సీజేఐపై అభిశంసన: తిరస్కరణకు 9 కారణాలు

  • 23 ఏప్రిల్ 2018
వెంకయ్య నాయుడు Image copyright Getty Images

భారత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని తిరస్కరించడానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ క్రింది కారణాలను ప్రధానంగా పేర్కొన్నారు.

1. గౌరవ పార్లమెంట్ సభ్యులు సమర్పించిన తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అన్న దానిని నిశితంగా పరిశీలించాను. తీర్మానాన్ని ఆమోదించడానికి ముందు నేను ఆ తీర్మానంలోని ప్రతి విషయం నిజమా, కాదా? అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) కింద 'నిరూపితమైన దుష్ర్పవర్తన' కిందకు వస్తుందా రాదా అని నిర్ధారించుకోవాల్సి ఉంది. ఇందుకోసం నేను ఎమ్.కృష్ణస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మార్గదర్శకంగా తీసుకోవడం జరిగింది.

ఈ కేసులో - ''తీర్మానాన్ని ఆమోదించే ముందు స్పీకర్ న్యాయపరమైన అంశాలలో సలహాలు ఇచ్చే భారత చీఫ్ జస్టిస్, భారత అటార్నీ జనరల్‌లను సంప్రదించాలి. తీర్మానాన్ని ఆమోదించే ముందు దానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయో, లేదో చూడాలి. న్యాయవ్యవస్థ విస్తృత ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో పెట్టుకోవాలి'' అని పేర్కొన్నారు.

అయితే ప్రస్తుత తీర్మానం చీఫ్ జస్టిస్‌కు వ్యతిరేకంగా కావడం వల్ల ఆయన సలహాను తీసుకోవడం కుదరదు.

Image copyright NALSA.GOV.IN

2. ఈ విషయంలో నేను న్యాయ నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, ఇరుసభలకు చెందిన మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ న్యాయాధికారులు, లా కమిషన్ సభ్యులను సంప్రదించి వారి అభిప్రాయాలను తీసుకున్నాను.

3. ఈ నోటీసులోని అంశాలపై నేను పలువురితో వ్యక్తిగతంగా సంభాషించాను. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో తీర్మానంలో చేసిన ఆరోపణలను ఒక్కొక్కటిగాను, సమిష్టిగాను పరిశీలించాను.

4. ఇలాంటి తీర్మానాలను పరిశీలించడంలో ప్రధానంగా ఆర్టికల్ 124 (4) కింద రెండు విషయాలను పరిశీలించాలి. ఒకటి 'నిరూపితమైన దుష్ప్రవర్తన', రెండోది 'అసమర్థత'. దీనిలో 'నిరూపిత' అన్న పదం ఆరోపితుల దుష్ప్రవర్తనను తప్పకుండా నిరూపించి తీరాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.

5. గౌరవ పార్లమెంట్ సభ్యులకు తమ తీర్మానంపై తమకే స్పష్టత లేదు. తమ నోటీసులో వారు ఉపయోగించిన పదాలన్నీ కేవలం అనుమానాలు లేదా వారి ఊహలు. అవి ఆర్టికల్ 124 (4) కింద ఎలాంటి సందేహాలకు ఆస్కారమివ్వని సాక్ష్యాధారాలు కాజాలవు.

Image copyright Getty Images

6. ఐదుగురు గౌరవ న్యాయాధిపతుల బెంచ్ చీఫ్ జస్టిసే 'మాస్టర్ ఆఫ్ రోస్టర్' అన్న విషయాన్ని స్పష్టం చేసింది. అందువల్ల ఇది సుప్రీంకోర్టు తనంతట తాను పరిష్కరించుకోవాల్సిన అంతర్గత విషయం. నోటీసులో పేర్కొన్న ఐదు అంశాలను పరిశీలించగా, వాటిలో ఏ ఒక్కటి కూడా సమర్థనీయమైనదిగా లేదా అనుమతించదగ్గదిగా నాకు కనిపించలేదు. మొత్తం విషయాలను పరిశీలించిన అనంతరం నేను సభ్యుల తీర్మానం నోటీసులను ఆమోదించరాదని నిర్ణయించుకున్నాను.

7. తీర్మానంలో చేసిన ఐదు ఆరోపణలను పరిశీలించగా, ఎక్కడా 'దుష్ప్రవర్తన' కారణంగా భారత చీఫ్ జస్టిస్‌ను తప్పుబట్టడం జరిగిందని నా దృష్టికి రాలేదు. ఆయనపై చేసిన ఆరోపణలకు నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేవని గుర్తించాను.

Image copyright Getty Images

8. గౌరవనీయ సభ్యులు రాజ్యసభ హ్యాండ్ బుక్‌లోని పేరా 2.2లోని అంశాలను విస్మరించారు. ఆ పేరాలో ఛైర్మన్ నోటీసులను అనుమతించేంత వరకు వాటిని బయట వెల్లడించరాదని పేర్కొనడం జరిగింది. నాకు నోటీసులు సమర్పించిన వెంటనే సభ్యులు 2018 ఏప్రిల్ 20న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, నోటీసులోని అంశాలు మీడియాతో పంచుకున్నారు. ఇది పార్లమెంట్ ప్రతిష్టను దెబ్బ తీసే చర్య.

9. అత్యున్నత ప్రజాస్వామ్య సంప్రదాయ వారసులుగా మనం రాజ్యాంగ పునాదులను, మన మాటలు, చేతలు, ఆలోచనల ద్వారా ప్రభుత్వ మూలస్థంభాలను బలహీనపరిచే చర్యలు చేపట్టరాదు. ఈ నేపథ్యంలో సభ్యుల తీర్మానాన్ని అనుమతించడం మంచిది కాదని నేను భావిస్తున్నాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా

ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్

బోరిస్ జాన్సన్: బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి