#గమ్యం: సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం... ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్

  • 22 ఏప్రిల్ 2018
విద్యార్థిని Image copyright iStock

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

ఆసక్తి కలిగిన, అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా చేయూతనందించేందుకు ప్రయత్నిస్తుంటాయి. కానీ ఆ సమాచారం చాలా మంది విద్యార్థులకు చేరడం లేదు. విద్యార్థులు దరఖాస్తు చేయకపోవడం వల్ల స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన నిధులు ప్రతి సంవత్సరం నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి.

సైన్స్, టెక్నాలజీ పరిశోధనలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ అందించే కేవీపీవై స్కాలర్‌షిప్ గురించి గతంలో చర్చించాం. ఇలాంటిదే మరో స్కాలర్‌షిప్ గురించి ఈరోజు 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఇన్‌స్పైర్ - ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రిసెర్చ్. పరిశోధనారంగంపై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతో అందించే స్కాలర్ షిప్ ఇది. ఏదైనా కొత్తది కనిపెట్టాలి, పరిశోధించాలనే తపన ఉన్నవారికి ఇదో మంచి అవకాశం. బేసిక్ సైన్సెస్‌లో డిగ్రీ లేదా ఉన్నత విద్య చదువుతున్నవారు దీన్ని పొందవచ్చు. ఇది మూడు విభాగాలుగా ఉంటుంది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: సైన్స్, టెక్నాలజీ పరిశోధనలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఓ వరం... ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్

సీట్స్ (ఎస్ఈఏటీఎస్ - స్కీమ్ ఫర్ అర్లీ అట్రాక్షన్ ఆఫ్ టాలెంట్)

6-11వ తరగతి (10-15 ఏళ్ల వయసు) వరకూ ఉన్న విద్యార్థులు ఈ కేటగిరీ కిందకి వస్తారు. దీనికి ప్రత్యేకమైన ప్రవేశ పరీక్ష ఏమీ ఉండదు. పాఠశాల హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ ఇన్‌స్పైర్‌కు రాసి, విద్యార్థుల పేర్లు నామినేట్ చేస్తే రూ.5000 స్కాలర్‌షిప్ ఇస్తారు. దీంతో ఏదైనా చిన్న ప్రయోగం లేదా పరిశోధన చేసి చూపించవచ్చు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.

Image copyright Inspire

షీ (ఎస్‌హెచ్ఈ - స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్)

పాఠశాల స్థాయికన్నా కొద్దిగా పెద్ద ప్రయోగాలు, పరిశోధనలు చేసే విద్యార్థులకు సహకారం అందించి, ప్రోత్సహించేందుకు కళాశాల స్థాయి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్ ఇది.

దీనికి ప్రత్యేకించి ఎలాంటి ప్రవేశ పరీక్షా లేదు. కేవలం బీఎస్సీ మొదటి సంవత్సరం బేసిక్ సైన్సెస్ చదువుతున్నవారు మాత్రమే దీనికి దరఖాస్తు చేసేందుకు అర్హులు.

  • స్టేట్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ... ఇలా ఏ బోర్డులో మీరు ప్లస్ 2 చదివారో దానిలో టాప్ 1% విద్యార్థుల్లో ఉండాలి లేదా
  • జేఈఈ అడ్వాన్సుడ్ లేదా నీట్‌లో 10000 లోపు ర్యాంకు తెచ్చుకోవాలి లేదా
  • కేవీపీవై పరీక్ష ఉత్తీర్ణులైతే కూడా షీ స్కాలర్‌షిప్‌కు అర్హులవుతారు లేదా
  • ఐఐఎస్ఈఆర్, ఎన్ఐఎస్ఈఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఫర్ బేసిక్ సైన్సెస్ (యూనివర్శిటీ ఆఫ్ ముంబయి), ఎన్‌టీఎస్ఈ స్కాలర్లు లేదా
  • నేషనల్/ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్‌లో అర్హులైనవారు లేదా
  • జగదీష్ బోస్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులైనవారు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సాధారణంగా అక్టోబర్‌లో విడుదలవుతుంది. డిసెంబరు చివరి వరకూ దరఖాస్తు గడువు ఉంటుంది. ఇది ఆన్‌లైన్‌లోనే చేయాలి.

Image copyright IISER

ఎంత మొత్తం వస్తుంది? ఎంతమందికి వస్తుంది?

బీఎస్సీ డిగ్రీ ఏ కాలేజీలో చదివినా ఫర్వాలేదు. షీ స్కాలర్‌షిప్ కింద సంవత్సరానికి రూ.80000/- ఇస్తారు. దీనిలో రూ.60000/- మీ చదువు నిమిత్తం బ్యాంకు అకౌంట్‌లోకి వస్తాయి. మరో రూ.20000/- మెంటార్‌షిప్ ఫీజు అంటారు. అంటే విద్యా సంవత్సరం చివరలో మీరు ఒక మెంటార్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి.

ఈ స్కాలర్‌షిప్‌ పీజీతో కలిపి మొత్తం ఐదేళ్లపాటు ఇస్తారు. కానీ ప్రతి సంవత్సరం 60% తగ్గకుండా మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా రాకపోతే ఆ సంవత్సరానికి మీకు స్కాలర్‌షిప్‌ రాదు. తర్వాత సంవత్సరం తగిన మార్కులు తెచ్చుకుంటే అప్పుడు ఆ సంవత్సరానికి స్కాలర్‌షిప్‌ వస్తుంది. ప్రతి సంవత్సరం మీ మార్కుల లిస్ట్ / గ్రేడ్ షీట్లను ఇన్‌స్పైర్‌ వారికి పంపించాల్సి ఉంటుంది.

మొత్తం స్కాలర్‌షిప్‌లు 12000. దీనికి పోటీ ఎక్కువగానే ఉంటుంది. కొద్దిగా కష్టపడితే ఈ 12000 మందిలో ఉండటం కష్టమేమీ కాదు. అప్లికేషన్లను వడపోసి, అర్హులను ఎంపిక చేయడానికి కనీసం 4 నెలల సమయం పడుతుంది. వెబ్‌సైట్లోకి వెళ్లి, లాగిన్ అయ్యి, మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సెలక్ట్ అయితే మీకు సమాచారం కూడా అందుతుంది.

Image copyright Getty Images

బేసిక్ సైన్సెస్ అంటే?

ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, బయాలజీ, స్టాటిస్టిక్స్, జియాలజీ, ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ, ఎలక్ట్రానిక్స్, బోటనీ, జువాలజీ, బయోకెమిస్ట్రీ, ఆంత్రోపాలజీ, మైక్రో బయాలజీ, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, అట్మాస్ఫియరిక్ సైన్సెస్, ఓషనోగ్రఫిక్ సైన్సెస్... వీటన్నింటినీ బేసిక్ సైన్సెస్‌గా చెప్తారు. వీటిలో ఏ సబ్జెక్టులతో డిగ్రీ చేస్తున్నా ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేయవచ్చు.

కేవీపీవై పరీక్ష ఉత్తీర్ణులైనా కట్ ఆఫ్ మార్కుల ఆధారంగా మీకు స్కాలర్‌షిప్‌ రాకపోతే మీరు ఇన్‌స్పైర్‌కు అప్లై చేయవచ్చు. కానీ రెండు స్కాలర్‌షిప్‌లు తీసుకునే వీలు లేదు.

దరఖాస్తుతో పాటు 10, 12 తరగతుల సర్టిఫికెట్లు జతచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మీరు చదువుతున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌తో సంతకం చేయించిన ఎండార్స్‌మెంట్‌ను కూడా పంపించాల్సి ఉంటుంది.

ఈ స్కాలర్‌షిప్‌ పొందగలిగితే మీ డిగ్రీకి విలువ మరింత పెరుగుతుంది.

Image copyright Getty Images

ఏఓఆర్సీ (అస్యూర్డ్ ఆపర్చూనిటీ ఫర్ రిసెర్చ్ కెరియర్స్)

ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఫెలోషిప్... 22 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసున్నవారు దీనికి అర్హులు. పీహెచ్‌డీ చేసేవారికి, తద్వారా పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలనుకునే 1000 మందికి ప్రతి సంవత్సరం దీన్ని అందిస్తారు. రెండోది ఫ్యాకల్టీ స్కీమ్. 27-32 మధ్య వయసువారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)