యశ్వంత్ సిన్హా: బీజేపీకి గుడ్‌బై - రాజకీయాల్లోంచి 'సన్యాసం'

  • 21 ఏప్రిల్ 2018
యశ్వంత్ సిన్హా Image copyright Getty Images

మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి వైదొలుగుతున్నట్టు శనివారం నాడు పట్నాలో ప్రకటించారు. కొంతకాలంగా ఆయనకు పార్టీ నాయకత్వంతో సరిపడడం లేదన్న విషయం తెలిసిందే.

పట్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తాను బీజేపీతో అన్ని విధాలుగా తెగదెంపులు చేసుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. అట్లాగే, క్రియాశీల రాజకీయాల్లోంచి 'సన్యాసం' తీసుకుంటున్నట్టు కూడా తెలిపారు.

యశ్వంత్ కుమారుడు జయంత్ సిన్హా ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు.

ఒక ఐపీఎస్ అధికారిగా భారత ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించిన సిన్హా 1984లో బీజేపీలో చేరారు.

1996లో బీజేపీలో జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి అయ్యారు. దాంతో పాటు విదేశాంగ శాఖ మంత్రిగానూ పని చేశారు.

అయితే 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు నిండిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకుంది. అలా యశ్వంత్ సిన్హా ప్రభుత్వ ఏర్పాటుకు దూరంగా ఉండిపోయారు.

అయితే, అప్పటి నుంచీ మోదీ ప్రభుత్వ విధానాలను, ముఖ్యంగా ఆర్థిక విధానాలను విమర్శిస్తూ యశ్వంత్ సిన్హా అనేక సార్లు బాహాటంగా ప్రకటనలు చేశారు. అలా ఆయనపై అసమ్మతివాదిగా ముద్రపడింది.

Image copyright AFP/GETTYIMAGES

'ప్రధానిగా మోదీకే నా మద్దతు'

రెండు నెలల క్రితం యశ్వంత్ సిన్హా బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో "బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నేను నరేంద్ర మోదీకి మద్దతునిచ్చాను. ఆయనను ముందుకు తెస్తే పార్టీ ఘన విజయం సాధించగలదని చెప్పాను" అని అన్నారు.

"ఆ తర్వాత ఇతర నాయకులు కూడా ఇదే అన్నారు. అలా ఆయన పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అయ్యారు. నేను ఊహించినట్టుగానే జరిగింది. ఆ ఎన్నికల్లో పార్టీ గెలిచింది. అంతేకాదు, ఆనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయడంలో కూడా నా భాగస్వామ్యం ఉంది. ప్రధాని అభ్యర్థిగా, ఆ తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టాక మోదీ ఆ మేనిఫెస్టోను శ్రద్ధగా చూడను కూడా చూడలేదు" అని సిన్హా అన్నారు.

"ఇప్పుడు వెనక్కి మళ్లి చూస్తే, వ్యక్తిగతంగా నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే అందులో పొందుపర్చిన అనేక హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు" అని సిన్హా ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఆర్థిక సలహామండలిలో తన పేరు లేకపోవడంతో యశ్వంత్ సిన్హా మనస్తాపం చెంది ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం.

Image copyright MANJUNATH KIRAN/AFP/Getty Images
చిత్రం శీర్షిక అమిత్ షా, నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీ త్రయం

ఏకాకిగా మారిన యశ్వంత్ సిన్హా!

నిరుడు సెప్టెంబర్‌లో 'ఐ నీడ్ టు స్పీక్ నౌ' శీర్షికతో యశ్వంత్ సిన్హా రాసిన వ్యాసం చర్చకు దారితీసింది.

దేశంలో మందగతిన సాగుతున్న ఆర్థిక వ్యవస్థపై అది మరోసారి చర్చ లేపింది. ఇందులో సిన్హా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని లక్ష్యంగా చేసుకున్నారన్నది స్పష్టం.

దానికి స్పందిస్తూ జైట్లీ 'ఆయనో రాజకీయ నిరుద్యోగి' అంటూ ఎద్దేవా చేశారు.

ఓ రకంగా యశ్వంత్ సిన్హా తన సొంత పార్టీలోనే ఏకాకి అయ్యారని చెప్పొచ్చు.

2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని చాలా మంది భావించారు. కానీ ఆయనకు బీజేపీ అగ్ర నాయకత్వం ఆ అవకాశం ఇవ్వలేదు.

అయితే గతంలో ఆర్థికమంత్రిగా యశ్వంత్ సిన్హా పనితీరు కూడా పూర్తిగా వివాదరహితమేమీ కాదు.

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు జరిగిన కేబినెట్ పునర్వవస్థీకరణలో ఆయనను ఆర్థిక మంత్రిగా తొలగించి విదేశాంగ శాఖ బాధ్యతను అప్పగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)