ప్రెస్‌రివ్యూ: ఆధార్‌తో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానం.. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం

  • 24 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

దేశంలో ఎవరికైనా ఒకే ఓటు ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోందంటూ నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుడుతోంది. దేశంలోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాను సమీకృతం చేయడంతోపాటు, ఓటరు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

దీనివల్ల దేశంలో ఒకరు ఒకటికన్నా ఎక్కువ ఓట్లు నమోదుచేసుకొనే ఆస్కారమే ఉండదు. నకిలీ ఓట్ల సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో దాదాపు 20 లక్షల వరకు నకిలీ ఓట్లను తొలిగించారు. అయితే రాజకీయ జోక్యంతో సమస్యలు ఎదురయ్యాయి.

అలాంటి విమర్శలకు ఆస్కారంలేని విధంగా నకిలీలను తొలిగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

కేంద్ర ఎన్నికల కమిషనర్ వివిధ రాష్ర్టాల ఎన్నికల అధికారులతో ఇటీవల సమావేశమై ఎన్నికల్లో తీసుకురానున్న సంస్కరణలపై వివరించారు.

ఓటర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని, త్వరలో ఆధార్ వివరాల సేకరణకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఓట్ల నమోదును పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు వివరాలు సైతం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుచేసేలా చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు.

వచ్చే 2019 ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని, త్వరలోనే మార్గదర్శకాలు వెలువడుతాయని అధికారులు తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.

Image copyright NOAH SEELAM/Getty Images

గవర్నర్‌కు హస్తిన నుంచి పిలుపు

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు దిల్లీ నుంచి పిలుపు వచ్చిందని 'ఈనాడు' తెలిపింది.

ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన దిల్లీలో పర్యటిస్తారు.

ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లతో భేటీ అయ్యి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని పాలన, రాజకీయ పరిస్థితులపై ఆయన కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది.

గవర్నర్‌ నరసింహన్‌ ఇటీవల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. వారి అసంతృప్తి, ఆవేదన, ప్రజల మనోభావాలు ఇతర అంశాలను తెలుసుకున్నారు.

రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆయన నివేదికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనిని ప్రధానికి అందజేసే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రిని సైతం ఆయన కలిసి మరో ప్రతిని అందజేస్తారు. ఈనెల 26న హైదరాబాద్‌కు తిరిగివస్తారు.

Image copyright PRAKASH SINGH/AFP/Getty Images

అంతా యాక్షనే.. ప్లాన్ నిల్

సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని అమలులో విఫలమైందని 'ప్రజాశక్తి' ఓ కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరింది.

రాయలసీమతోపాటు కోస్తా, ఉత్తరాంధ్రలలోనూ ఎండలు భగభగ మండుతున్నాయి. దాంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ప్రభుత్వం హడావిడిగా ఫిభ్రవరిలోనే సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించింది. అయినా క్షేత్రస్థాయిలో నేటికీ అమలుకు నోచుకోవట్లేదు.

అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం బిందె రూ. 8 నుండి రూ. 12 వరకూ వెచ్చించి కొనుక్కోవలసి వస్తోంది.

గతంలో మాదిరిగా పశువులకు నీటి వసతి కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించడంతో ఊరి చివర ఏర్పాటుచేసిన నీటి తొట్టెలు, కుంటలు నెర్రెలు బారాయి.

పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. లారీ వరి గడ్డి రూ. 80వేల నుండి రూ. 90వేల మధ్య పలుకుతుండడంతో పశువుల్ని మేపడం రైతులకు ఇబ్బందికరంగా మారింది.

ప్రభుత్వం సరఫరా చేస్తానన్న రూ. 2లకు కిలో గడ్డి రాష్ట్రంలో ఎక్కడా అమలు కావడం లేదు.

రాష్ట్రంలోని 60కు పైగా మున్సిపాల్టీల్లో తాగునీటి ఎద్దడి ఉంది.

ఉపాధి కూలీలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు వేయాలని, మజ్జిగ పంపిణీ చేయాలని అధికారులు వేసవి యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించారు.

మజ్జిగ పంపిణీలోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై మజ్జిగ నిధుల్ని బొక్కేస్తున్నారని ప్రజాశక్తి వివరించింది.

ఎంపీ అయ్యేందుకే చోరీలు చేస్తున్నా!

'ఎంపీగా పోటీ చేసేందుకే తాను చోరీలు చేస్తున్నానని' కిరణ్‌కుమార్‌ అనే అంతర్రాష్ట్ర నేరస్థుడు తెలిపాడంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. కిరణ్‌కుమార్‌ తన ముఠాతో కలిసి సోమవారం ఓ ఇన్నోవాను దొంగిలించి విక్రయిస్తుండగా వినుకొండ పోలీసులకు పట్టుబడ్డాడు.

'నాకు ప్రజాసేవ చేయాలని ఉంది. ఎంపీగా పోటీచేసి అందరి తలరాతలు మారుస్తా. సామాన్యుడికి ఉపయోగపడేలా ఎన్నికల ప్రణాళిక తయారుచేశా. దీన్ని అమలు చేయడానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికకావాలని అనుకుంటున్నా. ఎన్నికల ఖర్చుల కోసమే చోరీలు చేస్తున్నా' అని అతడు వివరించాడు.

ఇతడే 2014లో హైదరాబాద్‌లోని తనిష్క్‌ నగల దుకాణంలో భారీ చోరీ చేశాడు. అనంతరం తనంతటతానుగా మీడియా సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు.

తాజాగా తన ముఠాతో కలిసి ఓ ఇన్నోవా కారును దొంగిలించి విజయవాడలో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.

వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న ఈ ముఠాను వినుకొండ గ్రామీణ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈపూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వినుకొండ కోర్టులో హాజరుపరిచారని ఈనాడు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)