'భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు' - అంబేడ్కర్‌తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ

వీడియో క్యాప్షన్,

వీడియో: ‘‘ఓటింగ్ జరిగేది ప్రభుత్వాలను ఎన్నుకొనేందుకు/మార్చేందుకు అనే చైతన్యం ఎవరికుంది?''

1953లో డా. బీఆర్ అంబేడ్కర్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో.. భారత్‌లో ప్రజాస్వామ్యం భవిష్యత్తు, ఎన్నికల వ్యవస్థ, తదితర అంశాలపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమవుతుందా అన్న ప్రశ్నకు సమాధానంగా.. ‘‘విజయవంతం కాదు’’ అని అంబేడ్కర్ సమాధానమిచ్చారు.

అయితే అది నామమాత్రంగా, లాంఛనప్రాయంగా మాత్రంగానే కొనసాగుతుందని, ఎన్నికలు, ప్రధానమంత్రి, ఇతరత్రా అంశాలన్నీ ఉంటాయని ఆయన చెప్పారు.

సరైన వారు ఎన్నికైతేనే ఎన్నికలకు ప్రాధాన్యం!

ఎన్నికలు ముఖ్యం కాదా అని ప్రశ్నించగా, ఎన్నికలు వాటికవి ముఖ్యం కాదని, ఎన్నికల్లో సరైన వారు ఎన్నికైతేనే వాటికి ప్రాధాన్యం ఉంటుందని అంబేడ్కర్ స్పష్టం చేశారు.

సరిగా పాలించని వారిని గద్దె దించేందుకు ఎన్నికలు ప్రజలకు అవకాశం కల్పిస్తాయి కదా అని ప్రశ్నించగా.. ''అవును, కానీ ఆ స్పృహ, ఆలోచన ఎవరికి ఉన్నాయి? ఓటింగ్ జరిగేది ప్రభుత్వాలను ఎన్నుకొనేందుకు/మార్చేందుకు. కానీ అవసరమైన చైతన్యం ఎందరికి ఉంది?'' అని అంబేడ్కర్ స్పందించారు.

భారత ఎన్నికల వ్యవస్థలో అభ్యర్థికి ప్రాధాన్యం తక్కువ అని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. అభ్యర్థిని నిర్ణయించడంలో ప్రజలకు పాత్ర లేకుండా పోయిందని కూడా ఆయన చెప్పారు.

''ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తమ చిహ్నం జోడెద్దులకు ఓటేయాలని ప్రజలను కోరింది. ఆ పార్టీ తరఫున పోటీ చేస్తోంది గాడిదా? లేక ఓ విద్యావంతుడా?.. అన్నది ఎవరూ ఆలోచించలేదు. జోడెద్దుల గుర్తుకే ఓటేశారు'' అని ఆయన చెప్పారు.

అసమానతలు పోవాలి!

''భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. మౌలిక కారణం ఏంటంటే - ఇక్కడున్న సామాజిక వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం అనువైనది కాదు'' అని అంబేడ్కర్ తెలిపారు.

భారత సామాజిక వ్యవస్థలో అసమానతలు ఉన్నాయని ఆయన విచారం వ్యక్తంచేశారు. వివక్షతో కూడిన ఈ వ్యవస్థను అంతమొందించాల్సి ఉందన్నారు.

శాంతియుత మార్గంలో ఈ వ్యవస్థను అంతమొందించాలంటే సమయం పడుతుందని అంబేడ్కర్ చెప్పారు. సామాజిక వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు.

ప్రధానమంత్రి (జవహర్‌లాల్ నెహ్రూ), ఇతర నాయకులు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు కదా అని ప్రస్తావించగా, ప్రసంగాలతో ఒరిగేదేమీ లేదని అంబేడ్కర్ వ్యాఖ్యానించారు. ప్రసంగాలతో విసుగెత్తిపోయామన్నారు.

మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు. గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు.

‘కమ్యూనిజమే ప్రత్యామ్నాయం!’

భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోతే ప్రత్యామ్నాయం ఏమిటని బీబీసీ ప్రశ్నించగా - అప్పుడు ఏదో రకమైన కమ్యూనిజం లాంటిదే ప్రత్యామ్నాయం అవుతుందని తాను భావిస్తున్నట్లు అంబేడ్కర్ చెప్పారు.

తన అమెరికా ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికాలో ప్రజాస్వామ్యం విజయవంతమైంది కాబట్టి అక్కడ కమ్యూనిజం ఎప్పటికీ అధికారంలోకి రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

"భారత్‌లోనూ అలాంటి పరిస్థితులు ఏర్పడేలా చర్యలు చేపట్టవచ్చు కదా?" అని బీబీసీ ప్రశ్నించింది. అందుకు సమాధానం ఇస్తూ.. ‘‘అదెలా సాధ్యం? భారత్‌లో అందరికీ భూమి లేదు, వర్షపాతం తక్కువ, ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని పరిష్కరించకుండా పరిస్థితులను మెరుగుపరచలేం. ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని నేను అనుకోవడం లేదు’’ అని అంబేడ్కర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)