ఉనా: 'ఆత్మగౌరవం' కోసం బౌద్ధాన్ని స్వీకరించిన 300 దళిత కుటుంబాలు

  • 29 ఏప్రిల్ 2018
ఉనా దళితులు

గుజరాత్‌లోని ఉనాకు సమీపంలో మోటా సమఢియలా గ్రామంలో దాదాపు 300 దళిత కుటుంబాలు ఆదివారం మధ్యాహ్నం బౌద్ధమతాన్ని స్వీకరించాయి.

వీరిలో రెండేళ్ల క్రితం 'గోరక్షకుల' హింసకు గురైన బాధితుల కుటుంబాలు కూడా ఉన్నాయి.

తమకు హిందూమతంలో ఆదరణ లభించకపోగా, తరతరాలుగా వివక్షకూ, అణచివేతకు గురవుతూ వచ్చామని దళితులు ఆరోపించారు. హిందూమతం తమ ఆత్మగౌరవాన్ని గుర్తించడంలో వైఫల్యం చెందిందని వారన్నారు.

దాదాపు రెండేళ్ల క్రితం గోరక్షకులుగా చెప్పుకునే కొందరు గుజరాత్‌, గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని ఉనాలో ఐదుగురు దళితులను కట్టేసి కొట్టి, అర్ధనగ్నంగా ఊరేగించిన ఘటన తెలిసిందే.

ఆవులను చంపి చర్మం వొలుస్తున్నారన్నది వారిపై ఆరోపణ. అయితే తాము తమ వృత్తి ప్రకారమే చనిపోయిన ఆవుల చర్మాన్ని వొలిచాం తప్ప వాటిని తాము చంపలేదని దళితులన్నారు.

వారిని కట్టేసి కొడుతున్న వీడియో వైరల్ కాగా, ఆ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది.

హాజరు కాని మేవానీ

ఈ కార్యక్రమాన్ని సర్‌వైయా కుటుంబం నిర్వహించింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన చాలా మంది దళితులు ఇందులో పాల్గొన్నారు.

అయితే, ఉనా దారుణ ఘటన తర్వాత జాతీయ స్థాయిలో దళిత నేతగా గుర్తింపు పొందిన జిగ్నేశ్ మేవానీ వంటి దళిత నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

వశ్రామ్, రమేశ్, బెచార్‌లు తమ తండ్రి బాలు సర్‌వైయా, చిన్నాన్న కొడుకు అశోక్ సర్‌వైయాలు కలిసి సామూహికంగా '22 అంబేడ్కర్ ప్రతిజ్ఞలను' చదివారు.

"హిందూ దేవతలను, దేవుళ్లను విశ్వసించకపోవడం, హిందూ ఆచారాలను పాటించకపోవడం" అన్నది ఈ ప్రతిజ్ఞల్లో ఒకటి.

చక్కగా షేవ్ చేసుకొని ముస్తాబైన బాలు సర్‌వైయా అక్కడ హాజరైన వారందరికీ స్వాగతం పలికారు. అందరినీ ఆహ్వానిస్తూ, వారికి కావాల్సిన ఆహారం, నీరు ఏర్పాట్లు చూస్తూ సంతోషంగా కనిపించారు.

43 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆ ప్రాంతమంతా ఎండలు హడలెత్తిస్తున్నప్పటికీ, కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఎవరూ అక్కడి నుంచి కదలలేదు.

"ఈరోజు నుంచి మా జీవితాలను కొత్తగా మొదలుపెడతాం" అని బాలు బీబీసీతో అన్నారు. "మేమంతా కలిసి గుజరాత్‌లో బౌద్ధాన్ని విస్తరిస్తాం. అంబేడ్కర్ చూపిన దారిలో పయనిస్తాం."

ఈ గ్రామం రెండేళ్ల క్రితం దళితులను సామూహికంగా కొట్టిన స్థలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.

హిందూమతంలో తమకు వివక్ష, వేధింపులు తప్ప మరేమీ దక్కలేదని బాలు ఈ సందర్భంగా ఆరోపించారు.

ఎంత మంది దళితులు బౌద్ధం స్వీకరించారు?

ఆదివారం జరిగిన కార్యక్రమంలో మొత్తం దాదాపు 300 కుటుంబాల వారు బౌద్ధమతం స్వీకరించారు.

వీరే కాకుండా సౌరాష్ట్ర ప్రాంతంలోని మరెన్నో దళిత కుటుంబాలు బౌద్ధమతం వైపు ఆకర్షితులవుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు.

ఇంకా చాలా మంది దళితులు బౌద్ధాన్ని స్వీకరిస్తున్నట్టు దరఖాస్తులు అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఉనా దళిత నేత కేవల్ సింగ్ రాఠోడ్ బీబీసీతో అన్నారు.

ఈ మతమార్పిడి కార్యక్రమం వద్ద ఆయన మాట్లాడుతూ, "దళితులు ఇంకా ఇక్కడికి వస్తూనే ఉన్నారు" అని చెప్పారు.

"ఉనాలోనే కాకుండా, బౌద్ధ గురువులు ఉన్న ఇతర చోట్లలో కూడా దళితులు బౌద్ధాన్ని స్వీకరిస్తున్నారు. రేపు బుద్ధపూర్ణిమ కాబట్టి రేపు కూడా మరి కొందరు దళితులు బౌద్ధాన్ని స్వీకరించే అవకాశం ఉంది."

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గోసంరక్షకుల దాడులు.. వ‌ృత్తిని వదిలేస్తున్న చర్మకారులు

'హిందూమతంతో విసిగిపోయాం.. అంబేడ్కర్ బాట పట్టాం'

ఉనాలో 'గోరక్షకుల' దాడికి గురైన బాధితుడు వశ్రామ్ భాయ్ బీబీసీతో మాట్లాడుతూ, "హిందూ మతంలో మనిషిని సాటి మనిషి ప్రేమించడం అన్నది మేం ఎప్పుడూ చూడలేదు" అని ఆరోపించారు.

తెల్లటి దుస్తులు ధరించిన వశ్రామ్ అక్కడున్న వలంటీర్లకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ కనిపించారు. "బౌద్ధం కేవలం ఆవులను లేదా ఇతర జంతువులను కాకుండా మనుషులు ప్రేమించడం నేర్పుతుంది" అని చెప్పారు.

"హిందూమతంలో ఎప్పుడూ మేం విద్వేషాన్నే చవిచూశాం. ఇక బౌద్ధమతం విషయానికొస్తే ఇది ప్రపంచవ్యాప్త మతం. ఈ మతం మాకు మనుషులుగా తగిన గౌరవం ఇస్తుందని ఆశిస్తున్నాం. మేం అంబేడ్కర్ బాటలో నడుస్తూ బౌద్ధాన్ని స్వీకరిస్తున్నాం" అని ఆయన చెప్పారు.

'హిందూ మత నియమాలు అసమానత్వంపై ఆధారపడి ఉన్నాయి. అందుకే మతం మారాల్సిన అవసరం వచ్చింది" అని కేవల్ సింగ్ రాఠోడ్ అన్నారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

ఈ కార్యక్రమం కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉనాను దాటి మోటా సమఢియలా గ్రామానికి వెళ్లే దారిలో భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గిర్-సోమ్‌నాథ్ జిల్లా ఎస్‌పీ బీబీసీతో మాట్లాడుతూ, "ఈ కార్యక్రమం సందర్భంగా భద్రతా ఏర్పాట్ల కోసం 350 మంది పోలీసులను పంపించాం. ముగ్గురు డీఎస్‌పీలు, మరి కొందరు ఇన్‌స్పెక్టర్లను వ్యూహాత్మక కేంద్రాల్లో మోహరించాం" అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు