ఆశారాం బాపు: అసలెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేశారు?

  • 24 ఏప్రిల్ 2018
ఆశారాం బాపు Image copyright Getty Images

అత్యాచారం కేసులో నిందితుడు ఆశారాం బాపు భవితవ్యాన్ని తెల్చే కీలకమైన తీర్పు బుధవారం వెలువడనుంది. ఈ సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో జోధ్‌పూర్‌కు చేరుకునే అవకాశం ఉంది. అందువల్ల ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు జోధ్‌పూర్‌లో ఏప్రిల్ 30 వరకు 144 సెక్షన్ విధించారు.

ఈ నేపథ్యంలో అసలు ఆశారాం బాపు ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయనకూ ఇక్కడి రాజకీయ నేతలకు సంబంధం ఏంటి?

ఆయన ఎలా కేసులో ఇరుక్కున్నారు?

ఐదేళ్లుగా ఆశారాం బాపు, బాధితుల కుటుంబానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంలో మలుపులేంటి? చదవండి మరి..

పుట్టింది ‘పాకిస్తాన్‌’లో..

1941 ఏప్రిల్‌లో ప్రస్తుత పాకిస్తాన్‌ సింధ్ జిల్లాలోని బేరానీ గ్రామంలో ఆశారాం జన్మించారు. ఆయన అసలు పేరు అసుమల్ హర్పలానీ. ఆయనది సింధీ వ్యాపార కుటుంబం. దేశ విభజన అనంతరం 1947లో ఆయన కుటుంబం అహ్మదాబాద్‌కు వచ్చేసింది.

1960 ప్రాంతంలో ఆయన లీలాషాహ్‌ను ఆధ్యాత్మిక గురువుగా చేసుకున్నారు. ఆయనే తర్వాత అసుమల్ పేరును ఆశారాంగా మార్చారు.

1972లో ఆశారాం బాపు మొదటిసారిగా అహ్మదాబాద్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబర్మతీ తీరంలో కుటీరాన్ని నిర్మించుకున్నారు.

నాటి నుంచి ఆశారాం ఆధ్యాత్మిక ప్రాజెక్టు ప్రారంభమైంది. అక్కడి నుంచి అది గుజరాత్‌లోని ఇతర నగరాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించడం మొదలైంది.

Image copyright Getty Images

మొదట్లో గ్రామీణ ప్రాంతాలలో పేద, గిరిజన, వెనుకబడిన వర్గాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కీర్తనలతో ప్రారంభమైన ఆశారాం కార్యకలాపాలు క్రమక్రమంగా రాష్ట్రంలోని మధ్యతరగతి వర్గానికి విస్తరించాయి.

ఆధ్యాత్మిక ప్రవచనాలతో పాటు ప్రసాదం పేరిట ఆయన భక్తులకు భోజనాన్ని కూడా పెట్టేవారు. దీంతో ఆయన వద్దకు వచ్చే భక్తుల సంఖ్య వేగంగా పెరిగింది.

ఆశారాం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు నాలుగు కోట్ల మంది 'భక్తులు' ఉన్నారు.

క్రమక్రమంగా ఆశారాం బాపు, తన కుమారుడితో కలిసి తన సామ్రాజ్యాన్ని దేశవిదేశాలలో 400 ఆశ్రమాలకు విస్తరించారు.

దాదాపు 10 వేల కోట్ల రూపాయలకు పైగా ఉన్న ఆస్తులపై ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ, ఈడీలు విచారణ జరుపుతున్నాయి.

Image copyright YOUTUBE GRAB
చిత్రం శీర్షిక ఆశారాం బాపుతో మాజీ ప్రధాని వాజ్‌పేయి

మోదీ కూడా ఆశారాంను దర్శించుకున్నవారే!

ఆశారాం భక్తుల సంఖ్య పెరగడంతో , ఆయన భక్తుల ఓట్లు కోసం రాజకీయ నాయకులూ రంగంలోకి దిగారు.

ఎల్ కే అడ్వాణీ, నితిన్ గడ్కరీ, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సహా అనేక మంది బీజేపీ నేతలు ఆయన భక్తుల జాబితాలో ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్, ఉమా భారతి, రమణ్ సింగ్, ప్రేమ్ కుమార్ ధుమాల్, వసుంధర రాజెలాంటి ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రులు, ప్రముఖులూ ఆయనను గతంలో సందర్శించుకున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, మోతీలాల్ వోరాలు కూడా ఆయన భక్తులే.

నేటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకప్పుడు ఆయనను దర్శించుకున్నవారే.

Image copyright Getty Images

ఎన్నో కేసులు

2008, జులై 5న 10 ఏళ్ల అభిషేక్ వాఘేలా, 11 ఏళ్ల దీపేశ్ వాఘేలాల సగం కాలిన మృతదేశాలు ఆశారాం బాపు ఆశ్రమం బైట కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి.

అహ్మదాబాద్‌కు చెందిన వీరిద్దరూ చనిపోవానికి కొద్ది రోజుల ముందే ఆశారాం బాపు 'గురుకుల' పాఠశాలలో చేరారు.

దీనిపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది కానీ ఆ కమిటీ నివేదికను నేటి వరకు బహిర్గతం చేయలేదు.

మరోవైపు 2012లో ముఠేరా ఆశ్రమంలో 7 మంది ఉద్యోగుల మృతిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసు అహ్మదాబాద్ సెషన్స్ కోర్టులో నడుస్తోంది.

Image copyright Getty Images

జోధ్‌పూర్ కేసు ఏంటి?

2013 ఆగస్టులో ఆశారాం బాపుపై అత్యాచార ఆరోపణలు చేసిన షాజహాన్‌పూర్‌కు చెందిన బాధితురాలి కుటుంబం మొత్తం మొదట్లో ఆయన భక్తులే.

'పవిత్రమైన విద్య' లభిస్తుందనే నమ్మకంతో ఇద్దరు పిల్లలను ఆయన చింద్వాడా ఆశ్రమానికి పంపారు. 2013, ఆగస్టు 7న బాధితురాలి తండ్రికి 16 ఏళ్ల కూతురు అనారోగ్యంతో ఉన్నట్లు ఫోన్ వచ్చింది.

బాధితురాలి తల్లిదండ్రులు మరుసటిరోజు చింద్వాడా చేరుకున్నపుడు, ఆయన కుమార్తెకు దయ్యం పట్టిందని, వాటిని ఆశారాం బాపు బాగు చేస్తారని తెలిపారు. ఆగస్టు 14న బాధితురాలి కుటుంబం ఆశారాంను కలిసేందుకు జోధ్‌పూర్‌కు వెళ్లింది.

ఆగస్టు 15న నమోదు చేసిన ఛార్జిషీటులో ఆశారాం 16 ఏళ్ల బాధితురాలి ఆరోగ్యాన్ని బాగు చేస్తాననే నెపంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించారు.

ఈ ఫిర్యాదుతో బాధితురాలి తండ్రిని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆయనను డబ్బు ఇచ్చి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా ఆ కుటుంబం ఆశారాం బాపుపై న్యాయపోరాటం చేస్తూనే ఉంది.

Image copyright Getty Images

సాక్షులపై దాడుల పరంపర

  • 2014, ఫిబ్రవరి 28న ఆశారాం, ఆయన కుమారుడు నారాయణ సాయిపై అత్యాచార ఆరోపణలు చేసిన సూరత్‌కు చెందిన ఇద్దరు బాధితురాళ్లలో ఒకరి భర్తపై హత్యాయత్నం జరిగింది.
  • ఆ తర్వాత 15 రోజులకు ఆశారాం వీడియోగ్రాఫర్ రాకేష్ పటేల్‌పై దాడి జరిగింది. మరికొన్ని రోజుల తర్వాత మూడో సాక్షి తేజేశ్ భగ్నానీపై యాసిడ్ దాడి జరిగింది. ఈ మూడు హత్యాయత్నాల నుంచి సాక్షులు బతికి బయటపడ్డారు.
  • ఆ తర్వాత 2014, ఏప్రిల్ 23న ఆశారాం వ్యక్తిగత సహాయకుడు అమృత్ ప్రజాపతిపై నాలుగో దాడి జరిగింది. ఆయనను పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్చారు. తీవ్రంగా గాయపడిన ప్రజాపతి 17 రోజుల అనంతరం చికిత్స పొందుతూ మరణించారు.
  • ఆ తర్వాత ఆశారాంపై 187 వార్తలు రాసిన జర్నలిస్ట్ నరేంద్ర యాదవ్‌పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి పారిపోయారు. నరేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. మూడు ఆపరేషన్ల తర్వాత ఆయన మృత్యు ముఖం నుంచి బయటపడ్డారు.
  • 2015 జనవరిలో మరో సాక్షి అఖిల్ గుప్తాను కాల్చి చంపారు.
  • ఆ తర్వాత మరో నెలలోపలే ఆశారాం ఆఫీసులో పని చేసే రాహుల్ సచాన్‌పై కోర్టు పరిసరాల్లోనే హత్యాయత్నం జరిగింది. రాహుల్ ఆ దాడి నుంచి బయటపడ్డారు. కానీ 2015 నవంబర్ 25 నుంచి ఆయన ఆచూకీ లేదు.
  • ఇక ఈ కేసులో ఎనిమిదో దాడి 2015, మే 13న పానిపట్‌లో మహేంద్ర చావ్లాపై జరిగింది. ఆ దాడి నుంచి ప్రాణాలతో బైటపడిన మహేంద్ర పాక్షిక వికలాంగునిగా మారారు.
  • ఈ దాడి జరిగిన మరో 3 నెలల్లోనే జోధ్‌పూర్ కేసులో సాక్షి అయిన కృపాల్ సింగ్‌ను కాల్చి చంపారు. హత్యకు కొద్ది రోజుల ముందే ఆయన బాధితురాలికి అనుకూలంగా జోధ్‌పూర్ కోర్టులో సాక్ష్యం ఇచ్చారు.
Image copyright Getty Images

ఆశారాం పక్షాన పోరాడుతున్న లాయర్లు

గత ఐదేళ్లుగా దేశంలోని ప్రముఖ లాయర్లు ఆశారాం తరపున పలు కోర్టులో కేసులు వాదిస్తున్నారు. వారిలో రామ్ జెఠ్మలానీ, రాజు రామచంద్రన్, సుబ్రమణ్యస్వామి, సిద్ధార్థ లుథారియా, సల్మాన్ ఖుర్షీద్, కేటీఎస్ తులసి, యు.యు.లలిత్‌లు ఉన్నారు.

వివిధ కోర్టులలో ఇప్పటివరకు ఆశారం బెయిల్ పిటిషన్లను 11 సార్లు తిరస్కరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)