'కాస్టింగ్ కౌచ్' భావితరాన్ని భయపెడుతోందా?

  • 29 ఏప్రిల్ 2018
త్రిష Image copyright facebook
చిత్రం శీర్షిక త్రిష, ఆమె తల్లి ఉమ

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమను పట్టి కుదిపేసిన కాస్టింగ్ కౌచ్ వివాదం అమ్మాయిలను నటనలోకి.. సినీ పరిశ్రమలోకి పంపేందుకు తల్లులను భయపెడుతోందా?

ఇదే ప్రశ్నను బీబీసీ కొంతమంది యువతులు, నటులు - యువతుల తల్లులను అడిగింది. దానికి వారేమన్నారో చదవండి..

"నాకు సినిమాల్లో నటించాలని చాలా పెద్ద కల ఉండేది. కానీ మా ఇంటిలో ఒప్పుకోకపోవడంతో నేను నా కోరికను వదులుకోవాల్సి వచ్చింది." అని విశాఖపట్నం లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న అనూష పెనగంటి అనే యువతి చెప్పారు.

ఇదే విషయాన్ని అనూష తల్లి భారతి వద్ద ప్రస్తావించగా.. ఆమె "మా అమ్మాయి సినిమాల్లోకి వెళతాననే ఆలోచననే మేము జీర్ణం చేసుకోలేకపోయాము" అని చెప్పారు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionబాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మహిళ గురించి ఏమన్నారు.

ఈ మధ్య మీడియాలో లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ గురించి వచ్చిన వార్తలు చూసిన తర్వాత మా భయం మరింత రెట్టింపు అయింది అని అన్నారు.

సినిమాలు ఒక భద్రతతో కూడిన భవితను అందివ్వవని, అక్కడ విజయం తాత్కాలికమని అభిప్రాయపడ్డారు. అందుకే తమ కూతురిని సినిమాలలోకి వెళ్ళడానికి అనుమతించలేదని చెప్పారు.

Image copyright Rithika Kamani

హైదరాబాద్ కి చెందిన ప్రత్యూష అనే మరో యువతి తల్లి మనోగతం కూడా ఇలాగే ఉంది.

ప్రత్యూష చిన్న చిన్న యూట్యూబ్ వీడియోల్లొ కనిపించడంతో తనకి సినిమా ఆఫర్లు వచ్చాయని, కాని తామే ఒప్పుకోలేదని, ప్రత్యూష తల్లి అనురాధ తెలిపారు.

సినిమాలను ఒక కెరీర్ గా ఎంచుకోడానికి తమ పిల్లలకు అనుమతి ఇచ్చే స్థాయికి ఇంకా భారతీయ సమాజం, తల్లితండ్రులు చేరలేదని ఆమె అభిప్రాయపడ్డారు.

మాకు మా అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక అందమైన జీవితం గడపాలనే కోరిక కాని సినిమా రంగంలోకి పంపి అక్కడ కష్టాలు అనుభవించమని చెప్పలేమని అన్నారు.

కాస్టింగ్ కౌచ్ లాంటి అంశాలు ప్రతి పరిశ్రమలోనూ ఉండి ఉండవచ్చని అయితే సినిమా పరిశ్రమ గ్లామర్ పరిశ్రమ కావడం మూలంగా ఈ వివాదాలు కాస్త ఎక్కువగా ఉండి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

Image copyright Ruby

రూబీ అగ్గల అనే విశాఖపట్నంకి చెందిన మోడల్ మాట్లాడుతూ.. సినిమాలను వృత్తిగా ఎంచుకోవాలనే తన ఆలోచనకే ఇంటిలో తీవ్ర నిరసన ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు.

నా ఆలోచన చెప్పగానే, ఇంటిలో చదువు మాన్పించి పెళ్లి చేస్తామని బెదిరించారని గుర్తు చేసుకున్నారు.

రూబీ తల్లి మాటలాడటానికి నిరాకరించారు.

అయితే, తమ పిల్లల కోరికలకు మద్దతు తెలిపి చేయూతనందించే తల్లి తండ్రులు కూడా ఉన్నారు.

Image copyright MONA JHA

బిహార్‌లోని పట్నాకు చెందిన చెందిన మోనా ఝా తన కుమార్తె పొలిటికల్ సైన్సులో డిగ్రీ చేసినప్పటికీ. సినిమాలలోకి వెళతానని చెప్పగానే, కాస్త ఆశ్చర్యానికి, భయానికి గురి అయ్యామని చెప్పారు. కానీ, వారి కుమార్తె నిర్ణయానికి తగిన మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో, తమ పూర్తి సమ్మతిని తెలిపామని చెప్పారు.

పిల్లలు ఒక వయసు వచ్చాక తమకి ఏమి కావాలో నిర్ణయం తీసుకునే శక్తి కలిగి ఉంటారని అందుకే తన నిర్ణయానికి విలువ ఇచ్చామని చెప్పారు.

తమ కుమార్తెకి తగిన శిక్షణ పొంది సినిమాలలోకి వెళ్ళమని సలహా ఇచ్చామని.. తనకు తమ మద్దతు అన్ని వేళలా ఉంటుందని చెప్పారు. వీరి కుమార్తె ప్రస్తుతం ఎఫ్ టి ఇ విద్యార్ధులు నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటిస్తున్నారు.

‘టాలీవుడ్‌లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘

Image copyright Madhavilatha

తమ కూతురు మొదట సినిమాల్లోకి వెళ్తానన్నపుడు ఇంటిలో అస్సలు ఒప్పుకోలేదని, కాని తన పట్టు విడవకపోవడంతో, ఒప్పుకున్నామని, ప్రముఖ తెలుగు హీరోయిన్ మాధవవీలత తల్లి నాగేశ్వరి దేవి చెప్పారు.

ఈ రోజు తన కూతురి విజయం తమకి గర్వంగా ఉందని, కష్ట సుఖాలు ఎక్కడైనా ఉంటాయని, ఆఖరికి నిలబడేది మన ప్రయత్నమేనని తెలిపారు.

ఇప్పటికి మాధవీలత సోదరుడికి తను సినిమాలలోకి వెళ్ళడం ఇష్టం లేదని అన్నారు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ‘విల్ గో అవుటాఫ్ హైదరాబాద్.. వి హ్యావ్ సమ్ ప్రైవేట్ టైమ్’

నటి త్రిష కూడా తొలుత కాస్త ప్రతిఘటన ఎదుర్కొంది. కాని ఆమె తండ్రి ఆమె ఇష్టానికి పచ్చ జెండా ఊపారని, త్రిష తల్లి ఉమా కృష్ణన్ చెప్పారు.

తమది సినిమా కుటుంబం కాకపోవడంతో, కాస్త భయపడ్డామని, కాని సినిమాలలో భవిష్యత్తులేని పక్షంలో వెనక్కి తిరిగి వచ్చి చదువుకోవాలనే నియమం పెట్టి తనని సినిమాలకి పంపించామని చెప్పారు.

త్రిష ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదని గర్వంగా చెప్పారు.

కుటుంబం నుంచి తగిన సహకారం ఉంటే, సినీ పరిశ్రమ ఏమీ ముళ్లపొద కాదని అభిప్రాయపడ్డారు.

మీ టూ ఉద్యమం కారణంగా సినిమాలకి వచ్చే కొత్త అమ్మాయిలకి కొదవ ఏమి రాదని, ప్రముఖ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు.

Image copyright facebook

లైంగిక వేధింపులు లేని పరిశ్రమ ఎక్కడ ఉందని ప్రశ్నిస్తూ, సినిమా పరిశ్రమ సమాజంలో కేవలం ఒక్క శాతం మాత్రమే అని అన్నారు.

సమస్యలు అధిగమించాలంటే నటులు కావాలంటూ వచ్చే ప్రకటనల స్వరూపం తెలుసుకోవాలని, అవి నిజమైనవా కావా అని నిర్ధారించుకోవాలని, అలాగే అవి ఫిల్మ్ ఛాంబర్ తో నమోదు అయి ఉన్నాయా లేదో కూడా చూడాలని సలహా ఇచ్చారు.


మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: ఆ వేధింపులు నాకూ తప్పలేదు: అనుపమా పరమేశ్వరన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)