#MeToo: 'నిర్మాతలతో, దర్శకులతో పడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు'

  • 28 ఏప్రిల్ 2018
ఉషా జాదవ్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ''నీకు సినిమాలో అవకాశం ఇస్తున్నాం, నువ్వు కూడా మాకు ఏదో ఒకటి ఇవ్వాలి'' అని అనేవారని, ఈ డిమాండ్లకు తాను ఎన్నడూ అంగీకరించలేదని ఉషాజాదవ్ తెలిపారు.

భారత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా వేల మంది యువతీయువకులు సినిమాల్లో నటించాలనే, సినీ రంగంలో పనిచేయాలనే కలలను సాకారం చేసుకొనేందుకు ముంబయి వస్తుంటారు. వీరిలో అత్యధికుల ఆశలు నెరవేరవు. సరికదా, చాలా మందికి తట్టుకోలేని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. హిందీ చిత్రపరిశ్రమతోపాటు తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల చిత్రపరిశ్రమల్లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

బీబీసీ ప్రతినిధులు రజినీ వైద్యనాథన్, ప్రతీక్షా గిల్డియాల్‌ దాదాపు 12 మంది బాలీవుడ్ యువ నటీమణులతో మాట్లాడగా, సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తమకు లైంగిక వేధింపులు, అశ్లీల వ్యాఖ్యలు ఎదురయ్యాయని వారు చెప్పారు. కొందరు దర్శకులు, సినిమాల్లో పాత్రలు ఇప్పించడంలో ముఖ్య భూమిక పోషించే క్యాస్టింగ్ ఏజెంట్లు లైంగికంగా వేధించారని తెలిపారు.

ఒక చిన్న పల్లెటూరికి చెందిన సుజాత(అసలు పేరు కాదు) హీరోయిన్ కావాలని కలలు కనేవారు. తన కోరికను తల్లిదండ్రులకు చెప్పారు. సినిమాల్లో నటిస్తానని, సినిమా అవకాశాల కోసం ముంబయి వెళ్తానని, అనుమతించాలని వారిని అడిగారు. సంప్రదాయ కుటుంబానికి చెందిన ఆమె తల్లిదండ్రులు మొదట వద్దని వారించినా, చివరకు సరేనన్నారు. ఇది ఆరేళ్ల క్రితం జరిగింది. ఆమెకు అప్పుడు 19 ఏళ్లు. ఆమెకు నటించిన అనుభవం లేదు. అప్పటికి సినీరంగంలో తెలిసినవాళ్లు కూడా లేరు. తర్వాత ఈ విషయంలో సలహా ఇచ్చేవాళ్లు కొందరు ఆమెకు పరిచయమయ్యారు.

తన అపార్టుమెంటుకు వచ్చి కలవాలని సుజాతకు ఒక క్యాస్టింగ్ ఏజెంట్ చెప్పాడు. ఇలాంటి సమావేశాలు ఇళ్లలో జరగడం సాధారణమేనని తెలిసినవాళ్లు ఆమెతో అన్నారు. క్యాస్టింగ్ ఏజెంట్‌పై సుజాతకు అనుమానం రాలేదు.

అపార్టుమెంట్లో ఏజెంట్‌ను కలిసినప్పుడు ఏం జరిగిందో ఆమె బీబీసీతో చెప్పారు.

''అతడు నన్ను చాలా చోట్ల తడిమాడు. బట్టల కింద నుంచి చేతులు పోనిచ్చాడు. నా డ్రస్ తొలగించబోతుంటే అడ్డుకున్నాను. నా పద్ధతి సినీ పరిశ్రమకు సరిపోయేది కాదన్నాడు'' అని సుజాత వెల్లడించారు.

సినిమాల్లో పాత్రల కోసం ప్రయత్నించినప్పుడు చాలా సార్లు తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఆమె తెలిపారు.

ఫిర్యాదు చేయడానికి తానోసారి పోలీసుల వద్దకు వెళ్లానని, అయితే తన ఫిర్యాదును స్వీకరించలేదని సుజాత చెప్పారు. సినిమావాళ్లు వాళ్లకు నచ్చినట్టు చేస్తుంటారని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారని తెలిపారు.

ఆమె చెబుతున్న విషయాలను నిర్ధరించుకోవడం బీబీసీకి వీలు కాలేదు. తన వివరాలు వెల్లడించవద్దని సుజాత కోరారు. లైంగిక వేధింపుల గురించి ఎవరైనా నటి బయటకు మాట్లాడితే, ప్రచారం కోసమో, డబ్బు కోసమో అలా చేస్తోందని నిందలు వేస్తారని, దీనివల్ల తనకు చెడ్డపేరు వస్తుందని ఆమె తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఉషా జాదవ్

బీబీసీతో మాట్లాడినవారిలో చాలా మంది తమ వివరాలు రాయొద్దని కోరారు. 'వీరప్పన్', 'భూత్‌నాథ్ రిటర్న్స్', మరికొన్ని చిత్రాల్లో నటించిన ఉషా జాదవ్‌తోపాటు ఇంకొందరు మాత్రం తమ పేర్లు రాసేందుకు అంగీకారం తెలిపారు.

ఉషా జాదవ్ దాదాపు పదేళ్లుగా చిత్రసీమలో ఉన్నారు. మరాఠీ చిత్రం 'ధగ్'లో అభినయానికిగాను 2012 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకున్నారు.

ఇప్పటికీ తనకు లైంగిక వేధింపులు తప్పడం లేదని ఉష చెప్పారు. తనకు ఎదురైన పరిస్థితుల గురించి తాను గళం విప్పితే, ఇతర నటీమణులు కూడా ముందుకొచ్చి తమ వాణిని వినిపిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

నటిగా కొనసాగాలంటే దర్శకులు, నిర్మాతల సెక్స్ కోరికలు తీర్చాల్సి ఉంటుందని తాను బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో కొందరు అన్నారని ఉష వెల్లడించారు. ''నీకు సినిమాలో అవకాశం ఇస్తున్నాం, నువ్వు కూడా మాకు ఏదో ఒకటి (పడక సుఖాన్ని) ఇవ్వాలి'' అని అనేవారని తెలిపారు.

ఇలాంటి డిమాండ్లకు ఒప్పుకోవడం మినహా తమకు మార్గం లేదని చిత్రపరిశ్రమలోని కొందరు మహిళలు భావిస్తున్నారని ఉష చెప్పారు.

''లైంగిక కోరికలు తీర్చేందుకు నేను ఎన్నడూ అంగీకరించలేదు. దీనివల్ల కొందరు నిర్మాతల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఒక నిర్మాతైతే తన చిత్రంలో నన్ను ఉండనివ్వబోనన్నాడు. 'నీకు మంచి పాత్రలు రావు, నీకు ప్రయోజనం ఉండదు' అని శపించాడు కూడా. నేను ఖాతరు చేయలేదు. 'నీకు అంత శక్తి లేదులే' అన్నట్లుగా వ్యవహరించాను'' అని ఆమె వివరించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాధికా ఆప్టే

'ప్రముఖులు గళం విప్పాలి'

సినీ నటి రాధికా ఆప్టే మాట్లాడుతూ- సినీ పరిశ్రమలో కొందరికి ఉండే బలం మహిళలపై లైంగిక వేధింపులకు ఒక ముఖ్య కారణమన్నారు.

లైంగిక వేధింపుల గురించి తాను బహిరంగంగా మాట్లాడుతున్నానని, వీటి గురించి నోరు విప్పలేకపోతున్న చాలా మంది మహిళల నిస్సహాయతను తాను అర్థం చేసుకోగలనని ఆమె తెలిపారు.

బాలీవుడ్‌లోకి రావాలనుకునేవారికి ఇందుకు వీలు కల్పించే వ్యవస్థ ఏదీ లేకపోవడం సమస్య అవుతోందని రాధికా ఆప్టే చెప్పారు. వేధింపులకు పాల్పడే వ్యక్తులు ఈ లోటును ఆసరాగా చేసుకొంటున్నారని అభిప్రాయపడ్డారు.

హాలీవుడ్‌లో మాదిరి బాలీవుడ్‌లో కూడా #Metoo క్యాంపెయిన్ రావాలని రాధికా ఆప్టే అన్నారు. అయితే లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న పెద్ద ప్రముఖులు ఎవరైనా ముందుకొచ్చి తమ వాణిని వినిపించే వరకు బాలీవుడ్‌లో ఇది సాధ్యం కాదని చెప్పారు.

బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. బాల్యంలో తాను లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. లైంగిక దోపిడీ గురించి సెలబ్రిటీలు మాట్లాడితేనే పరిగణనలోకి తీసుకొంటారని, లేదంటే ఎవరూ పట్టించుకోరని విచారం వ్యక్తంచేశారు.

Image copyright Facebook/Sri Reddy
చిత్రం శీర్షిక సినీ పరిశ్రమలోని కొందరు తన నగ్న చిత్రాలు, వీడియోలు పంపించాలని అడుగుతున్నారని శ్రీరెడ్డి చెప్పారు.

హిందీ చిత్రపరిశ్రమలోనే కాకుండా భారత్‌లో ప్రాంతీయ భాషల చిత్రపరిశ్రమల్లోనూ లైంగిక వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ చిత్రపరిశ్రమల్లోనూ కొందరు మహిళలు వేధింపులకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు.

'క్యాస్టింగ్ కౌచ్'‌కు నిరసనగా ఇటీవల తెలుగు నటి శ్రీరెడ్డి మల్లిడి హైదరాబాద్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ''నా పోరాటంలో నేను నిస్సహాయురాలిని అయిపోయాను. నా బాధను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, అందుకే ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది'' అని ఆమె బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక దోపిడీపై హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎంఏఏ)' ఎదుట శ్రీరెడ్డి ఈ నిరసన చేపట్టారు.

తన గళం వినిపించేందుకు, తన డిమాండ్లపై ప్రభుత్వాన్ని స్పందించేలా చేసేందుకు తనకున్న మార్గం ఇదొక్కటేనని ఆమె తెలిపారు. ''సినీ పరిశ్రమలోని కొందరు నేను నగ్నంగా ఉన్న వీడియోలు, ఫొటోలు పంపించాలని అడుగుతున్నారు. నా బాధను, నిరసనను తెలిపేందుకు నేను అర్ధనగ్న ప్రదర్శన ఎందుకు చేయకూడదు'' అని శ్రీ రెడ్డి ప్రశ్నించారు.

సినీ నటి మాధవీలత కూడా నిరుడు బీబీసీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు. ''నీకు సినిమాలో అవకాశం ఇస్తే, ప్రతిఫలంగా నాకేం వస్తుంది'' అని అడుగుతారని, లైంగిక వేధింపులు ఈ ప్రశ్నతో మొదలవుతాయని ఆమె వెల్లడించారు.

సినీ గేయ రచయిత్రి శ్రేష్ఠ గత ఏడాది బీబీసీతో మాట్లాడుతూ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో సినీరంగంలోని మగవారి సంబంధీకులైన మహిళల నుంచి కూడా సమస్యలు ఎదురవుతుంటాయని ఆమె చెప్పారు. ''నా భర్త కోరిక తీర్చు'' అని ఒక నిర్మాత భార్య తనను అడిగారని శ్రేష్ఠ తెలిపారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక తన లైంగిక కోరికలు తీర్చాలని బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో ఒక 'పెద్దమనిషి' తనను అడిగాడని రణ్‌వీర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

మగవారికీ వేధింపులు!

భారత సినీ రంగంలో లైంగిక వేధింపులు మహిళలకే పరిమితం కాలేదు. కొందరు మగవాళ్లకూ ఇవి ఎదురవుతున్నాయి.

తన లైంగిక కోరికలు తీర్చాలని బాలీవుడ్‌లోకి వచ్చిన కొత్తలో ఒక 'పెద్దమనిషి' తనను అడిగాడని, అందుకు తాను అంగీకరించకపోవడంతో విఫల ప్రేమికుడి మాదిరి ఏడ్చాడని ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ 2015లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

నటుడు, దర్శకుడు, గాయకుడు అయిన ఫర్హాన్ అఖ్తర్ కూడా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన వాణిని వినిపించారు.

(అదనపు రిపోర్టింగ్ - సుప్రియా సోబ్తి)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)