భారత్‌లో ‘దేవతల గుహ‌’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?

Krem Puri

ఫొటో సోర్స్, Ronny Sen

ఫొటో క్యాప్షన్,

ఈ గుహలోకి వెళ్తే తిరిగి రాగలరా?

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక రాతి గుహ. దీన్ని ఈ ఏడాది మొదట్లో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో గుర్తించారు.ఈ గుహలో ఏముందో మీకు చూపించడానికి గుహ పరిశీలకుల బృందంతో కలిసి బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిశ్వాస్ అక్కడకు వెళ్లారు.

మీరు ఈ గుహలోకి వెళ్లి.. దారి మరిచిపోతే.. ఇక అంతే సంగతులు. మళ్లీ బయటకు రాలేరు.. అంటున్నారు బ్రియాన్ డి ఖర్పన్.

దట్టమైన చెట్లున్న అడవిలో దాదాపు గంట పాటు ట్రెక్కింగ్ చేసి.. ఈ క్రెంపురీ గుహ ముఖ ద్వారం వద్దకు చేరుకున్నామని వివరించారు.

క్రెంపురీ అంటే స్థానిక భాషలో దేవతల గుహ అని అర్థం.

సముద్ర మట్టానికి 1,227 మీటర్ల ఎత్తులోని లోయలో.. ఈ గుహ ఉంది. ఈ గుహ పొడవు 15 మైళ్లు. అంటే 24.5 కిలోమీటర్లన్నమాట.

ఇది 13 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

దీన్ని గుర్తించక ముందు వరకు అంటే 2018 ఫ్రిబవరి వరకు అతి పెద్ద ఇసుకరాతి గుహ రికార్డు వెనుజువెలాలోని ఇమావారియూటా అనే గుహ పేరిట ఉండేది.

అది 18.7 కిలోమీటర్ల పొడవుంది.

ఫొటో సోర్స్, Marcel Dikstra

ఫొటో క్యాప్షన్,

ఈ గుహ పొడవు 15 మైళ్లు.. అంటే 24.5 కిలోమీటర్లన్నమాట

71 ఏళ్ల ఖర్పన్‌కి గుహల గురించి చాలా విషయాలు తెలుసు. ఈయన ఇక్కడ పర్వత ప్రాంతంలో దాదాపు 25 ఏళ్ల పాటు గుహలను అన్వేషిస్తూ.. కొత్తవాటిని కనిపెడుతూ ఉన్నారు.

ఖర్పన్ 1992 నుంచి గుహలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈయనకు మేఘాలయలో 12కు పైగా గుహల గురించి తెలుసు.

మరో 30 మంది ఇతర గుహ పరిశీలకులు, హైడ్రాలజిస్టులు, పురావస్తు శాస్ర్తవేత్తలు కూడా మేఘాలయలో 1,650 గుహలను గుర్తించారు.

మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్ట గుహల వ్యవస్థకు మేఘాలయ పేరు గాంచింది.

దేశంలో అత్యధికంగా గుహలు ఉన్నది ఈ రాష్ట్రంలోనే.

సరే.. మళ్లీ క్రెంపురీకి వద్దాం. ఇక గుహలోకి వెళ్దాం!

మందపాటి టోపీలు.. తలకు తగిలించుకునే లైట్లు ధరించాం. అలా కాస్త చీకట్లోకి చొరబడ్డాం. ఎడమవైపు చిన్నపాటి దారి ఉంది. ఈ మార్గంలో వెళ్లాలంటే కేవింగ్ సూట్లు ధరించాల్సిందే.

ఈ మార్గంలో కింద చిత్రంలో చూపినట్లు పాకాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Marcel Dikstra

ఫొటో క్యాప్షన్,

ఈ మార్గంలో వెళ్లాలంటే కేవింగ్ సూట్లు ధరించాల్సిందే

ప్రధాన దారిలో మాత్రం ఇద్దరు వెళ్లవచ్చు. కాస్త వెడల్పుగానే ఉంటుంది.

నేను ఈ రెండు దారులూ ప్రయత్నించాను. కానీ రాళ్ల మధ్యలో నా షూ చిక్కుకుంది.

నీళ్లలోనూ నడిచి వెళ్లాం. చివరకు ఒక సుందరమైన నీటి ప్రవాహం కనిపించింది.

అయితే వర్షాకాలంలో ఇది పెద్ద వరదలా ఉండొచ్చు.

ఓ గోడపై పెద్ద సాలీడును గుర్తించారు ఖర్పన్. మొదట దీన్ని మేం షార్క్ పంటి అవశేషమనుకున్నాం.

కానీ.. ఈ గుహలో చాలా రహస్యాలున్నాయని ఖర్పన్ తెలిపారు.

ఈ గుహ చాలా సంక్లిష్టమైంది. వందల దారులు అల్లుకుపోయి గజిబిజిగా ఉంటాయి.

ఓ చిక్కు దారి (మేజ్) అయితే చిక్కులన్నీ సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు.

ఈ గుహలోకి దారి తప్పి వెళ్తే మళ్లీ తిరిగి రావడం మహా కష్టం.

ఇందులో చేపలు, కప్పలు.. పెద్ద సాలీళ్లు, గబ్బిలాలు, స్ఫటికాలు ఉంటాయి.

ఈ గుహను సర్వే చేయడం చాలా పెద్ద పనని స్విట్జర్లాండ్‌కి చెందిన గుహల పరిశీలకుడు, గుహల ఫొటోగ్రాఫర్ థామస్ అర్బేజ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Ronny Sen

ఫొటో క్యాప్షన్,

బ్రియాన్ డి ఖర్పన్

ఇక్కడ కొన్ని అంతుచిక్కని అవశేషాలూ లభించాయి.

పలు షార్క్ పంటి అవశేషాలు, నీళ్లలో ఉండే డైనోసార్లకు చెందిన ఎముకలను కూడా గుర్తించామని ఇటాలియన్ గుహ పరిశీలకుడు ఫ్రాన్సెస్సో సారో చెప్పారు.

ఇవి 6 కోట్ల ఏళ్ల కిందటివై ఉండొచ్చని తెలిపారు.

ఫొటో సోర్స్, Marcel Dikstra

ఫొటో క్యాప్షన్,

ఈ గుహలోకి వెళ్తే బయటకు రావడం చాలా కష్టం

మరి మనుషులిక్కడ ఉన్నారా?

శాస్ర్తవేత్తలు మాత్రం ఇక్కడ మనుషులు ఉండే అవకాశమే లేదంటున్నారు. మనుషులైతే గదుల్లాంటి రాతి గుహలు నిర్మించుకుంటారని.. ఇక్కడ తరచూ వరదలు వస్తుంటాయి కనుక ఈ ప్రాంతం ఆవాసానికి పనికి రాదని తెలిపారు.

ఈ గుహల మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇవి ఇసుక రాతి పొరల్లో ఏర్పడినవి.

సాధారణంగా గుహలు సున్నపు రాతి పొరల్లో ఏర్పడుతాయి.

మేఘాలయలో ఒక్కోసారి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది.

అందువల్ల ఇక్కడ ఈ ఇసుక రాతి గుహలు ఏర్పడి ఉంటాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, Ronny Sen

ఫొటో క్యాప్షన్,

ఈ గుహల్లో సాలీళ్లు, కప్పలు, చేపలు, గబ్బిలాలు తారసపడతాయి

మేఘాలయలోని గుహలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ప్రపంచంలోని అతి పెద్దవి.. అంటే 31.1 కిలోమీటర్ల లియట్ ప్రా సున్నపురాతి గుహలు ఇక్కడి పర్వతాల్లోనే ఉన్నాయి.

ఇక్కడి గుహల్లో కొన్ని చాలా పెద్దవి. కొన్నింట్లో లోతైన నదులు కూడా ఉన్నాయి.

97 మీటర్ల లోతైన నదులు కూడా ఇక్కడున్నాయి.

ఫొటో సోర్స్, Ronny Sen

ఫొటో క్యాప్షన్,

క్రెంపురీ గుహల్లో తాజాగా దొరికిన అవశేషాలు

ఇక్కడి బొగ్గు గనులు, సున్నపు రాళ్ల క్వారీల వ్యాపారం ఈ గుహలకు ముప్పుగా పరిణమిస్తోంది.

మేఘాలయలో బొగ్గు గనుల తవ్వకాన్ని ఆపాలని కోరుతూ ఖర్పన్ 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

క్రెంపురీ గుహలో ఉష్ణోగ్రత 16-17 డిగ్రీల సెల్సియస్ మేర ఉంటుంది.

ఇక్కడ రాళ్ల మధ్య పగుళ్ల ద్వారా గాలి వస్తుంది.

కనుక ఉక్కపోత.. ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలు ఉండవు.

కానీ.. ఒకసారి గుహలోకి వెళ్లాక చాలా జాగ్రత్తగా ఉండాలని ఖర్పన్ సూచిస్తున్నారు.

చిత్రాలు: రోనీ సేన్. మార్కెల్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)