బుద్ధుడి గురించి ఈ విషయాలు తెలుసా?

  • 30 ఏప్రిల్ 2018
బుద్ధుడి విగ్రహం Image copyright iStock

"వెయ్యి పనికి రాని మాటల కంటే.. మిమ్మల్ని శాంతియుతంగా మార్చే ఒక్క మంచి మాట మేలు". ఈ సూక్తి గౌతమ బుద్ధుడు బోధించింది.

బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్‌లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీ.పూ. 563లో జన్మించాడు.

ఆయన తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది.

గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నాడు.

ఆ దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించాడు.

బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించాడు.

కఠోర తపస్సు చేశాడు. ఆ తర్వాత సన్యాసం నిరర్థకమని భావించి వదిలేశాడు.

తర్వాత 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

అలా ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఓ చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికే 'బుద్ధ గయ' అనే పేరు వచ్చింది.

తర్వాత దాదాపు 45 ఏళ్ల పాటు అనేక ప్రాంతాల్లో తన సత్యమార్గాన్ని, సిద్ధాంతాలను బోధించాడు. సామాన్యులకు సులువుగా అర్థమయ్యేలా పాళీ భాషలో ఆయన బోధనలు చేసేవాడు.

80 ఏళ్ల వయసులో బుద్ధుడు తుదిశ్వాస విడిచాడు.

Image copyright iStock

గౌతమ బుద్ధుడు చెప్పిన 10 ఆసక్తికరమైన సూక్తులు

"ధ్యానాన్ని ఒక పనిగా చెయ్యకు. ప్రతి పనినీ ఒక ధ్యానంగా చెయ్యి."

"కాలాన్ని వృధా చేయడమంటే, నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే."

"మన లోపల శత్రువు లేనంత వరకు మన బయటి శత్రువు మనను భయపెట్టలేడు."

"మనిషికి నిజమైన ఆనందం లభించేది అతడి ఆలోచనల్లోనే."

"ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి."

"మీరు వెయ్యి యుద్ధాల్లో వెయ్యి మందిపై విజయం సాధించి ఉండొచ్చు. కానీ, తనపై తాను విజయం సాధించినవారే అసలైన విజేత."

"నిజం మాట్లాడండి. కోపాన్ని దరిచేరనీయకండి. ఎవరైనా అడిగితే మీ దగ్గర ఉన్నంతలో కొంత సాయం చేయండి."

"చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి."

"ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు."

"మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినాలి."

Image copyright Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు