ఉనా దళితులు హిందూ మతం నుంచి ఎందుకు మారుతున్నారు?

  • 29 ఏప్రిల్ 2018
దళితులు

రెండేళ్ల క్రితం గుజరాత్‌లోని ఉనాలో ఆవు చర్మం వొలుస్తున్నారన్న ఆరోపణలపై ఐదుగురు దళితులను కట్టేసి కొట్టిన సంఘటన యావత్ దేశాన్ని కుదిపివేసింది.

ఆ ఘటన తర్వాత గుజరాత్‌లో అహ్మదాబాద్ నుంచి ఉనా వరకు ఒక మార్చ్ నిర్వహించారు. దానికి దేశంలో చాలా చోట్ల నుంచి మద్దతు లభించింది.

ఉనా ప్రాంత దళితులు ఇప్పుడు హిందూ మతంలోంచి బౌద్ధమతంలోకి మారాలని నిర్ణయించుకున్నారు.

బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛారా కొద్ది రోజుల క్రితం ఉనాకు వెళ్లి వారితో మాట్లాడారు. వారు ఈ నిర్ణయానికి వచ్చిన నేపథ్యం ఏమిటి? వారి ఫిర్యాదులు ఏంటి? అనే అంశాలపై ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇదీ ఆయన కథనం...

చిత్రం శీర్షిక ఉనా దాడి బాధితుల్లో బాలుభాయ్ ఒకరు

బాలుభాయ్ సర్వాయియా (55) తన ఇంట్లో కుర్చీలో కూర్చుని తీక్షణంగా చూస్తూ ప్రకటించారు: ''మా ఇంట్లోని హిందూ దేవుళ్ల ఫొటోలు, విగ్రహాలను ఏప్రిల్ 19వ తేదీన మా ఊరి సమీపంలోని రావల్ నదిలో నిమజ్జనం చేస్తాం. పది రోజుల తర్వాత ఉనాలో మమ్మల్ని అవమానించిన చోట, కొట్టిన చోట, నగ్నంగా ఊరేగించిన చోట బౌద్ధ మతం స్వీకరిస్తాం.''

2016 జూలైలో గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో గల ఉనా పట్టణ వీధుల్లో.. ఐదుగురు దళితులను కొట్టి, బట్టలు విప్పి ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ ఐదుగురిలో బాలూభాయ్ సర్వాయియా ఒకరు.

ఆనందీబెన్ పటేల్, రాహుల్‌గాంధీ, మాయావతి తదితరులు ఉనా ఘటన ప్రాంతాన్ని సందర్శించటంతో ఆ ఉదంతం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఈ దళితులు ఆవులను చంపుతున్నారని ‘గో రక్షకులు’ ఆరోపించారు. కానీ తాము చనిపోయిన ఆవుల చర్మం ఒలుస్తున్నామని ఈ దళితులు చెప్తున్నారు.

‘‘దేశం మొత్తాన్నీ కదిలించిన దళిత ఉద్యమం ప్రారంభమైన ఉనాలోని ఆ దురదృష్టకర చారిత్రక ప్రాంతం ఇదే’’ అని వాశ్రామ్ సర్వాయియా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ చెప్పారు. చనిపోయిన ఒక ఆవు చర్మం ఒలుస్తున్న ఆయనను, ఆయన ముగ్గురు సోదరులను అక్కడ కొట్టి, బట్టలు విప్పి, వీధుల్లో ఊరేగించారు. ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన తొలిసారి ఆ ప్రాంతానికి వచ్చారు. ఆయనను అనుసరిస్తూ బీబీసీ బృందం కూడా ఆ స్థలానికి వెళ్లింది.

ఇంకా వెంటాడుతున్న పీడకల...

2016 జూలై 7వ తేదీన జరిగిన ఆ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ దారుణ అవమానం, మానసిక క్షోభ నుంచి ఈ బాధితులు నలుగురూ ఇంకా కోలుకోలేదు.

బాలూభాయ్, ఆయన కుటుంబం.. ఉనా తాలూకా లోని మోటా సమాధియాలా గ్రామం దళిత్-ఫాలియా‌లో ఒక చిన్న చీకటింట్లో నివసిస్తుంటారు. ఇంట్లో గోడల మీద హిందూ దేవుళ్లు, దేవతల బొమ్మలు స్పష్టంగా కనిపిస్తాయి. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఫొటో, బుద్ధుడి విగ్రహాలు కూడా ఇటీవలే ఆ ఇంట్లో చోటు సంపాదించుకున్నాయి.

బాధితుల్లో అందరికన్నా చిన్నవయస్కుడు అశోక్ సర్వాయియా. ‘‘ఆ రోజు ఏం జరిగిందో తలచుకుంటే ఇప్పటికీ నాకు భయమేస్తుంది. వాళ్లు మళ్లీ వచ్చి మమ్మల్ని కొడతారేమో అనిపిస్తుంది’’ అని అతడు బీబీసీ గుజరాతీ ప్రతినిధితో చెప్పాడు. ఆనాడు జరిగిన భయానక సంఘటన గురించి వివరించాడు.

ఆ ఘటన జరిగినప్పటి నుంచి బాధితులెవ్వరికీ ఉపాధి లేదు. పొలాల్లో కూలీలుగా పనిచేసే శక్తీ లేదు. ఆ ఘటన తర్వాత అశోక్ వ్యవసాయ కూలీగా పనిచేయటానికి విఫల యత్నాలు చేశాడు. అతడు రాత్రి పూట నిద్ర కూడా పోలేకపోతున్నాడని అతడి తల్లి విమలా సర్వాయియా (50) బీబీసీకి తెలిపారు.

‘‘అశోక్‌కి పడుకోగానే పీడ కలలు వస్తాయి. అర్ధరాత్రిళ్లు ఉలిక్కిపడి లేస్తాడు. ఇప్పుడు కూడా అతడిని చిన్న పిల్లాడిని చూసుకున్నట్లు నేను చూసుకోవాల్సి వస్తోంది’’ అని ఆమె చెప్పారు.

చిత్రం శీర్షిక ఉనా దాడి బాధితుడు బాలుభాయ్ భార్య కున్వార్ బెన్‌

ఆ బాధితులకు భరోసా ఏదీ?

వడ్గామ్ ఎంఎల్‌ఏ, దళిత నాయకుడు జిగ్నేశ్ మేవాని గుజరాత్ అసెంబ్లీలో లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంలో.. ఉనా బాధితులకు ఎలాంటి ప్రయోజనాలైనా కల్పించేందుకు అధికారిక హామీ ఏదీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.

ఈ ఘటన 2016లో దళితులకు దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టింది. ఉనా బాధితులకు మద్దతుగా మేవానీ ప్రదర్శన చేపట్టిన తర్వాత ఆయన పేరు ప్రతి ఇంటా మారుమోగింది.

కేవలం దళితుల నుంచే కాకుండా చాలా ఇతర సమాజాల నుంచి కూడా మద్దతు, సానుభూతి లభించిందని దళిత ఉద్యమకారుడు మార్టిన్ మక్వాన్ చెప్తారు.

‘‘నేటి భారతదేశంలో దళితుల వాస్తవ పరిస్థితికి సంబంధించిన కఠోర వాస్తవంగా ఉనా ఘటన తెరపైకి వచ్చింది’’ అని ఆయన పేర్కొన్నారు.

బౌద్ధమతం ఎందుకు?

ఉనా ఘటన జరిగినప్పటి నుంచే బాధిత కుటుంబం మతం మారేందుకు సిద్ధంగా ఉంది. ‘‘హిందూ మతాన్ని వీడే ధైర్యాన్ని మేం కూడగట్టుకోలేకపోయాం’’ అని వాశ్రామ్, రమేశ్, బేచర్‌ల తండ్రి బాలూభాయ్ సర్వాయియా బీబీసీతో చెప్పారు.

మాట్లాడటానికి మొదట తటపటాయించిన వాశ్రామ్.. ఆ తర్వాత బౌద్ధ మతాన్ని కీర్తించకుండా తనను తాను ఆపుకోలేకపోయారు. ‘‘అది అంతర్జాతీయ మతం. ఉనా ఘటన గురించి ప్రపంచానికి తెలిసిన తర్వాత.. హిందూ మతాన్ని విడిచి బౌద్ధమతాన్ని స్వీకరించటానికి గల కారణాలను ప్రపంచం గుర్తిస్తుందని నేను నమ్ముతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు. హిందూ మతం తమకు ఆత్మగౌరవం, అభిమానాలను అందించటంలో విఫలమైందని ఆయన అంటారు.

అన్యాయానికి గురైన దళితులందరూ తమతో పాటు బౌద్ధ మతం స్వీకరించాలని వాశ్రామ్, బాలూభాయ్ పిలుపునిస్తున్నారు. ‘‘ఆ రోజు చాలా మంది మాతో కలిసి వస్తారు. చూడండి’’ అని బాలూభాయ్ చెప్పారు.

చిత్రం శీర్షిక దళితులపై దాడులు వెలుగులోకి వచ్చిన ప్రతిసారీ బౌద్ధ మతంలోకి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.

హిందూమతం నుంచి బౌద్ధ మతంలోకి...

బాలూభాయ్ భార్య కున్వర్‌బెన్‌కు బౌద్ధ మతం గురించి, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గురించి ఇటీవలే తెలిసింది. ‘‘అంబేడ్కర్ దళితుడిగా పుట్టకపోయినట్లయితే.. ఈ దేశంలో దళితులను వీధి కుక్కలుగా చూసేవారని నా నమ్మకం’’ అని ఆమె అంటారు.

కున్వర్‌బెన్ ఇంతకుముందు వరకూ హిందూ మతాన్ని బలంగా సమర్థించేవారు. ఆమె దశమ దేవతను పూజిస్తూ ఏటా పది రోజుల పాటు ఉపవాసం ఉండేవారు. పదేళ్లుగా ఆ దీక్షను పాటిస్తున్నారు. ‘‘ఆమె జీవితమంతా హిందూ దేవతలు, దేవుళ్లను పూజిస్తూ గడిపింది’’ అని బాలూభాయ్ చెప్పారు. ఆమె రామాపీర్‌ను పూజించేవారు. ఉనా వచ్చే హిందూ గురువుల సత్సంగ్‌లు (సమారాధానలు) అన్నిటికీ హాజరయ్యేవారు.

కానీ ఇప్పుడు ఆమె తన మతం పట్ల ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ‘‘మేం మా జీవితాలను బిచ్చగాళ్లలా గడిపాం. అయినా కూడా మా బతికే హక్కును నిరాకరించారు. మమ్మల్ని మనుషులుగా బతికనివ్వని మతాన్ని నేనెందుకు పాటించాలి?’’ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ఉనా ఘటనకు ముందుగానే వాశ్రామ్ బౌద్ధ మతం వైపు ఆకర్షితులయ్యారు. వారి ఇంట్లో బుద్ధుడు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలు వచ్చి చేరాయి.

చిత్రం శీర్షిక 2016లో దాడి జరిగిన స్థలం

‘రాష్ట్రంలో బౌద్ధ మతస్తుల సంఖ్య పెరుగుతోంది’

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 30,483 మంది బౌద్ధ మతస్తులు ఉన్నారు. అయితే.. ఉనా ఘటన తర్వాత గుజరాత్‌లో బౌద్ధ మతం స్వీకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ స్థాపించిన బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ పి.జి.జ్యోతికర్ అభిప్రాయపడ్డారు.

డాక్టర్ జ్యోతికర్ గుజరాత్ యూనివర్సిటీలో చరిత్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. బౌద్ధ మతం స్వీకరించిన తొలి దళితుల్లో ఆయన కూడా ఉన్నారు. ‘‘డాక్టర్ అంబేడ్కర్‌ను అనుసరిస్తూ 1960లో నేను బుద్ధిస్ట్‌గా మారాను’’ అని ఆయన బీబీసీకి తెలిపారు.

2011 జనాభా లెక్కల నాటి నుంచి రాష్ట్రంలో బౌద్ధ మతస్తుల సంఖ్య రెట్టింపుకన్నా ఎక్కువగా పెరిగిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70,000 మందికి పైగా బుద్ధిస్టులు ఉన్నట్లు ఆయన అంచనా.

‘‘మతం మారటానికి ప్రధాన కారణం.. ఆత్మగౌరవం. విద్యావంతులైన దళిత యువత ఆకాంక్షలు పెరగటం, ఆత్మగౌరవం కల్పించటంలో సమాజం విఫలమవటం.. దళితులు హిందూ మతాన్ని వీడి ఒక వైఖరి తీసుకునేలా ఒత్తిడి చేస్తున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దళితులపై జరిగే ప్రతి అకృత్యం తర్వాత బౌద్ధ మతం స్వీకరిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్నారు.

నేను నా ఆవును ప్రేమిస్తూనే ఉంటా: బాలూభాయ్

ఉనా ఘటనకు ముందు నుంచే బాలుభాయ్ సర్వాయియా దగ్గర ఒక గిర్ ఆవు ఉందన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఆ ఆవుకి ఆయన గౌరి అని పేరు పెట్టారు. ఆ హేయమైన దాడి జరగటానికి ఒక నెల రోజుల ముందు తన ఆవుకు చికిత్స కోసం ఆయన రూ. 6,000 ఖర్చు పెట్టారు.

‘‘ఆవును ఊర్లో మా తమ్ముడి పొలం దగ్గర ఉంచాం. ఆ ఆవు ఇప్పుడో దూడను కూడా ఇచ్చింది’’ ఆయన ఆనందంగా చెప్తారు. ‘‘నా ఆవు మీద నాకున్న ప్రేమ మతం వల్ల తగ్గిపోదు. బౌద్ధ మతస్తుడిగా ఉన్నపుడు కూడా నా ఆవుని నాతో ఉంచుకుంటాను. దానికి సేవ చేస్తూనే ఉంటాను’’ అని బాలూభాయ్ తెలిపారు.

దళితులెవరూ ఎన్నడూ ఆవుకు హాని చేయరని ఆయన అంటారు. ‘‘తోలు ఒలవటం కోసం జబ్బుపడ్డ ఆవులను మేమెప్పుడూ తీసుకోలేదు. వాళ్లు డబ్బులు ఇస్తామని చెప్పినా మేం అలా ఎన్నడూ చేయలేదు’’ అని వివరించారు.

ఉనా ఘటనలో 45 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 11 మంది జైలులో ఉండగా మిగతా వారంతా బెయిలుపై విడుదలయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)