సివిల్స్ టాపర్ అనుదీప్‌తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

  • 28 ఏప్రిల్ 2018

శుక్రవారం విడుదలైన యూపీ‌ఎస్సీ సివిల్ సర్వీసెస్ 2017 పరీక్షల ఫలితాల్లో తెలంగాణలోని మెట్‌పల్లికి చెందిన అనుదీప్ దూరిశెట్టి దేశంలోనే మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు.

అనుదీప్ గతంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)‌కు ఎంపికయ్యారు. ఫలితాలు విడుదలైన తరవాత అనుదీప్ ‘బీబీసీ’తో మాట్లాడారు.

‘నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను అందుకోనున్న బాధ్యతల కోసం ఎదురు చూస్తున్నా. ఈ ర్యాంకుకంటే నా ముందున్న బాధ్యతే చాలా గొప్పది. ఇది సాధించడానికి నాకు సాయపడ్డ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అధ్యాపకులకు నా ధన్యవాదాలు’ అని అనుదీప్ అన్నారు.

కష్టపడటం వల్లే ఇక్కడిదాకా వచ్చాననీ, విజయానికి కష్టానికి మించిన దగ్గరి దారి మరోటి లేదనీ ఆయన చెప్పారు.

‘పరీక్షలు రాసినా, ఆటలాడినా, వేరే ఏ పని చేసినా.. మనం వంద శాతం కష్టపడుతున్నామా, లేదా అన్నది చూడాలి. నేను మా నాన్న నుంచి ఈ విషయాన్ని నేర్చుకున్నా. పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి ఇదే సూత్రాన్ని పాటించా’ అంటారాయన.

Image copyright facebook
చిత్రం శీర్షిక అనుదీప్ గతంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)‌కు ఎంపికయ్యారు.

అబ్రహం లింకన్ స్ఫూర్తి

అనుదీప్‌కు చరిత్ర చదవడమంటే చాలా ఇష్టం.

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ తనకు స్ఫూర్తి అని ఆయన చెబుతారు.

‘ఓ మంచి నాయకుడు ఎలా ఉండాలనేదానికి అబ్రహం లింకన్‌ను ఉదాహరణగా చూపొచ్చు. అనేక సవాళ్ల మధ్య, ప్రతికూల పరిస్థితుల్లో ఆయన తమ దేశాన్ని ముందుకు నడిపించారు. అందుకే నేను ఎప్పుడూ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుంటా’ అని అనుదీప్ చెప్పారు.

పరీక్షకు సన్నద్ధమైన తీరు గురించి వివరిస్తూ.. ‘చాలా మంది ప్రతిభావంతులు పోటీ పడే పరీక్ష ఇది. ఎన్ని గంటలు చదివామన్నది కాదు.. ఏం చదువుతున్నాం, ఎలా చదువుతున్నామన్నదే ముఖ్యం’ అంటారు అనుదీప్.

అనుదీప్ సివిల్ సర్వీసెస్-2013లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై, హైదరాబాద్‌లో పోస్టింగ్ పొందారు.

‘నేను హైదరాబాద్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నా. ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు సిద్ధమయ్యా. వారాంతాలతో పాటు, రోజులో ఎప్పుడు సమయం దొరికినా సివిల్స్‌కు సన్నద్ధమయ్యేవాణ్ణి.

చదువుకు ఏకాగ్రత చాలా ముఖ్యం. ఎప్పుడూ మన లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అదే స్థాయిలో శ్రమ కూడా దానికి తోడవ్వాలి. అప్పుడు ఫలితాలు వాటంతటవే వస్తాయి’ అని అనుదీప్ పేర్కొన్నారు.

Image copyright ANUDEEP DURISHETTY
చిత్రం శీర్షిక ‘లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. అదే స్థాయిలో శ్రమ కూడా దానికి తోడవ్వాలి.‘

ఇప్పటికీ కలలా ఉంది!

ఫుట్‌బాల్ చూడటం, ఆడటం కూడా అనుదీప్‌కు ఇష్టం.

‘చదువుతో పాటు ఫుట్‌బాల్ కూడా మొదట్నుంచీ నా జీవితంలో ఓ భాగమైంది. పుస్తకాలు కూడా ఎక్కువగా చదువుతా. ఫిక్షన్‌లు కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలకే ప్రాధాన్యమిస్తా.

చదవడం లేదా ఆడటం.. ఖాళీ దొరికితే నేను చేసే పనులివే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వ్యాపకం ఉండాలి. మన వ్యాపకాలే వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. అవే మనే జీవితాన్ని పరిపూర్ణం చేస్తాయి’ అంటారు అనుదీప్.

అనుదీప్ సాధించిన విజయాన్ని చూసి అతడి కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. ‘ఫలితం తెలిసిన వెంటనే మా అమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మా నాన్న ఇప్పటికీ ఇది నమ్మలేకపోతున్నారు. నాక్కూడా ఇదో కలలా అనిపిస్తోంది’ అంటారాయన.

Image copyright ANUDEEP DURISHETTY

విద్యా రంగంలో పనిచేయాలన్నది అనుదీప్ కోరిక. ‘విద్యా రంగంలో మనం ఇంకా చాలా ముందుకెళ్లాలి. స్కాండినేవియన్ దేశాలు చదువుకు చాలా ప్రాధాన్యమిస్తాయి. అందుకే అవి అభివృద్ధిలో మందున్నాయి. మనం కూడా ఓ కొత్త భారత్‌ను చూడాలంటే మన విద్యా రంగం మెరుగవ్వాలి. ఇప్పటికే మనం ఆ దిశగా కృషి చేస్తున్నాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ క్రతువులో నాకూ భాగం పంచుకోవాలనుంది’ అని అనుదీప్ వివరించారు.

తన తండ్రి వల్లే తనకీ విజయం సాధ్యమైందని అనుదీప్ చెబుతారు. ‘మా నాన్న నా రోల్ మోడల్. ఆయన తెలంగాణలోని ఓ చిన్న పల్లె నుంచి వచ్చారు. ఆయన కష్టపడి జీవితంలో పైకొచ్చారు. ఆయన శ్రమ వల్లే నేను బాగా చదువుకోగలిగా. ఆయనెప్పుడూ విలువలకు ప్రాధాన్యమిస్తారు. నేను మొదట్నుంచీ ఆయనలా అవ్వాలని అనుకునేవాణ్ణి’ అంటారు అనుదీప్.

‘మన రోల్‌మోడల్స్ మన చుట్టూనే ఉంటారు. వాళ్లను గుర్తించాల్సిన బాధ్యత మనదే’ అన్నది అనుదీప్ మాట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు