సచిన్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: నాలుగేళ్ల కిందట ఆయన ఏమన్నారు?

  • 24 ఏప్రిల్ 2018
సచిన్ టెండూల్కర్ Image copyright Getty Images

భారత క్రికెట్ ‘దేవుడు’ సచిన్ తెందూల్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 24. దాదాపు పాతికేళ్లు క్రికెటే శ్వాసగా ఆడిన సచిన్ 2013 నవంబర్‌లో ఆట నుంచి రిటైర్ అయ్యారు. ఆ సందర్భంగా సచిన్‌ను బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. నేడు సచిన్ పుట్టిన రోజు సందర్భంగా ఆ ఇంటర్వ్యూ సారాంశం ఇదీ...

బీబీసీ: సచిన్ మీరు ఎందుకు రిటైర్ అవుతున్నారు?

జవాబు: 24 ఏళ్ల తర్వాత శరీరం సహకరించడంలేదు. రోజూ ఉదయాన్నే లేవడం, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడం అంత సులుభం కాదు. ఒక దశకు వచ్చిన తర్వాత విశ్రాంతి కావాలని మన శరీరమే చెబుతుంది.

జిమ్‌కి వెళ్లకుండా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటే బాగున్నట్లు అనిపిస్తోంది. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. ప్రత్యేకించి భారత్‌లో వెస్టిండీస్ మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించాక ఇక క్రికెట్ నుంచి బయటకు వెళ్లేందుకు ఇదే సరైన సమయం అనిపించింది.

దాంతో చివరి మ్యాచ్‌ని ముంబయిలో నిర్వహించాలని బీసీసీఐని కోరాను. ఎందుకంటే ముంబయిలో అయితే మా అమ్మ కూడా వచ్చి ఆ మ్యాచ్‌ని చూడగలరు

బీబీసీ: ఓ కర్ర ముక్కతో బంతిని పరుగులు పెట్టించే వ్యక్తిగా మీకు మంచి గుర్తింపు ఉంది. అది మిమ్మల్ని ఎందుకు ఇంతపెద్ద సెలబ్రెటీగా చేసింది?

జవాబు: దాని వెనకున్న కారణం ఏమిటో నాకు తెలియదు. నా బ్యాటింగ్‌ శైలిని ప్రజలు ఇష్టపడుతుండొచ్చు.

నాకు చాలామంది ఇష్టం. సునీల్ గవాస్కర్ నా హీరో, వివ్ రిచర్డ్ నా హీరో. ఎప్పుడూ వాళ్లను హీరోలుగానే భావిస్తాను. అందుకే క్రికెట్ ఆడటం ప్రారంభించాను. వాళ్లలా నేను కూడా అవ్వాలని ఉండేది.

Image copyright Getty Images

బీబీసీ: మీరు వారికంటే పైకి ఎదిగారు. ప్రజల్లో ఆందోళనను నివారించే చక్కని మందు మీరు అని ఓ ప్రముఖ పాత్రికేయుడు వ్యాఖ్యానించారు. మీరేమంటారు?

జవాబు: దానికి నేను నో అని చెబుతాను. ప్రజలు ఊహించని స్థాయిలో నాకు మద్దతుగా నిలిచారు. వాళ్ల ఆదరణ వల్లే నా 24 ఏళ్ల ప్రయాణం సాగింది. అది నేను మరచిపోలేను.

నాకు సాధ్యమైనంత కృషి చేశాను. ఆరేడు ఏళ్ల వయసు నుంచే క్రికెట్‌తో ప్రేమలో పడ్డాను. అప్పుడు సరదాగా ఆడేవాడిని. 11 ఏళ్లు వయసు వచ్చాక క్రికెట్ బాగా ఆడాలని అనుకున్నా. ఇక 1983లో భారత్ ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత, అలా నేను కూడా ఆడాలని అనిపించింది.

అప్పటి నుంచే నా రియల్ క్రికెట్ ప్రారంభమైంది. ఆ తర్వాత నేను మరోటి ఆలోచించలేదు. దేశం కోసం ఆడుతుంటే ఆనందంగా అనిపించింది.

బీబీసీ: అభిమానులు మిమ్మల్ని విపరీతంగా పొగుడుతున్నారు. ఆరాధిస్తున్నారు. మీరెలా ఫీలవుతున్నారు?

జవాబు: నేను ఈ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నపుడు ఇలాంటి స్పందన వస్తుందని ఏనాడూ ఊహించలేదు.

ఇది మనం ప్లాన్ చేయగలిగేది కాదు. ఇదంతా దేవుడి రచన. అలా జరిగిపోయింది. ఇది నా జీవితాంతం గుర్తుంటుంది.

Image copyright Getty Images

బీబీసీ: మీ అభిమానులు ఇంతగా పొగడటం ప్రమాదకరమా?

జవాబు: ప్రజలు మనస్ఫూర్తిగా అభినందించటం ప్రమాదకరమని అనుకోవట్లేదు. దాన్ని ఓ ఆశీర్వాదంగా తీసుకున్నాను. అదే నా బలం.

ప్రతి సారీ బాగా ఆడేందుకు వారి అభినందనలే నాకు స్ఫూర్తినిచ్చాయి. దేశంలో 100 కోట్ల మందికి పైగా అభినందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

బీబీసీ: మీరు ఎక్కువగా షాపింగ్‌కి వెళ్లగలుగుతారా?

జవాబు: నో.. నేను షాపింగ్‌కి వెళ్లలేను. కానీ.. షాపింగ్ మిస్ అవుతున్నానని బాధపడను.

అది నాణేనికి రెండో వైపు వంటిది. షాపింగ్ అంటే షాపింగే అని నేను చూస్తా. దాని గురించి బాధపడను.

Image copyright Getty Images

బీబీసీ: చాలా మంది రోడ్డులో జనం తమ చుట్టూ మూగకుండా.. మామూలు మనుషుల్లాగా తిరగటాన్ని ఇష్టపడతారు. మీరు అలాంటిది ఇష్టపడరా?

జవాబు: కొన్ని పనులు చేయలేనని నాకు తెలుసు. ఇండియాలో మామూలు మనిషి చేసే పనులు చేయలేనని తెలుసు.

కానీ ఇది ఒక ప్యాకేజీ వంటిది. కొన్ని విషయాలతో పాటు కొన్ని విశిష్టతలుంటాయి. కొన్ని చేయగలం. మరోవైపు కొన్ని చేయలేం. మామూలు మనుషులు చేసే పనులన్నీ చేయలేం.

నాకు ఏదైనా ప్రత్యామ్నాయాలున్నట్లయితే.. మరొక దానిని దేనినీ ఎంచుకోను. ఇదంతా చాలా ఫెంటాస్టిక్‌గా సాగింది.

Image copyright Getty Images

బీబీసీ: ఇప్పుడు మీరు ఇండియాలో అత్యంత ప్రముఖ వ్యక్తి. ప్రపంచవ్యాప్తంగా జీవించివున్న అత్యంత ప్రముఖ భారతీయుడు మీరే. అలాంటి కీర్తి వేదికగా మీరు ఏం చేయబోతున్నారు?

జవాబు: నేను చేయాలనుకునే పనులు ఉన్నాయి. నాకు బాగా ఇష్టమైన పని. ఇప్పటికే మొదలుపెట్టాను. దేశమంతటా వెలుగు నింపటం.

ఇండియాలో లైట్లు లేని మారుమూల ప్రాంతాలున్నాయి. సూర్యాస్తమయం తర్వాత మళ్లీ సూర్యోదయం వరకూ ఇళ్లలో వెలుతురు లేని ప్రాంతాలవి.

ఆ ఇళ్లకు సోలార్ లైట్లు అందించాలని అనుకుంటున్నా. అలా దేశం మొత్తం వెలిగేలా చేయాలనుకుంటున్నా.

ఈ పని కొంత కాలం కిందట మొదలుపెట్టాం. కొన్ని గ్రామాలకు లైట్లు సమకూర్చాం. అక్కడ స్కూళ్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నిస్తున్నాం.

ప్రజలకు సంతోషం అందించాలన్నది ఆలోచన. అందుకే ఈ కార్యక్రమానికి ‘స్ప్రెడింగ్ హ్యాపీనెస్’ అని పేరు పెట్టాం.

బీబీసీ : ఇంత భారీ స్థాయిలో అభిమానులు ఉండటం వల్ల.. వారికి తిరిగి ఇవ్వటం మీ బాధ్యతగా భావిస్తున్నారా?

జవాబు: క్రికెట్ ఆడుతున్నపుడు అంత సమయం లేదు. నాకున్న కొద్ది సమయంలో పలు మంచి పనులకు మద్దతివ్వటానికి నా శక్తి మేర కృషి చేశాను.

ఇప్పుడు నాకు ఎక్కువ టైం ఉంది కాబట్టి నేను నమ్మే కొన్ని పనుల్లో భాగస్వామిని కావాలనుకుంటున్నాను. వాటిలో ఈ కార్యక్రమం ఒకటి.

నేను ఒక్కడినే కాదు.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో చేరవచ్చు. ఇది కనీస అవసరం. కేవలం సోలార్ లైట్లు అందించటం.

పిల్లలు రాత్రిపూట చదువుకోవటానికి, తల్లులు రాత్రిపూట తాము ఏం వండుతున్నామో చూడటానికి. ఇవి జీవితానికి కనీస అవసరాలు.

ఇది ప్రభుత్వమో ఇంకెవరో చేయలేకపోతున్నారని నేనటం లేదు. ఇది.. పేదల కోసం మనమంతా కలిసి చేస్తున్న కృషి. అంతే.

Image copyright Getty Images

బీబీసీ : మీరు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు...

జవాబు: ఎంపీగా ఉండటం చాలా పెద్ద గౌరవం. నేను ఎన్నికవలేదు. నన్ను నామినేట్ చేశారు.

అక్కడికి వెళ్లటానికి నిజంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇదొక గౌరవం.

నేను చేపట్టిన కార్యక్రమం గురించి ఇప్పుడే మీకు చెప్పాను. ఎంపీగా నేను ఈ పని చేయలేకపోయినప్పటికీ.. భారతీయ క్రీడల కోసం నేను కొన్ని ప్రణాళికలు అందించాను.

రాబోయే 20 ఏళ్ల కోసం మనం ఎలా ప్రణాళిక రచించాలనేదానిపై నా ఆలోచనలు తెలియజేశాను. అవి అమలులోకి రావటానికి కొంత సమయం పడుతుంది.

బీబీసీ : దానికి మీరెలా సాయం చేయగలరు? మీరు ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరు. కానీ మామూలుగా క్రీడల్లో భారత్ పెద్దగా రాణించదు. దానికి మీరెలా సాయం చెగలరు?

జవాబు: మా దగ్గర టాలెంట్ ఉందని నేను కచ్చితంగా చెప్పగలను. క్రీడల్లో భారత్ పెద్దగా రాణించదనేది అపోహ.

మేం పతకాలు గెలిచాం. పతకాలు గాలి లోంచి ఊడిపడవు. వాటిని గెలవటానికి కష్టపడాలి. అంకితభావం కావాలి.

దేశానికి ఆ పతకాలు తేవటం కోసం భారతీయ అథ్లెట్లు ఎన్నో త్యాగాలు చేశారు. వారికి హ్యాట్సాఫ్. ఆ క్రీడాకారులందరిని చూసి దేశం మొత్తం గర్విస్తుంది.

అయితే.. మరిన్ని ఎక్కువ పతకాలు ఎలా తేగలమనేదే ప్రశ్న. ఇందుకు ఒక పటిష్ట పునాదిని నిర్మించాలి.

ఆ భవిష్యత్ వ్యూహం 15, 20 ఏళ్లకు మించి ఉండాలి. ఎల్లప్పుడూ ఉండాలి. రాబోయే చాలా తరాలు ఆ సదుపాయాలను ఉపయోగించుకునేలా ఉండాలి.

Image copyright Getty Images

బీబీసీ: మీ సొంత ఆటకు వద్దాం. భారతీయ క్రికెట్‌లో మిమ్మల్ని ‘మిస్టర్ క్లీన్’గా పరిగణిస్తారు. కానీ క్రికెట్ క్రీడకే ఒక చెడ్డ పేరు ఉంది. అది మీకు బాధ కలిగిస్తుందా? భారతీయ క్రికెట్‌ను ప్రక్షాళన చేయడానికి ఏం చేయాల్సి ఉంది?

జవాబు: ఆటలో కొన్ని అవాంఛిత ఘటనలు జరిగినపుడు బాధ కలిగింది.

వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు అనేది వారి మీదే ఆధారపడి ఉందని నేను భావిస్తాను. దానిని ఆపటానికి వారు కొన్ని పనులు చేయవచ్చు.

అయినా.. చివరికి అది వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని ఎలా ఆపగలం?

ఇది.. దేశానికి ప్రాతినిధ్యం వహించటమనేది. అన్నిటికన్నా గొప్ప విషయం. దానిని గర్వంగా భావించాలి.

బీబీసీ: ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది కదా?

జవాబు: అవును. దానికో ప్రక్రియ ఉంది. టీమ్ ఆ పనిలో ఉంది. నేను వారు ఏం చేయాలో సలహా ఇచ్చేంత నిపుణుడ్ని కాదు.

కానీ.. ఆట స్వచ్ఛంగా ఉండటానికి సాధ్యమైన చర్యలన్నీ ఐసీసీ చేపడుతోంది. ఆటను వీక్షించే ప్రేక్షకులు అది నిష్పాక్షికమైన పోటీగా భావించగలగాలి.

కేవలం క్రికెట్ మాత్రమే కాదు.. ఏ ఆట అయినా అలాగే ఉండాలి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు