నన్ను రేప్ చేసినా, చివరకు చంపినా.. నా పోరాటం ఆగదు!

  • 14 ఏప్రిల్ 2018
సత్యభామ సౌందర్మల్ Image copyright Satyabhma Saundarmal

''రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారు. కానీ.. మహిళా హక్కులను హిందూ కోడ్ బిల్లులో పాస్ చేయడాన్ని వ్యతిరేకించిన సందర్భంలో డా.బీఆర్ అంబేడ్కర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం.. నాకు స్ఫూర్తినిచ్చింది'' అని సామాజిక వేత్త సత్యభామ సౌందర్మల్ అన్నారు.

మధ్యనిషేధం కోసం సత్యభామ పోరాడుతున్నారు. ''నా పోరాటంలో డా.అంబేడ్కరే నాకు స్ఫూర్తి. ఓ మహిళగా ఇప్పుడు నాకంటూ కొన్ని హక్కులున్నాయంటే.. ఆ ఘనత మాత్రం అంబేడ్కర్‌కే చెందుతుంది.

''పదో తరగతిలో మొదటిసారిగా అంబేడ్కర్ గురించి చదివాను. కానీ.. విద్య, సంఘటితం, పోరాటం అన్న ఆయన సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఆయన స్ఫూర్తితోనే.. నా పోరాటంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని ఎదుర్కోగలుగతున్నాను.''

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో.. మధ్యనిషేధం, మహిళా హక్కుల ఉద్యమాలు.. నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా హక్కులు, దళితులు, పీడిత వర్గాల కోసం 15 సంవత్సరాలుగా సత్యభామ పోరాడుతున్నారు.

''సమాజంలో దోపిడికి గురవుతున్నవారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే నా ప్రధాన లక్ష్యం. జీవితంలో చదువు ఆవశ్యకత గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందేశం నన్ను బాల్యంలోనే ఆకర్షించింది. నా ఆలోచనలపై చెరగని ముద్ర వేసింది. మొదట్లో.. కేవలం దళితుల నేతగానే అంబేడ్కర్‌ను అర్థం చేసుకున్నాను. కానీ ఆయన గురించి చదివాక, ఆయనెంత గొప్ప నాయకుడో అర్థమైంది.''

Image copyright Satyabhma Saundarmal

నిరక్షరాస్యతే అడ్డంకి...

బీడ్ జిల్లా మాజల్గూన్‌లో సత్యభామ జన్మించారు. ఉపాధి కోసం ఆమె తండ్రి ముంబై వెళ్లి, అక్కడే రెండో పెళ్లి చేసుకున్నారు. సత్యభామ తల్లి, అవ్వ ఇద్దరూ తమ స్వగ్రామంలోనే ఉంటూ.. అయిదుగురు పిల్లలను చదివించారు.

''నిరక్షరాస్యత వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో మా అవ్వకు బాగా అనుభవం. అందుకే.. ఎట్టిపరిస్థితుల్లో మేం చదువుకోవాలన్నది ఆమె సంకల్పం.''

''నేను పదో తరగతి పూర్తి చేసిన తర్వాత నాపై, నా సోదరిపై దొంగతనం చేశామంటూ కొందరు కేసు పెట్టారు. కొన్నాళ్లు జైల్లో కూడా ఉన్నాం. అప్పుడు లాయర్ ఏక్‌నాథ్ అవ్హడ్ మమ్మల్ని జైలు నుంచి విడిపించారు. ఆయనే నాకు అంబేడ్కర్‌ రచనలను పరిచయం చేశారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది.

ఏక్‌నాథ్‌కు చెందిన సంస్థ గత 4దశాబ్దాలుగా మానవ హక్కులపై పోరాడుతోంది. మహారాష్ట్రలోని దళితులు, పోత్రాజ్ వర్గీయుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ఆ సంస్థ పోరాడుతోంది.

''ఏక్‌నాథ్ గారి ప్రభావం నాపై చాలా ఉంది. ప్రస్తుతం ఆయనతో కలిసి పని చేస్తున్నాను. ఇక చదువు విషయానికొస్తే.. డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత 'మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్'(ఎమ్.ఎస్.డబ్ల్యూ) లో పీజీ పూర్తీ చేశాను. ఎమ్మెస్‌డబ్ల్యూ చదువుతున్నపుడే నాకు ప్రజలతో కలిసే అవకాశం కలిగింది. ఆవిధంగా సమాజసేవకు ఆకర్షితురాలినయ్యాను.''

Image copyright Satyabhma Saundarmal

'గృహ హింస' మూలాల కోసం అన్వేషణ...

''గృహ హింస బాధితులతో పని చేస్తున్నపుడు, సమస్యకు అసలు కారణం నాకర్థమైంది. 'ఏదైనా సమస్యను నిర్మూలించాలనుకున్నపుడు.. దాన్ని వేళ్లతో సహా పెకిలించాలి' అన్న అంబేడ్కర్ మాటలను నాకు పూర్తి విశ్వాసం ఉంది.'' అని సత్యభామ అన్నారు.

''చాలా గృహ హింస కేసుల్లో మద్యం తాగడమే ప్రధాన కారణమని తెలుసుకున్నాను. మద్యం తాగే భర్తలు తమ భార్యలను కొట్టడం ఆనవాయితీగా మారింది. ఆ సందర్భంలో మద్యనిషేధం గురించి ఆలోచించాను. అందుకోసం మహారాష్ట్ర మధ్యనిషేధ చట్టం - 1949ను అధ్యయనం చేశాను.''

అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన సమయంలో.. 22 ప్రతిజ్ఞలు చేయాలని తన అనుచరులకు సూచించారు. అందులో 'నేను ఎప్పుడూ మద్యం, మత్తు పదార్థాలను సేవించను' అన్నది 17వ ప్రతిజ్ఞ.

''మద్యపాన సమస్యలపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నాం. మా ఈ ప్రయత్నంలో భాగంగా.. అంబేడ్కర్ ప్రతిజ్ఞలను కూడా వారికి గుర్తు చేస్తున్నాం. అంబేడ్కర్ జయంతి రోజున కూడా చాలా మంది మద్యం సేవిస్తున్నారు. అలా చేయడం ఆయన్ను అవమానించడమేనని మేం వారికి చెబుతున్నాం.''

నాపై మహిళలే దాడి చేశారు!

మద్యపాన నిషేధం కోసం చేసిన పోరాటంలో సత్యభామకు ఎన్నో అవార్డులు వచ్చాయి. అవార్డులతోపాటుగా ఆమె ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. నా పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న మగవాళ్లు.. కొందరు మహిళలను నాపై దాడికి ఉసిగొల్పారు. 2017 మార్చి నెలలో నాపై దాడి చేసి, నా బట్టలను చింపేశారు. ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాను. తర్వాత.. రెట్టింపు శక్తితో నా పోరాటాన్ని కొనసాగించాను.

''నేను అంబేడ్కరిస్టును. నన్ను ఎవరూ ఓడించలేరు. నన్ను రేప్ చేసినా, చివరికి చంపేసినా పోరాటం ఆగదు. గతంలో కూడా చాలా మంది నాతో పోట్లాడారు.'' అని సత్యభామ అన్నారు.

బీడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మద్యనిషేధం అమలు చేయడంలో సత్యభామ సఫలమయ్యారు. సత్యభామ.. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోపాటు అనాధ శరణాలయం, శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఆమె భర్త కూడా సత్యభామకు చెందిన 'దామిని మద్యనిషేధ కార్యక్రమం'లో ఓ కార్యకర్తలా పని చేస్తున్నారు.

''పని మీద నేను బయటకు వెళ్లినపుడు నా భర్తే పిల్లలను చూసుకుంటారు'' అని సత్యభామ చెబుతున్నారు.

''అంబేడ్కర్.. కేవలం భారత రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు. ఆధునిక భారతానికి రూపకర్త కూడా! ఆయన నిబంధనలను, ఆర్థిక విధానాలను అవలంబిస్తే.. అంబేడ్కర్ కలలుకన్న భారత దేశం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది!''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి

హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను శుక్రవారం వరకు భద్రపరచండి: తెలంగాణ హైకోర్టు

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 3 స్థానాల్లో గెలుపు, 9 స్థానాల్లో ఆధిక్యం

‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు

'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె

దిల్లీ అగ్నిప్రమాదం: ‘ముగ్గుర్ని కాపాడా.. కానీ, నా సోదరుడిని కాపాడుకోలేకపోయా’