మునివాహన సేవ: దళితుడిని పూజారి భుజాలపై ఎందుకు ఎక్కించుకున్నారు?

  • 17 ఏప్రిల్ 2018
మునివాహన సేవలో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే ద‌ళిత వ్య‌క్తిని చిలుకూరు బాలాజి దేవ‌స్థానం అర్చకులు రంగ‌రాజ‌న్ త‌న భుజాల‌పై ఎక్కించుకున్నారు.

మునివాహన సేవలో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ఆదిత్య అనే ద‌ళితుడిని చిలుకూరు బాలాజీ దేవ‌స్థానం అర్చకులు రంగ‌రాజ‌న్ త‌న భుజాల‌పై ఎక్కించుకున్నారు.

రంగ‌నాథ స్వామి గుడి బ‌య‌ట మండ‌పం నుంచి గుడి లోప‌ల ధ్వ‌జ‌స్తంభం వ‌ర‌కూ ఆదిత్య‌ను రంగ‌రాజ‌న్ మోసుకెళ్లారు.

మేళ‌తాళాలు, అన్న‌మ‌య్య కీర్త‌న‌లు, చిన్న పిల్ల‌ల భ‌గ‌వ‌ద్గీత శ్లోకాల‌ మ‌ధ్య ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

త‌రువాత ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఇంతకీ ఏంటీ మునివాహన సేవ?

మరి మునివాహ‌న అంటే...

త‌మిళ‌నాడు శ్రీరంగంలోని రంగ‌నాథ స్వామి దేవాల‌యంలో 2700 సంవ‌త్స‌రాల కిందట ఇలాంటి ఘటనే జరిగిందని శ్రీవైష్ణ‌వులు చెబుతారు. వారి క‌థ‌నం ప్ర‌కారం తిరుప్పాణాళ్వార్ అనే ద‌ళిత భ‌క్తుడు శ్రీరంగంలోని దేవుణ్ని కీర్తిస్తూ కావేరి ఒడ్డున కూర్చుని పాట‌లు (పాశురాలు) పాడే వారు. అత‌ను ద‌ళితుడు కావ‌డంతో గుడిలోప‌లికి రాకుండా బ‌య‌టే పాట‌లు పాడేవారు.

ఆ గుడికి ప్ర‌ధాన అర్చ‌కుడిగా ఉన్న లోకసారంగుడు.. కావేరి న‌దికి వ‌చ్చిన‌పుడు, త‌న్మ‌య‌త్వంలో ఉన్న తిరుప్పాణాళ్వార్ పాటలు పాడుతూ క‌నిపిస్తాడు. లోక‌సారంగుడు వ‌చ్చినా అతను ప‌క్క‌కు త‌ప్పుకోడు.

దీంతో అత‌ణ్ని ప‌క్క‌కు తొల‌గ‌మ‌న‌డానికి లోకసారంగుడు రాయితో కొడ‌తాడు. తిరుప్పాణాళ్వార్‌కి దెబ్బ త‌గిలి ర‌క్తం వ‌స్తుంది, అత‌ను తేరుకుని అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

తర్వాత గుడిలో ఉన్న రంగ‌నాథ స్వామి విగ్ర‌హం నుంచి ర‌క్తం కారుతుంది. దాన్ని చూసిన లోక‌సారంగుడు త‌న త‌ప్పు తెలుసుకుని, ద‌ళితుడైన తిరుప్పాణాళ్వార్‌ని త‌న భుజాల‌పై ఎక్కించుకుని గుడిలోకి తీసుకువ‌స్తాడు.

లోక‌సారంగుడు ముని వంటి వ్యక్తి అని, అతని భుజాల‌పై ఎక్కి, అంటే అత‌ణ్ని వాహ‌నంగా చేసుకుని గుడిలోకి వ‌చ్చారు కాబ‌ట్టి తిరుప్పాణాళ్వార్‌ని మునివాహ‌నుడు అని కూడా అంటారు.

విశిష్టాద్వైతం లేదా శ్రీవైష్ణ‌వ సంప్ర‌దాయంలో 12వ ఆళ్వార్‌గా తిరుప్పాణాళ్వార్ ఆరాధ‌నీయుడయ్యాడు.

ఇప్పుడెందుకు చేశారు??

దేవుడి ముందు అంద‌రూ స‌మానులే అని చెప్ప‌డానికే తాను ఈ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టాన‌న్నారు రంగ‌రాజ‌న్. ఇటీవ‌ల ఉస్మానియా విశ్వవిద్యాల‌యంలో ద‌ళితుల అంశంపై జ‌రిగిన చ‌ర్చావేదిక‌లో తాను పాల్గొన్నాన‌నీ, అక్క‌డ మునివాహ‌నుడి గురించి వివ‌రించాన‌న్నారు.

దానిపై స్పందించిన దళిత విద్యార్థులు కొంద‌రు, "అప్ప‌ట్లో జ‌రిగి ఉండొచ్చు. ఇప్పుడు ఏ బ్రాహ్మ‌ణుడైనా ద‌ళితుడిని భుజాల‌పై ఎక్కించుకుంటారా?" అన్న ప్ర‌శ్న‌ను చాలెంజ్‌గా తీసుకుని తాను ఈ కార్య‌క్ర‌మం చేసిన‌ట్టు ఆయ‌న వివ‌రించారు.

"మేం కావాలంటే మునివాహ‌న ఘ‌ట్టాన్ని ఒక నాట‌కంలాగా ర‌వీంద్ర భార‌తిలో ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చు. కానీ, నేను నిజంగా ఆ ఘ‌ట్టాన్ని జ‌నులంద‌రికీ చూపి, స‌నాత‌న ధ‌ర్మంలోని స‌మానత్వాన్ని చాటాల‌నుకున్నాను. అందుకే నేను ద‌ళితుడిని నా భుజాలపై ఎక్కించుకుని గుళ్లోకి తీసుకెళ్లాను. దీన్ని అర్చ‌కులంద‌రూ కొనసాగించాలి. అంటే అంద‌ర్నీ భుజంపై ఎక్కించుకోమ‌ని కాదు. క‌నీసం ద‌ళితుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి వారిని గుడిలోకి ఆహ్వానించి, వారితో ప్ర‌త్యేకంగా పూజ చేయించాలి" అని కోరారు.

రంగ‌రాజ‌న్ త‌న భుజంపై ఎక్కించుకున్న ఆదిత్య ప‌రాశ్రీ శ‌క్తి ఉపాస‌కుడు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో మాదిగ కుటుంబంలో పుట్టారు. ఆయ‌న త‌ల్లితండ్రులు కూలి ప‌నికి వెళ్తుంటారు. అయితే ఆదిత్య మాత్రం ఆధ్యాత్మిక‌త వైపు ఆక‌ర్షితుడై, హిందూ శాస్త్రాల‌ను చ‌దివి మ‌హారాష్ట్ర‌లో ఓ గురువు ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసి, త‌న గ్రామంలోనే అమ్మ‌వారి పీఠం ఏర్పాటు చేసుకుని బ్ర‌హ్మ‌చ‌ర్య దీక్ష‌లో ఉన్నాడు.

అంట‌రానిత‌నం, ద‌ళితుల దేవాల‌య ప్ర‌వేశంపై ఆదిత్య మాట్లాడారు. ''వివ‌క్ష లేదు అన‌ను. వివ‌క్ష ఉంది. కానీ అది శాస్త్రాల్లో లేదు. స‌మాజంలో ఉంది. నేను మాదిగ కులంలో పుట్టి, శాస్త్రాలు చ‌దివి య‌జ్ఞోప‌వీతం (జంధ్యం) వేసుకున్నాను. నాకు బ్రాహ్మ‌ణులే జంధ్యం వేశారు. శాస్త్రాల‌పై సాధికారత సంపాదిస్తే మ‌న‌కూ అన్నీ వ‌స్తాయి. ఒక అవ‌కాశం, అధికారం మ‌న‌కు కావాల‌నుకున్న‌ప్పుడు, దానికి కావాల్సిన సాధ‌న, అధ్య‌యనం చేసి అర్హ‌త సంపాదించాలి'' అన్నారు.

"అంబేడ్కర్ కూడా భార‌తీయ మ‌తమైన బౌద్ధానికి మారారు త‌ప్ప‌, విదేశీ మ‌తాల‌వైపు వెళ్ల‌లేదు. అంబేడ్కర్‌ని నేను మ‌హ‌ర్షి అంటాను. కులం స‌మాజంలో ఉంది కానీ వేదాల్లో, ఉప‌నిష‌త్తుల్లో, శాస్త్రాల్లో లేదు. కులం పేరుతో స‌మాజాన్ని విడ‌దీయ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంద‌రికీ ఆధ్యాత్మిక జ్ఞానం అందితే ఈ స‌మ‌స్య‌లే ఉండ‌వు" అన్నారు ఆదిత్య‌.

త‌మ గ్రామంలోని ఆంజనేయ ఆలయంలోకి ఒక‌ప్పుడు ద‌ళితుల‌కు ప్ర‌వేశం ఉండేది కాద‌ని ఆయ‌న చెప్పారు. హిందూ మ‌తంలోని పెద్ద‌లు, గురువులు, ఆధ్యాత్మిక‌వేత్త‌లు ద‌ళిత‌వాడ‌ల్లోకి వెళ్లాల‌ని, వారికి శాస్త్రాల‌ను, ఆధ్యాత్మిక విష‌యాల‌నూ వివ‌రించాల‌ని పిలుపునిచ్చారు ఆదిత్య‌.

కొంత‌కాలంగా దేశ‌వ్యాప్తంగా ద‌ళితుల‌పై దాడుల విష‌యంలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో జియాగూడ‌లో జ‌రిగిన మునివాహ‌న ఘ‌ట్టం ఆస‌క్తి క‌లిగించింది. దీనిపై ద‌ళిత సంఘాలు, సామాజిక‌వేత్త‌లు భిన్నంగా స్పందించారు.

ఆంధ్ర, తెలంగాణ‌ల్లో ద‌ళితుల‌కు ఆల‌య ప్ర‌వేశాల‌పై పోరాడుతున్న సామాజిక స‌మ‌ర‌స‌త వేదిక అధ్య‌క్షులు టీఎన్ వంశ తిల‌క్ మాట్లాడారు. ''వివ‌క్ష ఒక‌టేసారి పోతుంద‌ని కాదు. కానీ ఇటువంటి కార్య‌క్ర‌మాల వ‌ల్ల క‌చ్చితంగా పాజిటివ్ మార్పు వ‌స్తుంది. త‌మ‌ను గుడిలోకి రానివ్వ‌రు అనే అభ‌ద్ర‌తా భావం ద‌ళితుల్లో పోతుంది. ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, కొన్ని గ్రామాల్లో ద‌ళితుల‌కు గుడిలోకి ప్ర‌వేశం ఉంది. వివ‌క్షను భ‌రిస్తూ ఇంకా హిందువులుగా కొన‌సాగుతున్న ద‌ళితులు ఎంద‌రో ఉన్నారు. వాళ్లు వివ‌క్ష‌ను భ‌రిస్తున్నారు కానీ, మ‌తం మార‌లేదు'' అని అన్నారు.

''ఇటువంటి కార్య‌క్ర‌మాలు కొన‌సాగాలి. నిన్న‌టి కార్య‌క్ర‌మం ద‌గ్గ‌రే కొంద‌రు అర్చ‌కులు ముందుకు వ‌చ్చి త‌మ దేవాల‌యాల్లో మునివాహ‌న సేవ నిర్వ‌హిస్తామ‌న్నారు. అయితే వాళ్లు (అర్చ‌కులు), మ‌మ్మ‌ల్ని (ద‌ళితులు) భుజాల‌పై ఎక్కించుకుని తీసుకెళ్ల‌క్క‌ర్లేదు.. మాకు వాళ్ళ భుజాలెక్కాల‌ని ఏమీ లేదు. మ‌మ్మ‌ల్ని ఆహ్వానించి వాళ్ల‌తో స‌మానంగా తీసుకెళ్తే చాలు. మాకు ఆత్మీయ‌త కావాలి. దేవాల‌య ప్ర‌వేశం, ద‌ర్శ‌నం ముఖ్యం. ఎక్క‌డైతే ద‌ళితుల‌కు దేవాల‌య ప్ర‌వేశం లేదో అక్క‌డ‌ అర్చ‌కులు ఆహ్వానిస్తే సుహృద్భావ వాతావ‌ర‌ణం నెలకొంటుంది. గుడి నుంచి గుడిసెకు అర్చకులు వార‌ధిగా మారాలి..'' అని తిలక్ పేర్కొన్నారు.

శాత‌వాహ‌న విశ్వ‌విద్యాల‌యంలో అధ్యాప‌కురాలు, బ‌హుజ‌న రెసిస్టెన్స్ ఫోర‌మ్ నిర్వాహ‌కులు సుజాత సూరేప‌ల్లి మాట్లాడుతూ.. ''హిందూ మ‌తంలోనే కులం పునాదులున్నాయ‌ని అంద‌రికీ తెలుసు. ఇప్ప‌టికీ స‌గం గుళ్ల‌ల్లో ద‌ళితుల‌కు ప్ర‌వేశం లేదు. ఉన్నా అంద‌రూ వెళ్లి వ‌చ్చాక ఉంటుంది. ద‌ళితులతో కూర్చుంటేనో, సేవా కార్య‌క్ర‌మాలు చేస్తేనో కులం పోతుంద‌ని కాదు. ఇలా చేస్తే కులం పోతుంద‌నుకుంటే రంగ‌రాజ‌న్ ఒక్క‌రే మిగిలిపోతారు. నా దృష్టిలో హిందూ మ‌తం లోప‌ల ఉండి కులం గురించి మాట్లాడ‌డం జోక్'' అని అన్నారు.

''కులం లోప‌లే పెళ్లిళ్లు అయిన‌ప్పుడు కులం ఎలా పోతుంది? వివ‌క్ష ఎలా పోతుంది? ఒక‌రు షో ఆఫ్ చేసినంత మాత్రాన కులం పోదు. ఈ చ‌ర్య క‌నీసం ద‌ళితుల‌కు ఆల‌య ప్ర‌వేశం క‌ల్పిస్తుందేమో.. అది కూడా నేను న‌మ్మ‌ను. ఇది ఆయన వ్య‌క్తిగ‌త చ‌ర్య‌గానే చూస్తాను. దీని త‌ర్వాత ద‌ళితులంద‌ర్నీ గుళ్ల‌లోకి రానిస్తార‌ని న‌మ్మ‌కం ఏంటి? నేనైతే అలా జ‌ర‌గుతుంద‌నుకోవ‌డం లేదు'' అని ఆమె అన్నారు.

న‌ల్సార్ విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు ప్రొఫెస‌ర్ హార‌తి వాగీశ‌న్ మాట్లాడుతూ.. ''వివ‌క్ష గుడిలోకి రానివ్వ‌డం, రానివ్వ‌క‌పోవ‌డం ద‌గ్గ‌ర లేదు. ఇది ఒక సానుకూల‌ సంకేతం. దీన్ని స్వాగ‌తిస్తాం. రామానుజుల వైష్ణ‌వ సిద్ధాంతం కులానికి దూరంగా జరిగే సిద్ధాంతం. కులానికి దూరంగా జ‌రిగిన దాన్ని మ‌రో కులంగా మార్చింది బ్రాహ్మ‌ణ మ‌తం. ఆ రోజుల్లో ఆ మాత్రం ముంద‌డుగు వేయ‌డం గొప్ప‌. కానీ ఆ స్ఫూర్తిని కొన‌సాగించ‌డం ముందున్న సవాలు. కానీ ఇలాంటివి ఒక ప్ర‌తీకాత్మ‌కం (సింబాలిక్)గా మిగిలిపోవ‌డ‌మే స‌మ‌స్య‌'' అని అన్నారు.

''ఇది అక్క‌డితో ఆగిపోతే జ‌రిగేదేమీ ఉండ‌దు. వివ‌క్ష ఆలోచ‌నా ప్ర‌క్రియ‌లో ఉంది. మెద‌డులో నుంచి వివ‌క్ష‌ను తొల‌గించ‌డానికి ఏం చేయాలనేది నిరంతరం ఆలోచించి దానికి తగిన చ‌ర్య తీసుకోవాలి. బ్రాహ్మ‌ణులే కాదు, అగ్ర‌కులాలంద‌రూ ఆ దిశ‌గా ఆలోచించాలి. కానీ అలా జ‌రుగుతుందా అనేది అనుమాన‌మే. ఇక్క‌డ జ‌రిగింది ఒక కార్య‌క్ర‌మం. కానీ అది ప్ర‌క్రియ‌గా మారుతుందా అనేది ప్ర‌శ్న‌. మారాలి అన్న‌ది కోరిక‌. భార‌త‌దేశంలో స‌ముదాయాలు ఉంటాయి. కానీ వాటి మ‌ధ్య సంబంధాలు ఎలా ఉండాల‌నేది చ‌ర్చ జ‌ర‌గాలి. ఇది బిగినింగ్ పాయింట్'' అని వాగీశన్ పేర్కొన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)