ప్రెస్ రివ్యూ: బ్యాంకుల్లోని డబ్బంతా ఎటు పోతున్నట్టు?

  • 18 ఏప్రిల్ 2018
Image copyright NAVEEN KUMAR/BBC

తెలుగు రాష్ట్రాల్లో నగదు కొరతతో ప్రజలు విలవిల్లాడుతున్నారంటూ ప్రధాన పత్రికలన్నీ కథనాలు ప్రచురించాయి.

ఏ ఏటీఎంకు వెళ్లినా నో క్యాష్‌ బోర్డులే కనిపిస్తుండటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

హైదరాబాద్‌లోని బ్యాంకులకు ఈ నెల మొదటి వారంలో రూ. 3,000 కోట్ల పైచిలుకు అందజేశామని రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతోంది.

అంత డబ్బు వచ్చినా ఖాతాదారులకు ఎందుకు చేరడం లేదన్న ప్రశ్నకు మాత్రం ఆర్‌బీఐ సమాధానం చెప్పలేకపోతోంది.

''బ్యాంకు మేనేజర్లు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నట్లు కొన్ని కేసులను పరిశీలిస్తే అర్థమైంది. ఆబిడ్స్‌లో ఓ బ్యాంకుకు దాని ప్రధాన కార్యాలయం నుంచి ఈ నెల 6న రూ.175 కోట్లు వెళ్లాయి. ఆ మొత్తం నగదును సదరు బ్యాంకు మేనేజర్‌ కేవలం ముగ్గురు ఖాతాదారులకే పంపిణీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది''అని ఆర్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారని సాక్షి పత్రిక పేర్కొంది.

ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు కొరతకు బ్యాంకుల మధ్య సమన్వయ లోపం కూడా ఓ కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

బుధవారం నుంచి నగదు కొరత రాకుండా కొన్ని చర్యలు తీసుకోబోతున్నామని, అందుకు ప్రధాన బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశామని ఆ అధికారి చెప్పారు.

తెలంగాణలో అన్ని బ్యాంకులకు కలిపి 8,781 ఏటీఎంలు ఉండగా.. అందులో పెద్దనోట్లు రద్దయినప్పట్నుంచీ దాదాపు 40 శాతం అంటే 3,800 ఏటీఎంల్లో నగదు లోడ్‌ చేయడం లేదు.

మరో 20 శాతం ఏటీఎంలలో వారానికి ఒకసారి మాత్రమే నగదు ఉంచుతున్నారు. మొత్తంగా 40 శాతం ఏటీఎంల్లోనే నగదు లోడ్‌ చేస్తున్నారని సాక్షి వివరించింది.

మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉందని ఈనాడు తెలిపింది.

సూరత్‌లో హత్యకు గురైంది తెలుగు అమ్మాయేనా?

గుజరాత్‌లోని సూరత్‌లో 10 రోజుల క్రితం అత్యాచారానికి గురై ఆపై హత్యకు గురైన బాలికను ఆంధ్రప్రదేశ్‌ వాసిగా గుర్తించారని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం ప్రచురించింది.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ కేసులో పోలీసులు బాధిత బాలిక వివరాలు కనిపెట్టలేక పోవడం విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో సదరు బాలిక తన కూతురేనని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి సూరత్‌ పోలీసులను ఆశ్రయించారు. గత ఏడాది అక్టోబరులో తన కుమార్తె అదృశ్యమైందని తెలిపారు.

అతను చూపిన ఫొటో, ఆధార్‌కార్డు బాధిత బాలికతో సరిపోయాయని సూరత్‌ పోలీసు కమిషనర్‌ సతీశ్‌ శర్మ తెలిపారు.

త్వరలో డీఎన్‌ఏ పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పా రు.

ఏప్రిల్‌ 6న సూరత్‌లోని క్రీడా మైదానం వద్ద పొదల్లో 9-11 ఏళ్లలోపు వయసు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అతి కిరాతకంగా అత్యాచారం చేసి.. హింసించి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది.

Image copyright STRINGER/gettyimages

సింగరేణి కార్మికులకు పాదరక్షలు కరవు

సింగరేణి కార్మికులకు పాడైన పాదరక్షలతోనే గనుల్లోకి వెళ్లాల్సి వస్తోందంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల రక్షణకు పాదరక్షలు, శిరస్త్రాణం అత్యంత కీలకం. అయితే, పాదరక్షల సరఫరాలో జాప్యం కారణంగా కార్మికులు చిరిగిన వాటితోనే విధులకు హాజరవుతున్నారు.

ఆరు నెలలకోసారి బూట్లను అందించాల్సి ఉండగా ఇప్పటికి 8 నెలలు కావస్తున్నా కొత్తవాటిని యాజమాన్యం సరఫరా చేయలేదు.

మరోవైపు తమకు ఇస్తున్న బూట్లు నాసిరకంగా ఉంటున్నాయని, మూడు నెలలకే పనికిరాకుండా పోతున్నాయని కార్మికులు వాపోతున్నారు.

మన్నికైన పాదరక్షలను కొనుగోలు చేయాలని హైకోర్టు గతేడాది ఆదేశించింది.

దాంతో యాజమాన్యం గతంలో కొనుగోలు చేసిన బూట్ల సరఫరాను నిలిపివేసి వాటిని గదుల్లో నిల్వ ఉంచింది. కొత్తగా మరో కంపెనీతో ఒప్పందం చేసుకునే పనిలో నిమగ్నమైంది.

ప్రస్తుతం కార్మికులకు సరఫరా చేసేందుకు సరిపడా బూట్లు ఉన్నాయని, నాణ్యత విషయంలో కోర్టు తప్పుపట్టడం వల్లనే వాటి సరఫరా నిలిపివేశామని సింగరేణి రక్షణ విభాగం జీఎం వసంత్‌కుమార్ తెలిపారని ఈనాడు పేర్కొంది.

కేసీఆర్ Image copyright facebook.com/KalvakuntlaChandrashekarRao

బీజేపీ వ్యతిరేక పోరును కర్ణాటకకు విస్తరిస్తున్న తెలుగు నేతలు

బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆగ్రహం కర్ణాటక ఎన్నికల్లో కూడా ప్రభావితం చేయొచ్చని 'ద ఎకనామిక్ టైమ్స్' ఓ కథనంలో తెలిపింది.

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు బెంగళూరులో జనతాదళ్ (సెక్యులర్) నేత దేవెగౌడను కలిసి ఆయనకు తన మద్దతు ప్రకటించారు.

ఇటీవలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశం పార్టీ కూడా కర్ణాటక ఎన్నిక ప్రచారంలో తనదైన ముద్ర వేయాలని చూస్తోంది.

టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఉపముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి తన బెంగళూరు పర్యటన సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని తెలుగు ఓటర్లకు పిలుపునిచ్చారు.

టీడీపీ ఎవరికీ స్పష్టంగా మద్దతు ప్రకటించనప్పటికీ, తెలుగు ప్రజల్లో ఉన్న బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్లను ఉపయోగించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

వచ్చే నెలలో శాసనసభ ఎన్నికలు సిద్ధమవుతున్న కర్ణాటకలో 15 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలుంటారని అంచనా. వీరి ఓట్లు కనీసం 12 జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

తెలంగాణను ఆనుకొని ఉన్న హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి.

అయితే తెలుగు మాట్లాడే వారి ఓట్లు కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య చీలిపోతే, అది తమకే లాభం అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)