అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నారా?

  • 18 ఏప్రిల్ 2018
బంగారం Image copyright Getty Images

ఏప్రిల్ నెలలో భారత్‌లో బంగారానికి ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఈ నెలలోనే బంగారం కొనేందుకు 'మంచి రోజు'గా భావించే అక్షయ తృతీయ వస్తుంది. అది ఈ ఏడాది ఏప్రిల్ 18న వచ్చింది.

బంగారం కొనుగోళ్లు.. ధరల్లో ప్రస్తుతం ఉన్న ట్రెండే కొనసాగితే ఈ అక్షయ తృతీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అక్షయ తృతీయగా నిలుస్తుంది.

2018 ఏప్రిల్ 17 అంటే మంగళవారం 24 కేరట్ల బంగారం దాదాపు రూ.32,000 (పది గ్రాములు)గా ఉంది.

Image copyright Getty Images

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

బంగారాన్ని పెట్టుబడులకు సురక్షిత సాధనంగా భావిస్తారు. ప్రస్తుతం వాణిజ్య అస్థిరత నెలకొని ఉంది.

అమెరికా చైనాపై వాణిజ్య యుద్ధం ప్రకటించింది.

దీంతో చాలా మంది తమ పెట్టుబడులు స్టాక్ మార్కెట్లకన్నా బంగారానికే మళ్లించొచ్చు.

దీని వల్ల బంగారం ధరలు పెరగొచ్చు. వీటి ప్రభావం భారత్‌పై ఎక్కువగానే ఉండొచ్చు.

Image copyright Getty Images

మరి భారత్ పరిస్థితి?

మళ్లీ మొదటికి వద్దాం. 2016లో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత దేశంలో బంగారం ధర పెరిగింది.

దీంతో బంగారం దిగుమతులు గతేడాదితో పోల్చితే ఈ మార్చిలో 40 శాతం పడిపోయాయి.

అయితే సమీప భవిష్యత్తులోనే దేశంలో బంగారానికి గిరాకీ పెరిగే వీలుంది.

ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. దీంతో రైతులు కాస్త ఆదాయాన్ని పొందారు. ఫలితంగా పండగలపుడు బంగారానికి గిరాకీ పెరిగే వీలుంది.

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనే బంగారానికి మూడింట రెండో వంతు డిమాండ్ ఉంటుంది.

గతంలో అక్షయ తృతీయకు ఏం జరిగింది?

ఇప్పటి వరకూ లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే.. ఈ ఏడాదే అక్షయ తృతీయకు బంగారం ధర ఎక్కువగా ఉంది.

2010లో అక్షయ తృతీయ అప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.18,167. కానీ ఇది గతేడాది రూ.29,860కి చేరింది.


Image copyright Getty Images

ఇదీ ట్రెండ్

2017 ఏప్రిల్ 28న- 28,861

2016, మే 9న - 29,860

2015 ఏప్రిల్ 21న - 26,938

2014 మే 2న - 28,865

2013 మే 13న -26,829

2012 ఏప్రిల్ 24న - 28,852

2011 మే 6న - 21,736

ఆధారం: Goldpriceindia.com

శుభవార్త ఏంటంటే.. మీరు గతంలో బంగారం కొని ఉంటే ఇప్పుడు వాటికి మంచి రాబడిని పొందొచ్చు.


Image copyright Getty Images

ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?

దీనిపై నిపుణులు విభిన్న అభిప్రాయాలు వెల్లడించారు. '' రూ.30వేల వద్ద సాధారణంగా బంగారాన్నిఅమ్ముతారు. అయితే ఇప్పుడు ధరలు స్థిరంగా లేవు. ఈ ఏడాది ఆఖరుకు బంగారం ధర మరింత పెరుగుతుంది. అందువల్ల ఈ అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే ఇకపై ధర పెరుగుతుంది'' అని కామ్‌ట్రెండ్స్ రీసెర్చ్ డైరెక్టర్ జ్ఞానశేఖర్ త్యాగరాజన్ వెల్లడించారు.

అయితే.. '' ఇప్పుడు ట్రేడింగ్ వాతావరణం అంత అనుకూలంగా లేదు. కొనుగోలుకు కొన్ని నెలలు ఆగాలని సూచిస్తాను'' అని ఏవీపీ కమోడిటీ రీసెర్చ్, ఎస్ఎంసీ గ్లోబల్‌కి చెందిన వందనా భారతి తెలిపారు. సెప్టెంబరు అక్టోబరు నెలలకు ధరల్లో 5-6 శాతం దాకా సర్దుబాటు వచ్చే వీలుంది.. అప్పుడు కొనుగోలు చేయొచ్చు అని సూచించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు