జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన: ఇకపై ఏం జరుగుతుంది?

  • 23 ఏప్రిల్ 2018
జస్టిస్ దీపక్ మిశ్రా Image copyright NALSA.GOV.IN

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా విపక్షాలు అభిశంసన తీర్మానం ముందుకు తేవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడి పైనే ఉంది.

నాయుడు ఈ అభిశంసన తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్తారా లేక ఇది చెల్లదని ప్రకటిస్తారా? అన్నది అందరి మదిలో మెదిలింది.

మీడియాలో వస్తున్న రిపోర్టులను బట్టి, అభిశంసన కోసం విపక్షాల వద్ద బలమైన ఆధారాలు లేవనీ, రాజ్యసభలో వారికి తగినంత సంఖ్యా బలం లేదని ప్రభుత్వం భావించింది.

దీంతో వెంకయ్యనాయుడు విపక్షాల నోటీసును తోసిపుచ్చారు. ఈ నోటీసును ఆయన స్వీకరించ లేదు. దీంతో దానంతటదే చెల్లనిదిగా మారిపోతుంది.

చరిత్రలో ఇప్పటి వరకు (తాజా నోటీసు కాకుండా) ఇలా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా అభిశంసన నోటీసులు ఆరు సార్లు ఇవ్వగా, నాలుగు సార్లు వాటిని స్వీకరించారు. ఈ ఆరింటిలో ఐదో కేసులో ప్యానల్ ఏర్పడటానికి ముందుగానే న్యాయమూర్తి తన తీర్పులో 'సవరణ' చేశారు.

1970లో అభిశంసన తీర్మానాన్ని కేవలం ఒక్కసారే తోసిపుచ్చారు. ఆ సమయంలో న్యాయమూర్తి రాజ్యసభ చైర్మన్ వద్దకు వెళ్లి ఇది అంత తీవ్రమైన కేసేమీ కాదని ఒప్పించడంలో సఫలీకృతుడయ్యారు.

Image copyright Getty Images

రాజ్యాంగపరమైన అనివార్యత

అభిశంసన నోటీసులను రాజ్యసభ చైర్మన్ పరిశీలనకు స్వీకరించేంత వరకూ భారత ప్రధాన న్యాయమూర్తి తన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తూనే ఉంటారు.

అభిశంసన నోటీసులను రాజ్యసభ చైర్మన్ పరిశీలనకు స్వీకరించినట్టయితే, ప్రధాన న్యాయమూర్తి న్యాయపరమైన తీర్పులు ఇవ్వకుండా దూరంగా ఉండాల్సి ఉంటుంది.

అయితే నైతిక దృష్టితోనే ఇలా జరుగుతుంది తప్ప రాజ్యాంగపరంగా అనివార్యతేమీ లేదని రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ బీబీసీతో అన్నారు.

అయితే, అభిశంసన నోటీసులు స్వీకరించగానే ప్రధాన న్యాయమూర్తి న్యాయపరమైన తీర్పుల ప్రక్రియ నుంచి వైదొలగాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్ దవే అభిప్రాయపడ్డారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం, "పార్లమెంటు ఉభయ సభల్లో మూడొంతుల మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాక, రాష్ట్రపతి ఆదేశంతోనే సదరు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆ బాధ్యత నుంచి తొలగించవచ్చు."

న్యాయమూర్తుల చట్టం 1968, 1969 ప్రకారం, అభిశంసన నోటీసులు ఇచ్చిన తర్వాత మొట్టమొదటి అనివార్యత ఏంటంటే, దానిపై 64 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు చేయాలి. ఆ తర్వాతే దానిపై ఏం చేయాలనేది రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆలోచిస్తారు.

Image copyright Getty Images

నోటీసులు స్వీకరించాక ప్రక్రియ ఎలా ఉంటుంది?

వెంకయ్య నాయుడు అభిశంసన నోటీసులు స్వీకరించినట్టయితే, ముగ్గురు సభ్యులతో కూడిన ఒక సమితిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు సభ్యులలో మొదటి వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి లేదా మరెవరైనా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయి ఉండాలి. రెండో వ్యక్తి ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మూడో వ్యక్తి న్యాయనిపుణులు అయి ఉండాలి.

అయితే, ఒకవేళ రాజ్యసభ చైర్మన్ అభిశంసన నోటీసులను తిరస్కరిస్తే, దీనిని కోర్టులో సవాలు చేయొచ్చని నిపుణులు అంటున్నారు.

నోటీసులు అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, వాటిని తిరస్కరిస్తే దాన్ని కోర్టులో సవాలు చేయొచ్చని నిపుణుల అభిప్రాయం.

అయితే, దుష్యంత్ దవే అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. నోటీసులు స్వీకరించని పక్షంలో కోర్టులో అప్పీల్ చేసేందుకు అవకాశం ఉండదని ఆయన అంటున్నారు.

ముగ్గురు సభ్యుల సమితి మూడు నెలల్లో నివేదిక సమర్పిస్తుంది. కావాలంటే కాలవ్యవధిని పొడిగించే అవకాశం కూడా ఉంది.

ఈ సమితి చేయాల్సిన పని ఏంటంటే (కేసు ఆ స్థాయి వరకు చేరుకుంటేనే), భారత ప్రధాన న్యాయమర్తిపై ప్రధాన ఆరోపణలేమిటో నిర్ధారించాలి. వాటి ఆధారంగా విచారణ జరుగుతుంది.

ఈ ప్యానెల్‌కు సంబంధిత వ్యక్తులకు సమన్లు పంపించే అధికారం ఉంటుంది. వారొక సివిల్ కోర్టుతో సమానమైన హక్కులు కలిగి ఉంటారు.

Image copyright NALSA.GOV.IN

అభిశంసన షరతులు

ఆరోపణలన్నింటిపై ఈ సమితి తమ నిర్ధారణలతో పాటు, తమ వ్యాఖ్యలను కూడా జత చేసి నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తుంది. సీజేఐ ఎలాంటి అక్రమ వ్యవహారానికీ పాల్పడలేదని సమితి అభిప్రాయపడితే అభిశంసన ప్రక్రియ అక్కడితోనే ఆగిపోతుంది.

ఒకవేళ సీజేఐ అక్రమ వ్యవహారానికి పాల్పడ్డట్టు నివేదిక వెల్లడి చేసినట్టయితే, అభిశంసన పైనా, సమితి నివేదిక పైనా సభలో చర్చ జరుగుతుంది.

ఈ తీర్మానాన్ని రాజ్యంగపరంగా స్వీకరించినట్టయితే, సీజేఐ వచ్చిన ఆరోపణలను సభలో రుజువు చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి న్యాయమూర్తిని పదవిలోంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు