్‌
చిత్రం శీర్షిక బతకడానికి బ్రిజ్వాసీ లాల్‌కు ఇదే ఆధారం

2017లో ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక అక్కడ అనేక గో వధశాలలను మూసేశారు. దాదాపు 18రాష్ట్రాలలో గోవధపై నిషేధం అమలులో ఉంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక క్రీయాశీలంగా ఆ నిషేధం అమలవుతూ వస్తోంది.

హిందువులు గోవుల్ని పవిత్రంగా భావిస్తారనీ, అందుకే వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని బీజేపీ నమ్ముతుంది. కానీ దేశంలో లక్షలాది దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు బీఫ్ తింటారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎంతమంది దళితులు ‘బోన్ కలెక్టర్స్‌’గా పనిచేస్తున్నారో తెలీదు. కానీ అలహాబాద్, కాన్పూర్, గోండా నగరాల్లో వాళ్లు ఎక్కువగా ఉన్నారు. తాము సేకరించిన ఎముకల్ని వివిధ రసాయనాల ఫ్యాక్టరీలకు అమ్ముకొని ఆ వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే వాళ్లు జీవిస్తారు.

‘కేజీ ఎముకలు అమ్మితే 3-5 రూపాయలొస్తాయి. ఈ పనికి ఏమాత్రం గౌరవం ఉండదు. కానీ కుటుంబాన్ని పోషించుకోవడానికి మాకు మరో మార్గం లేదు’ అంటారు బ్రిజ్వాసి లాల్. కానీ గోసంరక్షణ పేరుతో జరిగిన దాడుల్లో గత కొన్నేళ్లుగా చాలామంది చనిపోయారనీ, అందుకే ప్రస్తుతం తానీ పనిచేయడానికి భయపడుతున్నాననీ బ్రిజ్వాసీ చెబుతారు.

అందుకే చాలా జాగ్రత్తగా ఉంటున్నట్టు, తమ పనిని చీకట్లో మొదలుపెట్టి ఉదయం 10లోపు ముగిస్తున్నట్లు ఆయన వివరిస్తారు.

బ్రిజ్వాసీ లాల్
చిత్రం శీర్షిక బ్రిజ్వాసీ లాల్

గో సంరక్షకుల చేతిలో చనిపోయిన వాళ్లలో ఎక్కువగా ముస్లింలే ఉన్నారు. ఎక్కువగా వదంతుల కారణాంగానే వాళ్లపై దాడులు జరిగాయి.

‘మేం దళితులం కాబట్టి మామూలుగానే మమ్మల్నెవరూ గౌరవించరు. దానికితోడు ఈ పని ద్వారా మమ్మల్ని నిజంగానే అంటరానివాళ్లలా చూస్తున్నారు. రోడ్డుపైన మమ్మల్ని చూసి ఎదుటివాళ్లు పక్కకు తప్పుకుంటారు.

కొన్ని ఫ్యాక్టరీలు ఈ ఎముకల్ని కొంటాయి

కుళ్లిపోయిన మాంసం వాసన ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. చాలా మంది మేం వాటికి అలవాటు పడిపోయాం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మాకు వేరే దారి లేదంతే’ అని బ్రిజ్వాసీ లాల్ వివరించారు.

ఈ పని చేయడానికి శారీరకంగానే కాదు, మానసికంగానూ దృఢంగా ఉండాలంటారు సుగ్రీవ్ అనే మరో వ్యక్తి.

ఈ పనికి చాలా శక్తి కావాలంటారు సుగ్రీవ్
చిత్రం శీర్షిక ఈ పనికి చాలా శక్తి కావాలంటారు సుగ్రీవ్

‘చనిపోయిన జంతువుల్ని వెతుక్కుంటూ మేం రోజూ దాదాపు 45కిలోమీటర్లు కాలి నడకన తిరుగుతాం. ఎవరి ఇంట్లోనైనా జంతువులు చనిపోయినప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తారు. కానీ తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. అసలు ఏమాత్రం గౌరవించరు’ అని సుగ్రీవ్ చెబుతారు.

ఆయన పిల్లలు కూడా ప్రస్తుతం ఇదే పనిచేస్తున్నారు. కానీ భవిష్యత్తులో వారు వేరే పని చేస్తారని ఆయన ఆశిస్తున్నారు.

‘ఈ జంతు కళేబరాల దగ్గర వేరే వాళ్లు ఎక్కువ సేపు నిల్చోలేరు. కానీ దశాబ్దాలుగా మేం ఇదే పని చేస్తున్నాం. నాకు వేరే పని దొరికితే బావుండు. కానీ మాకెవరు పనిస్తారు?’ అని బైసాఖు అనే మరో వ్యక్తి చెప్పారు.

బైసాఖు
చిత్రం శీర్షిక ‘మేం పశువుల్ని చంపం, వాటి ఎముకల్ని మాత్రమే సేకరిస్తాం’ అంటారు బైసాఖు.

‘మేం జంతువుల్ని చంపం. చనిపోయిన జంతువుల ఎముకల్ని మాత్రమే ఏరుకుంటాం. కానీ ఆ విషయం తెలియక చాలామంది మమ్మల్ని నిందిస్తారు. మాపై దాడిచేస్తారు. నేను చాలాసార్లు గాయాలపాలైన పశువుల్ని చూశాను. మాకు సమస్యల్ని సృష్టించే బదులు వాటి సమస్యల్ని ఎవరైనా పట్టించుకుంటే బావుంటుంది’ అని బైసాఖు అభిప్రాయపడ్డారు.

పశువుల ఎముకల్ని సేకరించే క్రమంలో వాళ్లు చాలా దూరం నడుస్తారు. గాయపడతారు. కానీ డబ్బుల్లేక, ఆస్పత్రికి వెళ్లలేక గాయాలను నిర్లక్ష్యం చేస్తారు.

ఎముకల్ని సేకరించే వ్యక్తి

‘ఒక్కోరోజు 50కిలోల ఎముకలు దొరకుతాయి. ఒక్కోసారి 5 కిలోలే దొరకుతాయి. భరోసా లేని బతుకులు మావి’ అంటారు బైసాఖు. ‘ఓసారి ఎముకల్ని తీసుకొని ఇంటికొస్తుంటే, నేనే ఆవును చంపానని పొరబడి కొందరు నాపై దాడి చేశారు’ అని బైసాఖు చెబుతారు.

చోటు లాంటి కొందరు ఈ పనిని వదిలేసినా, అప్పుడప్పుడు పైడబ్బుల కోసం ఎముకల్ని సేకరిస్తారు.

చోటు
చిత్రం శీర్షిక చోటు అప్పుడప్పుడు పైడబ్బుల కోసం ఎముకల్ని సేకరిస్తారు.

‘మేం పర్యావరణంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తున్నాం. దానికి బదులుగా అవమానాల్ని ఎదుర్కొంటున్నాం. మమ్మల్ని కాస్త గౌరవించడం అంత కష్టమా?’ అని ప్రశ్నిస్తారు చోటు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు