ఐపీఎల్: అభిమానుల కోసం చెన్నై నుంచి పుణెకు 'సూపర్‌కింగ్స్' ఉచిత రైలు

  • 20 ఏప్రిల్ 2018
చెన్నై సూపర్‌కింగ్స్ అభిమానులు Image copyright Chennai SuperKings

వెయ్యి మందికి పైగా అభిమానులను చెన్నై నుంచి పుణెకు ఉచితంగా తీసుకెళ్లేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ 'చెన్నై సూపర్‌కింగ్స్' ఏకంగా ప్రత్యేక రైలునే ఏర్పాటు చేసింది.

తమిళనాడులోని చెన్నై, మహారాష్ట్రలోని పుణె మధ్య దూరం వెయ్యి కిలోమీటర్లపైనే. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు సొంత గడ్డ చెన్నై. అయితే ఈ జట్టు చెన్నైలో ఆడాల్సిన మ్యాచులను కావేరీ జలాల పంపిణీ వివాదం నేపథ్యంలో భద్రతా కారణాలతో నిర్వాహకులు పుణెకు మార్చారు.

శుక్రవారం పుణెలో రాజస్థాన్ రాయల్స్‌తో తాము ఆడబోయే మ్యాచ్‌కు 'చెన్నై సూపర్‌కింగ్స్ ఫాన్స్ క్లబ్‌' సభ్యులను తీసుకెళ్లేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ ఈ రైలును ఏర్పాటు చేసింది. 'విజిల్ పోడు ఎక్స్‌ప్రెస్' అని దీనికి పేరు పెట్టింది.

ఈ రైలు గురువారం చెన్నైలో బయల్దేరింది. ఈ అభిమానులకు చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం మ్యాచ్ టికెట్లతోపాటు పుణెలో ఆహారం, వసతి కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తోంది.

పుణెలో మ్యాచ్ చూసే అవకాశం కల్పించాలని అభిమానులు తమను కోరారని, వారు చూపే అభిమానానికి బదులుగా తమ వంతుగా ఈ ఏర్పాట్లు చేస్తున్నామని చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) కాశీ విశ్వనాథన్ క్రిక్‌ఇన్‌ఫో వెబ్‌సైట్‌తో చెప్పారు.

పుణెలో చెన్నై సూపర్‌కింగ్స్ ఆడే ప్రతి మ్యాచుకు ఇలా రైలు, ఇతరత్రా ఏర్పాట్లు చేయడం కష్టమని ఆయన తెలిపారు. శుక్రవారం మ్యాచ్‌కు వారి కోసం చేస్తున్న ప్రయత్నాలను విశ్లేషించుకొని, ఇతర మ్యాచులకు ఏర్పాట్ల గురించి ఆలోచిస్తామని చెప్పారు.

Image copyright Chennai SuperKings
Image copyright Chennai SuperKings

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)