పిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఏయే దేశాలలో ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు?

  • 22 ఏప్రిల్ 2018
పిల్లలు, అత్యాచారం, మరణశిక్ష, భారతదేశం Image copyright iStock

సూరత్, కఠువా, ఉన్నావ్, దిల్లీ - తేదీలు, స్థలాలు మాత్రం వేరే. కానీ సంఘటనలు మాత్రం అంతటా ఒకటే - బాలికలపై అత్యాచారం.

వీటిలో ప్రతి సంఘటనా కూడా అంతకు ముందు దానికన్నా దారుణమైనది, బాధాకరమైనది.

అందుకే అత్యాచార దోషులకు మరణశిక్ష విధించాలన్న డిమాండ్ భారతదేశంలో రోజురోజుకీ ఊపందుకుంటోంది. అయితే మరణశిక్షను కొందరు సమర్థిస్తుంటే, కొందరు వ్యతిరేకిస్తున్నారు.

దీని వల్ల ఇలాంటి నేరాలు తగ్గుతాయని కొందరు అంటే, కొందరు మాత్రం ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, అత్యాచార దోషులకు వివిధ దేశాలలో ఎలాంటి శిక్ష విధిస్తున్నారో తెలుసుకుందాం.

Image copyright Getty Images

భారతదేశం

భారతదేశం విషయానికి వస్తే, బాలలపై అత్యాచారాల కేసుల విషయంలో ఇప్పటివరకు 'అత్యంత అరుదైన' కేసుల విషయంలో మాత్రమే మరణశిక్షను విధిస్తున్నారు.

పిల్లలపై అత్యాచారం కేసులను పోక్సో చట్టం కింద నమోదు చేస్తున్నారు. ఈ చట్టం కింద అత్యాచార దోషులకు పదేళ్ల నుంచి గరిష్టంగా జీవితఖైదు విధించే అవకాశం ఉంది.

అయితే ఏప్రిల్ 21వ తేదీ శనివారం కేంద్ర కేబినెట్.. పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన సందర్భంలో పిల్లలు మరణించినా, అచేతనంగా మారినా దోషులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. అంతే కాకుండా.. అలాంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తారు.

ప్రపంచంలో ఇలాంటి అత్యాచారాలకు ఎలాంటి శిక్షలు విధిస్తున్నారు?

ప్రపంచవ్యాప్తంగా పిల్లలపై అత్యాచారాలకు విధించే శిక్షలు వేర్వేరుగా ఉన్నాయి. చాలా దేశాలు పిల్లలపై దారుణాలను, అత్యాచారంకన్నా తీవ్రంగా పరిగణిస్తాయి.

దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ అసోసియేట్ నికితా విశ్వనాథ్, ఈ విషయంలో ప్రపంచంలో రెండు రకాల దేశాలు ఉన్నాయని తెలిపారు. మొదటిది - మరణశిక్ష ఉన్నా, పిల్లలపై అత్యాచారం కేసుల్లో ఆ శిక్ష విధించరు. రెండోది - ఎలాంటి నేరానికైనా మరణశిక్ష ఉండదు.

మరణశిక్ష ఉన్న చాలా దేశాల్లో పిల్లలపై అత్యాచారానికి మాత్రం మరణశిక్ష లేదని నికిత తెలిపారు. అయితే పిల్లలపై లైంగిక హింసకు పాల్పడిన సందర్భంలో దోషులకు అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తారు.

2016లో పిల్లల హక్కుల కోసం ఏర్పాటు చేసిన హక్-సెంటర్ ప్రపంచవ్యాప్తంగా బాలికలపై జరిగే లైంగిక హింస, అత్యాచారాలకు విధిస్తున్న శిక్షలపై ఒక నివేదిక తయారు చేసింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు వేర్వేరు రకాల శిక్షలు విధిస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక మలేషియా

మలేషియా

మలేషియాలో పిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడితే గరిష్టంగా 30 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.

సింగపూర్

సింగపూర్‌లో పధ్నాలుగేళ్ల లోపు పిల్లలపై లైంగిక అత్యాచారాలకు పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష, దానితో పాటు కొరడా దెబ్బలు, జరిమానా విధించే అవకాశం ఉంది.

అమెరికా

గతంలో పిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే అమెరికాలో మరణశిక్ష విధించే అవకాశముండేది. అయితే కెన్నడీ వర్సెస్ లూసియానా (2008) కేసులో మరణశిక్ష రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించారు. మరణం లేని నేరాల్లో మరణశిక్షను విధించడం తగదని, నేరం కన్నా శిక్ష ఎక్కువగా ఉందని కోర్టు భావించింది.

ప్రస్తుతం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పిల్లలపై అత్యాచార నేరానికి విధించే శిక్షలు వేర్వేరుగా ఉన్నాయి.

Image copyright Getty Images

మరణశిక్ష లేని దేశాలు

ఫిలిప్పీన్స్

పిల్లలపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువైతే ఫిలిప్పీన్స్‌లో అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. దోషికి గరిష్టంగా 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. అంతే కాకుండా దోషికి పెరోల్ కూడా లభించదు.

ఆస్ట్రేలియా

పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే దోషులకు 15 నుంచి 25 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు.

కెనడా

కెనడాలో అత్యాచార దోషులకు గరిష్టంగా 14 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

ఇంగ్లండ్ మరియు వేల్స్

పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు 6 నుంచి 19 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జర్మనీ

జర్మనీ

జర్మనీలో అత్యాచారం అనంతరం పిల్లలు మరణిస్తే దోషికి జీవితఖైదు విధిస్తారు. కానీ కేవలం అత్యాచారం మాత్రమే జరిగిన సందర్భంలో దోషికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు.

దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాలో మొదటిసారి పిల్లలపై అత్యాచారానికి పాల్పడితే గరిష్టంగా 15 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అదే నేరస్తుడు రెండోసారి ఆ నేరానికి పాల్పడితే 20 ఏళ్ల జైలుశిక్ష, మూడోసారి పాల్పడితే 25 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

న్యూజీల్యాండ్

ఇలాంటి నేరాలకు గరిష్టంగా 20 ఏళ్ల శిక్ష విధించవచ్చు.

Image copyright Getty Images

మరణ శిక్ష విధించే దేశాలు..

2013లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రచురించిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా కేవలం 8 దేశాలలో మాత్రమే పిల్లలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. అవి - చైనా, నైజీరియా, కాంగో, పాకిస్తాన్, ఇరాన్, సౌదీ అరేబియా, యెమన్, సూడాన్.

'హక్' కో-డైరెక్టర్ అయిన భారతి అలీ, ''అనేక దేశాలు మరణశిక్షను రద్దు చేస్తుంటే మనం మాత్రం తిరోగమిస్తున్నాం. పిల్లలపై అత్యాచారాలకు మరణశిక్షను విధించాలని కోరుతున్న వారంతా ఒక విషయాన్ని గుర్తించాలి. మరణశిక్ష వల్ల అత్యాచారానికి పాల్పడిన తర్వాత దోషులు బాధితులను చంపేసే అవకాశం ఉంది. మనం దీనిని దృష్టిలో పెట్టుకోవాలి'' అన్నారు.

(సూచన: వివిధ దేశాలలో 'మైనర్', 'అత్యాచారం' అన్న పదాలకు వేర్వేరుఅర్థాలుఉన్నాయి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)