గ్రౌండ్ రిపోర్ట్: కఠువా రేప్ తర్వాత.. హిందూ - ముస్లింల మధ్య పెరిగిన అగాధం

  • 14 ఏప్రిల్ 2018
కఠువాలో అత్యాచార బాధిత బాలిక కుటుంబం ఇంటికి వేసిన తాళం
చిత్రం శీర్షిక కఠువాలో అత్యాచార బాధిత బాలిక కుటుంబం గ్రామం విడిచి వెళ్లిపోయింది

కఠువాలోని ఈ ఇల్లు ఖాళీగా ఉంది. పొయ్యి వెలగటం లేదు. తలుపు తాళం వేసి వుంది. ఆ తాళానికి ఒక ఎర్ర దారం. ఆ దారానికి ఒక ఆకుపచ్చని తాయెత్తు. బహుశా.. ఇంటిని కాపాడాలన్న ప్రార్థనలు అందులో ఉన్నాయోమో.

కానీ ఏ ప్రార్థనలూ ఆ బాలికను కాపాడలేకపోయాయి. లేకపోతే అకృత్యాలు అంతకన్నా శక్తివంతమైనవేమో.

పోలీసులు చెప్తున్న ప్రకారం.. ఎనిమిదేళ్ల బాలికను ఓ గుడిలో బంధించారు. ఆ పాపపై వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆ పాపను చంపటానికి కొన్ని నిమిషాల ముందు వరకూ కూడా పైశాచికం కొనసాగించారు. ఆ తర్వాత ఆమెను చంపేసి శరీరాన్ని అడవిలో పారేశారు.

కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్ ప్రకారం.. బాలిక అదృశ్యమైన జనవరి 10వ తేదీ నుంచి - హత్యకుగురైన జనవరి 17వ తేదీ వరకూ.. వారం రోజుల పాటూ ఆమెకు నిరంతరం మత్తుపదార్థాలు ఎక్కించారు. నిందితుల్లో ఒకడు ఉత్తరప్రదేశ్‌లోని తన బంధువుకు ఫోన్ చేసి ‘సరదా తీర్చుకోవాలంటే ఇక్కడకు వచ్చేయ్’ అని ఆహ్వానించాడు. ఇది చార్జ్‌షీట్‌లో ఉన్న సమాచారం.

చిత్రం శీర్షిక ఈ కేసు దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్ నుంచి సీబీఐకి అప్పగించాలని గ్రామానికి చెందిన కొందరు హిందూ మహిళలు డిమాండ్ చేస్తున్నారు

క్రైమ్ బ్రాంచ్ మీద విశ్వాసం లేదు?

కానీ.. విషయం ఇక్కడితో ముగియలేదు. బాలికపై అత్యాచారం కేసుకు కూడా హిందూ, ముస్లిం అనే మతం రంగు పులిమారు.

అక్కడికి సమీపంలోని మార్కెట్ దగ్గర 13 మంది మహిళలు నిరాహారదీక్ష చేస్తున్నారు.

ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలన్నది వారి డిమాండ్.

నిరాహారదీక్ష చేస్తున్న మహిళల సమీపంలో ఒక మందపాటి రావి చెట్టు ఉంది. దాని కింద మాజీ ‘సర్పంచ్’ ఒకరు కూర్చుని ఉన్నారు. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు మీద తమకు నమ్మకం లేదని ఆయన చెప్పారు.

కారణమేమిటంటే.. దర్యాప్తు బృందంలో నవీద్ పీర్జాదా, ఇఫ్తికార్ వాని అనే వాళ్లు ఉండటమేనని ఆయన బదులిచ్చారు.

జమ్మూకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్‌ విభాగంలో నవీద్ పీర్జాదా డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్. అయితే ఈ కేసు దర్యాప్తు మొత్తం పోలీస్ సూపరింటెండెంట్ రమేశ్ జల్లా పర్యవేక్షణలో జరిగింది.

దర్యాప్తు బృందం సారథి ఒక కశ్మీరీ పండిట్ అన్న విషయాన్ని నేను ప్రస్తావించాను. నిరాహారదీక్షలో పాల్గొంటున్న మధు ఆగ్రహంగా స్పందించారు. ‘‘మాకు ముందుగా ఏమీ చెప్పలేదు. అన్ని నిర్ణయాలూ తీసుకున్న తర్వాత మాకు సమాచారం వస్తుంది’’ అని మండిపడ్డారు.

చిత్రం శీర్షిక ప్రధాన నిందితుడు సంజీవ్ రామ్ తదితరుల మీద అక్రమ కేసు బనాయించారని అతడి బాబాయి బిషన్‌దాస్ శర్మ ఆరోపించారు

నిందితులను కాపాడటానికి త్రివర్ణ పతాకం

‘‘రాష్ట్ర పోలీసులు ఉగ్రవాదులను ఎదుర్కోగలిగినప్పుడు.. ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయకూడదు?’’ అని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ ఎస్‌పి వైద్య ప్రశ్నిస్తున్నారు.

‘కశ్మీరీ అతివాదుల విషయంలో ఇదే పోలీసుల తీరు అంతా బాగానే ఉందని జనం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఇదే పోలీసులు జమ్మూ ప్రాంతంలో ఒక బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తుంటే మాత్రం అభ్యంతరాలు చెప్తున్నారు‘ అని స్థానిక యువకుడొకరు మాతో వ్యాఖ్యానించారు.

అయితే.. ‘బకర్వాల్‌ల నాయకుడు తాలిబ్ హుస్సేన్ ఒత్తిడి వల్ల’ తమ అబ్బాయితో పాటు ఇతరుల మీద అక్రమంగా కేసు బనాయించారని.. ప్రధాన నిందితుడు సంజీవ్ రామ్ బాబాయి బిషన్‌దాస్ శర్మ ఆరోపించారు.

తాలిబ్ హుస్సేన్‌తో వీరి శత్రుత్వానికి కారణాలేమిటని అడిగితే.. అది తనకు తెలీదని, అప్పుడు తాను సైన్యంలో ఉద్యోగంలో ఉన్నానని బదులిచ్చారు.

హిందువుల ప్రాబల్యమున్న ఈ ప్రాంతంలో ఈ ఘటన తర్వాత.. ‘హిందూ ఎకతా మంచ్’ అనే సంస్థ మళ్లీ క్రియాశీలమైంది. వారు ఒక నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. అందులో కొందరు త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని పాల్గొన్నారు.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడటానికి భారతీయ పతాకాన్ని ఎలా ఉపయోగిస్తారన్న ప్రశ్నలు మీడియాలోని ఒక వర్గంలో వ్యక్తమయ్యాయి.

కఠువా అత్యాచారం కేసు.. దాద్రి అఖ్లాఖ్ బీఫ్ కేసు వంటిదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అభివర్ణించాయి. ఎందుకంటే.. అఖ్లాఖ్ హత్య కేసులో నిందితుడి మృతదేహం మీద నరేంద్రమోదీ ప్రభుత్వంలోని ఒక మంత్రి ఇంటి ముందు త్రివర్ణ పతాకం కప్పారు.

చిత్రం శీర్షిక వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసిన తర్వాత బాలికను చంపేసి శరీరాన్ని అడవిలో ఇక్కడ పడేశారు

ఇది భూమికి సంబంధించిన వివాదమా?

పోలీస్ చార్జ్‌షీట్ ప్రకారం.. కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ రామ్.. ఈ ప్రాంతంలో బకర్వాల్‌లు స్థిరపడటాన్ని వ్యతిరేకిస్తున్నాడు. బాధితురాలి కుటుంబానికి భూమి అమ్మటానికి సంబంధించిన ఒక కేసు హైకోర్టుకు కూడా చేరింది.

ఇటీవల రసనా గ్రామంలో మూడు బకర్వాల్ కుటుంబాలు స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. బకర్వాల్, గుజ్జార్ కుటుంబాలు సమీపంలోని ఇతర గ్రామాలు, జిల్లాల్లో కూడా స్థిరపడటం మొదలుపెట్టాయి. ఈ పశుపోషకులు ముస్లింలు. ఇదే వృత్తిలో ఉన్న ‘గద్దీ’ సమాజం వారు హిందువులు.

బకర్వాల్‌లు, గుజ్జార్లకు తాము పశువులను మేపటం కోసం ఎప్పుడూ భూమి ఇచ్చేవాళ్లం కాదని బిషన్‌దాస్ శర్మ చెప్తున్నారు. ‘‘అవును.. మేం గద్దీలకు భూమి ఇచ్చే వాళ్లం’’ అని ఆయన పేర్కొన్నారు.

బాధితురాలి ‘చౌతా’ (అంత్యక్రియలు) కోసం వందలాది మంది ముస్లింలు ఈ గ్రామానికి వచ్చారని.. ‘పాకిస్తాన్ జిందాబాద్.. భారత్ ముర్దాబాద్’ అని నినాదాలు చేశారని బాధితురాలి గ్రామంలోను, కఠువాలోను పలువురు మాతో చెప్పారు.

రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల వర్గంలో ఉన్న బకర్వాలాలు, గుజ్జార్లు ఎప్పుడైనా అతివాదులకు మద్దతు ఇచ్చారన్నది ఇంతవరకూ వినిపించలేదు.

Image copyright IMAGE COLLECTIVE MOHIT KANDHARI / BBC
చిత్రం శీర్షిక హత్య కేసులో నిందితులకు మద్దతుగా నిర్వహించిన ప్రదర్శనలో త్రివర్ణ పతాకాలను ప్రదర్శించారు

‘శత్రువు లేని చోట.. శత్రువును సృష్టిస్తున్నారు’

ఇదంతా శత్రువు లేని చోట శత్రువును సృష్టించే పని అని వామపక్ష సిద్ధాంతాలతో అనుబంధమున్న ఒక వ్యక్తి అభివర్ణించారు.

జమ్మూకు కశ్మీర్‌ లోయకు మధ్య ఉన్న అగాధం ఈ కేసు తర్వాత మరింత పెరిగిందని కఠువా నివాసి ధీరజ్ బిస్మిల్ అన్నారు. ఆయన జమ్మూలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్నారు.

ఇంతకుముందు వరకూ రాజకీయంగా ఉన్న విభేదాలు ఇప్పుడు సామాజిక అంశాలకు కూడా విస్తరించాయని ఆయన అభిప్రాయపడ్డారు.

కానీ, హిందూ - ముస్లింల మధ్య ఈ విభేదాలు 2008లో అమర్‌నాథ్ అల్లర్ల అప్పటి నుంచి మొదలయ్యాయని ధీరజ్ పేర్కొన్నారు.

‘‘దీనితో పాటు.. జమ్మూకశ్మీర్‌లో అధికారంలో భాగంగా ఉన్న బీజేపీ సీట్లు కూడా పెరిగాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఈ విభేదాలు ఇంకా పెరుగుతాయని ధీరజ్ చెప్తున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు