ప్రెస్‌రివ్యూ: "మోదీ హోదా హామీ ఇవ్వలేదు, ఆ వీడియోను మార్ఫింగ్ చేశారు"

  • 30 ఏప్రిల్ 2018
Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోదీ తిరుపతిలోనే కాదు.. నెల్లూరు సభలోనూ ఎప్పుడూ చెప్పలేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

తెదేపా నాయకులు ప్రధాని మాటలను మార్చి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

దిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి.. ప్రధాని మోదీ మార్ఫింగ్‌ వీడియోలను చూపించి చంద్రబాబు జాతీయ మీడియాను పక్కదోవ పట్టించారని అన్నారు.

'రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ, అవినీతిపై నిజానిజాలు' అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వద్దని తేల్చిచెప్పడంతో రాష్ట్రానికి హోదాతో సమానమైన నిధులు ఇచ్చామన్నారు.

తాము ఏ విషయంలో నమ్మక ద్రోహం చేశామో చెప్పాలంటూ 10 ప్రశ్నలు వేశారు.

అమరావతికి ఎలాంటి డీపీఆర్‌లు లేకున్నా రూ.1,500 కోట్లు ఇచ్చామని, ఇచ్చిన డబ్బులను సరిగా వాడుకోలేని అసమర్థతను కప్పి పుచ్చుకోవడానికి తెదేపా కొత్త డ్రామలు ఆడుతోందని వీర్రాజు విమర్శించారని ఈనాడు రాసింది.

Image copyright facebook.com/hyderabadpolice

'శ్రీలంకలో తెలంగాణ పోలీసింగ్'

హైదరాబాద్ పోలీసు విభాగంలో తీసుకొచ్చిన టెక్నాలజీ పరమైన సంస్కరణలు చూసి శ్రీలంక దేశ ఆరోగ్యశాఖ డిప్యూటీ మంత్రి ఫైజల్ ఖాసీమ్ ప్రశంసలు కురిపించారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

అమెరికా, బ్రిటన్ వంటి దేశాల కంటే మెరుగైన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని, తెలంగాణ పోలీసుల సహకారంతో శ్రీలంకలోనూ ఈ టెక్నాలజీని వినియోగిస్తామని ఫైజల్ తెలిపారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ), టెక్నాలజీ ఫ్యూజన్‌ను ఆదివారం సందర్శించి, రాష్ట్ర పోలీసులు ఉపయోగిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ గురించి తెలుసుకున్నారు.

తెలంగాణ ఆరోగ్యశాఖలో టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి మూడు రోజులు హైదరాబాద్‌లో పర్యటించేందుకు అధికారులతో కలిసి వచ్చారు.

శ్రీలంక హోంమంత్రి సూచనతో హైదరాబాద్ పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, ప్రజల భద్రత విషయంలో అమలు చేస్తున్న అంశాలనూ ఫైజల్ ఖాసీమ్‌ పరిశీలించారు.

హైదరాబాద్‌లో సీసీ కెమెరాలను సీసీసీకి అనుసంధానం చేసిన తీరు, నేరస్థుల ముఖాలను గుర్తించే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్, ఈ-చలాన్ విధించే విధానాల గురించి తెలుసుకున్నారు.

"తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భద్రత కోసం చేపట్టిన సాంకేతిక సంస్కరణలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను మా దేశంలోనూ ఏర్పాటు చేస్తాం. ఇందుకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుంటాం" అని శ్రీలంక వైద్యశాఖ డిప్యూటీ మంత్రి ఫైజల్ ఖాసీమ్ తెలిపారు.

విద్యార్థులు Image copyright Getty Images

ఉత్తీర్ణత శాతాలు పెరుగుతున్నాయ్.. ప్రమాణాలు తగ్గుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటా పెరుగుతున్నా.. విద్యార్థుల్లో మాత్రం ఆ మేరకు ప్రమాణాలు పెరగడం లేదు. విద్యా శాఖ పాస్ పర్సంటేజీలు పెంచుకోవడానికి చూపిస్తున్న శ్రద్ధ ప్రమాణాల పెంపుపై చూపించకపోవడమే దీనికి కారణమంటూ సాక్షి ఓ కథనం ప్రచురించింది.

కొన్నేళ్లుగా 10వ తరగతి ఫలితాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. 1998-99లో ఉత్తీర్ణత శాతం 52.67శాతం మాత్రమే. కానీ అది నేడు 95శాతానికి చేరుకోవడం గమనార్హం.

1999లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రైవేటు స్కూళ్లకు, కార్పొరేట్ సంస్థలకు పెద్దపెట వేశారు. దాంతో విద్యా రంగంలో ప్రైవేటు సంస్థల పెత్తనం ఎక్కువైంది.

తమ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచి చూపించుకునేందుకు ఆ సంస్థలు అడ్డదారులు తొక్కుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు ఉండిపోయింది.

ప్రైవేటే పాఠశాలల్లో 1998-99లో 52.67గా ఉన్నత పదోతరగతి ఉత్తీర్ణత శాతం 2003-04 నాటికి ఒక్కసారిగా 80.55శాతానికి పెరిగింది. అంటే అయిదేళ్లలో 27.88శాతం పెరిగింది.

అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 5 శాతం మాత్రమే పెరిగింది.

అర్హులైన టీచర్లు లేకున్నా.. సరైన బోధన జరగకున్నా ఆంగ్ల మాధ్యమం ఉందన్న ఒకే కారణంతో ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు భారీగా పెరిగిపోయాయి.

ఇదే అదనుగా ప్రైవేటు స్కూళ్లు.. విద్యార్థుల్లో ప్రమాణాలను పట్టించుకోకుండా విద్యార్థులతో బట్టీ పట్టించడం, కాపీయింగ్ తదితర మార్గాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ పోయాయని సాక్షి వివరించింది.

సురవరం సుధాకర్ రెడ్డి Image copyright cpofindia/facebook

సీపీఐ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ సురవరం

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకరరెడ్డి తిరిగి ఎన్నికయ్యారని 'నవతెలంగాణ' పత్రిక ఓ కథనం రాసింది.

ఈ పదవికి ఆయన ఎన్నికకావడం ఇది మూడోసారి.

కేరళలోని కొల్లంలో నిర్వహించిన సీపీఐ 23వ జాతీయ మహాసభలు ఆదివారం ముగిశాయి.

మహాసభ 139 మంది సభ్యులతో నూతన జాతీయ సమితిని ఎన్నుకుంది. అందులో 11 మంది కార్యదర్శివర్గ సభ్యులను, వారితో కలిపి 32 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకుంది. పన్నియన్‌ రవీంద్రన్‌ ఛైర్మన్‌గా 11 మందితో కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌ను కూడా మహాసభ ఎన్నుకుంది.

సురవం సుధాకరరెడ్డి, డి రాజా, షమీమ్‌ ఫైజీ, అమర్‌జిత్‌ కౌర్‌, అతుల్‌కుమార్‌ అంజాన్‌, రామేంద్ర కుమార్‌, డాక్టర్‌ కె. నారాయణ, కనం రాజేంద్రన్‌, బినరు విశ్వం, డాక్టర్‌ బికె కాంగో, పల్లబ్‌సేన్‌ గుప్తా నూతన కార్యదర్శివర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

Image copyright AlwaysRamCharan/facebook

అవినీతి లేనిది సినీ రంగం మాత్రమే: రామ్ చరణ్

అవినీతి లేనిది ఒక్క సినీ పరిశ్రమ మాత్రమేనని నటుడు రామ్ చరణ్ అన్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనంలో పేర్కొంది.

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించింది.

ఈ వేదికపై రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''ఏదైనా అవినీతి లేని పరిశ్రమ ఉందంటే ఈ ప్రపంచంలో అది ఒక్క సినిమా పరిశ్రమ మాత్రమే. సినిమాకి సంబంధించిన ప్రతి వ్యక్తికి ఏముంటుంది? ఉదయాన్నే 5 గంటలకు లేస్తాం. జిమ్ చేస్తాం. మేకప్ వేసుకుని షాట్‌కి వెళతాం. సాయంత్రం 7, 8 గంటల వరకు పనిచేస్తాం. ఎండ, వాన అనేది లెక్కచేయకుండా కష్టపడుతూనే ఉంటాం. బన్నీకి ఎన్నో గాయాలు అయ్యాయి. డ్యాన్స్‌ల వల్ల, రీస్కీ షాట్స్ వల్ల ఎన్నో గాయాలయ్యాయి. నటీనటులందరూ అంతే. మహేష్, తారక్, ప్రభాస్.. ప్రభాస్‌కి అయితే రెండు సార్లు షోల్డర్ ఇంజురీ అయింది. నాన్నకు మొన్న షోల్డర్ ఇంజురీ అయింది. బాలకృష్ణకు మొన్న షోల్డర్ ఇంజురీ అయింది. ఇలా ఒల్లు హూనం చేసుకుని కష్టపడుతూ.. మళ్లీ ఇంటికి వచ్చిన తెల్లారి ఏం చేయాలి లేదా వర్కవుట్ చేసుకుని, ఫ్యామిలీతో ఒక గంట గడిపి, తృప్తిగా పడుకుని మళ్లీ ఉదయాన్నే షూటింగ్ వెళతాం. ఇందులో అవినీతి ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడైనా అవినీతి కనిపిస్తుందా? మీ అందరికీ తెలుసు. నిజమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఎవ్వరూ నమ్మరు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)