ప్రత్యేక హోదా డైరీ: శ్రీకాకుళం రైల్వేస్టేషన్లో ఎంపీ రామ్మోహననాయుడు దీక్ష

  • 17 ఏప్రిల్ 2018
రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో పలు చోట్ల ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి.

సీపీఎం, సీపీఐ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంతటా బంద్ పాటించారు.

అధికార తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ ఈ బంద్‌కు దూరంగా ఉన్నాయి.

అయితే, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ప్రధాని మోదీ విభజన హామీలు నెరవేర్చలేదంటూ శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో రాత్రంతా దీక్ష చేపట్టి నిరసన తెలిపారు.

Image copyright ysrcpofficial/facebook
చిత్రం శీర్షిక బంద్ కారణంగా విజయవాడ బస్టాండులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

బంద్ సందర్భంగా హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాష్ట్రంలో హోదా కోసం నిర్వహించిన 5వ బంద్‌ అన్నారు.

ఒక్కరోజు బంద్‌తో ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారని, అలాగైతే ఏడాదికి ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు లాభం వస్తోందా? అని ప్రశ్నించారు.

ఈనెల 24వ తేదీన రాష్ట్రంలో విద్యుత్ దీపాలు ఆర్పేసి, చీకటిని పాటించాలని ప్రజలను కోరారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ఏపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను మరొకసారి చదువుకోవాలని, అందులో పేర్కొన్న విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని, అంతే తప్ప అవాస్తవాలు ప్రచారం చేయొద్దన్నారు.

ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు దీక్షకు దిగారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి మంగళవారం ఉదయం 7 గంటల వరకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో ఈ దీక్ష చేపట్టారు.

నిరసనలతో, దీక్షలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా గాంధీ మార్గంలో తాను రైల్వే స్టేషన్లో దీక్ష చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ ఇవ్వకుండా ఏపీ సహనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షిస్తున్నారని విమర్శించారు.

పార్లమెంటులోని 545 మంది ఎంపీల్లో ఒక ఎంపీ రాత్రిపూట ఒక రైల్వే స్టేషన్లో ఎందుకు నిద్రించాల్సి వచ్చిందో... అలాంటి పరిస్థితికి దారితీసిన కారణాలేంటో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ఆదుకోవాల్సిందిపోయి ఆడుకుంటున్నారంటూ ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

రాష్ట్రపతిని కలవనున్న వైసీపీ ఎంపీలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. కేంద్ర ప్రభుత్వం చేత విభజన హామీలు, ప్రత్యేక హోదా అమలు చేయించాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)