'మీకు ఏపీపై ఎందుకింత కక్ష?': చంద్రబాబు

  • 20 ఏప్రిల్ 2018
చంద్రబాబు Image copyright facebook.com/pg/TDP.Official

పుట్టిన రోజున నిరసన దీక్ష చేయాల్సి వస్తుందని తాను ఏనాడు అనుకోలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్ని కష్టాలొచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం వెనకడుగు వేయనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు.

శుక్రవారం చంద్రబాబు తన పుట్టినరోజున విజయవాడలో 'ధర్మపోరాట దీక్ష' పేరుతో నిరాహార దీక్ష చేశారు. సాయంత్రం దీక్ష విరమించిన తర్వాత ఆయన ప్రసంగించారు. ''ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నాను. రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేలా చూడటం నా బాధ్యత. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల తరఫున ఈ దీక్ష చేశాను'' అని చెప్పారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు చంద్రబాబు మాటల్లోనే..

''నేను స్వార్థం కోసం ఏదీ అడగట్లేదు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.

కేంద్రాన్ని వదిలిపెట్టొద్దు. మన అభివృద్ధి ఆగకూడదు. మన అభివృద్ధి ఆగిపోతే కేంద్రం ఆనందపడుతుంది.

మనం కూడా ఈ దేశంలో భాగం. పన్నులు కడుతున్నాం.

గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు తగ్గుతాయని తెలుసు. కానీ, కేంద్రంలో ఎన్డీయే వస్తుంది, మనకు సాయపడుతుంది అని వారితో పొత్తు పెట్టుకున్నాం.

ప్రత్యేక హోదా ఇస్తామని రాష్ట్ర విభజన అప్పుడు అప్పటి ప్రధాని (మన్మోహన్ సింగ్) హామీ ఇచ్చారు.

ఇప్పుడు కేంద్రాన్ని ఐదు కోట్ల మంది తరఫున, రాష్ట్రం తరఫున అడుగుతున్నాను.. విభజన చట్టంలోని అంశాలను, ప్రత్యేక హోదాను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా.

అమలు చేయరా? చేయకపోతే ఎందుకు చేయరని అడుగుతున్నాను.''

Image copyright facebook.com/pg/TDP.Official

''నాకు హైకమాండ్ లేదు. ప్రజలే నా హైకమాండ్. అడ్మినిష్ట్రేషన్‌లో మీ (నరేంద్ర మోదీ) కంటే నేను సీనియర్‌ను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అవకాశాలు వచ్చాయి కాబట్టి, నాకంటే తర్వాత వచ్చిన మోదీ ప్రధాని అయ్యారు. నేను 1995లో ముఖ్యమంత్రి అయితే, ఆయన 2002లో ముఖ్యమంత్రి అయ్యారు.

నేను ఇన్నాళ్లూ ప్రజల కోసమే ఓపిక పట్టాను. రాష్ట్రంలోని చాలా మంది పెద్దలు కావాలనే మాపై విమర్శలు చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి. కొంత మందికి ఈ ప్రాజెక్టు పూర్తికావడం ఇష్టం లేదు.

కానీ నా జీవిత ఆశయం పోలవరం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని పూర్తిచేస్తాను.

మీరు పటేల్ విగ్రహానికి రూ. 2,500 కోట్లు ఖర్చు పెడతారు. మా రాజధానికి రూ.1500 కోట్లు ఇస్తారా?

విభజన చట్టంలోని హామీలను ఎందుకు అమలు చేయరు?

మా ప్రజలు తప్పుచేయలేదు. మేం అసమర్థులం కాదు. అవసరమైతే మా రాష్ట్రాన్ని సొంతంగా నిర్మించుకునే సామర్థ్యం మాకుంది. చేసి చూపిస్తాం.

విశాఖ రైల్వే జోన్‌ను కావాలనే ఆలస్యం చేస్తున్నారు.

జాతీయ విద్యాసంస్థలను మీరు పూర్తి చేయాలంటే ఇంకో 30 ఏళ్లు పడుతుంది.

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కాగితాలకే పరిమితమైంది.

విజయవాడ, విశాఖ మెట్రోల విషయంలో కాలయాపన చేస్తున్నారు.

మీరు వైసీపీతో లాలూచీ పడి రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు.

తమిళనాడు తరహాలో ఏపీ ప్రభుత్వాన్ని చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నించారు. మేం ఒకరి చెప్పుచేతుల్లో ఉండబోమన్న విషయం తెలుసుకోవాలి.''

Image copyright Raju

''నాలుగు బడ్జెట్లలో రాష్ట్రానికి సాయం చేయలేదు. పోరాటం తప్ప మార్గం లేదన్న ఆలోచనతో ఈ పోరాటం చేస్తున్నాం.

40 ఏళ్లలో నేను ఎక్కడా రాజీపడలేదు. విలువలకు తిలోదకాలు ఇవ్వలేదు.

వెనుకబడిన జిల్లాలకు ఈ ఏడాది రూ.350 కోట్లు ఇచ్చారు. మేం పార్లమెంటులో గొడవ పెట్టుకున్న తర్వాత రిజర్వుబ్యాంకు ఇచ్చిన ఆ డబ్బును వెనక్కు తీసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు కూడా మీరు తీసుకున్నారు.

రాష్ట్రాలను బలహీనపరిచే చర్యలకు కేంద్రం పాల్పడితే సహించేది లేదు.

కేంద్రంలో ఉన్నాం కాబట్టి ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారు.

వైసీపీ, పవన్ కల్యాణ్‌తో లాలూచీ పడితే టీడీపీని అణచివేయొచ్చని మీరు అనుకుంటున్నారు. కానీ అది మీకు సాధ్యం కాదు.

మీకు నచ్చినట్టు చేస్తామంటే మా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోరు.

డబ్బులన్నీ సమర్థవంతంగా ఉపయోగించాం. 2029 నాటికి భారత్‌లో నం.1 రాజధానిగా అమరావతి ఉండాలని ప్రణాళిక వేసుకున్నాం.

పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే అందరూ మాకు మద్దతు ఇచ్చారు. ఏపీకీ న్యాయం చేయాలని పట్టుబట్టారు.

మీరు నన్ను ఇబ్బంది పెట్టలేరు. ఎవరు లాలూచీ పడుతున్నారో వాళ్లే ఫినిష్ అవుతారు.

దేశ ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోతోంది.

కఠువా, ఉన్నావ్ ఘటనలను ఏ విధంగా సమర్థించుకుంటారు? వీటిపై ప్రభుత్వానికి బాధ్యత ఉంది. గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది."

'చంద్రబాబు, జగన్ ఒక్కటే': డానీ

చంద్రబాబు ప్రసంగంపై సీనియర్ జర్నలిస్టు డానీ బీబీసీతో మాట్లాడుతూ- సమాధానాలు చెప్పడంలో చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్ష పెద్దగా ఏమీ ప్రభావం చూపదని అభిప్రాయపడ్డారు.

"చంద్రబాబు పుట్టినరోజున 12 గంటలు ఉపవాసం చేశారు. ఆయన దీక్ష రాజకీయంగా లేదు. ఒక లాంఛనంగా చేసినట్టు ఉంది. దాని ప్రభావం ఏమీ ఉండదు. వైసీపీ ఎంపీల దీక్ష కంటే పెద్దగా ఉంటే బాబు దీక్ష బాగుండేది. జగన్, చంద్రబాబు ఇద్దరూ దేనికీ సూటిగా సమాధానాలు చెప్పరు.కేంద్రం బాగా సహకరించిందని గతంలో చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. ప్రధాని మోదీని, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీనీ సన్మానించారు. వారినే ఇప్పుడు విమర్శిస్తున్నారు. అంటే పొగిడేది నేనే, విమర్శించేది నేనే అన్నట్టుగా ఉంది'' అని డానీ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు దీక్ష రాజకీయ జిమ్మిక్కు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఆంధ్రప్రదేశ్‌కు బీజేపీ శత్రువని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంతో ఎవరు జత కట్టినా ప్రజలు ఆగ్రహిస్తారు'' అని డానీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)