అభిప్రాయం: ‘నరేంద్ర మోదీ గంటల కొద్దీ తన గొప్పలు చెప్పి.. చివర్లో సన్యాసిని అంటారు’

  • 19 ఏప్రిల్ 2018
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Image copyright Getty Images

నరేంద్ర మోదీ గొప్ప షో మ్యాన్. బ్రిటన్ రాజధాని నగరం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ సెంట్రల్ హాలులో రెండు గంటల ఇరవై నిమిషాల పాటు జరిగిన ‘భారత్ కీ బాత్, సబ్‌కే సాత్‌’ కార్యక్రమంలో ఆయన అత్యద్భుతమైన రీతిలో తన చిట్టాను అప్పజెప్పారు. ఇదంతా చూస్తే.. మొత్తం కార్యక్రమం స్క్రిప్ట్ ప్రకారం నడిచిందనిపించింది.

షోలో ప్రతి ఒక్కటీ.. ఏమేం రావాలి? ప్రశ్నలు ఏముంటాయి? ఆయన ఏం సమాధానం ఇస్తారు? అనేవి ముందే నిర్ణయించినట్లు కనిపించింది. వివేకం ఉన్న ఎవరైనా ఇదంతా గమనించగలరు.

షోలో మోదీని ఇంటర్వ్యూ చేస్తోంది.. పాటల రచయిత ప్రసూన్ జోషి. ఆయన కూడ గొప్ప పాత్ర పోషించారు. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే.. అవి నరేంద్ర మోదీని బాగా అలరించాయి. ఆయన బాగా ఆనందించారు.

ఈ షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రిపోర్ట్ కార్డును ప్రవేశపెట్టారు. అందులో చాలా విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా పాకిస్తాన్‌ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు. బహుశా వాటిని తొలిసారి మనం విన్నాం.

Image copyright TWITTER/BJP4Delhi/BBC

నరేంద్ర మోదీ.. మాచో మ్యాన్

తన మాటల్లో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి కూడా మోదీ దృష్టి సారించారు. కర్నాటక లింగాయత్‌ల తత్వవేత్త బసవణ్ణను కూడా ఆయన ప్రస్తావించారు. బసవణ్ణ మరణం వరకూ కూడా మోదీ వెళ్లారు. కర్నాటకలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. త్వరలో అక్కడ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

ప్రధాని నరేంద్ర మోదీ మాచో మ్యాన్ (పురుషాహంకారి)లాగా మాట్లాడతారు. ఎలాగంటే.. దబంగ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ మాట్లాడినట్లు.

షోలో ఆయన కొన్ని మాటలు చెప్పారు. అవి విన్నప్పుడు ఎలా అనిపించిందంటే.. ‘ఆహా, మోదీ ఎంత బాగా పనిచేశారు’ అని. కానీ, విశ్లేషకులు చెప్పేది మాత్రం మరోలా ఉంది. అదేమంటే.. పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశం ఇప్పుడు ఎంతగా బలహీనమయ్యిందంటే.. గతంలో ఎన్నడూ లేనంతగా.

దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయింది. కాశ్మీర్‌లో హింస కూడా పెరిగింది. నివేదికల ప్రకారం.. సర్జికల్ స్ట్రైక్స్‌కు ముందు, తర్వాత కూడా అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. కానీ, నరేంద్ర మోదీ తన మాటల్లో మాత్రం ‘పాకిస్తాన్ వచ్చి భారత్ ముందు మోకరిల్లింది’ అన్నట్లుగా చెప్పుకొచ్చారు.

Image copyright Getty Images

తన ప్రతి పనినీ ‘ప్రత్యేకంగా’ చెప్పుకునే ప్రధానమంత్రి

దేశంలో అత్యాచార ఘటనలపై ప్రధానమంత్రి తన మౌనం వీడారు, కానీ ఎన్ని రోజుల తర్వాత? చిన్న చిన్న విషయాలపై కూడా ప్రధాని మోదీ వెంటనే ట్వీట్లు చేస్తారు. కానీ, దేశాన్ని కదిలించే అత్యాచార ఘటనలపై మాత్రం చాలా రోజుల పాటు ఆయన నోరు మెదపలేదు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నరేంద్ర మోదీ ప్రతి విషయాన్నీ మొట్టమొదటిసారి చేసిన పనిగా చెబుతారు. అరబ్, ఇజ్రాయెల్ పర్యటనల్ని కూడా ఆయన ఇలాగే బాగా ప్రచారం చేశారు.

తన ప్రసంగాలను ఆయన హెచ్చుతగ్గులతో చాలా రసవత్తరంగా రక్తికట్టిస్తారు. ఎదుటివాళ్లు ఎంతటి విమర్శకులైనా సరే.. ఆయన చెప్పే విషయాలను మాత్రం అలా వింటూనే ఉంటారు.

బహుశా.. ఇంత స్పష్టంగా మరే ప్రధానీ తననుతాను ప్రశంసించుకుని, ప్రతి పనినీ ప్రత్యేకంగా చెప్పుకుని ఉండరేమో. లండన్ షోలో ప్రతి ప్రశ్నా మోదీని ప్రశంసిస్తూనే ఉంది.

ఎవరైతే ప్రశ్నలు సంధిస్తున్నారో వారు కూడా ముందుగానే నిర్ణయించబడినట్లున్నారు. షోలో ప్రతి ఒక్కరూ మోదీని కీర్తిస్తోంటే బయటేమో ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శన జరుగుతోంది.

తన పేరును వందలసార్లు చెప్పుకుంటారు

ఈ మొత్తం కార్యక్రమం ద్వారా ఆయన తన ఖ్యాతిని పెంచుకున్నారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. అన్ని గంటలపాటు మోదీ, తనగురించి తానే మాట్లాడుకున్నారు.

ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే విషయం.. ‘థర్డ్ పర్సన్’లో తననితాను పెట్టుకుని ఆయన మాట్లాడటం. తన పేరును వందలసార్లు చెప్పుకుంటారు. తన ప్రశంసలతో ఆయన వంతెనలు కట్టేస్తారు. చివర్లోనేమో తానొక సాధారణ మానవుడినని, టీ అమ్ముకునేవాడినని, తనది ఒక సన్యాసి తత్వం అని చెబుతారు.

మరి ఆయన నిజంగానే ఒక సాధారణ మానవుడైతే.. తన గురించి తానే గంటలకొద్దీ గొప్పలు ఎలా చెప్పుకుంటారు? అన్న ప్రశ్న తలెత్తుతుంది.

Image copyright Getty Images

నరేంద్ర మోదీ ‘సిగ్గు.. సిగ్గు’

ఈ కార్యక్రమం కోసం ఆయన మద్దతుదారులు ఎంతమంది వచ్చారో, అంతమంది ఆయన్ను వ్యతిరేకించేవారు కూడా అంతమంది వచ్చారు. ఈ వ్యతిరేకుల్లో మహిళలు కూడా ఉన్నారు. వీరంతా అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా, శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆ క్రమంలో నరేంద్ర మోదీ ‘సిగ్గు.. సిగ్గు’ అంటూ నినాదాలు ఇచ్చారు.

దేశంలో జరిగిన అత్యాచారాల వంటి దుశ్చర్యల గురించి మాట్లాడేందుకు ఆయన లండన్‌ (విదేశీ గడ్డ)ను ఎంచుకున్నారు. దేశంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అది తానే చేసినట్లు, అంతకు ముందు ఏమీ జరగనట్లు ఆయన చెప్పుకున్నారు.

విదేశాల్లో భారతదేశ కీర్తిని పెంచుతానని ఆయన హామీ ఇస్తుంటారు. కానీ, వాస్తవం ఏంటంటే.. ఆయన మాటలతో దేశ ప్రతిష్ఠ దిగజారుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)