లబ్..డబ్బు: ఉద్యోగాల భవిష్యత్ ఏంటి? ఏం చేస్తే జాబ్ గ్యారెంటీ ఉంటుంది?

 • 21 ఏప్రిల్ 2018

రానున్న రోజుల్లో ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎటువంటి నైపుణ్యాలకు పెద్ద ఎత్తులో డిమాండ్ ఉండబోతోంది? ఏం చేస్తే ఉద్యోగాలు లేవంటున్న భారత్ దేశంలో అధిక ఉద్యోగావకాశాలు కలుగుతాయి?

ఈ సంవత్సరం రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి, అలాగే వచ్చే సంవత్సరం మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. చరిత్రలోకి తొంగి చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. అదేంటంటే.. ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నాలుగేళ్లలో రానన్ని ఉద్యోగావకాశాలు చివరిదైన ఐదవ సంవత్సరంలో వస్తాయి. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితేంటి?

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

దాదాపు తొమ్మిది శాతం యువకులకు ఈరోజు లేని కొత్త ఉద్యోగాలు రానున్న రోజుల్లో ఉండబోతున్నాయి. ఫిక్కీ, నాస్కామ్ సంస్థలు విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 కల్లా దాదాపు 37 శాతం సరికొత్త నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగావకాశాలు ఇండియాలో కలగబోతున్నాయి.

అయితే ఎటువంటి ఉద్యోగాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నది మరొక ముఖ్యమైన ప్రశ్న. ముఖ్యంగా నాలుగు రకాల ఉద్యోగాలు భవిష్యత్తు శాసించే స్థాయి ఉన్నవి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఎటువంటి నైపుణ్యాలకు పెద్ద ఎత్తులో డిమాండ్ ఉండబోతోంది?

ఏఏ ఉద్యోగాలు?

 • మొదటిది డేటా ఎనాలిసిస్. ఇప్పటికే ఇది ఊపందుకుంది.
 • ఇక కంప్యూటర్, మేథమెటికల్ జాబ్స్ కూడా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది.
 • అర్చిటెక్ట్స్, ఇంజనీరింగ్ ఉద్యోగాలు స్థిరంగా ఉంటాయి.
 • ఇక స్పెషలైజ్డ్ సేల్స్ కూడా మంచి భవిష్యత్తుకల ఉద్యోగాలే.
 • సీనియర్ మేనేజర్ల అవసరం భారీగా ఉండబోతోంది.
 • ప్రాడక్ట్ డిజైనర్లకు అవకాశాలు పెరగనున్నాయి.
 • మానవ వనరులు.. అదే హ్యూమన్ రిసోర్సెస్‌తో పాటు సంస్థాగత అభివృద్ధి నిపుణులు కూడా వర్కర్ల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు అవసరం.
 • ఇక ప్రభుత్వ సంబంధాల నిపుణులకు కూడా డిమాండ్ బాగా ఉంటుంది.

మరిన్ని ఉపాధి రంగాలు..

ఇక మరొక ముఖ్యమైన రంగం హెల్త్ కేర్. ఆరోగ్యమనేది అత్యంత ముఖ్యమైన అంశం. అందుకే దానికి సంబంధించిన ఉద్యోగాలకు ఎల్లపుడూ మంచి ఫ్యూచర్ ఉంటుంది.

అలాగే సోషల్ ఇంటలిజెన్స్, న్యూ మీడియా లిటరసీ లాంటి కొత్త రకమైన అంశాలలో కూడా ఉద్యోగావకాశాలు ఉండబోతున్నాయి.

అలాగే మేనేజ్మెంట్ అనలిస్టులకు, అకౌంటంట్లకు, ఆడిటర్లకు 2024 కల్లా అవకాశాలు రెండింతలు అవ్వబోతున్నాయి.

చిత్రం శీర్షిక ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నాలుగేళ్లలో రానన్ని ఉద్యోగావకాశాలు చివరిదైన ఐదవ సంవత్సరంలో వస్తాయి

ఈ గుణగణాలు చాలా చాలా ముఖ్యం

ప్రపంచం అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఈ పోటీ ప్రపంచంలో రోజుకొక కొత్త పాఠం నేర్చుకోవాలి. అంతే కాదు కొత్తదనాన్ని ఆహ్వానించి మనల్ని మనం దానికి తగ్గట్టుగా అభివృద్ధి చేసుకోవాలి.

2020 కల్లా మంచి డిమాండ్‌లో ఉండే ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్ , లక్షణాలలో అతి ముఖ్యమైనవి..

 • కాంప్లెక్స్ ప్రాబ్లెమ్ సాల్వింగ్.. అంటే క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపించడం
 • సృజనాత్మకత
 • అద్భుతమైన నిర్వహణా ప్రతిభ
 • సమన్వయంతో ముందుకు వెళ్లడం
 • పరిణితితో కూడిన నిర్ణయాలు తీసుకునే ప్రతిభ
 • సేవా దృక్పథం
 • చర్చించే స్వభావం

ఇవన్నీ కాదు మాకు ఉద్యోగాలు వద్దు, మాకు మేమే బాసులం, వేరే వాళ్ళకి మేమే ఉద్యోగావకాశాలు కలించాలి అన్న దృక్పథంతో సొంత కంపెనీలు పెట్టుకోవడం.. అదే స్టార్ట్ అప్ కల్చర్ ఇపుడు ట్రెండ్. దాన్ని కూడా ఫాలో అయిపోవచ్చు. వీటిలో ఏం చేసినా మీ భవిష్యత్తు బాగుండాలి. అదీ సంగతి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)