#గమ్యం: బీటెక్ తర్వాత ఏం చేయాలి? ఎంబీఏ-ఎంటెక్-జాబ్!?

  • 15 ఏప్రిల్ 2018
#గమ్యం: ఎంబీఏ - ఎంటెక్ - జాబ్: బీటెక్ తర్వాత ఏం చేయాలి? Image copyright PDPU

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

బీటెక్ పూర్తైన తర్వాత ఎంటెక్ చేయాలా? ఎంబీఏ చేయాలా? ఉద్యోగ వేట మొదలుపెట్టాలా? మేనేజ్‌మెంట్‌లో ఎదగాలంటే ఎంబీఏ చేయాల్సిందేనా? బీటెక్ తర్వాత ఎంటెక్ చెయ్యకపోతే ఉద్యోగాల్లో వెనకబడిపోతామా? ఇంజనీరింగ్ చదువు పూర్తైన ప్రతి విద్యార్థి మదిలో మెదిలే ప్రశ్న ఇది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం?

ఈ ప్రశ్నలకు ఎవరికి వారే సమాధానం ఇచ్చుకోవాలి. అదెలాగో ఈరోజు 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com ఎడిటర్ (ఇంజనీరింగ్) ప్రభ ధవళ. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption#గమ్యం: ఎంబీఏ - ఎంటెక్ - జాబ్: బీటెక్ తర్వాత ఏం చేయాలి?

ఉద్యోగమా? ఉన్నత విద్యా?

ఎంబీఏనా లేక ఎంటెక్ చేయాలా అనే దానిపై నిర్ణయాన్ని కాసేపు పక్కన పెట్టి ముందు ఉద్యోగంపై దృష్టిసారించడం మంచిదని చాలామంది నిపుణులు చెబుతుంటారు. ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో ఏదైనా ఉద్యోగం చేస్తే... అభ్యర్థి తన నైపుణ్యాలను, సామర్థ్యాలను సరైన రీతిలో అంచనా వేసుకోగలుగుతాడు. దాంతోపాటు మార్కెట్ అవసరాలు కూడా తెలుస్తాయి. తను ఏ రంగానికి, ఏ ఉద్యోగానికి సరిపోతాడనే అంశంపై స్పష్టత వస్తుంది.

Image copyright PDPU

ఎంటెక్ ఎవరు చేస్తే బెటర్?

మీకు టెక్నికల్ స్కిల్స్ బాగున్నాయి, సబ్జెక్టుపై చాలా పట్టు ఉంది, పరిశోధనలపై ఆసక్తి ఉంది... ఇవి మీ బలాలలైతే ఎంటెక్ మీకు అనుకూలమైనదని చెప్పవచ్చు.

ఎంబీఏ ఎవరు చేస్తే బెటర్?

మేనేజీరియల్ పొజిషన్స్‌లోకి వెళ్లాలనే ఆసక్తి ఉండి, పరిశోధనలపై పెద్దగా ఇష్టం లేని అభ్యర్థులు ఎంబీఏని ప్రయత్నించవచ్చు. ఎంట్రప్రన్యూర్‌గా స్థిరపడాలనుకునేవారికి కూడా ఎంబీఏ చాలా అనుకూలమైన కోర్సు. తమ వ్యాపార ఆలోచనలను తమ అభిరుచులకు అనుగుణంగా అమల్లో పెట్టుకునే అవకాశం లభిస్తుంది.

Image copyright PDPU

బలాలు - బలహీనతలు?

ఇప్పటికీ మీకు స్పష్టత రాకపోతే ఓ పేపరు తీసుకుని రెండు కోర్సులకు ఉన్న మంచి చెడులకు సంబంధించిన అంశాలన్నీ దానిపై రాయండి. మీ ఆసక్తులు, ప్రవేశ పరీక్షలు, విజయావకాశాలు, ఫీజులు, ప్లేస్‌మెంట్స్, మీ భవిష్యత్ ఆలోచనలు, దానికి ఈ కోర్సు ద్వారా నేర్చుకునేది ఎంతవరకూ సహకరిస్తుంది... ఇలాంటి అన్ని అంశాలనూ పేపరుపై రాయండి. అప్పుడు దీనిపై స్పష్టత వస్తుంది.

ఇటీవల మన దేశంలో పరిశోధనారంగానికి ప్రాధాన్యం పెరిగింది. అందువల్ల ఈ రంగంలో నిపుణులకు అవకాశాలు విస్తృతంగానే ఉంటాయి. నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాక అదే రంగంలో మరింత ప్రావీణ్యం అవసరం అనుకుంటే ఎంటెక్ చేయడం ఉత్తమ మార్గం.

Image copyright PDPU

ఎంబీఏలో స్పెషలైజేషన్ ఎలా ఎంచుకోవాలి?

ఎంబీఏ అనగానే సాధారణంగా అందరూ ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్... ఇవే అనుకుంటారు. కానీ ఇంకా చాలా స్పెషలైజేషన్లున్నాయి. వీటిలో కొన్నింటిని కేవలం ఇంజనీరింగ్ చేసినవారికోసమే కొన్ని సంస్థలు ప్రత్యేకంగా అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు క్యాట్ లేదా గేట్ వంటి పరీక్ష రాయాల్సి ఉంటుంది.

  • డెహ్రాడూన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ పెట్రోలియమ్ అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్)... ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్‌మెంట్, పవర్ మేనేజ్‌మెంట్, ఏవియేషన్ మేనేజ్‌మెంట్... ఇలా కొన్ని ప్రత్యేక డిగ్రీలు అందిస్తోంది.
  • గుజరాత్‌లోని పండిత్ దీన్‌దయాళ్ పెట్రోలియమ్ యూనివర్శిటీ (పీడీపీయూ)... ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.
  • సీడాక్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంబీఏ అందిస్తోంది.
  • ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ డిగ్రీని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియమ్ టెక్నాలజీ కూడా అందిస్తోంది.
  • ముంబయిలోని నిట్టీ కూడా 5 రంగాల్లో ఎంబీఏను అందిస్తోంది. దీనిలో మూడింట్లో ప్రవేశాలు గేట్ అర్హత ఆధారంగా, రెండు కోర్సుల్లోకి క్యాట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తారు.
  • ఎంబీఏ ఇన్ పవర్ మేనేజ్‌మెంట్‌... నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా చేయవచ్చు.
  • ఎన్ఐటీ - వరంగల్‌లో కేవలం ఇంజనీరింగ్ పూర్తి చేసినవారికే ఎంబీఏలోకి ప్రవేశాలు కల్పిస్తారు.

భవిష్యత్తులో ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ రంగానికి, ఆ రంగంలో నిపుణులకు పెరగనున్న ప్రాధాన్యం వీటన్నింటినీ చూస్తుంటే అర్థమవుతుంది. కేవలం ఇంజనీర్లకోసమే ప్రారంభించిన ఇలాంటి ప్రత్యేకమైన కోర్సులు చేస్తే మార్కెట్లో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

మరోవైపు, ఎంటెక్ చేస్తే భవిష్యత్‌లో మీ ఉద్యోగాభివృద్ధికి ఉపయోగపడుతుంది. కొన్ని సంస్థల్లో ఎంబీఏ కన్నా ఎంటెక్‌ చేసిన అభ్యర్థులకు కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, మీ ఆసక్తికి అనుగుణంగా మీ భవిష్యత్తును నిర్మించుకోండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)