బెంగళూరు: 'ట్రాఫిక్ వల్ల నా స్నేహితులు ఉద్యోగాలే మానేశారు'

  • 25 ఏప్రిల్ 2018
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబెంగళూరు: 'ట్రాఫిక్ ఒత్తిడి భరించలేక కొందరు ఉద్యోగాలు మానేశారు'

''మా కంపెనీలో చేరండి, మీరిప్పుడు చేస్తున్న ఉద్యోగమే చేయండి, అదీ మీరున్న నగరంలోనే.. జీతం రెండింతలు ఇస్తాం'' - ఇలాంటి ఆఫర్ వస్తే మీరెలా స్పందిస్తారు?

బెంగళూరు వాసులైతే ముందు ''ఆఫీస్ ఎక్కడ'' అని అడుగుతారు. ఔను, కొన్ని సందర్భాల్లో వారికి జీతం కంటే ఆఫీసు ఎక్కడనేదే ముఖ్యం.

అక్కడకు వెళ్లి రావడానికి ఎంత సమయం పడుతుందనేదే ముఖ్యం.

చిత్రం శీర్షిక ఐటీ ఉద్యోగి సరోజా గౌడకు ఆఫీసుకు వెళ్లడానికి, ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి చేరుకోవడానికి కలిపి కనీసం నాలుగు గంటలు పడుతుంది.

గంటల తరబడి ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకుపోవడాన్ని, దానివల్ల కలిగే ఒత్తిడిని భరించలేక తనకు తెలిసినవాళ్లు, స్నేహితులు కొందరు ఏకంగా ఉద్యోగాలే మానేశారని బెంగళూరులో ఐటీ ఉద్యోగి అయిన సరోజా గౌడ చెబుతారు.

'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా పిలిచే బెంగళూరులో 1500కు పైగా బహుళజాతి(మల్టీ నేషనల్) సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కొరత, వాహనాల కొనుగోళ్లు పెరిగిపోతుండటం వల్ల కర్నాటక రాజధానిలో ట్రాఫిక్ సమస్య అంతకంతకూ తీవ్రమవుతోంది.

బెంగళూరు వాసులు ఏటా సగటున దాదాపు 250 గంటలు ట్రాఫిక్ రద్దీలోనే గడుపుతున్నారు.

గంటకు నాలుగున్నర కిలోమీటర్లు

ఐటీ ఉద్యోగి సరోజా గౌడకు ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి, ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి చేరుకోవడానికి కలిపి కనీసం నాలుగు గంటలు పడుతుంది.

ఐటీ సంస్థల కేంద్రమైన ఎలక్ట్రానిక్ సిటీకి దారితీసే సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద నిత్యం సరోజ లాంటి ఐటీ ఉద్యోగులు వందల మంది ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుంటారు. ఇక్కడ సిగ్నల్ దాటడానికే 25 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది.

ఈ జంక్షన్ వద్ద వాహనాలు సగటున గంటకు కేవలం నాలుగున్నర కిలోమీటర్ల వేగంతో కదులుతాయి.

Image copyright AFP
చిత్రం శీర్షిక బెంగళూరు వాసులు ఏటా దాదాపు 250 గంటలు ట్రాఫిక్ రద్దీలోనే గడుపుతున్నారు.

సమస్యను ఉద్యోగులు ఎలా ఎదుర్కొంటున్నారు?

ట్రాఫిక్ సమస్య కారణంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది ఐటీ ఉద్యోగులు కారులోనే ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ వాడుతూ ఆఫీసు పనులు చేసుకుంటున్నారు.

ఉదాహరణకు సరోజా గౌడనే తీసుకోండి. ఆమె క్యాబ్‌లోకి చేరుకోగానే తన ఆఫీసు పని మొదలుపెడతారు.

''ట్రాఫిక్ రద్దీ వల్ల అలసట, చిరాకు కలుగుతాయి. నా షిఫ్టు మొదలయ్యే సరికే నిరుత్సాహంగా అనిపిస్తుంటుంది. చేయాల్సిన పని చాలానే ఉంటుంది. అందుకే ప్రయాణంలో సమయం వృథా చేయకుండా క్యాబ్‌లోకి చేరుకోగానే ఆఫీసు పని మొదలుపెడతాను'' అని సరోజ బీబీసీతో చెప్పారు.

కొందరు ఉద్యోగులు కారులో గంటలు గంటలు ఒంటరిగా ప్రయాణించలేక 'కార్ పూలింగ్' విధానంలో కార్యాలయానికి వెళ్లి వస్తున్నారు.

ట్రాఫిక్ సమస్య వల్ల తమ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఐటీ సంస్థలు పరిగణనలోకి తీసుకొంటున్నాయి. అందుకే కార్యాలయానికి దగ్గర్లో వారికి వసతి కోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడం, కొన్నిసార్లు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును కల్పించడం చేస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఉద్యోగులకు 'ట్రాఫిక్' ఒత్తిడి తగ్గడం లేదు.

మెట్రో రైలు వచ్చినా బెంగళూరు సమస్య పరిష్కారం కాలేదు.

ఎలక్ట్రానిక్ సిటీకి మెట్రో సేవలు అందుబాటులోకి రావడానికి మూడు, నాలుగేళ్లు పడుతుందని బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్(బీఎంఆర్‌సీ) అధికారులు చెబుతున్నారు.

చిత్రం శీర్షిక హెలీట్యాక్సీ

గగనతల ట్యాక్సీ

ఈ ట్రాఫిక్ ఇబ్బందుల్లో తనకు వ్యాపారంపరంగా మంచి అవకాశం ఉందని 'తుంబీ ఏవియేషన్' అనే సంస్థ భావించింది. ఎలక్ట్రానిక్ సిటీకి, విమానాశ్రయానికి మధ్య హెలీట్యాక్సీ సర్వీసును ప్రారంభించింది. ప్రయాణ ఛార్జీని రూ.3,500గా నిర్ణయించింది. దీనికి పన్నులు అదనం. ఈ గగనతల ట్యాక్సీలో ఆరుగురు ప్రయాణించవచ్చు.

ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా తాము హెలీట్యాక్సీ సర్వీసును ప్రారంభించామని తుంబీ ఏవియేషన్ సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం అధిపతి గోవింద్ నాయర్ చెప్పారు.

''వినూత్న ఆవిష్కరణలను, వినూత్న పరిష్కారాలను స్వాగతించే నగరం బెంగళూరు. ఒక్కో ఐటీ ఉద్యోగి రోడ్డు మార్గంలో విమానాశ్రయానికి చేరుకోవడానికి రూ.1,000 నుంచి రూ.1,500 వెచ్చిస్తారు. రెండు, మూడు గంటల సమయం పడుతుంది. హెలీట్యాక్సీ వల్ల రెండు గంటల సమయం ఆదా అవుతుంది. ఈ సమయాన్ని కుటుంబంతో గడపొచ్చు. లేదా, ఏవైనా ముఖ్యమైన సమావేశాలు ఉంటే హాజరుకావొచ్చు. ఈ విధంగా చూస్తే, ఆదా అయ్యే సమయం ఎంతో విలువైనది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

Image copyright Twitter
చిత్రం శీర్షిక ''ఉబర్ పూల్‌లో వస్తున్న ముగ్గురు ఐఐటీ-ఐఐఎం గ్రాడ్యుయేట్లు బీటీఎం వాటర్ ట్యాంకు వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.. వాళ్లు అక్కడ ఫుడ్-టెక్ కంపెనీని ప్రారంభించారు'' అంటూ బెంగళూరు ట్రాఫిక్‌పై సరదాగా పెట్టిన ఒక ట్వీటు

అక్కడైతే పెళ్లి కూడా చేసుకోవచ్చు!

ట్రాఫిక్ సమస్యపై స్థానికులతో మాట్లాడితే కొందరు సరదాగా స్పందించారు.

సిల్క్ బోర్డు జంక్షన్ వద్ద ట్రాఫిక్ గురించి మీరేమనుకుంటున్నారు అని ట్రాఫిక్‌లో ఉన్న ఒక యువ ఐటీ ఉద్యోగిని అడిగితే, ఆయన పెద్దగా నవ్వేశారు.

ఒక జోక్ కూడా చెప్పారు.

'''నా గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, ఇందుకు తగిన ప్రదేశాన్ని సూచించండి' అని కోరుతూ బెంగళూరువాసి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'సిల్క్ బోర్డ్ జంక్షన్ వద్ద ప్రపోజ్ చెయ్యి, అక్కడైతే ప్రపోజ్ చేయడానికే కాదు... పెళ్లి చేసుకోవడానికి కూడా సరిపడా టైం ఉంటుంది' అని అతడికి సమాధానం వచ్చింది'' అని ఆయన చెప్పారు.

Image copyright Twitter
చిత్రం శీర్షిక బెంగళూరు ట్రాఫిక్‌పై మరో ట్వీట్

ట్విటర్‌లో @silk_board లాంటి పేరడీ ఖాతాల్లో ట్రాఫిక్‌కు సంబంధించి జోక్స్ కోకొల్లలుగా ఉన్నాయి.

మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల మదిలో మౌలిక సదుపాయాల అంశం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)