BBC SPECIAL: నా బిడ్డను ఎందుకు చంపారు? ఆ తల్లి ప్రశ్నలకు బదులేది?

  • 15 ఏప్రిల్ 2018
చిత్రం శీర్షిక బాధితురాలి తల్లి

ప్రశ్నలు...

ఒక తల్లి వేస్తున్న వందలాది ప్రశ్నలు.

పైశాచికమైన సామూహిక అత్యాచారానికి గురైన ఓ ఎనిమిదేళ్ల బాలిక తల్లి సంధిస్తున్న ప్రశ్నలు.

కిరాతకంగా హత్యకు గురైన ఓ చిన్నారి తల్లిని వేధిస్తున్న ప్రశ్నలు.

ఏ బిడ్డపై హత్యాచారం మత విభేదాలను మరింత తీవ్రం చేసిందో.. ఆ బిడ్డ తల్లి అడుగుతున్న ప్రశ్నలు.

''మా కూతురు... ఏం తినింది? ఏం పోగొట్టింది? ఏం కాజేసింది? నా బిడ్డను ఎందుకు చంపారు?''

''ఆమెను వాళ్లు అక్కడి నుంచి తీసుకెళ్లారు.. ఆ దూరం నుంచి. ఎలా తీసుకెళ్లారో తెలీదు. ఎలా పట్టుకెళ్లారో తెలీదు. ఎలా చంపారో తెలీదు.''

''నా బిడ్డను ఎలా చంపారు..? ఇదే మమ్మల్ని వేధిస్తోంది...''

ఇలా ప్రశ్నలే ప్రశ్నలు... ఒక దాని తర్వాత ఒకటిగా... అంతులేని ప్రశ్నలు.

ఇది ఒక మాతృమూర్తి గుండె లోతులనుంచి లావాలా పెల్లుబుకుతున్న వేదన!

చిత్రం శీర్షిక బకర్వాల్ సమాజంలోని మహిళలు

అవి ఉధంపూర్‌లోని దూఘర్ నాలా పర్వతాలు. అక్కడ ఆమె కన్నీళ్లతో ప్రశ్నిస్తోంది. మా కళ్ల ముందు వారి ఎనిమిదేళ్ల కూతురి ముఖం కదలాడుతోంది. అది హత్యాచారానికి గురైన ఓ అమాయక చిన్నారి ముఖచిత్రం.

అచ్చం ఆమె అమ్మ ముఖం లాగానే. అలాగే పెద్ద పెద్ద కళ్లు. మెరిసే కళ్లు. మచ్చ లేని తెల్లని కళ్లు.

''నా బిడ్డ చాలా అందంగా ఉంటుంది. తెలివైనది. చురుకైనది. ఒక్కతే అడవికి వెళ్లి తిరిగి వచ్చేది'' ఆ తల్లి చెప్తుంటే.. ఆలోచనలు తిరిగి ఆమె దగ్గరకు వచ్చాయి.

చిత్రం శీర్షిక పర్వతాలపై అడవిలో బకర్వాల్ సమాజ సభ్యులు

''కానీ ఆ రోజు నా బిడ్డ తిరిగి రాలేదు. ఆ తర్వాత ఆమె శరీరం నిర్జీవంగా దొరికింది.''

గొర్రెలు, మేకలు, ఆవులు దగ్గర్లో తిరుగుతున్నాయి. వీళ్లు పెంచుకునే కుక్కలు గొలుసులతో కట్టేసి ఉన్నాయి. రాత్రంతా చలిలో ఉన్న ఆ కుక్కలు పగలు ఎండతో స్నానం చేస్తున్నాయి. గుర్రాలు తమ పిల్లలతో కలిసి గడ్డి మేస్తున్నాయి.

చిత్రం శీర్షిక పశువులను మేపుతున్న బకర్వాల్ సమాజానికి చెందిన ఓ మహిళ

ఆ చిన్నారికి గుర్రాలంటే ఎంతో ఇష్టం. ''ఆమెకు ఆటలంటే చాలా ఇష్టం. గుర్రపు స్వారీ కూడా ఎంతో బాగా చేస్తుంది'' అని ఆ చిన్నారి సోదరి చెప్పింది.

ఆ రోజు కఠువా అడవిలో గుర్రాన్ని మేపటానికి తీసుకెళ్లిందా చిన్నారి. అప్పుడే ఆమెను అపహరించుకుపోయారు. వారం రోజుల పాటు నిర్బంధించి ఆ పసిపాపపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత దారుణంగా చంపేసి అడవిలో పడేశారు.

''నాకు ముగ్గురు కూతుళ్లు ఉండేవారు.. ఇప్పుడు ఇద్దరే మిగిలారు...'' అంటూ కన్నీరు మున్నీరయిందా తల్లి.

ఆమె ఆ కూతురును తన సోదరుడికి ఇచ్చింది. ఆ సోదరుడి కూతురు ఒక ప్రమాదంలో చనిపోవటంతో తన కూతురును అతడికి అప్పగించింది.

ఈ దారుణ ఘటన జరిగినపుడు.. ఆ బాలిక తల్లిదండ్రులు పశువుల మేత కోసం వెళ్లారు. ఆ బాలిక కఠువా జిల్లాలోని ఆ గ్రామంలో తన మేనమామ దగ్గర ఉంది.

చిత్రం శీర్షిక బాధితురాలి తండ్రితో మాట్లాడుతున్న బీబీసీ ప్రతినిధి ఫైజల్ మొహమ్మద్ అలీ

ఏడు రోజుల తర్వాత కూడా తమ కూతురు మృతదేహాన్ని తెచ్చుకోవటానికీ వారు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.

''మీ బకర్వాల్ కమ్యూనిటీ వాళ్లే ఎవరో ఆమెను చంపేసి ఉంటారు' అని పోలీసులు చెప్పటం మొదలుపెట్టారు. గ్రామస్తులు అటువంటి పాపం చేయలేరని పోలీసులు చెప్పుకొచ్చారు'' అని ఆ బాలిక తండ్రి జీవం లేని గొంతుతో వివరించారు.

చిత్రం శీర్షిక బాధితురాలి తండ్రి

''ఆమె సహజంగా చనిపోయి ఉంటే ఎలాగోలా తట్టుకోగలిగేవాళ్లం. మామూలుగా చనిపోయిందని సమాధానం చెప్పుకునే వాళ్లం. ప్రపంచమంతా చనిపోతుంది.. నా బిడ్డ కూడా చనిపోయింది.. అనుకునే వాళ్లం'' అంటూ ఆ తల్లి రోదిస్తోంది. సల్వార్ జంపర్, ఆకుపచ్చని శాలువా ధరించిన ఆమె అంతులేని ఆవేదనకు ప్రతిరూపంలా కనిపిస్తోంది.

క్రీమ్ కలర్ సల్వార్ కమీజ్‌లో తెలుపు, నలుపు గళ్ల తలపాగాతో ఆ తండ్రి నిర్వేదంగా చెప్పాడు.. ''మా కూతురును కనీసం మా స్మశానంలో కూడా సమాధి చేయలేకపోయాం. ఆమె శరీరాన్ని అదీ రాత్రిపూట వేరే ఊరికి తీసుకెళ్లాల్సి వచ్చింది.''

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)