ప్రెస్‌రివ్యూ: చారిత్రక ఎర్రకోట నిర్వహణ ప్రైవేటుపరం!

  • 29 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

చారిత్రక ఎర్రకోట నిర్వహణను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసిందని ఈనాడు ఒక కథనం రాసింది.

వచ్చే ఐదేళ్లపాటు ఎర్రకోట నిర్వహణ, అభివృద్ధి పనులు దాల్మియా భారత్‌ గ్రూప్‌ చేపడుతుంది. ఇందుకు కంపెనీ ఏటా రూ.5 కోట్లు వ్యయం చేయనుంది.

ప్రతిగా ఎర్రకోటలో అన్నిరకాలుగా ప్రచారం చేసుకోవడానికి అనుమతిస్తూ కేంద్రం ఒప్పందం చేసుకుంది.

ప్రపంచ పర్యటక దినోత్సవాన్ని పురస్కరించుకుని గత ఏడాది సెప్టెంబరు 17న కేంద్రం 'స్మారక చిహ్నాల దత్తత' పథకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రకటించారు.

స్మారక చిహ్నాల అభివృద్ధి, నిర్వహణ చేపట్టే కంపెనీలు.. వాటి ఆవరణలో తమ గురించి ప్రచారం చేసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.

టిక్కెట్లు, అద్దెల రూపంలో వచ్చిన నగదు మొత్తాన్ని పూర్తిగా ఆ స్మారక చిహ్నాల అభివృద్ధికే వ్యయం చేయాలని, లాభాపేక్ష కూడదని షరతులు విధించింది.

స్పందించిన దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఏప్రిల్‌ 24న కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఎర్రకోటను తాకట్టు పెట్టేశారు: కాంగ్రెస్‌

భారత స్వాతంత్య్రానికి చిహ్నమైన ఎర్రకోటను కార్పొరేట్లకు తాకట్టు పెట్టేశారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సుర్జేవాలా ఆరోపించారు.

'ఎర్రకోట ప్రాముఖ్యత ఏమిటో మోదీకి, భాజపాకు తెలియదా?; ఇకపై కోటను చూడాలంటే కంపెనీకి డబ్బులు చెల్లించబోవడం నిజం కాదా?; అక్కడ ఎవరైనా వేడుక నిర్వహించుకోవాలంటే అద్దె కట్టాలనేది నిజం కాదా?' అని ఆయన ప్రశ్నించారు.

ప్రజా భాగస్వామ్యం కోరుకుంటున్నాం: అల్ఫోన్స్‌

సాంస్కృతిక చిహ్నాల అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం కోరుకుంటున్నామని కేంద్ర పర్యటకశాఖ సహాయమంత్రి కె.జె.అల్ఫోన్స్‌ పేర్కొన్నారు.

ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు ప్రతి పైసాను వాటి అభివృద్ధికే వ్యయం చేస్తాయన్నారు. అంత మంచిపని చేస్తున్న కంపెనీలు, వాటి గురించి ప్రచారం చేసుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు.

Image copyright facebook / ECI

2019 జమిలి ఎన్నికలకు సిద్ధం. కానీ..: సీఈసీ

లోక్‌సభకు గడువు ప్రకారం 2019 మేలో జరిగే ఎన్నికలను జమిలిగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తే అందుకు ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధమని ఎన్నికల సంఘం చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

అయితే, కేంద్ర ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించిన తర్వాతే ఏమైనా చేయగలమని సీఈసీ స్పష్టం చేసింది.

చట్ట సవరణ ఓకే అయితే, ఈవీఎంలు, ఇతర సాధనా సంపత్తిని, సాయుధ బలగాలను సమకూర్చుకోవడం తమకు పెద్ద సమస్య కాదని ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఒ.పి.రావత్‌ చెప్పారు.

లోక్‌సభ ఎన్నికలను ఈ ఏడాది జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికలతో పాటు ముందస్తుగా నిర్వహించే అవకాశం లేదని తేల్చిచెప్పారు.

2019లో గడువు ప్రకారం 5రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి మే నెలలో నిర్వహించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.

Image copyright TJS/FB

టీజేఏసీకి కోదండరామ్ రాజీనామా

తెలంగాణ జేఏసీకి కోదండరాం రాజీనామా చేశారు. తెలంగాణ జన సమితి-టీజేఎస్‌లో క్రియాశీలకంగా కొనసాగేందుకు టీజేఏసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

శనివారం గన్‌పార్కులోని తెలంగాణ అమరుల స్థూపం వద్ద టీజేఏసీ కన్వీనర్‌, విద్యుత్‌ జేఏసీ నేత రఘుకు కోదండరాం తన రాజీనామాను సమర్పించారు.

భవిష్యత్తులో టీజేఏసీకి పూర్తి స్థాయిలో సహకరిస్తానని తెలిపారు. టీజేఏసీ తాత్కాలిక చైర్మన్‌గా కె.రఘు కొనసాగుతారన్నారు.

పూర్తి స్థాయి చైర్మన్‌ ఎవరనే విషయంలో స్టీరింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

రాష్ట్ర ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో అమరులను, వారి స్మృతి చిహ్నాన్నీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మర్చిపోయిందని కోదండరాం ఆరోపించారు.

నేడు టీజేఎస్‌ ఆవిర్భావ సభ

తెలంగాణలో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. కోదండరాం నేతృత్వంలో ఏర్పాటవుతున్న తెలంగాణ జన సమితి-టీజేఎస్‌ ఆవిర్భావ సభ ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ జరగబోతోంది.

అమరులకు నివాళి అర్పించేందుకు 60 అడుగుల ఎత్తులో తాత్కాలిక స్థూపాన్ని ఏర్పాటు చేశారు.

Image copyright NOAH SEELAM

ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం-ఎస్సార్డీపీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని కేటీఆర్ చెప్పినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.7700 కోట్లతో ఫ్లైఓవర్లను నిర్మిస్తున్నారు.

శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద అండర్‌పాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

రూ.1500కోట్ల అంచనాతో ఛే నంబర్, ఉప్పల్‌లలో రెండు ఫ్లైఓవర్లను కేంద్ర ఉపరితల రవాణాశాఖ సమన్వయంతో చేపడుతున్నట్టు ఆయన చెప్పారు.

సికింద్రాబాద్ పారడైజ్ నుంచి తూముకుంట, ప్యాట్నీ సెంటర్ నుంచి కొంపల్లి సుచిత్ర వరకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రెండు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రతిపాదనలతోపాటు రూ.2500కోట్ల నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయని మంత్రి చెప్పారు.

వీటి నిర్మాణానికి కంటోన్మెంట్ ఆధీనంలోని భూమిని సేకరించాల్సి ఉందని, అయితే, స్థలాన్ని ఇచ్చే విషయంలో రక్షణశాఖ మోకాలడ్డుతున్నదని మంత్రి విమర్శించారు.

హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డులో భాగమైన కండ్లకోయ ఎక్స్‌ప్రెస్ వేను సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ వే అందుబాటులో రావడం ద్వారా 158 కిలోమీటర్ల పొడవువున్న ఔటర్ రింగురోడ్డు మొత్తం వినియోగంలోకి రానుంది.

స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ Image copyright DIBYANGSHU SARKAR/AFP/Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

4న మావోయిస్టుల బంద్

ఎన్‌కౌంటర్ల పేరుతో జరుగుతున్న మారణకాండకు నిరసనగా మావోయిస్టు పార్టీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిందని సాక్షి పత్రిక పేర్కొంది.

వారం నుంచి తెలంగాణ-మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతాల్లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 49 మంది మావోయిస్టులు మృతి చెందారు.

దీంతో ప్రతీకార చర్యగా మావోయిస్టు పార్టీ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఎస్‌ఐబీ వర్గాల సమాచారంతో తెలంగాణ పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

అమాయక గిరిజన మహిళలపై మావోయిస్టుల నెపం మోపి అత్యంత కిరాతకంగా కాల్చి చంపుతున్నారంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ తీవ్రస్థాయిలో స్పందించారు.

ఇంతటి దారుణకాండకు పాల్పడ్డ పాలకులకు, పోలీస్‌ బలగాలకు ప్రజల చేతిలో శిక్ష తప్పదంటూ.. దెబ్బకు దెబ్బ తీస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.

గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులకు పోలీస్‌ శాఖ భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.