'మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్లు కనిపెట్టారు!'

  • 18 ఏప్రిల్ 2018
బిప్లవ్ కుమార్ దేవ్ Image copyright Twitter

భారత్‌లో లక్షల ఏళ్ల కిందటే ఇంటర్నెట్‌ను ఆవిష్కరించారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ అన్నారు.

మహాభారత కాలంలో ఇంటర్నెట్ ఒక్కటే కాదు, శాటిలైట్లు కూడా ఉండేవని ఆయన చెప్పారు.

త్రిపురలో ఓ వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ ఆయన, "మనది ఎలాంటి దేశమంటే... మహాభారతంలో సంజయుడు ఓ చోట కూర్చొని యుద్ధంలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. దీని అర్థం ఏంటి? అంటే ఆ రోజుల్లోనే ఈ టెక్నాలజీ అంతా ఉనికిలో ఉందన్న మాట. ఇంటర్నెట్, శాటిలైట్లు.. ఇవన్నీ అప్పుడే ఉన్నాయి. లేదంటే సంజయుడు ఇదంతా తన కంటితో ఎలా చూడగలిగాడు?"

Image copyright facebook/Biplab Kumar Deb

'వారు కాదు, భారతీయులే కనిపెట్టారు!'

ఇంటర్నెట్‌ను కనిపెట్టింది పాశ్చాత్య దేశాలు కాదనీ, భారతీయులే ఇంటర్నెట్ ఆవిష్కర్తలని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ అన్నారు.

"అంటే... ఆ కాలంలో టెక్నాలజీ వాడకంలో ఉందని అర్థం. మధ్యలో ఏం జరిగింది, ఏం జరగలేదు... చాలా విషయాలు మారిపోయాయి. కానీ ఆ కాలంలోనే మన దేశంలో టెక్నాలజీ ఉండేది. దీనిని తొలిసారి కనిపెట్టింది మీరు కాదు, ఈ దేశంలో లక్షల ఏళ్ల క్రితమే వీటన్నింటినీ కనిపెట్టారు" అంటూ బిప్లవ్ కుమార్ ప్రసంగం సాగింది.

ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రసంగంపై సోషల్ మీడియాలో పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక ఫేస్‌బుక్ యూజర్ దీన్ని ఈ శతాబ్దపు బ్రేకింగ్ న్యూస్‌గా అభివర్ణించాడు.

"ఈ శతాబ్దపు బ్రేకింగ్ న్యూస్: ఇంటర్నెట్, శాటిలైట్ ఆవిష్కరణలు ఈ కాలంలో జరిగినవి కాదు. లక్షలాది ఏళ్ల క్రితమే, మహాభారత కాలంలోనే ఇవన్నీ ఉన్నాయి: బిప్లవ్ దేవ్" అని ఇబే గునా కామెంట్ రాశారు.

మరో యూజర్ ఫరీద్ ఉవాచ్ ఫేస్‌బుక్‌పై, "మహాభారత కాలంలోనే ఇంటర్నెట్ ఉండేది. దీనిని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ ధ్రువీకరించారు" అని రాశారు.

బిప్లవ్ కుమార్ దేవ్ గత నెలలోనే త్రిపుర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బిప్లవ్ తన నాయకత్వంలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు.

రాష్ట్రంలో 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి ఆయన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

గోమోతి జిల్లా, ఉదయ్‌పూర్‌లోని కాకరాబన్‌లో 1971లో జన్మించిన బిప్లవ్ కుమార్ దేవ్ సుదీర్ఘ కాలంగా ఆర్ఎస్ఎస్‌లో ఉన్నారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)