ప్రెస్ రివ్యూ: 'చంద్రబాబు పేల్చింది నకిలీ బుల్లెట్': జగన్

  • 25 ఏప్రిల్ 2018
Image copyright www.facebook.com/ysrcpofficial

'రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను నాలుగేళ్లుగా దగ్గరుండి మరీ ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు కొంగ జపం చేస్తున్నారు' అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విమర్శించారంటూ 'సాక్షి' ఓ కథనం ప్రచురించింది.

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 144వ రోజు మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సభలో ఇంకా ఏమన్నారంటే..

"ప్రత్యేక హోదా ఉన్నప్పుడు పరిశ్రమలు ఆదాయ పన్ను రాయితీ పొందుతాయి. ఎవరైనా హాస్పిటల్, హోటల్‌ కట్టాలనుకుంటే హోదా ఉంటే ఆదాయం పన్ను, ఎకైజ్‌ సుంకం కింద జీఎస్‌టీ కట్టాల్సిన పనిలేదని ఆలోచిస్తారు. దాంతో మన పిల్లలకు మన దగ్గరే ఉద్యోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది.

పేదవాళ్లు డబ్బులు లేక ఒక్కపూటే తింటున్నారనే సంగతి ఈ పెద్దమనిషికి తెలియడం లేదు. ఉద్యోగాలు వస్తేనే వారి కడుపు నిండుతుందన్న సంగతీ తెలియడం లేదు. కానీ తన ఒక్క పూట దీక్ష కోసం రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టారు.

చంద్రబాబు వైఖరి చూస్తే ఓ కథ గుర్తుకొస్తోంది. యుద్ధానికి వెళ్లిన ఒక సిపాయి తుపాకీ గురిపెట్టి పేల్చారు. కానీ అందులోంచి బుల్లెట్ బయటకు రాలేదు. ఎందుకంటే అది నకిలీ బుల్లెట్. యుద్ధం జరిగేటప్పుడు బుల్లెట్ బయటకు రాకపోతే ఏం జరుగుతుంది? చంద్రబాబు కూడా అచ్చం ఇలాగే చేశారు.

పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజున చంద్రబాబు తన పార్టీ ఎంపీలందరితో రాజీనామా చేయించి, ఆమరణ దీక్ష చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది కదా? అని జగన్ ప్రశ్నించారని సాక్షి వివరించింది.

Image copyright tdp.ncbn.official/facebook

నరసింహా... మీకిది తగునా?

గవర్నర్‌ నరసింహన్‌ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారంటూ 'ఆంధ్రజ్యోతి' ఓ కథనం రాసింది.

ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను గవర్నరే కలుపుతున్నారనే వార్తలు వస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

పంచాయతీరాజ్‌ జాతీయ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో మంగళవారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ''అందరినీ గవర్నరే కలుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. గవర్నర్‌ వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. గవర్నర్‌ వ్యవస్థే వద్దని టీడీపీ చెప్పింది. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడింది'' అని చంద్రబాబు గుర్తు చేశారు.

''అవినీతిపరులతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ నన్ను అణగదొక్కాలని మోదీ చూస్తున్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని నిలదీస్తే వైసీపీని రెచ్చగొడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. మొన్నటి వరకూ మనవెంట ఉన్న పవన్‌కల్యాణ్‌ ఇప్పుడు మనల్ని విమర్శిస్తున్నారు. కేంద్రం ఎన్ని విధాలా ఆడించాలో అన్ని విధాలా ఆడిస్తోంది.. మనల్ని ఇబ్బంది పెడుతూ సమస్యలు సృష్టిస్తోంది'' అని చంద్రబాబు మండిపడ్డారని ఆంధ్రజ్యోతి రాసింది.

Image copyright Getty Images

తెలంగాణలో అసాధారణంగా జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ అసాధారణ పనితీరును కనబరుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసించిందని 'నమస్తే తెలంగాణ' తెలిపింది.

జీఎస్టీ రాబడిలో జాతీయ సగటు కంటే తెలంగాణ మెరుగైన ఫలితాలను సాధిస్తోందని కేంద్రప్రభుత్వం అభినందించింది. త్వరలోనే రెవెన్యూ లోటు పోయి రెవెన్యూ మిగులు సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేసింది.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ హస్ముఖ్ అధియా ఈ మేరకు తెలంగాణ సీఎస్ ఎస్కే జోషికి లేఖ రాశారు.

గత ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా ఎస్‌జీఎస్టీ వసూళ్లలో రాబడి లోటు 28.3 శాతంగా ఉండగా.. అది ఈ ఏడాది మార్చికి 17.9 శాతానికి తగ్గిందని తెలిపారు.

దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోలిస్తే రాబడిని పెంచుకోవడంలో తెలంగాణ ఎంతో ముందుదన్నారు.

మున్ముందు ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తారని అధియా ఆకాంక్షించారు. ఈ ఒరవడిని ఇదేవిధంగా కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో రెవెన్యూలోటు అనేది లేకుండా పోయి రెవెన్యూ మిగులును సాధిస్తారని పేర్కొన్నారు.

జీఎస్టీ రాబడిని పెంచుకోవడానికి, లోటును తగ్గించుకునేందుకు అన్ని రాష్ట్రాలు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందన్నారు.

గాలులు Image copyright Getty Images

ఆఫ్రికా గాలులతో 'అలల' కల్లోలం

ఆఫ్రికా నుంచి అరేబియా సముద్రం వైపు వీస్తున్న ప్రచండమైన గాలులు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

ఈ గాలుల ప్రభావంతో అరేబియా, హిందూ మహాసముద్రాల్లో అలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే కేరళలో దాదాపు 200 ఇళ్లు ధ్వంసమయ్యాయి. తీరం నుంచి 50 మీటర్ల వరకున్న ఆవాసాలను కేరళ ప్రభుత్వం ఖాళీ చేయించింది.

కొల్లాం, కొచ్చి, అలప్పుజా, తిరువనంతపురంలో బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటుచేసింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, పశ్చిమబెంగాల్‌ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉన్నదని సునామి హెచ్చరికల సంస్థ 'ఇన్‌కాయిస్‌' హెచ్చరించింది.

ఈ నెల 26 వరకు సముద్రంలో అలల ఉధృతి అధికంగా ఉంటుందని అప్రమత్తం చేసింది. తీరానికి సమీపంలో నివాసముంటున్న మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)