చంపారన్: ‘‘నేను దేవుణ్నీ, అహింసనీ, సత్యాన్నీ దర్శించాను’’

మహాత్మా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

చంపారన్ సత్యాగ్రహం.. ఆంగ్లేయుల పాలనలోని భారతదేశంలో మొట్టమొదటి రైతు ఉద్యమం. వందేళ్ల కిందట 1917లో బిహార్‌లోని చంపారన్ జిల్లాలో మహాత్మా గాంధీ సారథ్యంలో జరిగిన మొట్టమొదటి సత్యాగ్రహం కూడా.

ఈ ఉద్యమం అటు గాంధీజీని ఇటు దేశ రైతులను భారత స్వాతంత్ర్యపోరాటానికి సమాయత్తం చేసిందని కొందరు చరిత్రకారులు భావిస్తారు.

దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ ఉద్యమాల అనుభవంతో 1915లో ఇండియా తిరిగొచ్చిన గాంధీ.. రెండేళ్ల తర్వాత 1917 ఏప్రిల్ నెలలో బిహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో నీలిమందును పండించే రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి రంగంలోకి దిగారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు బ్రిటిష్ పాలకులతో పోరాడుతూ అధికారులతో చర్చలు జరుపుతూనే.. మరోవైపు అక్కడి రైతులు, ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచేందుకు ఎంతో కృషి చేశారు.

ఆ క్రమంలో మొట్టమొదటిసారి శాసనోల్లంఘనకు తెరతీశారు. వేలాది మంది రైతులను కదిలించారు. చంపారన్‌లో రైతుల సమస్యలను పరిష్కరించారు. వందేళ్ల తర్వాత ఇప్పుడు కూడా దేశంలో రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. నాటి చంపారన్ సత్యాగ్రహం పూర్వాపరాలు ఇవీ.

మహాత్మా గాంధీ స్వీయ అనుభవం, ఆయనతో పాటు ఆ ఉద్యమంలో పాలుపంచుకున్న ఆచార్య జె.బి.కృపలానీ పరిశీలన.. ప్రఖ్యాత చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్‌ విశ్లేషణల సారాంశాలివీ...

ఫొటో సోర్స్, Margaret Bourke-White/photodivision.gov.in

ఫొటో క్యాప్షన్,

ఆచార్య కృపలానీ: చంపారన్ ఉద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు

మొట్టమొదటి సత్యాగ్రహం: ఆచార్య కృపలాని

‘‘లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి బిహార్‌లోని చంపారన్ నుంచి వచ్చిన రాజ్‌కుమార్ శుక్లా అనే రైతు హాజరయ్యారు. వారి ప్రాంతంలో రైతులు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లను గాంధీజీకి వివరించాడు. నీలిమందు తోటల్లో తెల్లవాళ్లు స్థానిక ప్రజలపై చెలాయిస్తున్న పెత్తందారీ పద్ధతుల్ని గురించి కూడా తెలియజేశాడు. గాంధీజీని చంపారన్ వచ్చి స్వయంగా వాస్తవాలు పరిశీలించాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత కలకత్తాలోనూ గాంధీజీని కలిసి మొండిపట్టుతో మొత్తానికి ఒప్పించగలిగాడు. ఇద్దరూ కలిసి కలకత్తా నుంచి రైలులో పాట్నా బయలుదేరారు.

చంపారన్ రైతుల పరిస్థితులు, సమస్యలు, భూమికి సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవటానికి పాట్నాలో రాజేంద్రబాబు (భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్) అనే న్యాయవాది ఇంటికి వెళ్లారు.ఆయన ఇంట్లో లేరు. అక్కడి గుమస్తా ఈ అపరిచిత వ్యక్తుల్ని ఇంటికి రానివ్వలేదు.

లండన్‌లో గాంధీజీతో పాటు చదువుకున్న మజహర్ ఉల్ హక్ అనే న్యాయవాది వచ్చి వారిద్దరినీ తన ఇంటికి తీసుకుపోయాడు. అక్కడి రైతులు, యజమానులకి సంబంధించిన ముఖ్యమైన వివరాల్ని అందించాడు. నీలిమందు పంట యజమానులకు ముజఫర్‌నగర్‌లో నివాస సముదాయాలున్నాయని హక్ చెప్పారు. దీంతో.. ముజఫర్‌నగర్‌లో స్థానిక కళాశాల ప్రొఫెసర్ కృపలానీ తనకు తెలుసని గాంధీజీ ఆయనకు చెప్పారు. అప్పటికప్పుడే తాము ట్రైన్లో అర్థరాత్రి ముజఫర్‌నగర్ చేరుకోబోతున్నట్లుగా నాకో టెలిగ్రాం పంపారు.

నేను కాలేజీ హాస్టల్‌కి వార్డెన్‌గా ఉండేవాడ్ని. విద్యార్థి సమూహంతో కలిసి వేడుకగా స్టేషనుకెళ్లాం. ట్రైన్ రాగానే గాంధీజీని ఆహ్వానించి నా సహోద్యోగి ప్రొఫెసర్ మల్కానిగారి ఇంట్లో ఉండటానికి ఏర్పాట్లు చేశాను.

చంపారన్‌లో భూసమస్యను గాంధీజీకి వివరించేందుకు కొందరు న్యాయవాద మిత్రులను ఆహ్వానించాను. వారిని అనేక ప్రశ్నోత్తరాలతో విసిగించిన తర్వాత గాంధీ యాజమాన్య సంఘ కార్యదర్శిని కలిసి తనకి సహకరించాల్సిందిగా కోరారు. తర్వాత తిర్‌హుట్ ప్రాంతపు కమిషనర్‌ని గాంధీజీ కలిశారు. గాంధీజీ అక్కడుండటం సమస్యల్ని సృష్టిస్తుందని వెంటనే ముజఫర్‌నగర్ వదిలి వెళ్లాలని కమిషనర్ చెప్పాడు. అటువంటిదేమీ జరగదని హామీ ఇస్తూ తాను చంపారన్ వెళ్లబోతున్నట్లు గాంధీజీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తమ కోసం ఖైదు కావడానికి సిద్ధపడి న్యాయస్థానం బోనులో దోషిగా నిలబడ్డ అద్వితీయ వ్యక్తి కోసం చంపారన్ రైతులు తండోపతండాలుగా తరలి వచ్చారని ఆచార్య కృపలానీ వివరించారు

ముజఫర్‌నగర్‌లో మూడ్రోజులున్న తర్వాత గాంధీజీ మోతిహారీ చేరుకున్నారు. అక్కడి దుర్భర పరిస్థితుల్ని తెల్సుకోవడం కోసం మారుమూల గ్రామాలకి వెళ్లాలని తలిచారు. మార్గమధ్యలో చంపారన్‌ని 24 గంటల్లోపల విడిచిపెట్టి వెళ్లిపోవాలనే నోటీసు కూడా అందుకున్నారు. తానొచ్చిన పనిని మధ్యలో వదిలి చంపారన్ నుంచి వెళ్లే ఆలోచన తనకి లేదని గాంధీజీ జిల్లా మెజిస్ట్రేట్‌కి జవాబు పంపారు.

ఆ మరుసటి రోజు తన ముందు హాజరు కావాలని జిల్లా మెజిస్ట్రేట్ నుంచి గాంధీకి సమన్లందాయి. మెజిస్ట్రేటు అధికారిక ఆజ్ఞలు ఆయనకి పంపడం, వాటినాయన తిరస్కరించడం, కోర్టుముందు విచారణకి హాజరు కావడం దేశం మొత్తం వార్తయింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండీ వేల సంఖ్యలో రైతులు.. యజమానులు, పోలీసులంటే భయం లేకుండా కోర్టుకి రావడం మొదలెట్టారు.

తమ కోసం ఖైదు కావడానికి సిద్ధపడి న్యాయస్థానం బోనులో దోషిగా నిలబడ్డ అద్వితీయ వ్యక్తిపట్ల వారి విధేయతను చూపడానికి రైతులు తండోపతండాలుగా తరలి రాసాగారు. ఆ రోజుల్లో సిమ్లాలో ఉండే ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకుంటుండేది. గాంధీజీ కూడా సమాచారాన్ని వైస్రాయికీ మాలవ్యాగారికీ, పాట్నాలోని ఇతర మిత్రులకీ చేరవేసేవారు.

అప్పటికింకా మొదటి ప్రపంచ యుద్ధం ముగియలేదు. దేశంలో ఎక్కడా కూడా రాజకీయపరమైన గంభీరవాతావరణం నెలకొనడాన్ని ఉన్నతాధికారులు హర్షించడం లేదు. గాంధీజీ విచారణ సందర్భంగా ప్రజానీకంలో కనిపించిన స్పందనను చూసిన ప్రభుత్వం వారిలో అశాంతి ప్రబలుతుందేమోనని ఆందోళన చెందింది. తీర్పు వాయిదా వేసి, గాంధీజీకి సమాచార సేకరణకు స్వేచ్ఛనిచ్చి విడుదల చేసింది.

న్యాయస్థానంలో గాంధీజీ ధిక్కార స్వరాన్ని చూసిన చంపారన్ రైతులు దీర్ఘకాలికంగా వారిని పట్టి ఉంచిన బానిస బంధనాల నుండి విముక్తమయినట్లు భావించారు. గాంధీజీ అరెస్టు కావడం, విడుదల చేయబడటం, సమాచార సేకరణకి అనుమతించబడటం రైతుల సమస్యకి అనూహ్యమయిన ప్రచారాన్ని తీసుకొచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

చంపారన్ ఉద్యమంలో తాను దేవుణ్ని, అహింసనీ, సత్యాన్నీ దర్శించానని గాంధీ వివరిస్తారు

నీలిమందు మచ్చ : మహాత్మా గాంధీ

‘‘అక్కడికి వెళ్లక పూర్వం నాకు చంపారన్ అనే పేరు కూడా తెలియదు. అక్కడ నీలిమందు ఉత్పత్తి అవుతుందని కూడా తెలియదు. చంపారన్ తిరహుత్ కమిషన్ యందలి ఒక జిల్లా. దానికి మోతీహారీ ప్రధాన కేంద్రం. అక్కడి కొఠార్లకు సంబంధించిన రైతులు నిరుపేదలు. నేను అక్కడికి వెళ్లి వారిని చూడాలి అని భావించాను. వెంటనే అనుచరులందరినీ వెంటబెట్టుకుని మోతిహారీకి బయలుదేరాను. పోలీస్ సూపరింటెండెంట్ దూత అక్కడికి వచ్చాడు. చంపారన్ వదిలి వెళ్లిపొమ్మని నాకు నోటీస్ ఇచ్చాడు. ’నేను చంపారన్ వదిలి వెళ్లను. నేను ఇక్కడి పరిస్థితుల్ని పరీక్షించాల్సి ఉన్నది’ అని సమాధానం రాసి అతనికి ఇచ్చాను. మరుసటి రోజున కోర్టుకు హాజరుకమ్మని నాకు సమను అందింది.

కోర్టు వాళ్లు సమను పంపారన్న వార్త క్షణంలో జనానికి తెలిసిపోయింది. మోతిహారీలో ఎన్నడూ కనీవినీ ఎరుగని ఘట్టం జరిగిపోయిందని ప్రజలు గోలపెట్టారు. గోరఖ్‌బాబు ఇంటి దగ్గర, కోర్టు దగ్గర గుంపులు గుంపులుగా జనం చేరారు. కోర్టులో ఎక్కడికి వెళితే అక్కడ నా వెంట ఒకటే జనం. కలెక్టరు, మెజిస్ట్రేట్, సూపరింటెండెంటుతో కూడా నాకు సంబంధం ఏర్పడింది. గవర్నమెంటు వారి నోటీసుల్ని ఒప్పుకున్నాను. అధికారులతో ఎంతో మంచిగా వ్యవహరించాను. దానితో వారందరికీ నా విషయమై భయం పోయింది. వారిని మంచిగానే వ్యతిరేకిస్తానని వారికి బోధపడింది. దానితోబాటు తమ అధికార ప్రాబల్యం ఆనాటితో తగ్గిపోయిందని వాళ్లు గ్రహించారు. ప్రజలు ఆ క్షణం గవర్నమెంటు అధికారుల దండన, శిక్షల భయం మరచిపోయి తమ కొత్త మిత్రుని యెడల గల ప్రేమ యొక్క ఆధిపత్యానికి లోబడిపోయారని అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.

నిజానికి చంపారన్‌లో నన్ను ఎవ్వరూ ఎరుగరు. రైతులు నిరక్షరాస్యులు. చంపారన్ గంగానదికి ఆవలి ఒడ్డున హిమాలయ పర్వత చరియల్లో నేపాలుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. అంటే అది ఒక కొత్త ప్రపంచమన్నమాట. రాజకీయంగా ఇక్కడ ఇంతవరకూ ఎవ్వరూ పనిచేసి ఉండలేదు. రాజకుమార్ శుక్లాకు వేలాదిజనంతో కలిసిపోయే శక్తిలేదు. చంపారన్ బయటగల ప్రపంచాన్ని ఆయన ఎరుగడు. అయితే మా ఇరువురి కలయిక పాతమిత్రుల కలయికగా పరిణమించింది. ఆ రూపంలో నేను దేవుణ్ని, అహింసనీ, సత్యాన్నీ దర్శించాను. ఇది అక్షరాలా నిజం. ఈ విషయమై నాకు గల అధికారం ఏమిటి అని ఆలోచిస్తే ప్రేమ తప్ప వేరే ఏమీలేదని.. ప్రేమ, అహింసల ఎడల నాకు గల నిశ్చలమైన శ్రద్ధ తప్ప మేరేమీ లేదని తేలింది. చంపారన్‌లో జరిగిన ఈ వ్యవహారం నాకు, రైతులకు ఉత్సవ దినం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

1931లో లండన్‌లో మహాత్మా గాంధీని చూడటానికి వచ్చిన ఆంగ్లేయులు.. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలడం తన లక్ష్యం కాదు. వారి హృదయాలను జయించే ఉద్దేశంతోనే తన చంపారన్ సంగ్రామం సాగిందని గాంధీ చెప్తారు

‘నాకిచ్చిన ప్రభుత్వ ఆదేశాన్ని పాటించితే ప్రజలకు నేను న్యాయం చేయలేనని భావిస్తున్నాను. వారి మధ్యన ఉండి మాత్రమే నేను ఇక్కడి ప్రజలకు సేవ చేయగలనని నమ్ముతున్నాను. అందువల్ల నేను ఇప్పుడు చంపారన్ విడిచి వెళ్లలేను. నాకిది ధర్మసంకటం. ప్రభుత్వ స్థానిక అధికారుల ఆదేశం కంటే నా అంతర్వాణి పెద్దదని.. దాని ఆదేశాన్ని పాటించడం నా కర్తవ్యమని భావిస్తున్నాను’ అంటూ నా నేరాన్ని అంగీకరిస్తూ కోర్టులో వివరించాను. ఇలా జరుగుతుందని మెజిస్ట్రేటు ఊహించలేదు. అనంతరం వైస్రాయి ఆదేశాల మేరకు కేసును ఉపసంహరించుకోవడమైనదని మెజిస్ట్రేటు నాకు సమాచారం అందజేశాడు. కలెక్టరు కూడా నాకు సాయం చేయటానికి సిద్ధమంటూ జాబు రాశాడు.

భారతదేశానికి సత్యాగ్రహం అంటే ఏమిటో, చట్టాన్ని సవినయంగా ఉల్లంఘించడం అంటే ఏమిటో పాఠం నేర్పినట్లయింది. చంపారన్‌లో జరిపిన ప్రయోగమంతా అహింసా ప్రయోగమే. ఆరేడుగురు వకీళ్లు రైతులు చెప్పే కథలు రాసుకుంటూ ఉండేవారు. ఈ వాజ్ఞ్మూలాలు రాసుకునేటప్పుడు గూఢచార పోలీసులు తప్పక ఉండేవారు. తెల్లదొరల్ని భయపెట్టి వారిని పారద్రోలడం నా లక్ష్యం కాదు. వారి హృదయాలను జయించాలనే ఉద్దేశంతో నా ఈ సంగ్రామం సాగింది.

మరోవైపు స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో అక్కడి గ్రామాల్లో చదువు చెప్పటం, పారిశుద్ధ్యం పనులు మొదలుపెట్టాం. కొద్ది రోజుల తర్వాత నా లేఖలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. అందులో నన్ను కూడా మెంబరుగా ఉండమని గవర్నర్ ఎడ్వర్డ్ గేట్ నన్ను పిలిచి కోరాడు. ఆ విచారణ కమిటీ, రైతులు చేసిన ఆరోపణలన్నీ నిజమేనని ప్రకటించింది. అన్యాయంగా తెల్లదొరలు తీసుకున్న సొమ్ము నుండి కొంత భాగం రైతులకు చెల్లించాలని, తిన్‌కఠియా రివాజును రద్దు చేయాలని సిఫారసు చేస్తూ తీర్మానించింది. ఈ రిపోర్టు అంగీకరింపబడటానికి, ఆ ప్రకారం చట్టం పాస్ చేయటానికి సర్ ఎడ్వర్డ్ గేట్ మహత్తరమైన కృషి చేశాడు.ఈ విధంగా 100 సంవత్సరాల నుండి అమల్లో ఉన్న తిన్‌కఠియా విధానం రద్దు అయింది. తెల్లదొరల రాజ్యం కూడా అస్తమించింది. అణగిపోయి పడివున్న రైతులు తమ శక్తిని గుర్తించారు. నీలిమందు మచ్చ కడిగినా పోదు అను భ్రమ తొలగిపోయింది.’’

ఫొటో సోర్స్, Amber Habib / Wikipedia

ఫొటో క్యాప్షన్,

ప్రథమ రైతాంగ పోరాటంగా చంపారన్ సత్యాగ్రహం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ అంటారు

చారిత్రక మహోద్యమం: ఇర్ఫాన్ హబీబ్

''ఆధునిక భారత చరిత్రను మలుపుతిప్పి భూమికోసం భుక్తికోసం పోరాడే రైతాంగాన్ని స్వాతంత్ర్యోద్యమానికి సిద్ధం చేసిన గొప్ప ఉద్యమం చంపారన్. చంపారన్ ఉద్యమాన్ని గాంధీజీ నిర్వహించిన పద్ధతి ఒక గంభీరమయిన నాయకత్వ నమూనాకి ప్రతీకగా నిల్చింది. ఆయన అక్కడికి వెళ్లేనాటికి దక్షిణాఫ్రికాలోలా సత్యాగ్రహం చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోగా రైతులంతా దీర్ఘకాలంగా పీల్చి పిప్పిచేయబడి ఉన్నారు.

అందువల్ల, గాంధీజీ ముందుగా తాను అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేసేందుకు అవసరమయిన సమాచార సేకరణలో భాగంగానే వచ్చానని ప్రకటించారు. నిర్భయులైన కొంతమంది యువతను ఆ రకంగా కూడగట్టగలిగారు. తర్వాతి కాలంలో ఆయన ముఖ్య అనుచరుడిగానున్న బ్రిజ్‌కిషోర్ ప్రసాద్, బీహార్‌లో ప్రముఖ కాంగ్రెస్ నేతగా ఎదిగిన రాజేంద్రప్రసాద్ కూడా వారిలో ఉన్నారు. గాంధీజీ తన బృందంతో మొట్టమొదట రైతుల దగ్గరికి వెళ్లి వారి ఫిర్యాదుల్ని నమోదు చేసుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆఖరికి అదే చంపారన్ సత్యాగ్రహంగా రూపొందింది.

17వ శతాబ్దంలో యూరోపు సామ్రాజ్యంలో గల వెస్టిండీస్‌లోని బానిసలచేత నీలిమందు తోటలు పండించేవారు. ఆంగ్లేయులు బెంగాల్‌పై విజయం సాధించాక జమీందార్లను లోబరుచుకుని రైతాంగం మీద నీలిమందు తోటల పెంపకాన్ని బలవంతంగా రుద్దేవారు. ఆ తోటలు బీహార్‌కు కూడా విస్తరించబడ్డాయి. బ్రిటిష్ వాళ్లు జమీందార్లను కొనేవారు కాదు కానీ జమీందారీ భూమిని కౌలుకు తీసుకుని దాన్ని రైతులకిచ్చే ‘టేకేదార్’ల అవతారం ఎత్తేవారు. జమీందార్లకి ఏమాత్రం తీసిపోని విషపు పాత్రను పోషిస్తూ చంపారన్ జిల్లాలోని గ్రామాల్లో యూరోపియన్లంతా ఆధిపత్యం చెలాయించేవారు. నూలు ఎగుమతి విస్తరించటం వల్ల తోట యజమానులు ‘టిన్-కటియా’ అనే పద్ధతిని రైతాంగం మీద రుద్దేవారు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో సారవంతమయిన వారి భూముల్లో నీలిమందుని పండించాల్సి వచ్చేది. అంతకుముందు నుంచీ రైతుల పాలిటి శాపాలయిన షరబ్షి, తవాన్ మొదలయిన పద్ధతులు అలాగే కొనసాగుతుండేవి. ఇవన్నీ కాక బిగార్ అనబడే వెట్టి సరేసరి.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గాంధీజీ జైలు శిక్షకు సిద్ధపడి మొట్టమొదటిసారిగా తన 'ధిక్యార చైతన్య స్వరాన్ని' వినిపించారని ఇర్ఫాన్ హబీబ్ చెప్తారు

ఈ అంశం మీద 1916లో లక్నో కాంగ్రెస్ సమావేశంలో చంపారన్ రైతులు తమ సమస్యలని వివరించారు. ఆ మరుసటి ఏడాది గాంధీ ఈ రైతుల సమస్యలను పరిశీలించటానికి చంపారన్ వచ్చారు. ఈ తతంగం నిరపకారమైందని బ్రిటిష్ అధికారులు భావించారు. ఐతే.. ఒక్క సామాన్య రైతు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం ఎప్పుడైతే చూశారో అప్పుడిక రైతులంతా వారి వారి భూముల్నెలా స్వాధీనం చేసుకున్నారో తమనెలా లొంగదీసుకున్నారో చెప్పడం కోసం బారులు తీరారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 16న బ్రిటీష్ జిల్లా న్యాయాధికారి గాంధీజీకి జిల్లా వదిలి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 18న న్యాయాధికారి ఎదుట ముద్దాయిగా నిలబడిన గాంధీ.. జైలు శిక్షకు సిద్ధపడి మొట్టమొదటిసారిగా ఈ అంకంలో తన 'ధిక్యార చైతన్య స్వరాన్ని' వినిపించారు. అతిసామాన్యంగా అగుపించే ఆ అంకితభావంతో కూడిన నిబద్ధతే ఆ రోజు విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాలో 20 సంవత్సరాల పాటు నిరవధికంగా భారతీయుల పక్షాన నిలబడి పోరాడిన గాంధీజీ సొంత గడ్డమీద కాలుమోపిన తర్వాత మొట్టమొదట చేపట్టిన సత్యాగ్రహ మహోద్యమం చంపారన్. అదక్కడితో ఆగలేదు. స్వదేశీ మిల్లు యజమానులకీ వ్యతిరేకంగా అహ్మదాబాద్ కార్మికులు, రెవెన్యూ వసూళ్లను నిరసిస్తూ ఖేడా ప్రతిఘటనోద్యమం రెండు సత్యాగ్రహాలు 1918 లోనే జరిగాయి. వాటి స్ఫూర్తే 1919 ఏప్రిల్‌లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చివరికి 1920-22 సంవత్సరాల మధ్య సహాయ నిరాకరణోద్యమం, ఖిలాఫత్ ఉద్యమంగా రూపుదాల్చాయి. ఏదేమైనప్పటికీ అశాంతి నిండిన రైతాంగానికి నూతన ఆశలు కల్పించీ, అంతిమంగా కష్టజీవులకే కచ్చితమైన విజయాన్నందించిన కీలకమైన ప్రజా ఉద్యమంగా ప్రథమ రైతాంగ పోరాటంగా చంపారన్ సత్యాగ్రహం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.’’

- ఆచార్య జె.బి.కృపలాని ప్రముఖ గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణ సామాజిక కార్యకర్త. 2017 ఏప్రిల్ 30న భావన్స్ జర్నల్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం నుంచి కొంత భాగం సేకరించాం.

- మహాత్మా గాంధీ స్వాతంత్ర్యోద్యమ సారథి. ఎంపిక చేసిన గాంధీజీ రచనలు మొదటి సంపుటం, సత్యశోధన లేక ఆత్మకథలోని ‘నీలిమందు మచ్చ’ వ్యాసం నుంచి సారాంశం సేకరించటం జరిగింది.

- ఇర్ఫాన్ హబీబ్ ప్రముఖ మార్క్సిస్ట్ మేధావి, చరిత్రకారుడు. 2017 ఏప్రిల్ 16న జనతా పత్రికలో ప్రచురితమైన ఆయన వ్యాసం నుంచి కొంత భాగం సేకరించాం.

(మూడు వ్యాసాలకు ఆధారం: చంపారన్ శతవార్షికోత్సవం సందర్భంగా లోహియా విజ్ఞాన సమితి ప్రచురించిన సంకలనం)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)