ప్రెస్‌ రివ్యూ: టుస్సాడ్‌ మ్యూజియంలో హీరో మహేశ్ బాబు మైనపు బొమ్మ!

  • 27 ఏప్రిల్ 2018
Image copyright Maheshbabu/Facebook

టుస్సాడ్‌ మ్యూజియంలో మహేశ్ బాబు

ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నటుడు మహేశ్ బాబు మైనపు బొమ్మ ఏర్పాటు చేయనున్నారు.

ఈ విషయాన్ని మహేశ్ స్వయంగా తన ట్విటర్ ద్వారా తెలిపారు. తన వివరాలు సేకరించడానికి వచ్చిన మ్యూజియం ప్రతినిధులకు మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు.



అయితే ఆయన బొమ్మను ఢిల్లీ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారా లేక బ్యాంకాక్‌లో ఏర్పాటు చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

గతంలో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నటుడు ప్రభాస్‌ మైనపు బొమ్మను ఆవిష్కరించారు. బ్యాంకాక్‌లోని మ్యూజియంలో దీన్ని ఏర్పాటు చేశారు.

Image copyright Trsparty / facebook

హైదరాబాద్‌ కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి-టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతోంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి, తీర్మానాలు ఆమోదించనున్నారని 'ఈనాడు' ఒక కథనం రాసింది.

ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తామని ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పలువురు జాతీయ పార్టీ నేతలను కూడా కలిసి మాట్లాడారు.

ఇవాళ ఫెడరల్ ఫ్రంట్‌ అంశాన్ని ప్లీనరీ వేదికగా చర్చించబోతున్నారు.

కేసీఆర్ కోల్‌కతా, బెంగళూరు పర్యటన వివరాలను ప్లీనరీ దృష్టికి తీసుకురానున్నారు.

టీఆర్ఎస్‌ ప్లీనరీలో 6 ముఖ్యమైన తీర్మానాలను ఆమోదిస్తారు.

'దేశరాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం'

జాతీయ స్థాయిలో కేసీఆర్‌ ప్రతిపాదించిన కొత్త సమాఖ్య కూటమి లక్ష్యాలు, ఆశయాలు, గుణాత్మక మార్పు సాధనకు నడుంకట్టినందుకు అభినందనలు, అండదండలను ప్రకటిస్తూ, దేశప్రజలను ఏకం చేయడానికి సంపూర్ణ మద్దతును అందిందేందుకు తీర్మానిస్తారు.

'ఇంటింటికీ సంక్షేమం-ప్రతి ముఖంలో సంతోషం'

సంక్షేమ పథకాలు, ప్రజల జీవనభద్రత, భరోసాకల్పన, వాటిని విజయవంతం చేసేందుకు పునరంకితమవుతామంటూ తీర్మానం ఉంటుంది.

'సమానాభివృద్ధే ధ్యేయంగా మైనారిటీ సంక్షేమం'

మైనారిటీల జీవితాల్లో వెలుగులు, వారి సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిపై తీర్మానం చేస్తారు.

'సుస్థిర అభివృద్ధి కోసం విస్తృతంగా మౌలిక సదుపాయాల కల్పన', 'దేశానికే ఆదర్శం తెలంగాణ వ్యవసాయ విధానం', 'భారీ పాలనా సంస్కరణలు.. ప్రజల ముంగిట్లోకి వ్యవస్థలు' వంటి తీర్మానాలు చేస్తారు.



జనసేనపై దుష్టశక్తుల కుట్ర

జనసేన ప్రజా కార్యక్రమాలపై దుష్టశక్తులు కన్నేశాయని ఆ పార్టీ అన్నట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది.

'ఈ నెలలో చిత్తూరు, గుంటూరు జిల్లా బాపట్లలో చేపట్టే కార్యక్రమాల్లో తుని రైలు దుర్ఘటనలాంటి విధ్వంసక చర్యలకు పాల్పడి జనసేన పార్టీకి అపకీర్తి వచ్చేలా కుట్ర జరిగినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఇందుకు పొరుగు రాష్ట్రాలకు చెందిన కిరాయి మూకలను స్వార్థ శక్తులు సంప్రదిస్తున్నాయని చెప్పి నిఘా వర్గాలు మమ్మల్ని అప్రమత్తం చేశాయి. అందుకే చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పవన్ కల్యాణ్ చేపట్టాల్సిన పర్యటనలు వాయిదా వేశాం' అని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.

గుంటూరు జిల్లా స్టువర్టుపురం నివాసి వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారుడు వెంకటరాహుల్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకాన్ని సాధించినందుకు ఈ నెల 30న స్టువర్టుపురంలో పాదయాత్ర, బాపట్లలో సన్మానం చేద్దామని నిర్ణయించామని జనసేన వెల్లడించింది.

Image copyright PIB / Facebook

'చంద్రబాబు మళ్లీ రావాలి లేదంటే వైసీపీ ఎన్డీఏలోకి రావాలి'

వైసీపీ ఎన్డీఏ కూటమిలో చేరాలని రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నేత, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే ఆహ్వానించినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం ప్రచురించింది.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ ఎన్డీయేలోకి రావాలని సూచిస్తూనే... వైసీపీ నేత జగన్‌ను కూడా ఎన్డీయేలోకి ఆహ్వానించారు.. కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథవాలే.

''చంద్రబాబు బలమైన ముఖ్యమంత్రి. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగాల్సింది కాదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా టీడీపీ మళ్లీ ఎన్డీయేలోకి రావాలి'' అని అథవాలే కోరారు.

చంద్రబాబు ఎన్డీయేలోకి రాకపోతే వైఎస్‌ తనయుడు జగన్‌ ఎన్డీయేలోకి రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు. వైసీపీ కూడా ఏపీలో బలమైన పార్టీ అన్నారు. ఎన్నికల ముందు అయినా, తర్వాత అయినా ఎన్డీయేలో చేరాలని జగన్‌ను కోరారు.

జగన్‌పై ఉన్న కేసుల సంగతి ఏమిటని ప్రశ్నించగా... అవేవీ రుజువు కాలేదని వ్యాఖ్యానించారు.

''అప్పట్లో జగన్‌ను సీఎం చేసి ఉంటే ఆయన కాంగ్రెస్‌ను వీడేవారు కాదు. అది కాంగ్రెస్‌ చేసిన తప్పు. కాంగ్రెస్‌ పార్టీని వదిలిపెట్టడంతో యూపీఏ సర్కారు జగన్‌ను దారుణంగా ఇబ్బంది పెట్టింది'' అని వివరించారు.

ఆశారాం బాపు Image copyright Getty Images

'బ్రహ్మజ్ఞాని రేప్ చేయడం తప్పుకాదు'

బాలికలను తనలాంటి బ్రహ్మజ్ఞాని రేప్‌చేయడం పాపం కాదని ఆశారాం బాపు చెప్పేవాడని అతని మాజీ శిష్యుడు రాహుల్‌ కె.సచార్‌ జోధ్‌పూర్‌ కోర్టుకు వెల్లడించారు. దీనిపై 'సాక్షి' కథనం రాసింది.

ఐదేళ్ల క్రితం బాలికను రేప్‌చేసిన కేసులో ఆశారాంకు యావజ్జీవ జైలు శిక్ష పడింది. కోర్టు తన తీర్పులో ప్రత్యక్ష సాక్షి రాహుల్‌ సచార్‌ చెప్పిన విషయాలను వెల్లడించింది.

పుష్కర్‌ (రాజస్థాన్), భివానీ (హర్యానా), అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని ఆశ్రమాల్లో 2003లో ఆసారాం బాలికలను వేధించటం చూశానని సచార్‌ చెప్పాడు. 'ఆశ్రమంలో ఆశారాం వెంటే ముగ్గురు బాలికలుండేవారు.

వారితో ఆశ్రమంలో కలియ దిరుగుతూ టార్చిలైట్‌తో సైగలు చేసేవాడు. అలా ఎంపిక చేసిన బాలికను ఆ ముగ్గురూ బాబా నివాసంలోకి పంపేవారు.

ఈ ముగ్గురు బాలికలే ఆశారాం పాపానికి బలైన బాధితులకు గర్భస్రావం చేయించేవారు. అహ్మదాబాద్‌లో బాబా ఓ బాలికను వేధిస్తుంటే ప్రత్యక్షంగా చూశా. బాబాను నిలదీశా. బ్రహ్మజ్ఞాని అలాంటివి చేయటం పాపం కాదని ఆసారాం బదులిచ్చాడు. ప్రశ్నించినందుకు నన్ను బయటకు గెంటించాడు. లైంగిక సామర్థ్యం పెంపు కోసం నల్లమందుతోపాటు ఇతర మందులను వాడే వాడు' అని సచార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)