ప్రెస్‌రివ్యూ: మహేశ్ అను నేను రాజకీయాల్లోకి రాను!

  • 28 ఏప్రిల్ 2018
Image copyright facebook / maheshbabu

"రాజకీయాలంటే ఆసక్తి లేదు. జీవితాంతం నటిస్తూనే ఉంటాను'' అని నటుడు మహేశ్ బాబు అన్నట్లు సాక్షి పత్రిక కథనం రాసింది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించిన 'భరత్‌ అనే నేను' సక్సెస్‌ మీట్స్‌ను విజయవాడ, తిరుపతిలో నిర్వహించారు.

అందులో మాట్లాడిన మహేశ్.. ''రాజకీయాల్లోకి రాను. వందేళ్ల వయసు వచ్చే వరకు నటిస్తుంటాను" అని చెప్పారు.

''నాన్నగారికి అందరి కన్నా పెద్ద అభిమానిని నేనే. సినిమాలో మంచి సీయంగా నటించాను. నిజ జీవితంలో బెస్ట్‌ ఫాదర్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. శ్రీవారి ఆశీస్సులు ఉంటే సినిమాలన్నీ హిట్‌ అవుతాయి'' అని మహేశ్ తెలిపారు.

Image copyright Getty Images

నల్లధనం, బినామీలపై సమాచారం ఇస్తే 5 కోట్లు!

నల్లధనం, బినామీ ఆస్తులు కూడబెట్టిన వారి వివరాలు అందించిన వారికి ఇచ్చే నజరానాలను కేంద్రం పెంచిందని ఆంధ్రజ్యోతి రాసింది.

ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి - సీబీడీటీ ఓ నిర్ణయం తీసుకుంది.

ఆదాయపు పన్ను ఇన్ఫార్మర్ల పురస్కార పథకం-2018 మేరకు పెంచిన నగదు బహుమతులను ఈ వారం నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నజరానా పొందాలంటే నల్లధనం చట్టం-2015 పరిధిలోని అప్రకటిత ఆస్తులు, నల్లధనం, బినామీ ఆస్తుల వివరాలను అందించాల్సి ఉంటుంది.

2007 మార్గదర్శకాల్లో సమాచారం అందించిన వ్యక్తులకు, గుర్తించిన ఆస్తుల్లో పన్నును చెల్లించదగిన మొత్తంలో 5శాతం మధ్యంతర రివార్డుగా, 65లక్షల వరకు పూర్తి స్థాయిలో పన్నులు వసూలయ్యాక 15 శాతం తుది రావార్డుగా 15 లక్షల వరకు అందించే వారు.

ఆదాయపన్ను కోటి దాటితే పన్ను మొత్తంలో 5శాతం లేదా 50లక్షలు ఇచ్చే వారు. విదేశీ ఆస్తులకు సంబంధించి నజరానా 50లక్షలకు మించేదికాదు.

తాజా పురస్కార పథకంలో విదేశీ ఆస్తుల వివరాలపై ఉప్పందించే పౌరులకు 5కోట్ల వరకు నగదు బహుమతి ఉంటుందని సీబీడీటీ వెల్లడించింది.

Image copyright Trsparty / facebook

ప్రగతిభవన్‌లో 16వ గది చూపిస్తే రాజీనామా-కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ విషయంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి సవాల్ విసిరినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక పేర్కొంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ప్లీనరీ వేదికగా కేసీఆర్ ఘాటుగా స్పందించారు.

"నేను చాలెంజ్‌ చేస్తున్నా. మీడియాతో ప్రగతి భవన్‌కు రా! 150 కాదు.. 15 రూములు చూపించకపోతే ప్రగతి భవన్‌ ముందు నువ్వు ముక్కు నేలకు రాయి. నువ్వు 16వ రూము చూపిస్తే.. నేను ముక్కు నేలకు రాయడం కాదు. ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా'' అని కేసీఆర్ సవాల్‌ విసిరారు.

గతంలో మహారాష్ట్రతో ఒప్పందాల విషయంలోనూ ఉత్తమ్‌ సవాల్‌ చేసి తోక ముడిచాడని ఆయన విమర్శించారు.

''మీ జీవితాల్లో, ప్రభుత్వాల్లో ఎన్నడూ ఆలోచించని పథకాలను మేం అమలు చేశాం. ప్రాజెక్టులను మేం నిర్మిస్తుంటే మీరు 250 కేసులు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ శ్రుతి మించితే కేసులు విత్‌డ్రా చేసే దాకా ప్రజలు తరిమికొట్టాలి'' అని కేసీఆర్‌ అన్నారు.

Image copyright facebook / MHA

ఏపీకి కాపు కోటా కావాలి!

''సామాజిక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగానే కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ కమిషన్‌ కూడా దీనిని సమర్థించింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది! రాష్ట్రపతి కూడా ఆమోదించాలా చూడండి'' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ అధికారులు కోరినట్లు ఆంధ్రజ్యోతి కథనం రాసింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన నాలుగు బిల్లులపై కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సత్‌పాల్‌ చౌహాన్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది.

కాపు రిజర్వేషన్‌ బిల్లు, భూసేకరణ చట్ట సవరణ బిల్లు, పబ్లిక్‌ డిపాజిటర్ల పరిరక్షణ బిల్లు, విద్యుచ్ఛక్తి సుంకం చట్టం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి.

కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీ గతంలో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది.

అంతర్‌ మంత్రిత్వ శాఖల పరిశీలనకు కేంద్ర హోంశాఖ పంపించగా... కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అభ్యంతరాలను తెలిపింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేసింది.

రిజర్వేషన్లు 50 శాతానికి మించి రాజ్యాంగంలో పొందుర్చాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం, ఆ పరిస్థితులు, ఇతర వివరాలను ఏపీ అధికారులు వివరించారు.

జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలోని బీసీ కమిషన్‌ అధ్యయనం చేసి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసు చేసిందని... దీనికి సహేతుకమైన కారణాలను పేర్కొందని చెప్పారు.

Image copyright MallikaSharawat / Facebook

"గాంధీ తిరిగిన దేశం అత్యాచారాలకు అడ్డాగా మారింది"

కొద్ది రోజులుగా దేశంలో జ‌రుగుతున్న అత్యాచార ఘ‌ట‌న‌లు, కాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి మ‌ల్లికా శెరావ‌త్ స్పందించారు.

"దేశంలో పిల్ల‌లు, మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న అఘాయిత్యాలు దారుణం. గాంధీజీ తిరిగిన ఈ భార‌త‌దేశం ఇప్పుడు అత్యాచారాల‌కి అడ్డాగా మారింది. మీడియా ఒత్తిడి వ‌ల‌నే మైన‌ర్ల‌పై అత్యాచారం చేసేవారికి ఉరిశిక్ష విధించాల‌న్న ఆర్డినెన్స్ వచ్చింది" అని మ‌ల్లికా అన్నారు.

బాలీవుడ్ సెల‌బ్రిటీలు అత్యాచార ఘటనలను ఖండిస్తూ నిర‌స‌న‌లు చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే.

బాహుబలి Image copyright facebook

జపాన్‌లో బాహుబలి ప్రభంజనం

బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోందని ఈనాడు రాసింది.

భారతదేశంలో రికార్డుల్ని కొల్లగొట్టిన 'బాహుబలి చిత్రం జపాన్‌లో కూడా ఇటీవలే వంద రోజులు పూర్తిచేసుకొంది.

జపాన్‌ రాజధాని టోక్యోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకి దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళికి హాజరయ్యారు.

ప్రదర్శన అనంతరం ప్రేక్షకులంతా లేచి బాహుబలి... బాహుబలి... అని నినదిస్తూ చిత్ర బృందాన్ని అభినందించారు.ఆ స్పందనని ప్రత్యక్షంగా చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు రాజమౌళి. ప్రేక్షకులతో కలిసి ఓ వీడియో తీసుకొని ట్విటర్‌లో పంచుకొన్నారు. 'సినిమాపై ప్రేమ హద్దుల్ని చెరిపేసింది' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం త్వరలోనే చైనాలో విడుదల కాబోతోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.