దేశంలో రేప్‌లు ఎందుకు తగ్గట్లేదు?

  • 18 ఏప్రిల్ 2018
చిన్నారి Image copyright Reuters

తొమ్మిది నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న ఓ బాలిక కామాంధుల కోరల్లో చిక్కుకుని అసువులుబాసింది. ఓ క్రీడా మైదానం సమీపంలోని చెట్లపొదల్లో శవమై కనిపించింది.

ఆమె పేరేంటో, ఊరేంటో నిన్నటి వరకూ తెలియలేదు.

హంతకులు ఎవరన్నది పోలీసులకు అంతుపట్టడం లేదు.

ఆ శవాన్ని గుర్తించి 10 రోజులు దాటింది.. తర్వాతే ఆమె ఏపీకి చెందిన బాలికగా భావిస్తున్నారు.

ఇప్పటికీ బాధితురాలు ఎవరన్నదానికి స్పష్టమైన ఆధారం ఏమీ లభించలేదు.

ఇది వజ్రాలకు మెరుగులద్దే పరిశ్రమకు నగరంగా ఖ్యాతి గడించిన గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఘటన.

ఆ శరీరం మీద 86 గాయాలున్నాయి. "శవాన్ని స్వాధీనం చేసుకున్న నాటికి వారం రోజుల కిందట ఆ గాయాలైనట్లు " పోస్టుమార్టం చేసిన వైద్యుడు అంచనా వేశారు.

ఆ బాలికను నిర్బంధించి, హింసించి, హతమార్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

గుజరాత్‌లో అదృశ్యమైన 8,000 మంది చిన్నారుల వివరాలన్నింటినీ పరిశీలించారు. అయినా ఈ బాధితురాలు ఎవరన్నది తేలలేదు.

'శవం దొరికిన చోట పెనుగులాట జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదు' అని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

దాన్ని బట్టి చూస్తే బలహీన వర్గాలను భయపెట్టాలన్న దురుద్దేశంతో జరుగుతున్న అకృత్యాల్లో ఇదీ ఒకటిగా అనుమానం వ్యక్తమవుతోంది.

Image copyright Reuters

ఈ నేరాలు పెరగడానికి అది కూడా కారణమేనా?

చట్టవిరుద్ధంగా అబార్షన్లు పెద్దఎత్తున జరగడంతో దేశంలోని లింగ నిష్పత్తి అసమానత ఘోరంగా పెరిగిపోయింది. దీంతో మహిళలతో పోల్చితే పురుషులు ఎక్కువైపోయారు.

దేశంలో ప్రస్తుతం 112 మంది పురుషులు ఉంటే మహిళలు 100 మంది మాత్రమే ఉన్నారు.

అబ్బాయిలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భారత్‌లో ఉండాల్సిన మహిళల కంటే 6 కోట్ల 30 లక్షల మంది తక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.

మహిళలపై ఆకృత్యాలు పెరగడానికి ఈ లింగ వ్యత్యాసాలు కూడా ఓ కారణమే అన్నది చాలామంది భావన.

దేశంలో అత్యధికంగా రేప్ కేసులు నమోదవుతున్న రాష్ట్రం హరియాణా. అతి తక్కువ లింగ నిష్పత్తి ఉన్న రాష్ట్రం కూడా అదే కావడం గమనార్హం.

ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 10 ఏళ్ల బాలికను వేధించిన కేసులో ఓ 50 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైంది.15 ఏళ్ల అబ్బాయి మూడున్నర ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 20 ఏళ్ల వివాహితపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు.

ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన 24 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో చోట పంట పొలంలో దారుణ హత్యకు గురైన యువతి శవం లభ్యమైంది.

ఇవి అధికారికంగా బయటికి తెలిసిన కేసులు మాత్రమే.

Image copyright Reuters

కఠువా ఘటన ఏం చెబుతోంది?

జమ్ముకశ్మీర్‌లోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ ఆలయంలో నిర్బంధించి, కొన్ని రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసి, హింసించి, హత్య చేసి శవాన్ని అడవిలో పడేశారు.

"మైనారిటీలుగా ఉన్న బకర్వాల్ ఆదివాసీలను కఠువా నుంచి తరిమేయాలన్న ఆలోచనతోనే ఈ హత్య జరిగిందంటూ ఓ గోడపై రాసి ఉండటాన్ని చూశాను" అని ఆదివాసీ హక్కుల సంస్థ (ఆల్ ట్రైబల్ కోఆర్డినేషన్ కమిటీ) సభ్యులు నజాకట్ ఖటానా చెప్పారు.

దీంతో ఆ చిన్నారి హత్యోదంతం రెండు మతాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఈ కేసులో ఎనిమిది మంది మీద అభియోగాలు నమోదు చేశారు. సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసు విచారణ ప్రారంభించింది.

Image copyright KULDEEP SENGAR/TWITTER
చిత్రం శీర్షిక ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్

మరోవైపు అరెస్టైన నిందితులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ఇద్దరు బీజేపీ మంత్రులు జాతీయ జెండాలు చేతబట్టుకొని ర్యాలీలో పాల్గొనడం వివాదాస్పదమైంది.

వారి చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవడంతో వాళ్లు రాజీనామా చేశారు. ప్రధాని మోదీ కూడా స్పందించి కఠువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలను ట్విటర్ వేదికగా ఖండించారు.

"ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుంది" అని మోదీ ట్వీట్ చేశారు. అయితే, ఆ హామీతో ప్రయోజనం శూన్యం అంటూ చాలామంది విమర్శించడం ప్రారంభించారు. (ఈ కేసుల్లో అత్యాచార ఆరోపణలు, నిందితులకు మద్దతిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న వారు మోదీ సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే. దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన తర్వాతే వారిపై చర్యలు తీసుకున్నారు.)

మిగతా నాయకులు మాత్రం గొప్పగా చేసిందేమీ లేదు.

2014లో ఓ పాత్రికేయురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఆ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ మాట్లాడుతూ.. "అబ్బాయిలు తప్పులు చేస్తారు. అంతమాత్రాన వాళ్లను ఉరితీయాల్సిన అవసరం లేదు. అత్యాచార నిరోధక చట్టాల్లో మార్పులు చేస్తాం" అని వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

రాజీపడాల్సిందేనా?

ప్రస్తుతం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా భారతీయ మహిళలు రాజీపడాల్సి వస్తోంది. 'మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వస్త్రధారణ సరిగా ఉండాలి, తోడు లేకుండా బయటకు వెళ్లకూడదు లేదా ఇంట్లోనే ఉండిపోండి. కాదంటే మీ భద్రతకు భరోసా లేదు' అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి.

దేశంలో చిన్నారులపై దాడులు పెరుగుతుండటం కలవరపెట్టే విషయం.

నేర రికార్డుల ప్రకారం 2012, 2016 మధ్య మైనర్లపై రేప్ కేసులు రెండింతలకు పైగా పెరిగాయి.

దేశంలో మహిళా బాధితుల్లో 40శాతం మంది మైనర్లే.

2012 డిసెంబర్‌లో జరిగిన దిల్లీ నిర్భయ ఉదంతం అనంతరం రేప్‌కి విస్తృత నిర్వచనం వచ్చింది.

అంతకుముందు చాలామంది అత్యాచారాలు జరిగితే బాధిత కుటుంబాలు పరువు పోతుందన్న కారణంగా పోలీసులకు, మీడియాకు చెప్పేందుకు ముందుకొచ్చేవారు కాదు.

మంచి పరిణామం ఏమిటంటే ప్రస్తుతం చాలామంది బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి కేసులు పెట్టగలుగుతున్నారు.

Image copyright AFP

కానీ, రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యే అస్తవ్యస్తమైన న్యాయ వ్యవస్థ కారణంగా ఎంతోమంది నిందితులు దర్జాగా బయటకొచ్చేస్తుండటం దురదృష్టకరం.

దేశంలో నమోదవుతున్న ప్రతి నాలుగు కేసుల్లో ఒక్కదాంట్లో మాత్రమే దోషులకు శిక్ష పడుతోంది.

మరోవిషయం ఏమిటంటే.. దేశంలో చాలా మంది లైంగిక హింసను పెద్ద సమస్యగా చూడటంలేదు. దీన్ని సామాజిక సంక్షోభంగా గుర్తిస్తున్నట్టుగా బీజేపీ సహా, ఏ పార్టీ కనిపించడంలేదు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)