ప్రెస్ రివ్యూ: తెలంగాణ నుంచి పోటీ చేయనున్న ప్రకాశ్‌రాజ్‌?

  • 16 ఏప్రిల్ 2018
Image copyright facebook.com/KalvakuntlaChandrashekarRao

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌లో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కీలక భూమిక పోషించనున్నారంటూ 'సాక్షి' పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. కర్ణాటక, తమిళనాడు ప్రజలు, రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్న ప్రకాశ్‌రాజ్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి ఫ్రంట్‌ను బలోపేతం చేసేలా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు.

ప్రకాశ్‌రాజ్‌ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడు అని ఇటీవల బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడను కలిసిన సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నారు.

దేవెగౌడతో భేటీకి ఆయన్ను కూడా తీసుకెళ్లారు.

ప్రస్తుతం కరుణానిధి-కేసీఆర్‌ భేటీ ఏర్పాట్లలో ప్రకాశ్‌రాజ్‌ ఉన్నట్లు సమాచారం. వచ్చేనెలలో కేసీఆర్, కరుణ భేటీ అవకాశం ఉందని సాక్షి వివరించింది.

ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి 10 సినిమాల్లో నటిస్తున్నారు.

నానా పటేకర్‌ నటించిన 'నట సామ్రాట్‌' అనే మరాఠీ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసే హక్కులు కొనుక్కున్నారు. కేసీఆర్‌ కోరితే ఈ చిత్రాలను త్వరగా పూర్తి చేసుకొని, నటసామ్రాట్‌ చిత్ర రీమేక్‌ను వాయిదా వేసుకునేందకు ప్రకాశ్‌రాజ్‌ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కర్ణాటకలోని మంగళూరులో పుట్టి పెరిగిన ప్రకాశ్‌రాజ్‌ సినిమా నటుడిగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ప్రజలకు సుపరిచితుడు.

మొదటి నుంచి లౌకిక వాద భావజాలం పట్ల ఆసక్తి చూపిస్తున్న ఆయన బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మంగళూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్‌ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరితే అందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందని సాక్షి కథనం పేర్కొంది.

Image copyright MUNIR UZ ZAMAN/gettyimages

కాన్పుల ఖర్చు తెలంగాణలోనే ఎక్కువ!

కాన్పుల కోసం అయ్యే ఖర్చు జాతీయ సగటు కంటే తెలంగాణలో రూ. 7,000 అధికంగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఓ కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా ఒక్కో కాన్పు ఖర్చు సగటున రూ. 13,039 అవుతుండగా, తెలంగాణలో మాత్రం సగటున రూ. 20,645 అవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దేశవ్యాప్త సగటుకు దగ్గరలోనే ఉంది. ఇక్కడ సగటున రూ.13,657 అవుతోంది.

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్, సోషల్ కన్జంప్షన్ సర్వే ఆన్ హెల్త్ వెల్లడించిన వివరాలపై సీనియర్ పరిశోధకులు మోత్కూరి వెంకటనారాయణ, లఖిరాం హన్స్‌దలు అధ్యయనం చేశారు.

ఆ అధ్యయనం ప్రకారం, తెలంగాణలో ఎక్కువ ప్రసవాలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయని తేలింది.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో కాన్పుకు రూ. 22,101 అవుతుండగా, ప్రభుత్వ దవాఖానాలకు వెళ్తే రూ.2,647 అవుతున్నాయి.

పట్టణాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.25,261, సర్కారు ఆస్పత్రుల్లో రూ.3,585 ఖర్చవుతున్నాయి.

Image copyright www.facebook.com/TrsHarish

కాళేశ్వరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు

37 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ దశలో కొత్త రికార్డులు సృష్టిస్తోందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

మేడిగడ్డలో శనివారం ఒక్కరోజే 7 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల్లో కలిపి రోజుకు 20 వేల క్యూబిక్‌మీటర్లకు పైగా కాంక్రీట్‌ వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది ఆసియాలోనే అత్యుత్తమమన్నారు.

సీఎం కేసీఆర్‌ సూచనలు, సలహాలు, మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, సమీక్షల కారణంగా అసాధారణ స్థాయిలో పనులు జరుగుతున్నాయని ఎల్‌అండ్‌టీ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

అతి తక్కువ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆసియాలోనే కొత్త రికార్డు నెలకొల్పుతామని హరీశ్‌రావు చెప్పారు.

కర్ణాటక ఎన్నికలు Image copyright MANJUNATH KIRAN/gettyimages

కర్ణాటక ఎన్నికల్లో తెలుగువారి ప్రభావం

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో గెలుపోటములను తెలుగువారు ప్రభావితం చేయగలరంటూ 'సాక్షి'ఓ కథనం ప్రచురించింది.

లక్షలాది మంది తెలుగువారు బెంగళూరులో స్థిరపడిపోయారు.

ప్రస్తుతం నగర పరిధిలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 నుంచి 10 స్థానాల్లో తెలుగువారు గెలుపోటములను ప్రభావితం చేయగలరు.

హెబ్బాళ, కేఆర్‌ పురం, బొమ్మనహళ్లి, మహదేవపుర, బీటీఎం లేఔట్, అనేకల్, యలహంక, జయనగర, హొసకోటే, బెంగళూరు దక్షిణ నియోజకవర్గాల్లో తెలుగు ప్రజల సంఖ్య అధికం. ప్రస్తుత శాసనసభ్యుల్లో దాదాపు 10 శాతం మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.

బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు, చిక్కబళ్లాపుర, మైసూరు, కొప్పళ, చిత్రదుర్గ, దావణగెరె, యాదగిరి, హుబ్లీ-ధార్వాడ తదితర ప్రాంతాల్లో దాదాపు కోటి మందికిపైగా తెలుగు మాట్లాడే ప్రజలు ఉంటున్నారు.

కర్ణాటకలో కన్నడ తరువాత ఇతర భాషలు మాట్లాడే వారిలో ఉర్దూ తొలిస్థానంలో ఉండగా ఆ తర్వాత తెలుగు నిలిచింది.

అక్కడి జనాభాలో ఉర్దూ మాట్లాడేవారు 9 శాతం కాగా, తెలుగు ప్రజలు 8.17 శాతం ఉన్నారు.

Image copyright LUDOVIC MARIN/gettyimages

పేదల జీవితాలను మార్చేస్తున్న నల్ల కోడి

ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ జిల్లాలోని పేదల జీవితాల్లో కడక్‌నాథ్ నల్ల కోడి వెలుగులు నింపుతోందంటూ నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

ఈ కోడి మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల మార్కెట్‌లో డిమాండ్ భారీగా ఉంది.

స్థానికంగా ఈ కోడిని కడక్‌నాథ్ లేదా కారైకుడి అని పిలుస్తారు.

సాధారణ కోళ్ల ధరలు రూ.150 నుంచి రూ.300 వరకు ఉంటుండగా.. ఈ కోడి ఒక్కొక్కటీ రూ.400 నుంచి రూ.900 వరకు పలుకుతోంది.

పేదలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వ పథకంలో భాగంగా జిల్లాస్థాయి అధికారులు రాయితీపై ఈ కోళ్లను మహిళలకు అందజేస్తున్నారు.

వీటి పెంపకం, విక్రయాల ద్వారా పేదలు ఆర్థికంగా లబ్ధి పొందుతూ వచ్చిన ఆదాయాన్ని ఇండ్ల మరమ్మతులకు, పిల్లల ఫీజులకు ఉపయోగించుకుంటున్నారు.

ఇవి మూడు నెలల్లో దాదాపు 1.5 కిలోల బరువు పెరుగుతాయి.

వీటిని ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)