ప్రెస్‌రివ్యూ: చంద్రబాబు దీక్ష వేదిక వద్దకు లక్షమంది.. వేసవి తాపానికి ఎయిర్ కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు

 • 20 ఏప్రిల్ 2018
చంద్రబాబు నాయుడు దీక్ష Image copyright tdp.ncbn.official/facebook

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది.

ముఖ్యమంత్రి దీక్ష శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దీక్ష సాగనుంది అని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం..

 • ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ సంఘాల ప్రతినిధులు సహా మొత్తం 200 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు.
 • వేదిక ముందు భాగాన 10 వేల మంది కూర్చునే విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పదివేల కుర్చీలు వేశారు.
 • ముందు భాగాన డీ సర్కిల్‌లో సందర్శకులు సీఎం వద్దకు వచ్చి పలుకరించి వెళ్లడానికి వీలుగా ప్రత్యేక క్యూను ఏర్పాటు చేస్తున్నారు.
 • చంద్రబాబు 12 గంటల సమయం పాటు అంటే 720 నిమిషాలు దీక్షలో ఉంటారు. దీక్ష ముగిశాక ఆయన ప్రసంగిస్తారు.
 • ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పదేసి నిమిషాల చొప్పున మాట్లాడతారు.
 • లక్ష మంది ప్రజలు దీక్షకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
 • సెషన్ల వారీగా కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు ప్రజలు గ్యాలరీల్లో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు.
 • వేదికపై ఉన్న వారు అందరికీ స్పష్టంగా కనిపించడం కోసం ప్రతి గ్యాలరీలోనూ ఒక ఎల్‌ఈడీ స్ర్కీన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
 • అమరావతికి భూమి ఇచ్చిన రైతులు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వసతిగృహాల విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రజలు, ఉద్యోగ వర్గాలు, మహిళలు పెద్దఎత్తున హాజరవుతారని భావిస్తున్నారు.
 • వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్యాలరీలలో ఎయిర్‌ కూలర్లు ఏర్పాటు చేశారు.
 • గ్యాలరీల్లో కూర్చున్న వారికి మంచినీళ్ల బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తారు.
 • స్టేడియం బయట ఉన్న వారికి అల్పాహారంగా ఒక బిస్కెట్‌ ప్యాకెట్‌, కేకు, ఫ్రూటీ ప్యాకెట్‌ను అందిస్తారు. స్టేడియం లోపల ఎలాంటి తినుబండారాలకు అనుమతించరు.
 • భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. స్టేడియం లోపల, బయట అడుగడుగునా సీసీ కెమేరాలు అమర్చారు. ఏర్పాట్ల సమీక్షకు కృష్ణా జిల్లా యంత్రాంగం కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
Image copyright Getty Images

టైమ్‌లో కొహ్లీ, దీపికా పడుకోణ్.. మోదీకి దక్కని చోటు

టైమ్ మ్యాగజీన్ 2018 జాబితాలో విరాట్ కొహ్లీ, దీపికా పడుకోణ్‌లకు స్థానం దక్కిందని, జాబితాలో భారత ప్రధాని మోదీకి స్థానం దక్కలేదంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..

ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజీన్‌ 2018 సంవత్సరానికి 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ నటి దీపికా పడుకోణ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ చోటు దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా టైమ్‌ జాబితాలో చోటుదక్కించుకున్నవారి ప్రొఫైల్స్‌ను ఆయా రంగాల్లో ప్రముఖులైన వ్యక్తులు రాశారు. కాగా, టైమ్‌ ప్రాబబుల్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పరిశీలనకు వచ్చినప్పటికీ.. ఆయనకు తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రొఫైల్‌ను మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రాస్తూ.. '2008 లో అండర్‌ - 19 ప్రపంచకప్‌కు నేతృత్వం వహిస్తున్న కోహ్లీని తొలిసారి చూశాను. ఈరోజు విరాట్‌ కోహ్లీ అనే పేరు ప్రతి ఇంట్లో సుపరిచితమైపోయింది అన్నారు.

Image copyright Getty Images

కరవు కాలం

కరవుబారిన పడిన ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పరిస్థితులను చూసి కదిలిపోయిందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

గురువారం చంద్రబాబుతో సమావేశమైన కరవు బృందం.. తాగునీరు, పశుగ్రాస సమస్యలు అధికంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

భూగర్భజలం అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి.. తాగడానికి నీరు లేదు.. పశువులకూ మేత కరవైంది... పండ్లతోటలు ఎండుముఖం పట్టాయి.. ఈశాన్య రుతుపవనాల సమయంలో 311.7 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 177.5 మి.మీ. మాత్రమే నమోదైంది.

సాధారణం కంటే 43.1శాతం తగ్గింది. దీంతో ప్రకాశం, నెల్లూరు, కడప, అనంతపురం, విజయనగరంలో ప్రభుత్వం 121 కరవు మండలాలను ప్రకటించింది.

కరవు ప్రభావం పశువులపై తీవ్రంగా పడిందని రైతులు కేంద్ర బృందం ముందు ఆవేదనచెందారు. మేత కూడా లేక కబేళాకు తరలించామని వివరించారు. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు ఇచ్చినా నీరు అందుబాటులో లేకపోవడంతో గడ్డి పెంచుకునే వీలు లేదన్నారు.

తాగునీటికి తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, ఇళ్లలో వేసుకున్న బోర్లు ఎండిపోయాయని ప్రజలు ఈ బృందానికి వివరించారు. వాడకం నీటిని కూడా అయిదు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని వివరించారు.

అనంతపురం, కడప జిల్లాల్లో 1,500 అడుగుల లోతులో బోర్లు వేసినా నీటి జాడ దొరకడం లేదు. ప్రభుత్వం సరఫరా చేసే నీరు చాలీచాలకుండా ఉందని ఈనాడు కథనం

Image copyright facebook/CPI(M)

సీపీఎం మహాసభలు

సీపీఎం 22వ జాతీయ మహాసభలు గురువారంనాడు ప్రారంభమైన నేపథ్యంలో నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో..

అంతర్గత ప్రజాస్వామ్యం మాకున్న గొప్ప బలమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడంపై తమకు ఏకాభిప్రాయం ఉందని, రాజకీయంగా దీన్ని ఎలా సాధించాలనే అంశంపై 22వ అఖిలభారత మహాసభలో విస్తృత చర్చ జరుగుతున్నదని స్పష్టం చేశారు.

మహాసభల్లో రెండు రకాల తీర్మానాలు ప్రవేశపెట్టలేదని, ఒకే తీర్మానం...రెండు రకాల అభిప్రాయాలు మాత్రమే మహాసభ ముందు ఉంచామని తెలిపారు.

మహాసభలో రెండు రోజుల చర్చల వివరాలను గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియా గోష్టిలో వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారానే నడుస్తోందని. దేశానికి కావల్సింది నేతలు కాదని, నీతి కావాలని చెప్పారు.

పాలకవర్గ పార్టీల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను పెట్టగలిగేది వామపక్ష పార్టీలు మాత్రమేనని, వాటి ఐక్యతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో తాము పోటీచేయని నియోజకవర్గాల్లో బీజేపీని ఓడించాలని అక్కడి ఓటర్లకు చెబుతున్నామని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారని నవతెలంగాణ పత్రిక కథనం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)