అభిప్రాయం: ‘కఠువా ఘటనపై మీడియా ఎందుకిలా చీలిపోయింది?’

  • 29 ఏప్రిల్ 2018
కఠువా Image copyright Getty Images

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసు విషయంలో జమ్మూకశ్మీర్ సమాజం వివిధ వర్గాలుగా చీలిపోయింది. అయితే చీలిపోయింది కేవలం సమాజం మాత్రమే కాదు, మీడియా కూడా ఈ సంఘటనపై రెండు వర్గాలుగా విడిపోయింది.

బాలికపై అత్యాచారం అన్నది ఒక వాస్తవం. దీనిపై జమ్మూకశ్మీర్ క్రైం బ్రాంచి ఒక మైన‌ర్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది నిందితులపై స్పష్టమైన ఆధారాలతో ఛార్జిషీటు దాఖలు చేసింది.

కానీ ఇటీవల జమ్మూకు చెందిన కొన్ని వార్తాపత్రికలు, ప్రధానంగా హిందీ పత్రికలు ఆ అత్యాచారం నిజమేనా అని ప్రశ్నలు లేవనెత్తుతూ, పతాక శీర్షికలతో వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇదే తరహా వార్తలు ఇతర పత్రికల్లో కూడా కనిపిస్తున్నాయి.

ఉదాహరణకు ఏప్రిల్ 20న హిందీలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన దైనిక్ జాగరణ్ - 'కఠువాలో బాలికపై అత్యాచారం జరగలేదు, పోస్ట్‌మార్టం రిపోర్టులో కేవలం గాయాలను మాత్రమే ప్రస్తావించారు' అంటూ ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది.

అయితే పోస్ట్‌మార్టం నివేదికలో లైంగిక చర్య గురించి స్పష్టంగా పేర్కొన్నారు. అంతే కాకుండా కఠువా ఆసుపత్రికి చెందిన డాక్టర్ల బృందం ఈ గాయాలు లైంగిక దాడి కారణంగా ఏర్పడినవేనంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఆ పత్రిక మాత్రం బాలిక శరీరంపై గాయానికి వేరే కారణాలు ఉండవచ్చంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

Image copyright Twitter
చిత్రం శీర్షిక హిందీ పత్రిక 'దైనిక్ జాగరణ్‌' ప్రచురించిన ఈ వార్త వివాదానికి దారితీసింది.

ఈ పత్రిక మాత్రమే కాదు, చాలా హిందీ పత్రికలు ఈ సంఘటన తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశాయి. కొన్ని పత్రికలు - 'అత్యాచారం జరిగింది కానీ అది సామూహిక అత్యాచారం కాదు' అని రాశాయి. తమ కథనాల్లో క్రైం బ్రాంచ్ నివేదికను సవాలు చేశాయి. ఆ విధంగా నిందితుల వర్గానికి చెందిన వారి సెంటిమెంట్లకు అనుగుణంగా కథనాలు ప్రచురించాయి.

ఆంగ్ల పత్రికలు ప్రత్యక్షంగా క్రైం బ్రాంచ్ నివేదికను తప్పుపట్టనప్పటికీ, కేసు ప్రాధాన్యతను తగ్గించే విధంగా రిపోర్టింగ్ చేశాయి. కొన్ని సంఘటనలు - ఉదాహరణకు, ఏప్రిల్ 9న కఠువా లాయర్లు క్రైం బ్రాంచ్ చార్జిషీటును దాఖలు చేయకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలకు వార్తల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అదే విధంగా ఈ అత్యాచారం, హత్యలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు కూడా జమ్మూ ప్రెస్ తగిన ప్రాధాన్యతను ఇవ్వలేదు.

Image copyright IMAGE COLLECTIVE MOHIT KANDHARI / BBC
చిత్రం శీర్షిక హత్య కేసులో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు

దీనికి భిన్నంగా ఈ సంఘటనపై కశ్మీర్ ప్రెస్ విస్తృత కవరేజీ ఇచ్చింది. వివిధ వార్తాపత్రికలలో పని చేస్తున్న జర్నలిస్టులు ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, హత్యలపై విస్తృత కథనాలను ప్రచురించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలను కూడా మొదటి పేజీలో ప్రచురించారు.

మరో విధంగా చెప్పాలంటే, ఈ నిరసనలే నిందితులను చట్టం ముందుకు లాక్కువచ్చాయి. అందుకే ప్రొఫెసర్ హరి ఓమ్ లాంటి మితవాద గొంతుకలు కశ్మీర్ మీడియాను ఇస్లామిక్ ఉద్యమంలో భాగమని విమర్శిస్తున్నాయి.

ఆ బాలిక ముస్లిం అయిన కారణంగా కశ్మీర్ మీడియాను విమర్శిస్తూ, కేవలం అందువల్లే మీడియా బాధితురాలి కుటుంబం వైపు ఉందంటూ ఇంకా పలువురు విమర్శిస్తున్నారు.

Image copyright AFP

సామాజిక, రాజకీయ వర్గాలలోని ఈ చీలిక మీడియాలో కూడా స్పష్టంగా కనిపించింది. ఒకటి, రెండు మినహాయింపులు తప్ప, జమ్మూలోని మీడియా స్పష్టంగా ఒక విధానాన్ని అనుసరించింది.

క్రైం బ్రాంచ్‌ను విచారణ నుంచి తప్పించి, దానిని సీబీఐకు అప్పగించాలంటూ సమాజంలోని ప్రధాన వర్గాలతో పాటు జమ్మూ హై కోర్టు బార్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది. బహుశా దీని వల్లే మీడియా ఈ ధోరణిని అనుసరించి ఉండవచ్చు.

అయితే రేపిస్టులకూ, హంతకులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారన్న వాదనలను కూడా కొంత మంది కూడా తప్పుపట్టారు. జమ్మూలోని సీనియర్ జర్నలిస్టులలో ఒకరైన అరుణ్ జోషి ఈ వాదనను కొట్టిపారేస్తూ ఫేస్‌బుక్‌లో వరుసగా పోస్టులు పెట్టారు.

''ఎప్పుడైనా వాస్తవం బయటకు రాక తప్పదు. కానీ జర్నలిస్టులుగా మనం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, రెచ్చగొట్టే ప్రకటనలు చేయగూడదు. దానివల్ల ఒకరోజు పతాక శీర్షిక లభించవచ్చు కానీ జరిగే నష్టం మాత్రం లెక్కకట్టలేనది. కొందరి కుట్రలకు మనం వాహకాలుగా ఉపయోగపడుతున్నాం. ఇప్పటికే జమ్మూకాశ్మీర్ వినాశనానికి దగ్గరలో ఉంది'' ఆయన తన తాజా పోస్టులో పేర్కొన్నారు.

రాష్ట్రంలో మీడియా సహా సమాజంలోని అన్ని వర్గాలు మతప్రాతిపదికన చీలిపోయిన ఉన్నందున, 2008లో తలెత్తిన అమర్‌నాథ్ భూవివాదం నాటి పరిస్థితులు మళ్లీ రావొచ్చని చాలా మంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు బీజేపీకి తన 'ఓటుబ్యాంకు' నుంచే తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. ఇద్దరు మంత్రుల రాజీనామాను 'కశ్మీర్ ముందు తలొంచడమే' అంటూ వారు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పై ఆందోళన నిజం కూడా అయ్యే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)