పవన్ కుమార్ చామ్లింగ్: దేశంలో అత్యంత సుదీర్ఘ కాలం సీఎంగా ఉన్న నేత

  • 8 ఆగస్టు 2018
జ్యోతిబసు రికార్డును పవన్ కుమార్ చామ్లింగ్ అధిగమిస్తున్నారు Image copyright Getty Images
చిత్రం శీర్షిక జ్యోతిబసు రికార్డును పవన్ కుమార్ చామ్లింగ్ అధిగమిస్తున్నారు

భారతదేశ రాజకీయ చరిత్రలోనే అరుదైన రికార్డు చెరిగిపోయింది.

23 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన పశ్చిమ్‌బంగ మాజీ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును మరో సీఎం అధిగమించారు.

పశ్చిమ్ ‌బంగకు పొరుగునే ఉన్న సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కుమార్ ఆ ఘనత సాధించారు.

అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పీఠంపై ఉన్న ప్రభుత్వాధినేతగా ఏప్రిల్ 29న ఆయన ఈ సరికొత్త రికార్డు సృష్టించారు.

మరోవైపు తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కూడా 5 వేర్వేరు సార్లు సీఎంగా పనిచేసి మొత్తంగా 6,863 రోజులు అధికారంలో ఉన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జ్యోతిబసు

అది జ్యోతిబసు శకం

పశ్చిమ్ బంగ రాష్ట్రానికి జ్యోతి బసు 8,540 రోజులు అంటే 23 ఏళ్ల 4 నెలల 17 రోజుల పాటు వరుసగా ముఖ్యమంత్రిగా సేవలందించారు.

1977 జూన్ 21న పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన 2000 సంవత్సరం నవంబరు 5 వరకు ఆ పదవిలో ఉన్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ-మార్క్సిస్ట్ (సీపీఎం)కు చెందిన ఆయన వరుసగా 5 పర్యాయాలు సీఎంగా పనిచేశారు.

అయిదో విడత పదవీ కాలం ముగియడానికి ముందే ముఖ్యమంత్రి స్థానం నుంచి వైదొలిగారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పవన్ కుమార్ చామ్లింగ్

పవన్ కుమార్ చామ్లింగ్

జ్యోతిబసు రికార్డు బద్దలుగొడుతున్న సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ కూడా ప్రస్తుతం అయిదోసారి ఆ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు.

తొలిసారి 1994 డిసెంబరు 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ 'సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్' నేత అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు.

1999, 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌ను విజయపథాన నిలిపి తానే సీఎం అయ్యారు.

తాను సీఎం కావడానికి ముందు సిక్కిం సంగ్రామ పరిషత్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చామ్లింగ్ ఆ తరువాత 1993లో సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్‌ను స్థాపించారు.

మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో తన పార్టీ అత్యధిక సీట్లు సాధించడంతో తొలిసారి సీఎం అయ్యారు. 2009లో అయితే రాష్ట్రంలోని మొత్తం 32 అసెంబ్లీ సీట్లనూ చామ్లింగ్ పార్టీయే గెలుచుకుంది. అది కూడా ఒక రికార్డే.

సాహితీకారుడిగా..

2018 ఏప్రిల్ 28తో ఆయన 8540 రోజుల పాలన పూర్తిచేసుకుని జ్యోతిబసు రికార్డును సమం చేయనున్నారు. ఏప్రిల్ 29న జ్యోతిబసు రికార్డును అధిగమిస్తున్నారు.

రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా కనిపించే చామ్లింగ్ సాహితీరంగంలోనూ చెరగని ముద్ర వేశారు.

ఎక్కువగా నేపాలీ భాషలో కవిత్వం రాసే ఆయన మొత్తం 17 పుస్తకాలు రాశారు. వీటిలో చాలావరకు కవితా సంకలనాలు.

సిక్కిం ప్రగతికి సంబంధించి తన దార్శనికతను చాటుకునేలా వివిధ సందర్భాల్లో తాను చేసిన ఉపన్యాసాలకూ పుస్తక రూపమిచ్చారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక నవీన్ పట్నాయక్

ముఖ్యమంత్రులుగా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న మరికొందరు ..

ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా పదవిలో ఉన్నవారిలో మిజోరాం సీఎం లాల్ తన్హావాలా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు.. పవన్ కుమార్ చామ్లింగ్ తరువాత స్థానాల్లో ఉన్నారు.

నవీన్ పట్నాయక్ 2000 సంవత్సరం మార్చి 5న తొలిసారి సీఎం పదవి చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలిచి గత 18 ఏళ్లుగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు. పవన్ కుమార్ రికార్డు స్థాపించే ఏప్రిల్ 28, 2018 నాటికి నవీన్ 6,628 రోజుల పాలన పూర్తిచేసుకుంటారు.

లాల్ తన్హావాలా ఏప్రిల్ 28 నాటికి 7,824 రోజులు పాలన పూర్తి చేసుకుంటారు. అయితే, 1984 మే 5న తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఆయనకు వరుస విజయాలు దక్కలేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మాణిక్ సర్కార్

ప్రస్తుతం పదవిలో లేనివారిలో..

  • అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గెగాంగ్ అపాంగ్ రెండు విడతల్లో మొత్తం 8286 రోజులు సీఎంగా ఉన్నారు.
  • త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ తొలిసారి 1998 మార్చి 11న పదవి చేపట్టి 2018 మార్చి 8 వరకు వరుస విజయాలతో సీఎంగా ఉన్నారు. ఆయన మొత్తం 7,304 రోజులు పదవిలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు