ప్రెస్‌రివ్యూ: ముఖ్యమంత్రి అంటే మామూలు ఉద్యోగం కాదు - మహేశ్‌బాబు

  • 19 ఏప్రిల్ 2018
Image copyright BharatAneNenu/facebook

‘‘అది మామూలు ఉద్యోగం కాదు. పెద్ద కాన్వాయ్‌తో, జెడ్‌ కేటగిరీ రక్షణ మధ్య తిరగడం ఒక్కటే కాదు. ఒక రాష్ట్రాన్ని కాపాడుకొనే ఓ గొప్ప బాధ్యత’’ అని సినీ నటుడు మహేశ్‌బాబు అభిప్రాయపడినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.

మహేశ్ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఆయన మాట్లాడినట్లు ‘ఈనాడు’ పేర్కొంది. ఆ కథనం ప్రకారం... ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా నటించినప్పటికీ రాజకీయాలకూ తనకూ సంబంధం లేదని మహేశ్ చెప్పారు. తన జీవితమంతా సినిమాలకే అంకితమన్నారు. అయితే సినిమా చేస్తున్నపుడు రాజకీయాల మీద ఒక అవగాహన ఏర్పడిందన్నారు.

సినిమాలో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాల వంటివేవీ ఉండవని మహేశ్ చెప్పారు. ‘‘నాయకులంతా కూడా ఈ సినిమా చూసేలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా ఉంటుందీ చిత్రం. దర్శకుడు కొరటాల శివ ఏ కథ చేసినా... మాస్‌ అంశాల్ని మాత్రం వదిలిపెట్టరు. కానీ ఈ సినిమా విషయంలో ఒక ముఖ్యమంత్రి ఎలా ఫైట్లు చేస్తాడు? ఎలా డ్యాన్సులు చేస్తాడు? అనే సందేహాలు వస్తుండొచ్చు. కానీ అదే ఈ సినిమాకి అసలైన కథ, అదే ఈ సినిమా ప్రత్యేకత’’ అని వివరించారు.

తన నటన మీద తన తండ్రి సీనియర్ నటుడు కృష్ణ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ‘‘నాన్న నటించిన ప్రతి సినిమానీ చూస్తుంటాను. 'ఈనాడు' సినిమా పదిసార్లు చూసుంటాను ఇప్పటికి. ఆయన్ని అనుకరించాలనుకోను కానీ... మాటల పరంగానో, నటనలోనూ అనుకోకుండా ఆయన శైలి కనెక్ట్‌ అవుతుంటుంది. 'భరత్‌ అనే నేను'పైనా నాన్న ప్రభావం చాలా ఉంది’’ అని మహేశ్ తెలిపారు.

‘‘ఇక ప్రయోగాలు చేసే ఓపిక పోయింది. చాలా అలసిపోయాను. నాన్నగారి అభిమానులంతా ఇంటికొచ్చి కొట్టేలా ఉన్నారు. ఇకపైన అభిమానుల్ని అలరించే వాణిజ్య ప్రధానమైన సినిమాలే చేస్తా’’ అని మహేశ్ నవ్వుతూ వ్యాఖ్యానించినట్లు ‘ఈనాడు’ కథనం పేర్కొంది.

Image copyright NAra chandrababu naidu / Facebook

అమరావతి నిర్మాణ వ్యయం రూ. 51,000 కోట్లు

కేంద్రం సహకరించడం లేదని, రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు నిలిచిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని, అవేమీ నిజం కాదని రాజధాని నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్లు ‘ప్రజాశక్తి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

అమరావతి అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక మంత్రి నారాయణతో కలిసి బుధవారం సచివాలయంలో సమీక్షించారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం తన మాటను నిలబెట్టుకోకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయన్నారు. రానున్న 18 ఏళ్ళ కాలాన్నీ దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక ప్రణాళికను ఈ సమావేశంలో ఆమోదించారు.

అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం రూ. 23,294 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 48,115 కోట్లు అవసరమని అంచనా వేసినట్లు సిఆర్‌డిఎ అధికారులు సీఎంకు వివరించారు. ఈ నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుండి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి మొత్తం అంచనా వ్యయం రూ. 51 వేల కోట్లు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

ఇందులో రూ. 38,590 కోట్ల మేర హడ్కో, వరల్డ్‌ బ్యాంక్‌ వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకోవడానికి అవకాశం ఉందని అధికారులు వివరించారు. కీలక రాజధాని ప్రాంతంలోగల 5,020 ఎకరాల భూమిని ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచి దాని ద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. మరో నాలుగేళ్ళలో సిఆర్‌డిఎ సొంత ఆదాయ మార్గాలలో స్వయంగా నిధులను సమకూర్చుకునే స్థాయికి ఎదగగలదని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పరిపాలన నగరం అభివృద్ధిని ప్రత్యేకంగా పరిగణించి దానికోసం విడిగా నిధుల ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు సూచించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సిఆర్‌డిఎ అధికారులు పనుల తీరును సీఎంకు వివరిస్తూ మౌలిక సదుపాయాల కోసం మొత్తం 1,945 ఎకరాలు భూసేకరణ చేస్తున్నామని, పెనుమాక గ్రామంలోనే 540 ఎకరాల మేర భూసేకరణ జరపాల్సి ఉంటుందని తెలిపారు. నవంబరు నెలాఖరుకు తమ ప్యాకేజి పనులన్నీ పూర్తి కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయని సంస్థలను పక్కన పెట్టాల్సివస్తుందని అన్నారు. ఈ సమీక్షలో పరిపాలన నగరం అభివృద్ధి పనులను కమీషనర్‌ శ్రీధర్‌ ముఖ్యమంత్రికి వివరించారు.

Image copyright Janasena Party / Facebook

ఈ గన్‌మెన్‌ నాకొద్దు: వెనక్కి పంపేసిన పవన్‌కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తన భద్రతకు నియమించిన నలుగురు గన్‌మెన్‌ను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెనక్కి పంపేశారని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ప్రభుత్వం వారిద్వారా తనపై నిఘాపెట్టిందని.. తన కదలికలను ఎప్పటికప్పుడు కూపీలాగుతోందని ఆయన అనుమానిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

గత నెల 14న జరిగిన జనసేన ఆవిర్భావ సభ సమయంలో తనకు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీకి ఆయన లేఖ రాశారు. దరిమిలా ఆయనకు ప్రభుత్వం 2 + 2 తరహా భద్రత కల్పించింది.

పవన్‌ ఎక్కడకు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో.. రాజకీయంగా ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో ఎప్పటికప్పుడు సదరు గన్‌మెన్‌ ప్రభుత్వానికి చేరవేస్తున్నారని ఆయన విశ్వసిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Image copyright Getty Images

టీవీలో మీరేం చూస్తున్నారో కేంద్రానికి తెలిసిపోతుంది!

మనం ఇంట్లో కూర్చొని ఏ ఛానల్‌ చూస్తున్నాం? వ్యక్తిగతంగా మన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఇష్టా యిష్టాలు ఏంటి? అన్నవి ఇకపై బహిర్గతం కానున్నాయని ‘నవ తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. కొత్త టెలివిజన్‌లకు కంప్యూటర్‌ చిప్‌తో కూడిన సెట్‌ టాప్‌ బాక్సుల్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సిద్ధం చేసిందని ఢిల్లీలోని ఉన్నత స్థాయి అధికారులు మీడియాకు వెల్లడించారు. చిప్‌ ఆధారిత సెట్‌ బాక్సులు ఎందుకు? అంటే.. టీవీ వీక్షకులు ఎలాంటి కార్యక్రమాల్ని చూస్తున్నారన్నది తెలుసుకోవటం కోసం, ఏ కార్యక్రమాన్ని, ఎలాంటి కార్యక్రమాన్ని.. ఎంతసేపు చూశారు? అనే సమాచార సేకరణ కోసమే తీసుకొస్తున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.

బ్రాడ్‌కాస్టింగ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ రంగాన్ని 'బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌' (బీఏఆర్‌సీ), ఇండియా సంస్థ ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతోందని, ఈ సంస్థ ఇచ్చే టీవీ రేటింగ్స్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకునే పరిస్థితి నేడు ఉందని, దీనిని పోగొట్టేందుకు టీవీ వీక్షకుల సమాచారాన్ని పక్కాగా సేకరించాలన్న ఉద్దేశంతో ఉన్నామని కేంద్రం తెలుపుతోంది.

కంప్యూటర్‌ చిప్‌ ఆధారిత సెట్‌ టాప్‌ బాక్సు బిగించిన ఇంట్లో ఎవరు, ఏ ఏ కార్యక్రమాల్ని చూశారన్న సమాచారం ప్రసార కేంద్రానికి (బ్రాడ్‌కాస్టింగ్‌ సెంటర్‌)కు చేరుతుంది. ఇకపై చిప్‌ ఆధారిత సెట్‌ టాప్‌ బాక్సుల్ని మాత్రమే బిగించాలని డీటీహెచ్‌ ఆపరేటర్లమీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే అవకాశముంది. రాజకీయ పార్టీలు ఈ సమాచారాన్ని తమ ప్రయోజనాలకు వాడుకునే ప్రమాదముందని ‘నవ తెలంగాణ’ కథనం వ్యాఖ్యానించింది.

సుప్రీంకోర్టు Image copyright Getty Images

‘అన్నింటికీ ఆధార్’తో గోప్యతకు ముప్పు: సుప్రీంకోర్టు ఆందోళన

పౌరుల దైనందిన కార్యకలాపాలన్నింటికీ బయోమెట్రిక్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తే ఆ సమాచారం దుర్వినియోగమయ్యే ముప్పు ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసినట్లు ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

‘సాక్షి’ కథనం ప్రకారం.. ఆధార్‌ చట్టబద్ధతపై బుధవారం జరిగిన విచారణలో గోప్యతా ఉల్లంఘనపై రాజ్యాంగ ధర్మాసనం పలు సందేహాలను లేవనెత్తింది. ప్రతి లావాదేవీకి బయోమెట్రిక్‌ ధ్రువీకరణను తప్పనిసరిచేయడం.. వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించడానికి దారితీస్తుందని, తరువాత అది దుర్వినియోగమయ్యేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది.

'కేవలం వేలిముద్రల వల్ల ఎలాంటి వివరాలు తెలియవు. కానీ ఆ సమాచారాన్ని ఇతర వివరాలతో కలిపితే అదొక సమాచార నిధిగా మారుతుంది. అది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే తగిన రక్షణ వ్యవస్థ అవసరం' అని బెంచ్‌ వ్యాఖ్యానించింది.

యూఐడీఏఐ తరఫున హాజరైన లాయర్‌ రాకేశ్‌ ద్వివేది జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. చాలా సందర్భాల్లో ధ్రువీకరణ ఒకసారే జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు పాన్, మొబైల్‌ సిమ్‌ కొనుగోలును ఉదహరించారు. ఇప్పటికైతే ఆధార్‌ సమాచారాన్ని సంగ్రహించేందుకు అవకాశాలు లేవని, ఒకవేళ భవిష్యత్తులో ఆ పరిస్థితే తలెత్తితే కోర్టు జోక్యం చేసుకోవాలని అన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్: పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత పౌరుడి కేసులో నేడు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు... ఇప్పటివరకూ ఏం జరిగింది

బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా

ప్రెస్‌ రివ్యూ: ‘కాపులు బీసీలా.. ఓసీలా చంద్రబాబే చెప్పాలి’

ముంబయి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 10 మంది మృతి

ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్‌ల దారిలోనే వెళ్తున్నాడా

"ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" విశ్వభూషణ్ హరిచందన్

కేరళ వరదలు: ఈ వానాకాలాన్ని దాటేదెలా? గత ఏడాది విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుందా...

ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది