#గమ్యం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి మార్గం చూపే మెరైన్ ఇంజనీరింగ్

  • 29 ఏప్రిల్ 2018
ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్శిటీ (ఐఎమ్‌యూ) Image copyright Getty Images

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

భారతదేశానికి మూడువైపులా సముద్రాలున్నాయి. అందువల్ల షిప్ బిల్డింగ్, నేవల్ ఆర్కిటెక్చర్, ఓషనాలజీ, బల్క్ గూడ్స్ (డేంజరస్ గూడ్స్) ట్రాన్స్‌పోర్టేషన్, సముద్ర జలాలకు సంబంధించిన చట్టాలు, సముద్రపు సరిహద్దుల భద్రత, మెరైన్ ఇంజనీరింగ్... ఈ రంగాల్లో నిపుణులైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి, మంచి భవిష్యత్ నిర్మించుకోవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి.

ఇంజనీరింగ్ అంటే అందరికీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, సివిల్, మెకానికల్... ఇవే అనుకుంటారు. అలాగే ఎంబీఏ అంటే హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్... అందరికీ ఇవే గుర్తొస్తాయి. కానీ ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్శిటీ (ఐఎమ్‌యూ) ఆఫర్ చేసే ప్రత్యేక కోర్సుల గురించి చాలామందికి అవగాహన తక్కువ.

ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్శిటీ (ఐఎమ్‌యూ)లో ప్రవేశాలు, కోర్సులు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్ ప్రక్రియ, ఉద్యోగావకాశాలు... వీటి గురించి ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media caption#గమ్యం: ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్శిటీలో చేరడం ఎలా?

అసలు మెరైన్ ఇంజనీరింగ్ అంటే...

షిప్ ఎలా తయారవుతుంది? దానిలో ఇమిడి ఉన్న టెక్నాలజీ ఏమిటి? షిప్ ఎలా నడపాలి, ఏయే జాగ్రత్తలు అవసరం? ప్లాట్‌ఫామ్స్ ఎలా నిర్మించాలి? నేవల్ ఆర్కిటెక్చర్ (షిప్ డిజైనింగ్) అంటే ఏమిటి?... ఇలాంటి అంశాలన్నీ మెరైన్ ఇంజనీరింగ్ కిందకు వస్తాయి.

ముంబైలో మూడు, కోల్‌కతాలో రెండు క్యాంపస్‌లు ఉండేవి. వీటన్నింటినీ కలిపి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్శిటీ అనే పేరుతో సమీకృత విద్యాసంస్థను ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఓ క్యాంపస్, తమిళనాడులోని చెన్నైలో మరో క్యాంపస్ ఉన్నాయి. ఇవి కాకుండా పుణె, ముంబై, పోర్ట్‌బ్లెయిర్ వంటి కొన్ని నగరాల్లో అనుబంధ సంస్థలు మరో 21 ఉన్నాయి.

Image copyright IMU

షిప్ బిల్డింగ్, ఓషనాలజీ, బల్క్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్, సముద్ర జలాలకు సంబంధించిన చట్టాలు, సముద్రపు సరిహద్దుల భద్రత, మెరైన్ ఇంజనీరింగ్... వంటి అంశాలకు సంబంధించిన విద్యనందించే కేంద్రీయ సంస్థ మ్యారిటైమ్ యూనివర్శిటీ. ఐఎమ్‌యూ వివిధ కోర్సులను మూడు విభాగాల్లో అందిస్తోంది.

1. గ్రాడ్యుయేషన్ - బీటెక్, బీఎస్సీ, బీబీఏ, డిప్లొమా

బీటెక్‌లో మెరైన్ ఇంజనీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషనాలజీ ఇంజనీరింగ్ వంటివి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బీబీఏలో లాజిస్టిక్స్, రీటైల్ అండ్ ఈ-కామర్స్ వంటి కోర్సులను అందిస్తున్నారు. మ్యారిటైమ్ సైన్స్, నాటికల్ సైన్స్, షిప్ బిల్డింగ్ అండ్ రిపెయిర్‌లపై మూడేళ్ల బీఎస్సీ డిగ్రీని అందిస్తున్నారు. సంవత్సరం వ్యవధితో అందించే డిప్లొమా చేసినా బీఎస్సీలో లేటరల్ ఎంట్రీ ద్వారా చేరవచ్చు.

2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ - ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా

మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్; కమర్షియల్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్‌లో ఎంఎస్సీ, పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌లలో ఎంబీఏ డిగ్రీని ఐఎమ్‌యూ అందిస్తోంది. మెరైన్ ఇంజనీరింగ్‌లో పీజీ డిప్లొమా (పీజీడీఎంఈ) కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. దీనికి ప్రతి సంవత్సరం జనవరిలో మాత్రమే ప్రవేశాలు జరుగుతాయి.

3. రిసెర్చ్ - పీహెచ్‌డీ

సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే పరీక్ష ద్వారా దీనిలో ప్రవేశాలు జరుగుతాయి.

Image copyright IMU

అర్హతలేమిటి? అప్లై చేయడం ఎలా? పరీక్ష ఎప్పుడు?

ఏ కోర్సులో చేరాలన్నా ఐఎమ్‌యూ నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాల్సిందే. అన్ని కోర్సులకూ ఒకే రోజు జరుగుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000 (జనరల్ కేటగిరీ, రూ. 700 - ఇతరులు) చెల్లించాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 6న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్లకు చివరితేదీ మే 11. హాల్ టిక్కెట్లను మే 15నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2న దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

అర్హత సాధిస్తే ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ మీకు అప్లికేషన్‌తోపాటు జతచేసి ఉన్న బ్రోచర్లో ఉంటాయి.

Image copyright IMU

దరఖాస్తు చేయాలంటే ఏం కావాలి?

మెరైన్ ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా పాస్‌పోర్ట్ కలిగి ఉండాలి. నీటిపై ప్రయాణం ఒక్కోసారి సరిహద్దులు దాటాల్సి వస్తుంది. అంతేకాదు, చదువు పూర్తయ్యాక ఉద్యోగం ఇక్కడే ఉన్నా శిక్షణలో భాగంగా విదేశీ జలాల్లో కూడా తిరగాల్సి రావచ్చు. అందువల్ల పాస్‌పోర్ట్ తప్పనిసరి.

అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు 17 సంవత్సరాల కనీస వయసు ఉండాలి. తప్పనిసరిగా డీజీ-షిప్పింగ్ ద్వారా ఆమోదం పొందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అవసరం. దీనికి సంబంధించిన వివరాలు బ్రోచర్లో ఉంటాయి. బీటెక్‌కు అప్లై చేయాలంటే కనీసం 60శాతం మార్కులు, బీఎస్సీకి అప్లై చేయాలంటే కనీసం 50శాతం మార్కులతో ప్లస్ 2 లేదా ఇంటర్, ఏఐసీటీఈ డిప్లొమా ఉత్తీర్ణులు దీనికి అర్హులు. దీంతోపాటు పదోతరగతి, ఇంటర్మీడియట్‌లలో ఇంగ్లిష్‌లో కనీసం 50శాతం పైన మార్కులు వచ్చి ఉండాలి.

Image copyright IMU

పరీక్ష ఎలా ఉంటుంది?

ఐఎమ్‌యూలో ఏ కోర్సులో చేరాలన్నా ముందుగా ప్రవేశ పరీక్ష తప్పనిసరి. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ప్రవేశ పరీక్షలో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ఇంటర్ లేదా ప్లస్ 2 సిలబస్ నుంచి ప్రశ్నలతోపాటు ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్‌పై కూడా ప్రశ్నలుంటాయి. పీజీ ప్రవేశ పరీక్షలో 120 ప్రశ్నలుంటాయి. ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏలకు సిలబస్‌లో స్వల్ప మార్పులుంటాయి.

ప్రవేశ పరీక్షకు ముందే మీ ఇంటర్ లేదా ప్లస్ 2 ఫలితాలు, మార్కులు వచ్చేస్తాయి. వాటిని కూడా ఆన్‌లైన్‌లో ఐఎమ్‌యూకి సబ్‌మిట్ చేయాలి.

Image copyright IMU

ఏ క్యాంపస్‌లో ఎన్ని సీట్లు?

కోల్‌కతా క్యాంపస్‌లో బీటెక్ (మెరైన్ ఇంజనీరింగ్)కు 246 సీట్లున్నాయి. మిగిలిన క్యాంపస్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లుంటాయి.

ముంబై క్యాంపస్‌లో బీఎస్సీ (నాటికల్ సైన్స్)కు 180 సీట్లు, చెన్నైలో 120 సీట్లున్నాయి.

విశాఖపట్నం క్యాంపస్‌లో ఎంటెక్‌కు మూడు స్పెషలైజేషన్లలో ఒక్కొక్కదానికి 20 సీట్లున్నాయి. యూజీలో మెరైన్ ఇంజనీరింగ్ సంబంధిత అంశాలు చదివినవారికి పీజీ ప్రవేశాల్లో తప్పకుండా ప్రాధాన్యం ఇస్తారు.

సముద్రం ఉన్నచోట అంతర్జాతీయ వాణిజ్యం ఉంటుంది. అందువల్ల మ్యారిటైమ్ కోర్సులకు భవిష్యత్‌లో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రంగంలో ఉత్తీర్ణులైనవారికి ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అవకాశాలు చాలా ఎక్కువ.

ఇంకా వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)