అభిప్రాయం: ఒక్క రజనీ - ఒకే ఒక్క రజనీ!

  • 23 ఏప్రిల్ 2018
ఒక్క రజనీ-ఒకే ఒక్క రజనీ Image copyright FACEBOOK

బహముఖ ప్రజ్ఞాశాలి, విజయవాడ రేడియో స్టేషన్ మాజీ డైరక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూశారు. రేడియో తరం 'రజనీ' అని ఆత్మీయంగా పిలుచుకునే తొలితరం ఆధునిక వాగ్గేయకారుడాయన. భావుకత్వపు బాటలో సున్నితంగా సాగిన ఆయన స్వరయానపు నాడి తెలిసిన వైద్యురాలు రొంపిచర్ల భార్గవి అందిస్తున్న నివాళి వ్యాసం.

ఇవాళ పొద్దున్నే ఆరు గంటలకు మోగిన ఫోన్‌తో మెలకువ వచ్చింది. అటు వైపు నుంచి "రజనీ" గారి కోడలు ప్రసూన... "భార్గవీ, మామయ్యగారు వెళ్లి పోయారమ్మా" అనగానే మనసు ఒక్కసారిగా బాధాతప్తమయింది.

"రజనీ" అని పిలుచుకునే బాలాంత్రపు రజనీ కాంతరావుగారు ఒక వ్యక్తి కాదు, ఆయన దగ్గరున్నది ఒక కళకాదు. ఆయన ఒక రచయిత, వాగ్గేయకారుడు, రేడియో కళాకారుడు, సినీ పాటల-మాటల రచయిత, సంగీత దర్శకుడు. ఇలా పదహారు కళలతో వెన్నెల విరబూసే పూర్ణ చంద్రుడాయన.

అలాంటి "రజనీ"గారితో నా పరిచయం ఎలా మొదలైంది అని ఆలోచిస్తే... 2003లో వీఏకే రంగారావుగారి వ్యాస సంకలనం "ఆలాపన" ప్రచురణ సందర్భంగా ఆయన దగ్గరకెళ్లి కూర్చోవడం, తెలియని సమాచారం తెలుసుకోవడం చేస్తూ ఉండేదాన్ని. అప్పట్లో ఆయనకు వృధ్ధాప్యంలో ఉండే సమస్యలు ఉన్నా కొంతవరకూ స్పష్టంగా మాట్లాడటం, పాడటం చేసేవారు. ఆయన గొప్పతనమేంటో తెలియక పోయినా గొప్పవాడు అని అందరూ అనుకుంటారని తెలుసు.

అలా వెళ్లి కూర్చొని మాట్లాడే సందర్భాల్లో సూర్యుని వెలుగు తొలిపొద్దులో సన్నగా చిన్న వెలుతురుగా మొదలై క్రమంగా ఎలా ప్రచండమైన కాంతిగా మారుతుందో అలా ఆయన బహుముఖప్రజ్ఞా విశేషాలు నెమ్మది నెమ్మదిగా అవగాహనకు వచ్చాయి నాకు.

ఈనాటికీ ఆయన ప్రతిభను కొలిచే కొలమానాలు నావద్ద లేవనే విషయం నాకు తెలిసినా, ఆయన రచనల్లోని పదబంధాల్లో కనిపించే సాధారణత్వం, సంక్లిష్టత, ప్రాచీనత, ఆధునికత, అచ్చతెలుగు మాటలు, సంస్కృత భూయిష్టమైన సమాసాలు... ఇలా పరస్పర విరుధ్ధమైన విషయాలు ఒకే చోట ఒనగూడటం అత్యంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అవి స్వాతంత్ర్యం పొందిన తొలి ఉద్విగ్న క్షణాలు. పండిట్ నెహ్రూ ఉపన్యాసం తర్వాత 'మ్రోయింపు జయభేరీ' అని టంగుటూరి సూర్యకుమారి తెలుగు నేలను ఉద్వేగంతో ఊపేశారు. ఆ పాట రాసింది, స్వరపరిచింది బాలాంత్రపు రజనీకాంతరావు. అదే ఊపులో మరింత ప్రాముఖ్యం పొందిన ’మాదీ స్వంతత్ర దేశం‘ గేయ రచన, స్వర దర్శకత్వం కూడా ఆయనదే. అప్పటి నుంచి అంతిమ ఘడియల దాకా ఆయన తన పాట లాగే జీవించారు. ఎన్నో ప్రయోగాలు చేశారు. తెలుగు సాహితీ సంగీత మాగాణంలో నిండైన కృషిచేశారు. తనదైన ముద్ర వేశారు.

ఇంతటి ప్రతిభ ఆయనకు ఎలా కలిగింది? ఆయన పుట్టుక, పెంపకం ఇంకా ఇతర ప్రభావాలు ఏమిటి అని పరిశీలిస్తే...

తండ్రి బాలాంత్రపు వెంకట్రావు (వెంకట,పార్వతీశ కవులలో ఒకరు) గారి నుంచి ఆయనకు కవిత్వం పుట్టుకతోనే సంక్రమించిందని, తర్వాత్తర్వాత పింగళి లక్ష్మీకాంతం గారిని తన గురువుగా చెప్పుకునే వారనీ చెబుతారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మించినా ప్రాథమిక విద్య అంతా తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో జరిగింది. పిఠాపురంతో అనుబంధమెక్కువ, అదే తన ఊరని ఆయన చెబుతారు. తర్వాత కాలేజీ చదువు కాకినాడలోనూ, తెలుగు, సంస్కృతం ప్రధాన విషయాలుగా బీఏ ఆనర్స్ విశాఖ పట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ చదివారు. తన తొమ్మిదో ఏటనుండే సంగీతం పాడుతూ వుండే వారట.

1940-41 ప్రాంతంలో ఇరవయ్యేళ్లప్పుడు ఆల్ ఇండియా రేడియో సంస్థలో ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి రిటైరయ్యే వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కేంద్రాల్లో పనిచేసి 1978లో రేడియో స్టేషన్ డైరెక్టరుగా రిటైరయ్యారు.

రేడియోలో ఆయన ప్రవేశ పెట్టిన ప్రక్రియలు, చేసిన ప్రయోగాలూ తలుచుకుంటే, అవన్నీ ఒక్క మనిషి చేశాడనుకుంటే కళ్లు తిరిగి పోతాయి.

'భక్తిరంజని'లో వినపడే "సూర్యస్తుతి" ఒక్కదాని గురించి రాయడానికే బోలెడంత సమయం పడుతుంది. అందులో వినపడే కంఠాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో! ఆదిత్య హృదయం, సంప్రదాయ కీర్తన, సూర్య స్తుతి... అన్నిటినీ కలిపి అల్లిన కదంబ మాల అది. ఎంత అద్భుతంగా ఉంటుందో వింటుంటే!

అలాంటివెన్నో ప్రయోగాలు - సంగీత రూపకాలు, యక్షగానాలు, నాటికలు, సంగీత శిక్షణ, ఉషశ్రీ గారి ధర్మ సందేహాలు, ఈ మాసపు పాట, బావగారి కబుర్లు, ఇంకా ఎన్నో కార్యక్రమాల రూపకర్త ఆయన. వీటికి సంబంధించిన రచనలు చేయడం, ట్యూన్లు కట్టడం ఒక ఎత్తు, వాటిని గాయనీ గాయకులతో, వాద్యబృందంతో నిర్వహించడం ఒక ఎత్తు. ఆయన రేడియో తరపున రచయిత చలం గారిని చేసిన ఇంటర్వ్యూ ఈ నాటికి కూడా అపురూపమైనదిగా పరిగణిస్తారు. ఆయన వివాద రహితుడు. అన్నేళ్లు రేడియోలో పనిచేసినా తోటిఉద్యోగులు కానీ పరిచయస్థులు కానీ ఆయనను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ విమర్శించడం నేనెరగను.

Image copyright FACEBOOK

బాలమురళి, బాలసరస్వతి, శ్రీరంగం గోపాలరత్నం, ఎస్ రాజేశ్వరరావు, టంగుటూరి సూర్య కుమారి... వీరందరి చేత లలిత సంగీతం పాడించారు. తాను సినిమా రంగంలో పూర్తిగా నిలదొక్కుకోక ముందు "రజనీ" గారు రేడియోలో ఇచ్చిన అవకాశాలు చాలా ఆదుకున్నాయని ఘంటసాల చెబుతారు. లలిత సంగీతానికి చాలా ప్రాచుర్యం కల్పించిన వారు "రజనీ". రాజేశ్వరరావు, బాలసరస్వతి జంటగాను, విడివిడిగానూ "రజనీ"గేయాలు చాలా పాడారు. అవి మంచి పాపులర్ అయ్యాయి కూడా. "చల్లగాలిలో, ఓ విభావరీ, కోపమేల రాధా, పోయిరావే కోయిలా" మొదలయినవి వాటిలో కొన్ని.

ఇంక ఆయన పని చేసిన సినిమాలు రాశిలో తక్కువయినా వాసిలో ఎక్కువే. మొదటగా చేసిన సినిమాలు జగన్నాథ్ గారి "తారుమారు, భలే పెళ్లి". ఆయన భార్య సుభద్రగారి చేత "జో అచ్యుతానంద "పాడించారు.

తర్వాత "గృహప్రవేశం" సినిమాకు మాటలు, పాటలు కూడా రాశారు. "లక్ష్మమ్మ"కు పాటలు రాశారు. "స్వర్గ సీమ"లో "ఓ పావురమా" పాట, ట్యూనూ ఈయనవే. "మానవతి", "పేరంటాలు"లో పాటలు రాశారు. "బంగారు పాప"లో "తాథిమి తకథిమి తోల్ బొమ్మా" అంటూ మాధవపెద్ది పాడింది అద్భుతమైన పాట.

"రాజమకుటం"లో పాటలు కొన్ని... "ఊరేది పేరేది ఓ చందమామా" అనే రాగమాలిక ఎంత బాగుంటుందో నేను చెప్పలేను.

సినిమాల్లో రాసేటపుడు చాలావరకూ "నాగరాజు","తారానాథ్","నళినీ"... వంటి మారుపేర్లతో రాసేవారు, రేడియో ఉద్యోగానికి భంగం రాకుండా.

కొన్ని సినిమాలకు సంగీత దర్శకులుగా వేరే వాళ్ల పేర్లుండేవి కానీ బాణీలు ఈయనవే. అంటే వాళ్లు ఆర్కెస్ట్రయిజేషన్ చేసి రికార్డ్ చేసేవారన్న మాట.

ఆయన సంగీత దర్శకత్వంలోని విశేషమేమంటే ఆయనకు శాస్త్రీయ సంగీతం తెలుసు, సంప్రదాయ సంగీతం తెలుసు, జానపద ధోరణులు ఎరిగి ఉన్నారు, సూఫీ సంగీతం, అరేబియన్ పోకడలు, బెంగాలీ వరసలు, రవీంద్ర సంగీతం, మరాఠీ మట్లు, హిందూస్థానీ పట్లు, గజల్ సంగీతం... ఇవన్నీ అలవోకగా ఎలా సాధించారో తలుచుకుంటే పిచ్చెక్కి పోతుంది. అందుకే ఆయన బాణీలు ప్రత్యేకంగా, అనుకరణకు సాధ్యం కాకుండా, నిత్యనూతనంగా ఉంటాయి.


రచయితగా ఆయన రాసిన పుస్తకాలు

  • శతపత్ర సుందరి - మూడొందలకు పైగా లలిత గీతాలు.
  • విశ్వవీణ - సంగీత రూపకాలు
  • మువ్వ గోపాల పదాలు - ఇంగ్లిషులో
  • చతుర్భాణి
  • రామదాసు, క్షేత్రయ్య - జీవితచరిత్రలు
  • ఏకాంత సేవ - ఇంగ్లిష్
  • ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము - ఇందులో ఉన్న సమాచారం చాలా విలువైంది. అందుకే కాలానికి నిలిచే పుస్తకమది.

వివిధ పత్రికల్లో సంగీతం గురించి వ్యాసాలూ, విమర్శలూ రాసేవారు. కొన్నిసార్లు "సారంగదేవ, పూషా"అనే మారు పేర్లతో కూడా రాసే వారు.

ఇక గేయ రచయితగా ఆయన రాసిన పాటలు పరిశీలిస్తే ఆయన ప్రతిభకు ఆశ్చర్యమేస్తుంది.

"హాయిలోనేల ఎద కింత హింస... తీయ పాటలో బాధేల వంశీ" అని రాసిన కవి హృదయంలో ఎంత కవిత్వం పలికితే ఆ మాటలు వెలువడి ఉంటాయి అనిపిస్తుంది.

"మన ప్రేమ, సస్య సౌందర్య సీమల్లో ప్రభవించి, ప్రభవించి

నమ్ర మరుసీమమగునో

కమ్ర సుమధామమగునో"

ఒక నెగిటివ్ థింకింగ్ వెంటనే పాజిటివ్ థింకింగ్, ఆ సంస్కృత సమాసాలు చూశారుగా!

"చల్లగాలిలో తూలిరాలు వటపత్రములపై తేలి తేలి పడు అడుగులవే

పూలతీవ పొదరిండ్ల చాటుగా పొంచి చూచు శిఖిపింఛ మదే"

...అనగానే ఒక దృశ్యం ఆవిష్కృతమవుతుంది.

లలితగీతాల కథ ఇలా ఉంటే సినిమా పాటల్లో కూడా...

"ఓ మలయ పవనమా.. తొలి జన్మల వలపుల్లో తొరిపిన తేనియలూ"

ఊరేది పేరేది... తరిపి వెన్నెలల దొర రారా" అనడం నాకు భలే విచిత్రంగా అనిపించింది. తరిపి వెన్నెల అంటే పౌర్ణమికి ముందొచ్చే తెల్లటి వెన్నెలట.

ఇంకా చెప్పాలంటే అన్నమయ్య పదాలకు ట్యూన్ చేసి రేడియోలో పాడించి ప్రచారం చేసింది మొట్టమొదట ఆయనేనట.

Image copyright FACEBOOK

రమ్మనవే మాని రచనలూ - బాలసరస్వతి

విన్నపాలు వినవలె - భానుమతి

నాకుంజెప్పరెవలపు నలుపో తెలుపో - శ్రీరంగం గోపాలరత్నం

ఆయన రాగ నిర్దేశం కూడా చెప్పుకోదగినది, అరుదైన రాగాలను తీసుకుని పాటలు ట్యూన్ చేస్తారాయన. ఉదాహరణకి "రసాళి" రాగంలో "తనపంతమె" అనే పాట "మానవతి" సినిమాలో బాలసరస్వతి చేత పాడించారు.

"వాగధీశ్వరి"లో అన్నమయ్య పదం "నాకుంజెప్పరె" శ్రీరంగం గోపాలరత్నంతో పాడించారు.

ప్రాచీన రాగాలైన "ఆంధ్రి, దేవసాళగం" రాగాల గురించి పరిశోధన చేసి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు.

పిల్లలకోసం "జేజి మామయ్య" పాటలు రాసి, పాడించారు.

దేశభక్తి గీతాలు ఆయన రాసినవి సూర్యకుమారి నోట "మాదీ స్వతంత్ర దేశం, మ్రోగింపు జయభేరి" వింటుంటే రక్తం ఉప్పొంగుతుంది.

ఇలా "రజనీ" గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాల్సిందెంతో మిగిలే ఉంటుంది. శ్రీశ్రీ చెప్పిన "చెంచాతో సముద్రాన్ని తోడ సాధ్యమా"అన్న మాట గుర్తొస్తుంది.

గత పదిహేనేళ్లుగా వారి కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధం వల్ల కొంత సమీపంగా ఆయన్ను గమనించడానికి వీలైంది. నేనెప్పుడు వెళ్లినా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండేవారు. ఇంట్లో ఏ సంగీత, సాహిత్య కార్యక్రమం జరిగినా ఆయన సమక్షంలో జరిగేది. ఎంతసేపయినా అలా కూర్చొనే ఉండేవారు "అయ్యో, పెద్దాయన ఇబ్బంది పడుతున్నారేమో" అని మేమెవరన్నా అనుకుంటే "లేదు, ఆయనకిష్టం ఇలాంటివి" అని చెప్పేవాళ్లు. ఆయన కూడా లేవడానికి ఇష్టపడక పోవడం గమనించాను.

ఇంటికి వచ్చిన వాళ్లు "నేనెవరో చెప్పండీ" అనీ, "ఏదీ ఒక పాట పాడండీ" అనీ పరీక్షలు పెడుతూ ఉండేవారు. ఒక వారం క్రితం వరకూ కూడా ఆయన ఈ పరీక్షల్లో ఎప్పుడూ నెగ్గుతూనే ఉండేవారు. ఎటొచ్చీ మొన్న శ్రేయా రామనాథ్ ఆయన పాటలతో కచేరీ చేసినపుడే ఆయన కుర్చీ ఖాళీగా వుండటం.

ఎవరొచ్చి పిలిచినా పలక్కుండా ఉండటం కొంత ఆందోళన కలిగించినా "శతపత్ర సుందరుడు శతాధిక సుందరుడవుతాడులే" అనే ధీమాతోనే ఉన్నాం అందరం ఈ రోజు వరకూ.

లోకమంతా గొప్పవాడనీ, మంచివాడనీ కీర్తించి, ప్రేమించడం వేరు, తన సహాయకులు, దగ్గరగా మసలినవారు ఆ మాటలు అనడం వేరు.

ఆయనని కన్న తండ్రిలా, కంటికి రెప్పలా చూసుకుంది ప్రసూన. నిజంగా ఈ విషయంలో ఆయన చాలా అదృష్ట వంతుడు, అలాంటి కోడలు అందరికీ దొరకదు.

"గాఢ కాలాగ్ని కీలలలోన తపియించి తపియించి

ధగ్ధ తరుకాండమగునో

ముగ్ధ మధు భాండ మగునో - మనప్రేమ"

అనే పాట వింటూ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే "ఎవరు రాస్తారిలా మావయ్య గారు తప్ప" అంది ప్రసూన.

అలా మేమందరం కదలకుండా ఉన్న ఆయన్ని చూస్తూ కళ్లు తుడుచుకుంటూ అటూ ఇటూ మొహం చాటు చేసుకుంటూ తిరుగుతుంటే, ఆయన్నిన్నాళ్లూ తల్లిలా చూసుకున్న భ్రమరాంబ ఒకచోట కూలబడి బావురుమంది. "ఇన్నాళ్ల నా స్నేహం ఈ రోజుతో తీరిపోయిందమ్మా. అయ్యగారికి అన్నం పెట్టాలని ఎక్కడికెళ్లినా పెందలాడే తిరిగొచ్చేదాన్ని. నామొహంలో ఏమాత్రం చిరాకు కనపడినా ఆయన బాధ పడతారమ్మా, అందుకే డైపర్ మార్చేటపుడు కూడా నవ్వు మొహంతోనే ఉండేదాన్ని. ఎవర్నీ బాధ పెట్టడం ఆయనకిష్టం ఉండదమ్మా" అని ఏడుస్తోంది.

భ్రమరాంబకి ఆయన పాటల సౌందర్యము, ఆయన గొప్పతనము తెలియక పోవచ్చు కానీ ఒక మనిషిగా ఆయన ఎంత ఉన్నతుడో ఆమె గ్రహించింది, అది చాలదా?

ఆ ఆవరణంతా "రజనీ" పాటల పరిమళంతో గుభాళిస్తూ ఒక ఉత్సవం జరుగుతున్నట్టుగా ఉంది. "రజనీ" ఆత్మ విశ్వాంతరాళం లో పరిభ్రమిస్తూ "ఓ విభావరీ" అనిపాడుతున్నట్టుగా ఆయన గానం విశ్వగానంగా మారినట్టుగా అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పోలవరం పనుల రివర్స్ టెండరింగ్.. ఇంతకీ రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి

అపోలో 11: చంద్రుడి మీదకు మనిషి ప్రయాణం ఓ నాటకమా? దీనికి నాసా సమాధానమేంటి?

‘అమరావతి రుణాన్ని తిరస్కరించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానిదే.. ప్రపంచ బ్యాంకుది కాదు’

సాయంత్రం 6 లోగా బలపరీక్ష జరపండి.. డెడ్‌లైన్ పొడిగించిన గవర్నర్

జింబాబ్వేను సస్పెండ్ చేసిన ఐసీసీ.. క్రికెట్‌లో రాజకీయ జోక్యంతో జట్టుపై నిషేధం

ప్రెస్ రివ్యూ: ‘రోడ్డు మీద పడుకుంటా’.. ‘40 ఏళ్ల ఇండస్ట్రీ అంటే ఇదేనా’

కుల్‌భూషణ్ జాధవ్ మరణశిక్షను పాకిస్తాన్ ఎలా సమీక్షిస్తుంది

హత్యకేసులో జీవిత ఖైదు పడిన శరవణ భవన్ యజమాని గుండెపోటుతో మృతి